| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | విష్ణువుచే మాలి యనువాఁడు హతుఁ డగుట |
| కం. | భ్రాంతములై రథాశ్వములు వాఱ సుమాలియు నిల్పలేక యు ద్భ్రాంతి వహించె నింద్రియ పరంపర నిల్వని భ్రాంతచిత్తున ట్లంతఁ బరాఙ్ముఖుండయిన యన్నఁ గనుంగొని మాలి వచ్చి శ్రీ కాంతునిఁ దాఁకె యుద్ధకుతుకంబున హైమరథాధిరూఢుఁడై | 68 |
| వ. | ఇవ్విధంబునం బ్రతాపజితాంశుమాలి యగు మాలి వనమాలిం దాఁకి మహాసాహసంబున | 69 |
| మ. | ఘనకోదండగుణారవంబు దశదిగ్భాగంబులన్ నిండఁ గాం చన పుంఖాంచిత బాణముల్ దొడిగి లక్ష్యంబైన శ్రీవత్సలాం ఛను వక్షంబునఁ దూఱనేయ నవి క్రౌంచంబుం ప్రవేశించు హం సనికాయంబుల లీలఁజొచ్చి చన నిచ్చం గుందె దేవౌఘముల్ | 70 |
| ఉ. | మాలిధనుర్వియుక్త శితమార్గణముల్ శతకోటికోటుల వ్వేళ నిజాంగమున్ దొరసి వేదన సేయఁగ ధైర్యసంపదం దాళెఁ బయోజనాభుఁడు రణంబున నింద్రియజేత యాధులం దాలిమమై సహించిన విధంబున రామనృపాల! వింటివే! | 71 |
| కం. | ఈ క్రమమున మాలి భుజా విక్రమమున నొచ్చి మెచ్చి విష్ణుఁడు శారాఙ్గ వక్రజ్యారవ మఖిలా శాక్రోడము లావరింప సంరంభమునన్ | 72 |
| చం. | కులిశసముజ్జ్వల ద్విశిఖకోటుల మాలి శరాళిఁ ద్రుంచి త జ్జలదనిభాంగముం గదియ శారిఙ్గ మెఱుంగులఁ బోలువాలుఁ దూ పులు నిగుడింపఁగా నవియుఁ బోయి తదీయ శరీరరక్తమున్ బలువిడిఁ గ్రోలె, ము న్నమృతపానము సేయు సురౌఘమున్ బలెన్ | 73 |
| చం. | మదమిటు లార్చిపేర్చి వనమాలి చలంబున మాలిమౌళి ప ల్చిదురుపలై ధరం గలయఁజేసి శరాసము ద్రుంచి టెక్కెముం బ్రదరముపా లొనర్చి హయపాటనమున్ ఘటియించి సూతునిం తుదిఁగనఁజేయ వాఁడు విరథుండయి చండతరాగ్రహంబునన్ | 74 |
| మ. | గద కేలంగొని శృంగివద్గిరి రహిన్ గ్రావంబుపైనుండి యు న్మదమై కేసరి డిగ్గులీల రథమంతన్ డిగ్గి పల్మాఱు న గ్గదఁ జక్రాకృతిఁ ద్రిప్పుచుం గవిసి నాగద్వేషి మూర్ఖంబు బి ట్టదరం గొట్టె మహాద్రి వజ్రహతి వ్రయ్యంజేయు జిష్ణున్ బలెన్ | 75 |
| ఉ. | మాలిగదాహతిం బిలుకుమాలి విహంగమమౌళి ధైర్యముం దూళి పయోధి మున్ దిరుగు తోరపు గట్టువలెం జలించి య వ్వేళఁ బరాఙ్ముఖుండయిన వెన్నుఁడు నివ్వెఱనొందె నందునన్ మే లని యార్చి రాసురులు మింట సుపర్వులు పిచ్చలింపఁగన్ | 76 |
| వ. | అప్పుడు | 77 |
| చం. | గరుడు పరాఙ్ముఖత్వమును గర్వితులై రిపులార్చు పేర్మియున్ సురల భయాకులస్థితియుఁ జూచి యిదేమి ఖగేంద్ర! యంచు శ్రీ హరి తన హస్తపద్మమున నాతని మస్తము సంస్పృశించి యా తురత హరించి శాత్రవు నెదుర్కొనఁజేసి పరాక్రమంబునన్ | 78 |
| ఉ. | కేలి సుదర్శనాయుధముఁ గేశవుఁ డంప యుగాంతపావకా భీలమహాస్ఫులింగచయ భీషణకీలకరాళమై లయో ద్వేలఘనాఘనోద్గళిత దీర్ఘతరాశని భూరిఘోషమై మాలి శిరంబుఁ ద్రుంచె క్షణమాత్రములో దివి వేల్పు లుబ్బఁగన్ | 79 |
| వ. | అంత | 80 |
| కం. | చక్రాహతి నీ క్రమమున నా క్రవ్యాదోత్తమోత్తమాంగము దెగి భూ చక్రము గ్రక్కదలంబడె శాక్రశతారచ్ఛితోగ్రశైలము లీలన్ | 81 |
| శా. | ఈ లీలన్ హరి మాలిఁ ద్రుంచుటయు దేవేంద్రాది దిక్పాలకుల్ సాలన్ సంతసమంది దివ్యసుమవర్షంబుల్ ప్రవర్షించి ర వ్వేళన్ వాని వధంబుఁ గన్ను లెదుటన్ వీక్షించి శోకానల జ్వాలల్ గ్రాలఁ దదగ్రజుల్ వగచుచున్ సైన్యంబుతోఁ బాఱఁగన్ | 82 |
| శా. | లంకామార్గము వట్టినట్టి రిపులన్ వీక్షించి తార్‌క్ష్యుండు సా హంకారస్థితి వెంబడిం బడి స్వపక్షాభీలవాతంబు న ల్వంకల్ దార్కొనఁజేయఁ దూలముల లీలన్ వార లుద్విగ్నులై బింకంబేది చనంగఁ గేశవుఁడు గంభీరాట్టహాసంబునన్ | 83 |
| మహాస్రగ్ధర | బెదరించున్ బెట్టు మించున్ బెనుశరములచే భీకరస్ఫూర్తి ముంచున్ గుదియించున్ గోపగించున్ గురుముసలములన్ గొట్టి బాధించు వంచున్ గద నొంచున్ గండ డంచున్ ఘనపరిఘములన్ ఖడ్గమున్ గై ధరించున్ విదళించున్ వెంబడించున్ విసువ కసురులన్ విష్ణుఁడీ రీతిఁ ద్రుంచున్ | 84 |
| వ. | అప్పుడు | 85 |
| మ. | జహదస్త్రంబు లుఠత్తురంగముఁ బతచ్ఛత్రధ్వజంబున్ క్షిప ద్బహుశీర్షంబు నటత్కబంధము గళద్రక్తంబు ధావద్భటం బు హసద్భూతము విస్రవచ్ఛ్రమపయఃపూరంబునై యిందిరా గృహిచే శత్రుబలంబు పెంపుసెడి పాఱెన్ దక్షిణాశాగతిన్ | 86 |
| కం. | హరి వెనువెంటం దగిలిన కరి నివహము చందమునఁ గకావిక లగుచున్ హరి వెను దగిలినఁ బఱచిరి కరినివహముతోడ రిపులు కాకుత్‌స్థమణీ! | 87 |
| తే.గీ. | ప్రళయఝంఝాసమీరంబువలనఁ జెదరి పఱచు కాలాభ్రముల లీలఁ బద్మనాభు శారఙ్గకోదండనిర్ముక్త సాయకోగ్ర పవనహతి దైత్యసంఘముల్ పఱచెనపుడు | 88 |
| చం. | గరుడతురంగ నందక విఖండిత దానవరాట్తనుచ్యుతా భరణరుచుల్ దిగంతములఁబర్వె ఘనాఘనకోటినుండి భా సురగతి మించు మించు లన క్షోణిపయిన్ హరి కుంకుమాంబువుల్ గురియు తెఱంగునం దొఱఁగెఁ గ్రొత్తగ నెత్తురుటేఱు లత్తఱిన్ | 89 |
| మ. | ఘనదైతేయ ఘనాఘనప్రచయ మాకాశంబునందా జనా ర్దన పర్జన్య నియుక్తిఁజెంది రణవర్షావేళ వర్షించె నూ తన కీలాలము హారమౌక్తికలసద్వర్షోపలవ్యాప్తి భూ తనికాయం బను చాతకప్రతతి కుత్సాహంబుఁ గల్పించుచున్ | 90 |
| వ. | ఈ క్రమంబున | 91 |
| మ. | గమకంబుల్ సెడి కైదువుల్ విడిచి యంగంబుల్ సెమర్పన్ నిరూ ఢమహాప్రాణభయంబునన్ దలలు వీడన్ రక్తముల్ గ్రక్కుచున్ విముఖత్వంబునఁ బాఱు రాత్రిచరులన్ వెన్నాడి మున్నాడి వి క్రమముం జూపు త్రివిక్రమున్ మరలి చక్కం జూచి రోషంబునన్ | 92 |