| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఆశ్వాసాంత పద్యములు |
| ఉ. | నందకుమార! మారద సనందన నారద మానసాంతరా ళిందవిహారి! హారిమురళీ మృదుగాన విలోల గోపికా నందనిదాన! దానవఘనాఘనభిన్మరుదుల్లలద్గరు ద్బృందతురంగ! రంగదమరీ జనరంజన రాసఖేలనా! | 335 |
| కం. | వనదారుణ శిఖివారణ వనదా! మదవారణేంద్ర వరద! జగత్పా వన! దాసజననిరూఢా వన! దాక్షిణ్యాది సుగుణ వరరత్ననిధీ! | 336 |
| పంచచామరము | సనాతనప్రసిద్ధపూరుషత్వ కీర్తిభాజనా! జనాదిలోక సంగిమౌని సంఘ సౌఖ్యసాధనా! ధనాధినాథ నందనాత్మతాపహృత్కృపాఘనా! ఘనాత్మరూప దర్శనోత్సుకత్సరోరుహాసనా! | 337 |
| గద్యము | ఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణి వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంధాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు ద్వితీయాశ్వాసము. |