| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శూర్పణఖను విద్యుజ్జిహ్వునకిచ్చి పెండ్లి చేయుట |
| మ. | అనవద్యస్థితి నుల్లసిల్లు చొకనాఁ డాత్మానుజన్ నిండు జ వ్వని నా శూర్పణఖాఖ్యఁ గన్యఁ గని యుద్వాహంబు గావింప బం ధునికాయాన్వితుఁడై తలంచి యల విద్యుజ్జిహ్వుఁడన్ గాలకే యునకుం బెండ్లి యొనర్చెఁ దల్లి హృదయం బుత్సాహమగ్నంబుగన్ | 263 |
| వ. | ఈ ప్రకారంబున శూర్పణఖకు వివాహం బాచరించి యా విరించి పౌత్రజుఁ డొక శరత్సమయంబున మృగయా వినోదం బొనరింపం దలంచి సమంచిత మణిమయస్యందనారోహణంబు గావించి ధనుర్బాణంబులు ధరియించి యొక్కరుండ పోయి, యమితాగమ సమన్వితంబయి పులస్త్యజనకాననంబునుంబోలె నున్న యొక్క నిర్జనకాననంబుఁ బ్రవేశించి, యచ్చట | 264 |