ఇతిహాసములు ఉత్తరరామాయణము విశ్రవు నిర్దేశంబువలన ధనేశుండు గైలాసంబుఁజేరుట
విశ్రవు నిర్దేశంబువలన ధనేశుండు గైలాసంబుఁజేరుట
మ.నవరత్నోజ్జ్వల దివ్యపుష్పక విమానం బెక్కి వేవేగ వి
శ్రవసుం జేరి నమస్కరించి యనుజప్రారంభ మాద్యంతమున్‌
సవిశేషంబుగఁ దెల్పి యెయ్యది నివాసం బెందు వర్తింతు? మీఁ
ది విచారం బిఁక నేమి? తండ్రి! కృప నిర్దేశింపవే నావుడున్‌
247
మ.ధనుదుం గన్గొని తండ్రి యిట్లనియెఁ బుత్రా! నేఁడు గా దద్దురా
త్మునిదౌ నిప్పని యల్లనాఁడె విని యీ దుర్బుద్ధి యే మూర్ఖు దె
ల్పెనయో? యగ్రజు ప్రోలు గావలెనె బల్మిం గైకొనన్‌? జోటు లే
దె? నంయబేల పరిత్యజించె? దని సూక్తిన్‌ నీతి నేఁజెప్పినన్‌
248
కం.చిలువకు బదనికఁ జూపిన
చెలువున నా పలుకు వాఁడ సేకొన కలుకం
బలుకక మొగముల జేగుఱు
లొలుకఁగ వడి లేచి యిచట నుండక చనియెన్‌
249
ఉ.వాఁడు మదాంధుఁ డార్యులగువారలు పల్కిన వాక్యపద్ధతిన్‌
రాఁడు పయోజగర్భుని వరంబున లోకవిభుండు దానయై
నాఁడు దురాత్ములైన దితినందనులన్‌ బలుమందిఁ గూడికొ
న్నాఁడు శపించినన్‌ గినిసినన్‌ బనిసేయదు వానిపై నిఁకన్‌
250
చం.తగని కుమారుఁడైన మమతారహితస్థితి యొప్పుఁ దండ్రికిన్‌
దగని సహోదరుం డయినఁ దానును బాయుట యొప్పు నన్నకున్‌
దగదని నిగ్రహించినను దాదృశులౌదురుగాన వానితోఁ
దగదిఁకఁ బొత్తు నీకొక హితం బొనరించెద విన్ము పుత్రకా!
251
శా.లీలోద్యానలతాకుడుంగ విహరల్లేఖాంగనాహాసరు
గ్జాలప్రస్రవదిందుకాంతలహరీ సంబంధ మందాకినీ
నాళీకోత్పల వాసనా జనితకాంతాయుగ్భవోల్లాసమౌ
కైలాసంబు వసింప నీకుఁ దగు నింకం జేరు మచ్చోటికిన్‌
252
ఉ.అచ్చటి కేళికాననము లచ్చటి కల్పిత భూధరోచ్చయం
బచ్చటి యచ్చపుం గొలఁకు లచ్చటి బంగరుఁజాయ తమ్మి పూ
లచ్చటి రత్నమందిరము లాత్మకు మొప్పొనఁగూర్చునే గదా!
యచ్చటి కాఁపురంబునఁ బురారి సఖుండగుఁ బొమ్మ నావుడున్‌
253
చం.జనకుని యాజ్ఞ మౌళి నిడి సమ్మద మొప్ప ధనేశుఁ డప్పుడే
ధన మణి వస్తువాహన కదంబము సేకొని యాశ్రితుల్‌ హితుల్‌
దనయులు సైనికుల్‌ గొలువఁ దక్కక లంకఁ బరిత్యజించి శం
భుని శరణంబుఁజేరి ప్రియపూర్వముగా శరణంబు వేడినన్‌
254
కం.శరణాగతసులభుం డగు
హరుఁ డాతని నాదరించి యలకాహ్యయమౌ
పురమిచ్చి మెచ్చి మచ్చికఁ
బరమాప్తునిఁగా నొనర్చి పరిపాలించెన్‌
255
కం.అనయము వినయము నయమును
దన సొమ్ముగ మెలఁగు కీర్తిధనుఁ డెచ్చటికేఁ
గిన నిష్టార్థముఁ జేకొనుఁ
గన రామ! ధనేశఁ డిటుల కాంక్షిత మొందన్‌
256
మ.జనలోకేంద్ర! కుబేరుఁ డిట్లరుగఁ ద్రింశద్యోజనీదీర్ఘయై
కనకోద్భాసితసౌధయై సుగృహయై కన్పట్టు నా లంక ని
ర్జనయయ్యుం జెలువొందె నొక్క విభుఁ డాసంగూడి వీడ్కొన్నఁ జ
య్యన వేఱొక్కని రాకకుం దనరు వేశ్యాకాంత చందంబునన్‌
257
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju