| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవుడు ధనేశ్వరుని దూతం జంపి యలకాపురిపై దండెత్తుట |
| మ. | పదిమోముల్ ప్రళయార్కబింబముల రూపంబూను గోపంబునన్ రద సంఘట్టన మాచరించుచు నదభ్రభ్రూకుటుల్ మీఱ ని ర్వది కన్నుల్ జ్వలితాగ్నికుండముల యుగ్రత్వంబు సూచింప మూ ర్ఖు దశాస్యుం డల దూతఁజూచి మిగులంగ్రూరాత్ముఁడై యిట్లనున్ | 321 |
| తే.గీ. | మంచితనమున నీతి బోధించువాడ పోలెఁదన యుగ్రతపమును శూలితోడి చెల్మియును గల్మి బలిమియుఁ దెలుపఁబంచి నాఁడె మీదొర నా చెంత నానలేక? | 322 |
| ఉ. | రొక్కముఁగన్న కల్మియును రుద్రుని చెల్మియు నమ్మి, కొన్ని దు ర్వాక్కుల వాఁడు తెల్పి యిటు రమ్మన నీ వెటులాడ వచ్చినాఁ విక్కడ మూర్ఖ! యం చడిదమెత్త వధింపకుఁడంచుఁ దమ్ముఁడున్ మ్రొక్క నదల్చి దూతశిరముం దెగవ్రేసె వివేకశూన్యుఁడై | 323 |
| మ. | అలకాధీశుని దూత నిట్లతఁడు ప్రాణాంతంబు నొందించి యా తలయున్ మొండెముఁ గొల్వులో మెలఁగు భృత్యశ్రేణిపాల్‌సేసె, ప్ర జ్వలితాత్యుగ్రదవాగ్ని నే విడిచినం జల్లారునే? నీతివా క్కుల మూర్ఖుండు శమించునే కినుకఁ గాకుత్‌స్థాన్వయగ్రామణీ! | 324 |
| కం. | చెనఁటి యని దశముఖుని ననఁ బనిలే దతనికి హితోక్తిఁ బ్రకటింపఁ దలం చిన ధననాయకు ననవలె జనవర! వినుమంత నద్దశగ్రీవుండున్ | 325 |
| తే.గీ. | తన యమాత్యులఁ గనుఁగొని ధనదు మాట వింటిరే? యిప్పుడెంత గర్వించినాఁడు? మాకుఁ దనకున్నపాటి వివేకమున్న దే? ప్రబోధింపఁదాఁగాక యెవ్వరింక? | 326 |
| ఉ. | పట్టణ మాక్రమించి తనుఁ బాఱఁగఁ ద్రోలిన నోర్చి తానుఁ దోఁ బుట్టువుగాన పోయెనఁట! పోవక నిల్చిన నేమి సేయునో? గట్టిగఁ జూత మిప్పు డలకాపురి ముట్టడి చేసి గట్టువిల్ పట్టిన దిట్టఁగూడి మనపై భుజశౌర్యముఁ జూపుఁగా కిఁకన్ | 327 |
| ఉ. | మాన్యుఁ డటంచు నెంచు బహుమాన మెఱుంగక యక్షుఁడే యసా మాన్య విరోధకృద్వచనమార్గణపంక్తుల నొంచె నింద్రము ఖ్యాన్యులు నన్ను గెల్వఁగఁ బ్రయత్నము సేయుట యుగ్గడించె నీ హైన్యముదీఱ నింక ధనదాది దిగీశుల గెల్వఁబోఁదగున్ | 328 |
| ఉ. | లెమ్ము ప్రహస్త! తొల్త నవలీల ధనేశుని గెల్వఁ బోయెదన్ బొమ్ము బలంబుఁగూర్ప మన ప్రోలను గల్గిన వీరదైత్యులన్ దెమ్ము జయానకార్భటులు దిక్కులఁ బిక్కటిలంగ నాబడిన్ రమ్ము రయమ్ముతోనన భరంపడి యాతఁడు నట్లు చేసినన్ | 329 |
| సీ. | శాతమన్యవశిలా చక్రఘర్ఘరదీర్ఘ - రావంబు దిక్కులు వ్రక్కలింప గారుత్మతద్యుతిస్ఫార సైంధవఖురో - ద్ధుర సముద్ధతుల నిద్ధర చలింప సారసారసరాగచారుకేతనకాంతు - లాకాశమణిదీప్తి నపహరింప ఘనఘంటికాఘణంఘణనాదముల ధరా - ధరగుహాళులు ప్రతిధ్వను లొసంగ | |
| గీ. | శరశరాసనముసలముద్గరకృపాణ తోమరగదాది సాధనస్తోమపూర్తి మిక్కుటంబైన యొక్క తేరెక్కి వెడలె వింశతిభుజుండు త్రైలోక్యవిజయకాంక్ష | 330 |
| కం. | మారీచమహోదరశుక సారణధూమ్రాక్షముఖ్య సచివులలోఁ బెం పార బ్రహస్తుఁడు ముంగలి యై రాక్షససేన నడపె నపుడు నృపాలా! | 331 |
| కం. | మల లూటాడ నదీనద ములు గలఁగఁగఁ జండవిపినములు గూలఁ బురం బులు బెదర ముహూర్తంబునఁ బలలాదబలంబు లలకపజ్జకుఁ జనియెన్ | 332 |
| సీ. | చరనీలగిరిశంక సవరించు మదమత్త - కరుల దంతుర దంతకాండరుచులుఁ దనువులొందిన గాడ్పులన నొప్పు నుత్తమా - శ్వముల ముత్యాల కళ్లెముల రుచులు బలుమేరువుల తీరుగల తేరులను మీఱు - కళుకు వజ్రపు బండికండ్లరుచులుఁ గలనైన భయ మెఱుంగని భటోత్కర మెత్తు - విచ్చుకత్తుల నిచ్చహెచ్చు రుచులు | |
| గీ. | ధవళకేతన రుచులు ఛత్రముల రుచులు జామరంబుల రుచు లొక్కసారి నిగిడి మెండుకొని వెండికొండపై నిండ నా ప్ర చండ భుజదండుఁ డాతండు దండువిడిసె | 333 |
| కం. | అని కుంభజుఁ డెఱిఁగించిన విని నవ్వుచు రాముఁ డవల వింశతిభుజుఁడున్ ధనవిభుఁడును బోరిన విధ మనఘా! వినవలతుఁ దెల్పుఁడని యడుగుటయున్ | 334 |