ఇతిహాసములు ఉత్తరరామాయణము బ్రహ్మ ప్రత్యక్షమై దశగ్రీవవిభీషణాదులకు వరంబు లొసంగుట
బ్రహ్మ ప్రత్యక్షమై దశగ్రీవవిభీషణాదులకు వరంబు లొసంగుట
సీ.శ్వేతకేతుఁడు జోకసేసి తెచ్చిన పదా - ర్వన్నెయంచ హుమాయి వడిగ నెక్కి
వెనువెంట వచ్చు సావిత్రీముఖస్త్రీల - ప్రణయభాషల మీఁది బాళిమాని
ప్రాఁబల్కు తుదలతోఁబ్రణుతించు సంయమి - ప్రవరుల నుతిఁ బెడచెవులఁబెట్టి
సృజనాక్రమముఁ దెల్పఁ జేరి కై నడచు బ్ర - హ్మల దిక్కుగని మాటలాడమఱచి
 
గీ.గనుకుపరువునఁ బఱదెంచు కొడుకు వీణ
వినెడు రక్తియుఁ బూనక వేల్పుఁ జెలువ
లాడఁ బాడంగ నెడయీక యాక్షణమున
దశముఖున కబ్జభవుఁడు ప్రత్యక్షమయ్యె
180
శా.ఈ చందంబునఁ బంక్తికంఠునకు వాణీశుండు గాన్పించి వీ
రాచారుం డతఁ డున్న యొక్క తలపై హస్తాసిఁ బూన్పంగ నో
హోచాలింపు దశాస్య! యీ తెగువ కుద్యోగింతురే? మెచ్చితిన్‌
నీ చిత్రాధ్వరకర్మనైష్ఠికతకున్‌ నీ కోర్కు లీ వచ్చితిన్‌
181
వ.అని వారించి హితోక్తులు వివరించిన విరించను పలుకు లాలించి, సాహసోద్యోగంబు సాలించి లేచి తలయెత్తి యతనిం బొడగాంచి పులకాంచితశరీరుండయి యవ్విశ్రవః కుమారుం డనేక నమస్కారంబు లాచరించి యిరువది కరంబులు ముకుళించి హర్షగాద్గద్యంబు వహించి యిట్లని స్తుతియించె.182
సీ.ప్రకృతిదురాపమై పరిపూర్ణరూపమై - యెసఁగు సత్తామాత్ర మీవె కావె
సత్త్వప్రధానమై సాక్షితాధీనమై - యెసఁగు నీశ్వరతత్త్వ మీవె కావె
సృష్టినిర్మాతవై యిష్టార్థదాతవై - యెసఁగు సర్వనియంత వీవె కావె
పురుషాహ్వయుండవై బోధమయుండవై - యెసఁగు మహాత్ముండవీవె కావె
 
గీ.నిన్ను సృజియించుకొన్నది నీవె కావె
నిన్ను నీయందుఁ గనుఁగొందు వీవెకావె
యెల్ల శ్రుతులెంచ మను వేల్ప వీవెకావె
యెల్ల శ్రుతులకు నావాస మీవెకావె!
183
మ.తనుబుద్ధీంద్రియముల్‌ వికారములు నాత్మం జెందంగాఁ జేసి వా
నిని దత్తద్బహుకర్మముల్‌ సలుపఁగా నీవే నియోగించి యం
దున దారిద్య్రము వైభవంబు సుఖమున్‌ దుఃఖంబుఁ గాలంబు వెం
టనె కల్పించి సమస్తముంగను నినున్‌ ధ్యానింతు నశ్రాంతమున్‌
184
ఉ.దేవ! శుభాశుభస్థితులు దేవనరాసురముఖ్యులొందఁగా
నీవె యొనర్తు వాఢ్యుఁడవు నీకొక విన్నప మాచరించెదన్‌
జీవులు మృత్యువన్న వెఱఁ జెందుదు రుగ్రవిరోధి మృత్యువే
కావునఁ దద్భయంబు వెలిగా బ్రదుకన్‌ వర మీయవే కృపన్‌
185
మ.గరుడాదిత్య నభశ్చరాసురమరుద్గంధ్వర్వ సిద్ధర్షి భా
స్వర విద్యాధర యక్షకిన్నర పిశాచప్రేత రక్షః ఫణా
ధర భూతగ్రహ విశ్వసాధ్య వసురుద్రశ్రేణిచేఁ బోరులన్‌
మరణం బొందని మన్కి యిమ్ము, గణియింపం దక్కు మర్త్యాదులన్‌
186
మ.అని ప్రార్థించినఁ బద్మగర్భుఁడు దదీయాశాస్య మీడేర్చి తెం
పున మున్నాతఁడు వహ్ని వేల్చిన శిరంబుల్‌ గ్రమ్మఱన్‌ మొల్చి చె
ల్వెనయం గట్టడసేసి సౌఖ్యనిధివై యీరేడు లోకంబులం
దు నజయ్యుండను కీర్తిఁగాంచుమని సంతుష్టాత్ముఁగావించుచున్‌
187
చం.అతని సపర్యలన్‌ బ్రముదితాత్మకుఁడై పరమేష్ఠి యోగరం
జితమతియౌ విభీషణునిఁ జేరి తపంబున ధర్మమార్గ సు
స్థితి ననివార్యభూతహితశీలత నీ ప్రతిఁగాన నేను మె
చ్చితి నిను వత్స! నీ వలచు చింతితముల్‌ గదియింపు నావుడున్‌
188
శా.అంతర్నాదము విన్న యోగివరు నట్లామాట లాలించుచున్‌
సంతోషించి విభీషణుండు - విమలస్వాంతం భవంతం దయా
వంతం శాంతమనంత రూపిణమహం వందే - యటంచున్‌ వచః
కాంతుంజేరి నమస్కరించి పలికెన్‌ గంభీరవాచార్భటిన్‌
189
చం.ఇనుఁడు కరంబులన్‌ గళల నిందుఁడు కీలల వహ్ని వన్నెగాం
చిన క్రియ సద్గుణంబులఁ బ్రసిద్ధి వహించిన లోకకర్త వీ
వెనసిన కూర్మి వచ్చి ననునెంతయు మెచ్చితి నంటి వింతకం
టెను వరమున్నదే? యిపుడు నేఁ గృతకృత్యుఁడనైతి నీశ్వరా!
190
ఉ.ఐన నమోఘదర్శనుఁడవైన జగత్పతి వీవె మెచ్చి యిం
పైన వరంబు వేఁడుమని యానతి యియ్యఁగ నూరకుండరా
దే నుతిసేసి వేఁడెద సహింపఁగఁగూడనియట్టి యాపదన్‌
మానిత ధర్మమార్గమున మామకచిత్తము నిల్వఁ జేయవే!
191
కం.ఏ యాశ్రమంబుఁ జెందిన
నా యాశ్రమధర్మమునకు ననుకూలముగాఁ
జేయుము హృదయము ధార్మికుఁ
డేయెడ నవిజయ్యుఁ డనఁగ నే వినియుందున్‌
192
తే.గీ.శిక్షితము గాకయ మదీయ చిత్తవృత్తి
కనుగుణంబుగ నిమ్ము బ్రహ్మాస్త్ర మనిన
నా వరములిచ్చి తద్బుద్ధి కజుఁడు మెచ్చి
యిచ్చ ననుకంప జనియింప నిట్టు లనియె
193
ఉ.ఆసురయోనిఁబుట్టియును నాసురవృత్తి యొకింతలేదు నీ
కీసురలైన దీఁటగుదురే? భవదుక్తులు నన్నుఁ బ్రీతునిం
జేసె నమర్త్యభావము సుశీల! యొసంగితి నింక నీవు దే
వాసురకోటిలో ఘనుఁడవై మనుమంచు ననుగ్రహించినన్‌
194
కం.కొనియాడి రమరు లజుఁ గనుఁ
గొనియాడిరి వేల్పు ముద్దుగుమ్మలు వెత వీ
డ్కొని పాడిరి గంధర్వులు
పెనుపగు నమరత్వ మవ్విభీషణుఁ డొందన్‌
195
చం.పరహితుఁడైనవానికి శుభంబు లభించిన నెల్లవారలున్‌
హరుసమె కండ్రు దుర్జనున కాయువు శ్రీయును వృద్ధిఁ బొందినం
బరమభయంబుఁ జెందుదురు భానుకులేశ్వర! కావునన్‌ దయా
పరుఁడు విభీషణుం డమరభావము నొందిన నుబ్బి రందఱున్‌
196
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju