ఇతిహాసములు ఉత్తరరామాయణము సుమాలి నిర్దేశముచేఁ గైకసి విశ్రవు నాశ్రమంబు సేరి యతని వరించుట
సుమాలి నిర్దేశముచేఁ గైకసి విశ్రవు నాశ్రమంబు సేరి యతని వరించుట
సీ.అమరలోకము జోక నాలోకనీయమై - యే లోకము సమృద్ధి నింపొనర్చుఁ
గమలాప్త కమలారి కాంతు లొందకయ యే - స్థలము రత్నప్రకాశముల వెలుఁగు
బలి నిశాచర సార్వభౌమ నాజ్ఞావిశే - షమున నే భువనంబు సౌఖ్యముఁగను
భోగవత్యాపగాంభోజ గంధానిల - వ్యాప్తి నే నెలవు పావనతఁ జెందు
 
గీ.హాటకేశ్వర సేవాగతాగతాహి
కన్యకా నూపురార్భటిఁ గర్ణ సుఖ మొ
సంగు నే పద మట్టి రసాతలమున
నుండి యంత సుమాలి తానొక్కనాఁడు
114
మ.ధరణీలోకవిలోకనోత్సవ మెదం దార్కొన్న స్వర్గాద్రితుం
గరథస్థుండయి పుత్రి కైకసి నిజాంకం బెక్కిరాఁ, జంచలా
స్ఫురితంబై తగు నీలమేఘము బలెన్‌ భూషాలసద్గాత్రుఁడై
సరిదంభోధి వనప్రదేశముల సంచారంబుఁ గావింపఁగన్‌
115
లయగ్రాహిచారుపదనూపురము లారభటి మీర, మణి - హారములు చనుగవల దారసిల, మేలొ
య్యారములు నచ్చరలు పేరణి నటింప, వర - చారణులు దేవ యవధా రని జతై కై
వారము ఘటింపఁ బలుమాఱు వెలిచామరలు - సూరెల వియచ్చరకుమారికలు వీవం
బేరుగల పుష్పకముపై రుచిరలీల గురుఁ - జేరఁజను ధీరునిఁ గుబేరుఁ బొడఁగాంచెన్‌.
116
ఉ.కాంచి సుమాలి వెండియు నెగాదిగఁజూచి కళానిరూఢి నూ
హించఁగ వీనిఁ బోలఁగలఁడే యల రేదొర? యిట్టి పుత్రునిం
గాంచిన విశ్రవోమునిదిగా మఱి భాగ్య మయారె! రాక్షసుల్‌
గాంచెరె సౌఖ్య మీదృశునిఁ గైకసి విశ్రవుఁజేరి కాంచినన్‌
117
మ.అని రక్షోహితకార్యకాంక్షి యగు నయ్యాదిత్యవిద్వేషి యో
జనఁగావించి విముక్తపద్మ యగు శ్రీ చందాన నింపొందు నం
దనమోమాదరపూరితేక్షణములన్‌ దర్శించి వంశంబు మ
న్చు నుపాయం బొకటే గణింతు విను మంచుం గూర్మితో నిట్లనున్‌
118
ఉ.మానిని! యీ మణీమయవిమానముపైఁ జనువాఁడు విశ్రవో
మౌనికుమారుఁ డీశ్వరసమానుఁ డుదగ్దిశ యేలు నెప్పుడున్‌
వీని జయించుపాటి రణవీరులు గల్గుదు రమ్మహామునీ
శానుని భార్యవై యతని సాధుమతిన్‌ భజియించి తేనియున్‌
119
సీ.దౌహిత్రకులముచేఁ దమకు మేలగునంచు - బితృదేవతలు మనఃప్రియముఁ గందు
రాడుబిడ్డయు నల్లుఁడని వేడుకలు సేయఁ - గలిగెఁగా యని తల్లి యెలమిఁబొందుఁ
గన్యకాదానాభిగణ్యపుణ్యఫలంబు - దనకుఁ జేకుఱెనంచు జనకుఁ డలరు
వరుసతో భోగించి వరము లీయఁదలంచి - యనలేందు గంధర్వు లాశ్రయింతు
 
గీ.రాత్మజామణి జనియించెనన్న మాత్ర
నట్టికన్య యసామాన్య యని యెఱింగి
కుల వయోరూప శీలభంగులకుఁ దగిన
విభు వెదకి పెండ్లిఁ గావించి వెలయు గురుఁడు
120
మ.తనుజామాత్రవు గావు వంశమున సౌందర్యంబునన్‌ సద్గుణం
బున శ్రీదేవికి సాటిసేయఁదగు నిన్‌ బూబోఁడి! మావాని కి
మ్మని యే బంధుఁడు వేడఁగా వెఱచుఁ బ్రత్యాఖ్యాన శంకాప్తి జ
వ్వని వైనన్‌ దినముల్‌ క్రమింపఁబడె నుద్వాహార్హునిం గానమిన్‌
121
చం.కమలదళాక్షి! కూఁతు నిలఁ గాంచుట మేలగు నైన నొక్క ప
క్షమున విచారహేతు వని కాంచెద నెట్లగునన్నఁ దల్లి వం
శము గురు నన్వయంబు పతి సంతతి కన్యదుర్మాతయైనఁ జొ
ప్పమి యపకీర్తియున్‌ బడయు బాంధవ నిందయు నొందుఁ గావునన్‌
122
ఉ.దీని వరించు వీఁడనుచు దేవుఁ డెఱుంగునొ లే కెఱుంగఁడో
కాని తదన్యుఁడెట్లెఱుఁగుఁ గాన యెఱుంగ నితండు నీ విభుం
డౌనని తల్లి! నీవలన నన్వయ మొప్పఁ బ్రసిద్ధిఁగాంచు నం
చేనును నెల్లబాంధవులు నెన్నుదు మిప్పని దీర్పవే యనన్‌
123
ఉ.కమ్మల డాలు చెక్కుల ధగద్ధగలీన మొగంబువంచి కా
నిమ్మని లేచి సిగ్గు మది హెచ్చిల మ్రొక్కినఁ దండ్రి యెత్తి మా
యమ్మ! సుపుత్రులం గని శుభాన్వితవై మను మిమ్మహామునిన్‌
సమ్మతిఁగొల్చి నీవని ప్రసన్నత దీవనలిచ్చి పంచినన్‌
124
సీ.నఖరుచుల్‌ చరణారుణచ్ఛాయలను గూడి - యలరు కుంకుమగంధ మవని కొసఁగ
రమణీయ మణినూపురధ్వనుల్‌ శుచిపక్ష - లగు ద్విజాతుల పల్కు లనుసరింప
సొగసువాలు మెఱుంగుఁ జూపు లాశవీ - థికలఁగల్వవిరి మేలుక ట్లమర్ప!
గరపల్లవశ్రీలు గంకణారవముచేఁ - గోయిల యెలనాగగుంపుఁ బిలువఁ
 
గీ.గాంచికాఘంటికలు మ్రోయ నంచితోరు
కదళికలు మీఱ ఘనకుచ కనకకలశ
యుగనిగన్నిగ లొలుక నయ్యువిద శోభ
నాకృతినిఁ జేరెఁ బౌలస్త్యు నాశ్రమంబు
125
కం.కాంచనపాంచాలికవలె
మించిన యక్కాంచనాంగి మొయిజిగి పయి వ్యా
పించం గాంచిన తరువులు
గాంచన తరువుల తెఱంగుఁగైకొనె నచటన్‌
126
కం.సాయమున మరుని కెందొగ
సాయకమన రమణి యిటుల చని హోమంబుం
జేయుచు రెండవ స్వాహా
నాయకుఁ డనఁదగు పులస్త్యనందనుఁ జేరెన్‌
127
ఉ.చూచి మరీచిమాలి రుచిఁ జొక్కెడు పద్మినిలీల రక్తితో
నా చెలి యిచ్చ మెచ్చుకొని యాతని మ్రోల నతాననాబ్జసం
సూచితలజ్జయై నిలిచి క్షోణిఁ బదాగ్రమునన్‌ లిఖించుచున్‌
వేచినయంత హోమవిధి విశ్రవుఁడున్‌ నెఱవేర్చి ముందటన్‌.
128
సీ.తెలివియౌ చేరలంతేసి కన్నులదాని - మొలకనవ్వుల ముద్దుమోము దాని
వెలయ సందెడు తలవెండ్రుకల్‌ గలదాని - బసమించు నెలవంకనొసలిదానిఁ
గమ్మడా లొరయు బంగారుఁజెక్కులదానిఁ - దావి వీడెపుఁగావి మోవిదాని
మబ్బు సిబ్బెపు గబ్బి గుబ్బచన్నుల దానిఁ - బిడికిట నడఁగు నెన్నడుముదాని
 
గీ.మెఱుఁగువలెఁ దళ్కు తళుకను మేనిదానిఁ
గన్నె ప్రాయంబుచే వన్నెఁ గన్నదానిఁ
దోరపుఁబిఱుందుదానిఁ బెందొడలదాని
సొగసు నడదాని నక్కన్నెఁ జూచె నతఁడు
129
ఉ.చూసి సవిస్మయాత్ముఁ డగుచున్‌ ముని యెవ్వతె వేమి నీదు పే
రే చెలి లేక యొంటి యిట కేటికి వచ్చితి వెవ్వరైనఁబ్రే
రేచిరొ నీవె వేడ్కకుఁ జరించెదొ కల్గినమాట గల్గిన
ట్లో చెలి! దెల్పుమన్న నదియుం గరముల్‌ ముకుళించి యిట్లనున్‌
130
మ.కరుణాసాగర! నే సుమాలి యను రక్షస్స్వామి గారుపుఁగూఁ
తురఁ బుష్పోత్కట చెల్లెలన్‌ రహి వహింతుం గైకసీ సంజ్ఞచే
గురు నిర్దేశమునన్‌ భవచ్చరణముల్‌ గొల్వంగఁ దా వచ్చితిం
బరికింపం దగు నా మనోరథము మీ భవ్యప్రభావంబునన్‌
131
వ.అని పలికిన యచ్చిలుకలకొలికి పలుకులు విని, తన మనోదృష్టి నది వచ్చిన రాక యెఱింగి, సుగుణాభినందనుండగు నప్పులస్త్య నందనుం డిట్లనియె.132
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju