ఇతిహాసములు ఉత్తరరామాయణము సరస్వతి తోడ్పాటుచే బ్రహ్మ కుంభకర్ణునకు నిద్రను వరంబుగా నిచ్చుట
సరస్వతి తోడ్పాటుచే బ్రహ్మ కుంభకర్ణునకు నిద్రను వరంబుగా నిచ్చుట
చం.బిసరుహగర్భుఁ డిట్టులు విభీషణు కోర్కు లొసంగి ప్రాభవం
బెసఁగఁగఁ గుంభకర్ణుకడ కేఁగెడునప్పుడు వేల్పు లాడి ర
య్యసుర కభీష్ట మియ్యఁ దగదయ్య పరాకు సరస్వతీశ! వాఁ
డసదృశకాయుఁ డీభువన మింతయు మ్రింగఁగ నోపు నొక్కటన్‌
197
సీ.గట్టిగాఁ బదముర్విఁ బెట్టెనేనియు సప్త - పాతాళలోకముల్‌ భగ్నములగు
నొక్కమా టటునిల్చి నిక్కెనేనియు శిరః - ప్రహతిచే నూర్ధ్వకర్పరము పగులు
నుత్సాహమొదవ మైనుబ్బించెనేనియుఁ - బచ్చిగోడల జాడ విచ్చు దిశలు
లేచినీల్గుచు బారసాఁచె నేనియుఁ జక్ర - వాళాచలేంద్ర మవ్వలికి వీఁగుఁ
 
గీ.గేరి నవ్విన మీబోఁటి వారికెల్ల
గుండె దిగులగు మమ్ముఁ బేర్కొనఁగ నెంత?
ఈ వఱకు వాఁడు సేసిన హింసలెంచఁ
గూడ దటువంటి ఖలు దయఁజూడనేల?
198
ఆ.వె.తనువుఁ జూతమన్నఁ గనరాదు తుదమొద
లాత్మఁ జూతమన్న నతికఠినము
నడకఁజూత మన్నఁ గడు హింస వాఁడేల?
ధాత! వాని తపము దయ్య మెఱుఁగు
199
కం.నందనవనవాసినులఁ బు
రందర సహచరల నచ్చరలఁ బెక్కండ్రన్‌
మ్రందించె మ్రింగె నరముని
బృందంబుల ఖలుఁడు వీఁడు పిన్నతనమునన్‌.
200
కం.ఏ వరము లేకయే బలు
కావరమున జగము లేఁచు ఖలునకు వరముల్‌
దేవర యొసంగుట మండెడు
పావకులో నేయి వోయు భావముగాదే?
201
ఉ.కావునఁ గుంభకర్ణుపయిఁ గారుణికత్వము మాని నీవు మా
యా వివశాత్ముఁజేసి వరమంచొకదాని నొసంగినన్‌ శుభం
బావహిలున్‌ జగంబులకు నంచు సురల్‌ వివరింప భారతీ
దేవి ముఖంబుఁజూచెఁ దొలిదేవర సాదరవీక్షణంబునన్‌.
