| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | మాల్యవదాదులు యుద్ధంబున నోడి లంక విడిచి రసాతంబు సేరుట |
| చం. | రణనయవేది యద్భుతపరాక్రమవంతుఁడు మాల్యవంతుఁడా క్షణమున, వేల దాఁటి చను సంద్రము లీల స్వకీయవాహినీ గణముఁ గ్రమించి యా హరి ముఖాముఖికిం జని ప్రజ్వలత్క్రుధా రుణనయనంబులన్ మిడుఁగుఱుల్ సెదరం దలయూఁచి యిట్లనున్ | 93 |
| ఉ. | ఒప్పునె నీకు మాధవ! యయో! రణధర్మము వీరధర్మముం దప్పి భయార్తులై పఱచు దైత్యుల వెన్కొని హింస సేయఁగా నిప్పని హీనుఁడైన ఘటియించునె? భీతులఁ ద్రుంచువానికిం జెప్పెడిదేమి? కీర్తియును సేమము స్వర్గముఁ గల్గనేర్చునే? | 94 |
| చం. | సమరపరాఙ్ముఖుం దొడరి చంపినవాఁ డెటువంటి మంచి పు ణ్యము లొనరించినం బొరయఁ డండ్రు దివం, బదియట్టులుండెఁగ య్యము ఘటియింప నంత ప్రియమైనను నేనిదె యున్నవాఁడఁ, జూ పుము భుజశౌర్య, మీ వెఱచి పోయెడి దైత్యులఁదాఁక నేటికిన్? | 95 |
| కం. | అని పలికి మాల్యవంతం బను శైలములీల నిశ్చలాత్మకుఁడై ని ల్చిన మాల్యవంతుఁ గనుఁగొని కనుఁగొనఁ గెంజాయ దొలుకఁగా హరి పలికెన్ | 96 |
| ఉ. | ఓయి నిశాచరప్రవర! యొప్పుగ నిప్పుడు పల్కు నీ రణ న్యాయము లెందుఁబోయె సురనాథులఁ దోలెడుచోటఁ జాలుఁబో న్యాయము చేతఁగాదె జయమందుట మీరు జగం బెఱుంగదే న్యాయము మేము దప్ప మొకనాఁటి కదెట్లన విన్ము దెల్పెదన్ | 97 |
| ఉ. | మున్ను విధాత మీకు వరముల్ గరుణించుటఁజేసి త్రోయరా కిన్ని దినంబు లేను క్షమియించితి, వేల్పులు మాకుఁ బ్రాణముల్, విన్నఁదనంబు వారి కొదవించిన మిమ్ము రసాతంబునన్ మిన్నత తూఱినన్ వెఱచి మిన్నిఁకఁ బ్రాఁక్రినఁ బట్టి చంపుదున్. | 98 |
| మ. | అమరుల్ మీవలనన్ భయార్తులయి నన్నర్థించినన్ దైత్యులన్ సమరక్షోణి జయింతుఁ బొండని ప్రతిజ్ఞాపూర్వికాభీతిదా నము మున్నిచ్చితి, భీతి నున్న శరణన్నన్ వందినన్ వ్రాలినన్ మిము ఖండింపకపోవ నన్న నతఁడున్ మేలంచుఁ బెల్లార్చుచున్. | 99 |
| చం. | కనుఁగవ గొప్ప నిప్పు లొలుకం బటురోషరసారుణాబ్జలో చనుఁడగు విష్ణుమీఁదనొక శక్తి మహాభుజశక్తిఁబూన్చి వై చిన నది ఘంటికల్ రొదలు సేయఁగ మంటలు మింట నంటఁగాఁ జని హరి ఱొమ్మున న్మెఱసెఁ జారుఘనస్థితచంచలాద్యుతిన్ | 100 |
| మ. | దనుజారాతియు నంతఁ బేరురమునం దళ్కొత్తు తద్ఘోరసా ధనముం గ్రమ్మఱఁబూని శాత్రవుని మీఁదన్ వైవ సేనాని పం చిన శక్తిం బలె మాల్యవంతు నెద వ్రచ్చెన్ జొచ్చి దానన్ మహా శనిపాతంబునఁ గూలు నీలగిరి యోజన్ వ్రాలె వాఁ డుర్వరన్ | 101 |
| చం. | తొడగిన జోడు వ్రయ్యలుగఁ దోరపు నెత్తుటదోఁగి యాగతిం బడి మఱికొంతసేపునకుఁ బైకొను శ్రాంతిఁ దొఱంగి స్వస్థుఁడై యడరి నిశాచరాగ్రణి మహాగిరిపోలిక సుస్థిరాకృతిం దడబడ కేఁగుదెంచి హరిఁ దార్కొని మార్కొని విక్రమంబునన్. | 102 |
| మ. | రటదత్యుజ్జ్వల కింకిణీశతసహస్రాస్ఫార కార్‌ష్ణాయస స్ఫుటశాతోత్కట కంటక ప్రకటమై పొల్పొందు శూలంబు మి క్కుటపుం దెంపునఁ బూని కేశవుని వక్షోదేశముం గ్రుమ్మి యం తటఁబో కద్దివిజారి ముష్టినిహతిం దాటించె రోషంబునన్ | 103 |
| ఉ. | ఆతని సాహసంబునకు నచ్చెరువందె వియచ్చరవ్రజం బాతరి మేలుమేలనుచు నార్చిరి దైత్యులు మాల్యవంతుఁడీ రీతి ముకుందు నొంచి యరరే! నిలుమంచు ఖగేంద్రు మోముని ర్ఘాతముఁబోలు ముష్టిహతి ఘట్టన సేసి పరాక్రమించినన్ | 104 |
| ఉ. | పక్షికులేంద్రుఁ డల్గి నిజపక్షపరంపరఁ బుట్టుగాడ్పునన్ రాక్షసరాజ సైనికుల రాయిడిఁజేసినఁ బండుటాకుల ట్లక్షమతన్ క్షణంబయిన నచ్చట నిల్వఁగలేక బెండులై దక్షిణవార్ధిలోఁ బడిరి దైవవశంబున లంక త్రోవగన్ | 105 |
| వ. | అంత | 106 |
| మ. | వినతానందన పక్షమారుతహతిన్ విభ్రాంతుఁడై మాల్యవ ద్దనుజేంద్రుం డట నిల్వఁగూడక ససోదర్యాప్తమిత్రంబుగాఁ జనియెన్ లంకకు సిగ్గుతో నిటులు కంజాతాక్షుచేఁ బెక్కు మా ర్లనిలో నొచ్చి రసాతలస్థులయిరయ్యా! దానవుల్ రాఘవా! | 107 |
| తే.గీ. | వెలయ సాలకటంకటకులమువార లధికు లమ్మాల్యవన్ముఖ్యు లాహవమున రామ! నీచేత హతులైన రావణాది దనుజవరులు పులస్త్యగోత్రంబువారు | 108 |
| తే.గీ. | రావణాదులకంటె నిర్వక్రవిక్ర మక్రమంబున ఘనులైన మాల్యవన్ము ఖాసురగ్రామణుల గెల్వ హరికిఁ దక్క నలవియె తదన్యులకు భానుకులవరేణ్య! | 109 |
| చం. | హరి హరి యంచు మే మనఁగ నన్యువలెన్ విననేల? నీవె శ్రీ హరి విపు డాలకించిన మహత్త్వము నీయది శంఖచక్రముల్ గరములఁ బూన కిద్దివిజకంటకులన్ బొలియింప మానుష స్ఫురణ జనించినాఁడవు ప్రబోధనిధుల్ నినుఁ గందు రాత్మలన్ | 110 |
| ఉ. | దుర్మతులెచ్చి సాధులకు ద్రోహము సేయునెడన్ జగంబునన్ ధర్మము తప్పు నప్పు డవతారము లెత్తి విశిష్టరక్షణల్ గూర్మి నొనర్చి దుష్టజనకోటి హరింతువు రావణాది దు ష్కర్మపరామరారిగిరి శంబకరా! రఘవంశ శేఖరా! | 111 |
| మ. | అల పౌలస్త్యుల కంటె వీరులగు పూర్వాదిత్యులన్ లంక వా రలు ప్రాపించుట శౌరివైరమున వీరత్వంబు దీఱన్ రసా తల మా భీరులు సేరుటం దెలిపితిం దర్వాతి వృత్తాంతముం దెలియం జెప్పెద నాలకింపుము కథాధీనావధానుండవై | 112 |
| వ. | అని కలశజుండు మున్ను తన్ను రఘువీరుం డడిగిన ప్రశ్నంబునకు నిటుల సదుత్తరం బొసఁగినవాఁడై మఱియు నిట్లనియె | 113 |