| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దేవతలు బ్రహ్మ యొద్దకుఁ బోయి యింద్రుని పరాజయము సెప్పుట |
| తే.గీ. | అవధరింపుము కుంభసంభవ మహర్షి చంద్రుఁ డిట్లను శ్రీరామచంద్రుఁ జూచి రఘుకులాధీశ! యీ రీతి రావణాత్మ జుండు సురపతిఁగాని లంకఁ జొచ్చుటయును | 2 |
| శా. | ఆశ్చర్యార్తిభయాత్ములయ్యు వసురుద్రాదుల్ సుధాశిద్విష త్పశ్చాద్భాగముఁజేరి కొంతవడి బద్ధస్పర్థఁబోరాడి త ద్దోశ్చక్రాసిగదా పరశ్వధముఖాస్తోకాయుధస్తోమముల్ విశ్చేష్టత్వముఁ జెందఁ జేయుటయు శ్రాంతిం బొంది వారందఱున్ | 3 |
| మ. | ఒకచో గుంపులు గూడి దీనముఖులై యుచ్ఛ్వాసముల్ నించుచున్ వికలత్వంబున వైరిఁగాంచుచు నయో వృత్రాది దైత్యచ్ఛిదా ధిక తేజోనిధి కింత వంత వొడమెన్ దేవత్వమున్ రాక్షస ప్రకరాధఃకృత మయ్యెఁ గాలగతి మాన్పం గూడ దెవ్వారికిన్ | 4 |
| తే.గీ. | ఏమి సేయుద మింతకు హేతు వల వి ధాత గద! యమ్మహాత్మున కీ తెఱంగు విన్నపము సేసి తద్వచోవృత్తి మెలఁగ నన్నిటికి మేలని తలంచి యపుడ కదలి | 5 |
| సీ. | ఎదురుగా వచ్చి దేవేంద్రునిఁ బొడఁగాన - కల్ల స్వర్గమువారు తల్లడిల్ల నింద్రు నంతటివాని కెంతవచ్చె నటంచు - వనట సువర్లోకవాసు లడల జేజేలు తండ్రిఁ బాసిన ప్రజలై రయో - యని చూచి జనలోకజనులు వగవ శతమన్యుఁ జెఱఁబట్టఁ జాలిరే పగవార - లని తపోలోకంబు మునులు బెగడ | |
| గీ. | వాసవుం డెందుఁ జనెనొ వివర్ణులగుచు నమరులేటికి వచ్చిరో యనుచు సత్య లోకమునఁ గాపురంబున లోకు లరయ జలజగర్భుని సభఁ జేరఁ జనిరి సురలు | 6 |
| మ. | చని నానావిధ దివ్యరత్నమయభాస్వన్నవ్య శిల్పంబులం గన నై నైకవిధావతార కమలాక్ష శ్లాఘ్య చిత్రాతి చి త్ర నవస్ఫాటిక కుడ్యహారిరుచులన్ దళ్కొంది యాత్మప్రకా శ నిరూఢోన్నతి దివ్యమౌ నొక మహాసౌధాగ్రభాగంబునన్ | 7 |
| సీ. | కపిలమార్కండేయ కణ్వాదిమునిశిఖా - మణులతో నొక మోము మాటలాడ నిఁకఁజేయఁదగు సృష్టి యిది సేయుఁడని యుప - బ్రహ్మల కొకమోము బదులు వలుక భావగర్భములాడు భాషావధూటితో - నొకమోము నగుచు నర్మోక్తి నుడువ నప్సరఃకమలాస్య లాడులాస్యము లొక్క - మొగము చూచుట కాభిముఖ్య మొంద | |
| గీ. | సర్వతోముఖ చాతుర్య ధూర్వహత్వ మొంది డెందంబు చెలువంద నున్నతాబ్జ రాగసింహాసనస్థుఁడై రాజసమునఁ బెద్ద కొలువున్న జేజేల పెద్దఁగనిరి | 8 |
| మ. | కని యాదిత్య మరుద్వసు ప్రముఖ లేఖశ్రేష్ఠు లా పెద్దవే ల్పునకుం జాఁగిలి మ్రొక్కి మోడ్చిన కరాంభోజాతయుగ్మంబు లా త్మ నిటాలంబులఁజేర్చి నిల్చిన దయాధౌరేయుఁడై మీరు వ చ్చిన కార్యం బదియేమి? తెల్పుఁడని రాజీవాసనుండాడినన్ | 9 |
| మ. | అమరుల్, స్వామి! పరాకు నేఁ డమరలోకారాధ్యుఁడౌ నింద్రునిన్ సమరక్షోణి నెదిర్చి రావణతనూజాతుండు బంధించి, దు ర్దమశౌర్యంబునఁ గొంచుఁబోయెఁబురికిన్ దద్ఘోరమాయామహ త్త్వమునన్ మేమును దూలి వచ్చితిమి మా తాపంబు వారింపవే! | 10 |
| ఉ. | గట్టుల మట్టువెట్టు బలుకైదువుఁబట్టినయట్టి దిట్టఁడున్ దిట్టతనంబువాసి పొలదిండికి లోఁబడి గాసిఁ జెందఁగా నెట్టు సహింపవచ్చు? జగదీశ ! యశక్తుని చందమొంది చూ పెట్టుక యుండనేల ? విడిపింపఁగదయ్య ! నిలింపనాథునిన్ | 11 |
| మ. | అని ప్రార్థించు దివాటకోటిఁగని యాహా! యెంత కార్యంబు వ చ్చె నిలింపాగ్రణి కంచు ధాత కరుణాస్ఫీతాత్ముఁడై లేచి కొ ల్వున నున్నందఱు గొల్వ వెల్లజిగి పుల్గుందేజిపై నెక్కి గ్ర క్కన లంకాపురికేఁగెఁ జారణముఖుల్ గైవారముల్ సేయఁగన్ | 12 |