202
వ.ఇటువలెఁ దన మొగంబుఁ గనిన నలుమొగంబుల వేలుపుదొర యింగిత మెఱింగి మెఱుంగుల తెఱంగునఁ దుఱంగలించు మెఱుంగుఁ జూపులఁ దొంగలి ఱెప్పల నప్పళించుచు విప్పుగల కప్పుఁగొప్పు విరుల సరులకై కప్పుకొను నళిపరంపరల కళుకు సంపాదించు నవతంసచాంపేయ ప్రభా సంపదలకు లంకె లగుచుఁ గనత్కనక తాటంకదీప్తులు విద్దెంబుఁ జూపుకోపున నందంపుఁ జెక్కుటద్దములపై ముద్దు గురియం గరంబులఁ బుస్తకాక్షమాలికా విపంచికలు మెఱయఁ గొదమ రాయంచవలె నచ్చదువుల జవరాలు పతి యెదుటి కరుదెంచి యుదంచితాంజలి యొనరించి వినయలజ్జాభరానతవిలోకనంబులం దద్వదనంబు లలంకరించి యల్లన యేమి పని యాచరింతు నాన తిండనిన నజుండును నద్దేవి నాదరించి యిట్లనియె203
మ.సరసీజేక్షణ! యెల్ల జీవుల రసజ్ఞల్‌ సేరి క్రీడించునే
ర్పరి వీవె కద! కుంభకర్ణు రసనాభాగంబునన్‌ నిల్చి నే
వర మీ వచ్చినవేళ నయ్యసురుచే వ్యర్థోక్తు లాడింపు మే
ల్వరముల్‌ గోరఁగ నీకు పొమ్మనిన నవ్వాగ్దేవి యట్లుండినన్‌
204
మ.అమరజ్యేష్ఠుఁడు నంత నయ్యసురు డాయంబోయి లే కుంభక
ర్ణ! మహాభాగ! భవిత్తపంబుఁ గన నానందంబు వర్ధిల్లె వేఁ
డు మభీష్టం బొడఁగూర్తు నిప్పుడన వాఁడున్‌ మ్రొక్కి షణ్మాసముల్‌
దమి నిద్రింపఁగ నొక్కనాఁ డశన మొందం జేయవే నావుడున్‌
205
చం.వనజజుఁడట్ల యౌ నది యవశ్యము మేలు సుఖాన నిద్రపొ
మ్మని సురకోటితోఁ జనియె నంత సరస్వతియుం దదాస్యవ
ర్తన ముడిగెన్‌ నిజప్రతిభఁ దాలిచి యప్పుడ కుంభకర్ణుఁడుం
దన నుడువుల్‌ దలంచుకొని తా నిటులంచుఁ దలంచె నెంతయున్‌
206
మ.అకటా! పద్మజు నంతవాఁడు వరమియ్యన్‌ వచ్చినన్‌ మంచి కో
రిక లర్థింపక నిద్ర యిమ్మనెడి వెఱ్ణిం గంటిమే? యిట్టి దే
టికి నా నోటికి వచ్చె? హా! తెలిసికొంటిన్‌ వేల్పులే చేసి రీ
వికలత్వం బిఁక నేల యైనపనికిన్‌ విభ్రాంతిఁ గావింపఁగన్‌
207
కం.పౌరుషమునకును దైవం
బారయ ఫలకారి యందు రా దైవంబే
వైరస్యము వహియించిన
నే రూపునఁ బురుషుఁడొందు నిష్టార్థంబుల్‌?
208
కం.దైవోపహతుఁడు సుకృతపుఁ
ద్రోవ వెదకి పోవ నదియె దుర్గతియగు మేల్‌
గావలయునన్నఁ గీడగుఁ
గావున నిఁక జాలిఁజెందఁగా దనుచున్నన్‌
209
ఉ.అన్నయుఁ దమ్ముఁ డచ్చటికి నంతటిలోఁ గడువేడ్క వచ్చి తా
నున్న విధంబుఁజూచి యదియున్‌ విని దైవమె యిట్లు సేసిన
వ్విన్నఁదనంబుఁ జెందఁదగునే? వగపేటికిఁ బామరుండవే?
యన్నఁ గలంకదేఱె నతఁ డర్కకులేశ్వర! వారిమాటలన్‌
210
కం.ఈ తెఱఁగున దశకంఠుఁడు
ధాతవరంబునను గామితము లొనఁగూడన్‌
భ్రాతృసమేతంబుగ శ్లే
ష్మాతక వనమునకుఁ జనియె సంతోషమునన్‌
211
వ.అని యెఱింగించి రఘుకులగ్రామణితో మఱియు నగస్త్య ముని శిఖామణి యిట్లనియె212
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju