| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవుండు గరుడోరగాదుల బాధించుట |
| కం. | క్రూరుఁడు దశముఖుఁ డంతఁ బ యోరుహభవదత్త వరమదోద్రేకమునన్ మేరఁ దలంపక దుష్ట ప్రారంభమునంద బుద్ధి యలవరిచె నృపా! | 298 |
| వ. | అది యెట్లనిన | 299 |
| సీ. | గరుడుల గరుడుల కంబంబులనె కట్టి - గంధర్వ గంధర్వ గతు లడంచి యక్షులఁబక్షుల యటుల పాఱఁగఁద్రోలి - ఖచరులఁ గుచరులఁగా నదల్చి కిన్నరు లెన్నరు తన్నని నొప్పించి - సిద్ధుల బద్ధులఁజేసి కలఁచి సాధ్యులు సాధ్యులై శరణుఁబొందఁగఁ జేసి - యమరులఁ జమరుల యండకనిచి | |
| గీ. | భోగుల విభోగుల నొనర్చి యోగి తతి వి యోగితతివలె బలువెత నొందఁజేసి చారణానిల తూషితభాస్వరుల నొడిచి యుద్ధతేజంబుఁజూపె లంకేశ్వరుండు | 300 |
| మ. | హవనంబుల్ భువనంబులున్ జెఱుచు మాయల్ దాల్చుఁగూల్చున్ సుధా శి వనంబుల్ పవనంబులీల ద్విజులన్ ఛేదించు భేదించుఁ ద ద్భవనంబుల్ భువనంబు లున్న తటినుల్ బంధించి మ్రందించు స త్సవనంబుల్ ప్లవనంబుఁజెంద గిరు లుద్యన్ముష్టి నొంచున్ వడిన్ | 301 |