ఇతిహాసములు ఉత్తరరామాయణము దశగ్రీవుఁడు మయసుతను మందోదరిఁ బెండ్లియాడుట
దశగ్రీవుఁడు మయసుతను మందోదరిఁ బెండ్లియాడుట
కం.సురమృగముల నిఁక నిటువలె
హరియింతు నటంచుఁ దెలుపు ననువున నయ్యా
సురశార్దూలుఁడు వనభా
సురమృగముల వేఁటలాడుచుం జని యెదుటన్‌
265
కం.మయునిఁ బ్రశాంతకృపారస
మయుని హఠాభ్యాస నియమ మహిమాపహృతా
మయుని గుణముదిత నర సుర
మయునిఁ దొలుతఁ గైకసీకుమారుఁడు సూచెన్‌
266
వ.చూచి తదనంతరంబున267
సీ.హరినీలముల కప్పు నళిజాతములయొప్పుఁ - గల కొప్పు రహి మెప్పు గులుకుదానిఁ
గలువఱేకులు యేపు ఖంజనంబుల రూపు - నివసించు వాల్‌చూపు నీటుదానిఁ
దళుకు బంగరుగిండ్లు దులకించు విరిచెండ్లు - నడఁగించు పాలిండ్ల నమరుదానిఁ
గండచక్కెర దీవి దండకెంపుల ఠీవి - మొలపించు చెంగావి మోవిదానిఁ
 
గీ.దళుకుఁజెక్కులదాని సిగ్గొలుకుదాని
నొఱపు గలదానిఁ దొలుకాఱు మెఱుపుఁజాయ
హెచ్చు జిగిదాని మయువెంట వచ్చుదాని
బాల నొక్కతెఁ జూచె నప్పంక్తిముఖుఁడు
268
కం.చూచి తలలూచి యిటులని
యేచినతమిఁ దలఁచె నౌర యీయొయ్యారం
బీ చిన్నిపాయ మీ చెలు
వే చెలువలయందుఁ గంటిమే లోకములన్‌?
269
సీ.ఈ నాతికౌనుతో నెనగాక కాఁబోలు - సింగముల్‌ గుహలలోఁజిక్కుటెల్ల
నీ బాల నడలతో నెనగాక కాఁబోలు - నేనుంగు లడవిలో నీగుటెల్ల
నీ చెల్వ చూడ్కితో నెనగాక కాఁబోలు - సారంగములు పొదల్‌ దూఱుటెల్ల
నీ కన్య ఘనవేణి కెనగాక కాఁబోలు - నహులు పుట్టలు సొచ్చి యడఁగుటెల్ల
 
గీ.నీ నెలఁతఁ జేరి కాఁబోలు నించువింటి
చెం చతనుఁడయ్యు జగము జయించుటెల్ల
నీ లలన సృష్టి సేసి కాఁబోలుఁ బంక
జాసనుఁడు విశ్వమున స్రష్ట యగుటయెల్ల!
270
సీ.ఎలదేఁటి విహరణం బెపుడు నొందని ఫుల్ల - కమలంబు దొరసె నిక్కలికి మోము
రాచిల్కముక్కుఁజేర్పని పక్వబింబంబు - ప్రతిబింబ మెనసె నిప్పడఁతి మోవి
గండుఁగోయిలకు దక్కని మావిచిగురుల - ట్లెసఁగె నీ లతకూన మృదుకరములు
నవభుజంగాలింగనమ్ము సేకొనని గే - దఁగి తావిఁ దెలిపె నీ తరుణి వలపు
 
గీ.వన్నె గల క్రొన్నన కటారి మన్నెవాఁడు
చిన్ననాఁడు వహించిన చికిలి కలువ
తూపు లన మించె నీ చెల్వ చూపు లవుర
పెండ్లి లేనట్టులున్న దిబ్బిసరుహాక్షి
271
శా.ఈ పద్మేక్షణ జాతి యెయ్యదియొ? పేరేమందురో? యీ ఘనుం
డీ పూబోఁడికి నేమి గావలయునో? యే నర్థి నిమ్మన్నచో
నీ పూర్ణేందునిభాస్య నియ్యఁడొకొ? తా నీకున్న నింతేల సం
తాపం బప్పటి కీతనిన్‌ గెలిచియైనన్‌ దీనిఁ బెండ్లాడెదన్‌
272
కం.అను సాహసంబు మదినిడి
వినయము గలవాఁడపోలె వింశతిభుజుఁడా
యన పోవు త్రోవ కడ్డము
చని వినతి యొనర్చి పలికెఁ జతురత్వమునన్‌
273
ఉ.ఓ మహితాత్మ! యీ విపిన ముగ్రమృగాకుల మిప్పుడిందు మీ
రేమిటి కేఁగుదెంచితిరొ యెప్పుడు నెచ్చటనుందు రేమి మీ
నామము లానుపూర్విగ వినన్‌ వలతున్‌ వినిపింపుఁడన్న వీ
తామయుఁడా మయుండను దశాస్యునితోఁ గలరూపమేర్పడన్‌
274
కం.దానవశిల్పాచార్యుఁడ
నేను మయుం డనెడువాఁడ నిందువదన యి
మ్మానిని మందోదరి యనఁ
గానొప్పు మదీయపుత్రి గాంభీర్యనిధీ!
275
ఉ.నా మహనీయశిల్పమును నా సుగుణంబులు మెచ్చి దేవతల్‌
హేమయనం బ్రసిద్ధి వహియించిన యచ్చరలేమ నిచ్చి రా
హేమకుఁగా మనోజ్ఞమగు హేమపురంబు సృజించి యచ్చటన్‌
హేమనుగూడి యేను సుఖియించితిఁ బంచశతాబ్దముల్‌ రహిన్‌
276
శా.ఏమో యీశ్వరమాయ! యే నెఱుఁగఁ దండ్రీ! హేమతో నున్నచో
వ్యామోహంబునఁ బెద్దకాలము క్షణంబై తోఁచు నా చెల్వ నే
మ్మో మొక్కించుక చూడకున్న నిమిషంబుం గల్పమౌ వేయునే
లా? మే లెట్టిదొ? దానియిల్లు పెడఁబాయకలే నహోరాత్రముల్‌
277
శా.ఆయెంబోయెను, నాఁటి జోలి యిఁకనేలా? యీవలన్‌ వింటివే
యోయయ్యా! యటుగొన్నినాళ్లు సన నాయోగంబునన్‌ దౌహృద
శ్రీ యప్పద్మపలాశలోచన ధరించెం గాంచె మాయావియౌ
మాయావిన్‌ మఱిదుందుభిన్‌ బిదప నిమ్మందోదరీ కన్యకన్‌
278
చం.అనిమిషు లంతట బిలువ నంపిన నన్నెడఁబాసి హేమవో
యిన నది లేనిచోట వసియింప సహింపక సంసృతిప్రవ
ర్తనము జుగుప్సగాఁగని విరాగుఁడనై తప మాచరింపఁబో
వనె సమకట్టి యీ సుత వివాహము సేయఁదలచి యిమ్మెయిన్‌
279
కం.తగువాని నెందుఁగానక
జగతింగ్రుమ్మరెద రాత్రిచరశేఖర! నీ
దగు కులము నామమే వినఁ
దగుదు ననుచుఁ దోఁచె నేనిఁ దగు వివరింపన్‌
280
ఉ.నా విని పంక్తికంఠుఁడు మనంబున సంతసమంది యో మహా
త్మా! విను నాకు బ్రహ్మప్రపితామహుఁ డేను బులస్త్యు పౌత్రుఁడన్‌
బావనమూర్తి విశ్రవుఁడు మజ్జనకుండు జగంబునన్‌ దశ
గ్రీవుఁడు నాఁ బ్రసిద్ధుఁడ నరీణపరాక్రమధైర్యధుర్యుఁడన్‌
281
మ.లవణాంభోధిగభీరఖేయవృతమౌ లంకాపురం బేలుదున్‌
స్వవయోరూపకులానురూప యగు కన్యం గోరుచున్నాఁడ లే
దు వివాహం బని పల్కినన్‌ మయుఁడు సంతోషించి యర్హుం డతం
డవు మత్పుత్రిఁ బరిగ్రహించుటకు నూహాపోహ లింకేటికిన్‌?
282
కం.అని కృతనిశ్చయుఁడై య
ద్దనుజమణికి ధారవోసెఁదనపుత్రి మయుం
డనలుని సన్నిధి నతఁడుం
దనరుచుఁ బాణిగ్రహణముఁ దగ నొనరించెన్‌
283
శా.మాణిక్యోజ్జ్వల కంకణస్ఫురితమౌ మందోదరీకన్యకా
పాణింబట్టిన సాత్త్వికోదయము సూపెట్టన్‌ దశగ్రీవుమై
క్షోణీనాయక! యెంత తామసగుణస్థుండైననున్‌ సద్గుణ
శ్రేణిన్‌ మించినవారి పొం దొలసినన్‌ జేకూరుఁ దద్భావముల్‌
284
ఉ.రాక్షస రాజ్యలక్ష్మి యన రంగు వహించిన యప్పయోజప
త్రేక్షణ నిట్లు పెండ్లియయి యెంతయు వేడ్క దశాస్యరాక్షసా
ధ్యక్షుడు మామకున్‌ బహువిధార్చన లిచ్చిన నాతఁడున్‌ లలా
టాక్షునినైన నొంచునొక యద్భుతశక్తి యొసంగి ప్రేముడిన్‌
285
కం.ఇది పరమఘోరసాధన
మెదిరించిన నెట్టి పగతునేనిఁ జెఱుచు బె
ట్టిదుమీఁదఁగాని వైవకు
మదరొందెడువారిమీఁద నని వీడ్కొనియెన్‌
286
తే.గీ.రామ! యీ శక్తిఁగొని కాదె రావణుండు
మున్ను మన లక్ష్మణుని నొంచి మూర్ఛవుచ్చె?
నదియుఁ బెనులోభిఁ బ్రార్థించు నర్థి యాచ్న
వలె నిరర్థకమై చన్న వగలఁబొగిలె
287
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju