ఇతిహాసములు ఉత్తరరామాయణము దశగ్రీవుఁడు లంకం దన కిమ్మని ధనేశునితోఁ జెప్పఁ బ్రహస్తునిఁ బంపుట
దశగ్రీవుఁడు లంకం దన కిమ్మని ధనేశునితోఁ జెప్పఁ బ్రహస్తునిఁ బంపుట
శా.ఆకర్ణించి యతండు రెండు గడియల్‌ ధ్యానించి మీ భాషితం
బే కర్తవ్య మటంచుఁ దాత వదనం బీక్షించుచున్‌ లేచి బా
హా కౌక్షేయకులై యమాత్యులు ప్రహస్తాదుల్‌ భటుల్‌ గొల్వ లం
కాకాంక్షం జని నిల్చె దండధరదిగ్రాజత్త్రికూటంబునన్‌
234
వ.నిలిచియచ్చట235
చం.అతులవచః ప్రశస్తునిఁ బ్రహస్తునిఁ జూచి దశాస్యుఁడీ విఁకం
బితృసము నస్మదగ్రజుఁ గుబేరుని శీఘ్రము చేరి నా యభీ
ప్సితమును, లంక ము న్నసురశేఖరు లేచిన కార్యభంగియుం
జతురతఁజెప్పి, యప్పుర మొసంగఁగ వే చని యాడి రమ్మనన్‌
236
చం.అతఁడు హసా దటం చతిరయంబున లంకకుఁబోయి కిన్నరీ
శతమణి కంకణ క్వణన చారుకరోదర చామరా నిల
ప్రతిహతకుంతలుం డయి సభాస్థలి నోలగమున్న దేవతా
పతినిభునిన్‌ ధనప్రభుని భక్తిఁ గనుంగొని మ్రొక్కి యిట్లనున్‌
237
ఉ.దానదయాదిసద్గుణనిధాన! పరాకు భవత్ప్రియానుజుం
డైన దశాననుండు వినయంబున మీదగు సేమ మారయం
గా ననుఁబంచె మీ పదయుగంబునకున్‌ నతు లాచరించె మీ
తో నొకమాట తెల్పుమనెఁ దోరపువేడ్క వినుండు దెల్పెదన్‌
238
మ.మన మాతామహు లాదికాలమున నిర్మాణంబు సేయించియుం
డిన గేహం బఁట లంక, యెవ్వ రచటన్‌ లేకుండినన్‌ మీరు గై
కొని పాలించితి రిప్పు డద్దనుజముఖ్యుల్‌ వచ్చినా రందఱున్‌
ననుఁగొల్వన్‌, బుర మేను మీవలెనె కొన్నాళ్లేలఁ గాంక్షించితిన్‌
239
మ.అని మీ కూరిమితమ్ముఁ డాడుమనినాఁ డా మాట యట్లుండె, యో
జనయుం దెల్పెదఁ బంక్తికంధరుఁడు భాషానాథ దీవ్యద్వరం
బునఁ దేజంబున మేటి నెయ్యమె తగున్‌ మూర్ఖుల్‌ విరోధంబు సే
యన యున్నా రమితంబుగా నచట నయ్యా! నీదు చిత్తంబనన్‌
240
శా.ఆ యక్షేశుఁడు పంక్తికంధరు నమాత్యగ్రామణిం జూచి యే
మో యంచుండితి నింతమాత్రమున కోహో! యింత సంకోచమే
లా? యీ ప్రోలొకఁడెంత? నా ధనము నా యైశ్వర్యముం బ్రోవఁ దా
నే యర్హుం డగుటేమి మీరెఱుఁగరే? యిమ్మేది భేదోక్తికిన్‌?
241
కం.నేనై చేయఁగ వలసిన
దాని నెఱింగించె మేలు తమ్ముఁడు నెమ్మిం
దా నిప్పట్టణ మేలుట
నేనేలుటకంటె వేడ్క యిబ్బడిగాదే!
242
వ.అని కలయం బలికి243
కం.కాఁపురము సేయ కిఁక లం
కాపుర మెడఁబాయవలసెఁగా యను బలువౌ
తాపము దోఁపఁగ నీక ప్ర
తాపము గల యనుజుఁ దలఁచి ధనదుఁడు మరలన్‌
244
కం.రమ్మనుమా తమ్మునిఁ దన
సొమ్మనుమా లంక రాక్షసులతో మేల్‌ గై
కొమ్మనుమా వలదనుమా
నమ్మనుమా యనుచు దండనాథునిఁ బనిచెన్‌
245
వ.ఇవ్విధంబున మనుష్యధర్ముండు దుర్మదుండగు దశకంధరునకుఁ బ్రత్యుత్తరంబు వచియింప దూతం బంచి, తత్‌క్షణంబు246
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju