ఇతిహాసములు ఉత్తరరామాయణము ధనాధిపుఁడు దశగ్రీవునకు నీతిఁదెల్ప దూతం బంపుట
ధనాధిపుఁడు దశగ్రీవునకు నీతిఁదెల్ప దూతం బంపుట
ఉ.ఆతఱిఁగొన్నినాళ్లకు ధనాధిపుఁ డంతయు నాలకించి దు
ర్నీతి వహించు తమ్మునకు నీతియు ధర్మువుఁ దెల్పఁ గూరిమిన్‌
దూత నతిత్వరన్‌ బనుప దుశ్శకునంబులతోడ లంకకున్‌
భీతిల కేఁగి వాఁడును విభీషణు ముందఱఁ గాంచెఁ గాంచినన్‌
302
ఉ.అన్నయశాలి వాని హృదయం బలరంగ బహూకరించి మా
యన్నకు సేమమే? వదిన హర్షముఁ గాంచునె? పుత్రులెల్ల సౌ
ఖ్యోన్నతులే కదా! కుశలయుక్తులె యాప్తులు మంత్రు లాశ్రితుల్‌?
నిన్నిట కేల యంపెఁ బతి నేఁ? డన నంతయు వాఁడు దెల్పినన్‌
303
తే.గీ.కొంత చింతించి, మన హితోక్తులు సగౌర
వముగ విననేర్చునే పంక్తివదనుఁ? డేల
యన్న యిప్పనిఁ దలపెట్టె? నైన నేమి ?
వచ్చితివిగద! రమ్మని వానిఁ గొనుచు
304
మ.గణనాతీత నిశాచరస్తవము లాకర్ణించుచున్‌ గంకణ
క్వణనంబుల్‌ దగఁ జామరంబు లమరీవారంబు వీవన్‌ సభాం
గణ సమ్మర్దము వేత్రహస్తు లుడుపంగా నిండు కొల్వున్న రా
వణునిం జేరి, విభీషణుం డెఱఁగి క్రేవన్‌ దూతఁ గాన్పించినన్‌
305
కం.ధనదుని దూతయు వినయం
బున నించుక చేరి మ్రొక్కి ముకుళితకరుఁడై
దనుజుల బహు సమ్మర్దం
బున నొదుగుచు నిలిచి పంక్తిముఖుతో ననియెన్‌
306
ఉ.స్వామి! పరాకు, దైత్యకులచంద్ర! త్వదగ్రజుఁడైన కిన్నర
గ్రామణి వంశవిత్తగుణ గౌరవయుక్తి సమానుఁడౌట మీ
సేమము వేఁడి మీకొక విశేషహితం బెఱిఁగింపు మంచు న
న్నీమెయిఁ బంచె నెయ్యము వహించి వినుం డది విన్నవించెదన్‌
307
చం.సమతఁ బరోపకరాకృతి సల్పుటయే సుకృతంబు ఘోరపా
పము పరపీడసేయుటయ బ్రహ్మకులంబునఁబుట్టి దేవతా
ప్రముఖ విరోధమున్‌ నెరపఁ బాడియె? ధర్మముచేతఁగాదె యీ
సమధిక సంపదన్‌ దొరసి సంతత మందఱమున్‌ సుఖించుటల్‌
308
ఉ.నాస్తికుఁడున్‌ శఠుండుఁ గులనాశకుఁడున్‌ గను దుష్టవర్తనం
బాస్తికతాధురంధరున కర్హమె? యద్భుతనిష్ఠచే నజో
పాస్తి ఘటించినాఁడవు కృపాగుణశూన్యుఁడవై భుజాబల
ధ్వస్తుఁ లజేయనేల సురవర్యుల నార్యుల ధర్మధుర్యులన్‌?
309
ఉ.నందనమాదియై సురవనంబులఁ గూల్చితి వప్సరోవధూ
బృందము బల్మిఁబట్టి చెఱఁబెట్టితి వార్యులు సేయు యాగముల్‌
మ్రందఁగఁ జేసి తార్తులగు మౌనులఁ జంపితి వస్మదాదులే
మందురొ యన్‌ భయం బెఱుఁగవైతివి తెల్పెడిదెట్టు నీకిఁకన్‌?
310
ఉ.గొట్టుతనానఁ దన్‌ వెడలఁగొట్టినఁ దిట్టిన రట్టడంచుఁ దోఁ
బుట్టువ నౌట నొండనకపోయితిఁ, బల్మఱు బెట్టుఁజూపినం
జుట్టములైనఁ దాళుదురె? శూరతయే జడదారి పెద్దలం
బట్టి వధించు? టీ వెడఁగు భావము మానఁగదయ్యా తమ్ముడా!
311
మ.హిమవత్పర్వత తుంగశృంగమున నేనిన్నాళ్లు శైవవ్రతం
బమితశ్రద్ధనొనర్చి వచ్చి భవదీ యౌద్ధత్వ మాలించి ధ
ర్మము గాదంచుఁ బ్రబోధసేసితి ననుంబాటించి వంశోచిత
క్రమముం గైకొను మంచుఁ దెల్పుమనె యక్షస్వామి రక్షో-ధిపా!
312
మ.అది గా కన్యుల కల్మిఁ గన్గొని యసూయామగ్నుఁడౌవాని కా
పద సేకూరు నవశ్య మట్టి యశముంబ్రాపించె మీ యన్నయే
యది తార్కాణగ విన్నవింతు వినుఁడం చద్దూత కేల్దోయి నె
న్నుదుటంజేరిచి పల్కెఁ గ్రమ్మఱ మదాంధుండౌ దశగ్రీవుతోన్‌
313
మ.దితిజాధీశ్వర! యొక్కనాఁడు తుహినాద్రిం జేరి మీయన్న యం
దతిసౌభాగ్యనిరూఢి శంకరుని యర్ధాంగంబునన్‌ మించు ప
ర్వతరాట్కన్యక నట్టె చూచె నెటులం బ్రాపించె నీ భాగ్య మీ
సతి కంచుం దన సవ్యనేత్రమున నీర్ష్యారోషమగ్నాత్ముఁడై
314
ఆ.వె.ఇటుల కుటిలబుద్ధి వీక్షించు యక్షేశు
సవ్యలోచనంబు క్షణములోన
దివ్యయోగమహిమ దేవి దగ్ధము సేయ
నేమి సేయువాఁడో నింక ననుచు.
315
కం.విత్తవిభుఁ డడలి యగ్గిరి
యుత్తరశృంగమున నియమయుక్తి నిలిచి య
ష్టోత్తరదశశతవర్షము
లుత్తమ శైవవ్రతంబు లొనరించునెడన్‌
316
ఉ.భూరిజటల్‌ ప్రవాళముల పొల్పుఁగనన్‌ ఘనబాహుశాఖలన్‌
మీఱి యపర్ణ పర్ణరుచి మేకొనఁ గ్రొన్నెలరేక కోరకా
కారముఁబూన నీలగళకాంతులు తేఁటుల నీటుఁజెంద, మం
దారములీల శూలి ధననాథునకుం గనుపించి యిట్లనున్‌
317
ఉ.మెచ్చితి నీ తపంబునకు మీఁటగు నిష్ఠకు నిమ్మహావ్రతం
బచ్చపు బత్తి నెవ్వరుఁ బ్రయత్నముతో నిటు సంఘటింప లే
రచ్చుగ మున్ను నే సలిపినట్టులె సల్పితి వీవొకండవే
యిచ్చితి నా సఖిత్వము వహింపుము మత్తులితప్రభావమున్‌
318
తే.గీ.దేవినే దృష్టిఁగంటి వా దృష్టి యొకటి
యును ధరారేణు పరివృతజ్యోతిగతిఁ బి
శంగరుచిఁ గాంచు నేక పిశంగ నయనుఁ
డనఁగ నందున వెలయుదు వనఘ! నీవు
319
చం.అని వరమిచ్చి శూలి రజతాద్రికి నెచ్చెలికాని వెంటఁదో
డ్కొని చనుదెంచె నట్లగుటఁ గోప మసూయయుఁ గీడు ధర్మవ
ర్తనము సమస్తబాంధవహితంబగు నగ్రజు బుద్ధి మాటఁజే
కొనుము శుభంబు మాన్చు చెడుగుందనమే? లని దూత తెల్పినన్‌
320
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju