| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సుమాలి తన సేనల మఱల్చికొని హరిపైఁగవయుట |
| మ. | హరిచే నొచ్చి సదైన్యమై పఱచు సైన్యంబున్ జయోత్సాహి నా హరి నీక్షించి సుమాలి రోషవివశుండై చండకాండంబులన్ హరి శాతాశుగవృష్టిమాన్చి రవి నీహారచ్ఛటల్ గప్పువై ఖరి మైఁదూపుల ముంచి దిక్కు లద్రువంగాఁబేర్చి పెల్లార్చినన్ | 63 |
| శా. | ప్రావృట్కాలఘనార్భటుల్ విని శిఖిప్రాతంబు లేతెంచున ట్లా వీరాగ్రణి సింహగర్జ విని మున్నాపన్నులై చన్న య ద్దేవద్వేషులు గ్రమ్మఱన్ మరలి బుద్ధిస్థైర్య శౌర్యాఢ్యులై గోవిందున్ వెసఁదాఁకి మున్పటివలెన్ ఘోరంబుగాఁ బోరఁగన్ | 64 |
| చం. | అపుడు సుమాలి హేమకవచావృతుఁడై సతటిద్ఘనంబుతో నుపమకు వచ్చి రత్నకటకోజ్జ్వలమౌ కరమెత్తి యుత్కట ద్విపమువలెన్ ముకుంద! పఱతెమ్మని పిల్చుచుఁగేక వేయుచున్ విపుల శతాంగమున్ మెఱయ వే చని మార్కొని విక్రమించినన్ | 65 |
| మ. | సరసీజాక్షుఁడు మందహాసము దనర్చం బ్రోల్లసత్కుండల స్ఫురితంబైన తదీయసూతు శిర మచ్చోఁ ద్రుంచి, యజ్జోదు మై శరసంఘంబులు నించి యార్చిన రథాశ్వంబుల్ నిజక్షత్త లే మి రథం బీడ్చుక యేఁగెఁ దత్సమరభూమిం బాసి యుద్భ్రాంతిమై | 66 |
| వ. | ఈ క్రమంబున | 67 |