| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | బ్రహ్మదేవుఁ డింద్రజిత్తునకు వరం బొసంగి యింద్రుని విడిపించుట |
| ఆ.వె. | ఏఁగి తనకుఁబూజ లిచ్చు మిత్రాత్మజ భ్రాతయుక్తుఁడైన పంక్తిముఖుని నాదరించి మింట నధివసించి విరించి యంచితోక్తి దనుజు లలరఁ బలికె | 13 |
| ఉ. | వత్స! దశాస్య! యెందు నిటువంటి బలాఢ్యునిఁగాన వేల్పులన్ మత్సరమొప్ప గెల్చితివి మార్కొని జిష్ణునిఁబట్టి తెచ్చె యు ష్మత్సుతుఁ డింతకంటె భుజశౌర్యము లున్నవె? యింక దేవతా హృత్సరసీజముల్ పొగుల నీతఁడు మేటగు నింద్రజిత్తనన్ | 14 |
| చం. | అమరులఁబ్రోవ ముజ్జగము లారయ నింద్రుఁ బ్రతిష్ఠ సేసినాఁ డ మొదట వాఁడు కారలఁ బడందగఁ డింకిట నా నిమిత్త మ య్యమరవరేణ్యునిన్ విడువుమంచుఁ బయోరుహగర్భుఁడాడు వా క్యములు దశాస్యసూతి విని యంజలిసేసి వినీతి నిట్లనున్ | 15 |
| మ. | జగదారాధ్యపదాబ్జ! మీర లిపుడాజ్ఞాపించినట్లే జయం తగురున్ వీడెద నా కొసంగు మమరత్వం బన్న వాణీశుఁడున్ నగి యక్షాసురకిన్నర ప్రముఖ నానా ప్రాణిరింఛోళికిన్ జగతిన్ లే దమరత్వ మింకొకటి కాంక్షన్ వేడుమా యిచ్చెదన్! | 16 |
| చం. | అన విని మేఘనాదుఁ డను నట్టిదయేని మహాత్మ! వైరితో నని యొనరింపఁగా వలసినప్పుడు వేల్మి యొనర్చి హోమ వ హ్నిని జనియించు దివ్యరథ మెక్కినచో నమరత్వ మొందని మ్మనుపమ హోమ విఘ్నమయినప్పుడు నాశము సమ్మతించితిన్ | 17 |
| చం. | తపములు పెక్కు సేసి కద తాత! యమర్త్యతఁ గందు రందఱున్ విపుల పరాక్రమంబుననె వేఁడెద నీ యభిలాష మీయవే కృప! నని పౌత్రజుం డడుగ నిచ్చితి నట్లగు నంచుఁ బద్మజుం డపుడు విముక్తుఁడైన దివిజాధిపుఁ దోడ్కొని వేడ్కమీఱఁగన్ | 18 |
| కం. | వారల నట వీడ్కొని తన వారలతో గగన మార్గ వర్తి యయినచో గౌరవహానిజ లజ్జా భారంబున శిరము వంచి బలరిపుఁడంతన్ | 19 |
| సీ. | వీడిన సిగ జాఱు విరజాజి సరులతో - మురువు డించిన వాడుమోముతోడ దందడిఁదెగి రాలు తారహారములతో - వదలిన భూషణ వ్రజముతోడ బలుకట్ల దద్దు లేర్పడు భుజార్గళులతో - నలఁగిన చలువ దువ్వలువతోడ నరిశరజర్జరితావయవములతో - బడలికఁ బొడము చేడ్పాటుతోడ | |
| గీ. | నడుగు లెడనెడఁ దడఁబడ నశ్రుజలము లడర నడలున నడతెంచి యంఘ్రికమల యుగళి వ్రాలిన బలవైరి నూఱడించి యంచితప్రేమ మించి విరించి యనియె | 20 |
| తోదకవృత్తము | బాలిశునైనను బండితునైనన్ గాలవశంబునఁ గర్మఫలంబుల్ మేలయి కీడయి మేకొనకున్నే? యేల మనోవ్యథ నింకెద వింద్రా! | 21 |
| మ. | తొలి జన్మంబులఁజేయు కర్మములు చెందున్ గొందఱన్ గొందఱన్ గలఁచున్ దప్పక యా శరీరముల నౌ కర్మంబె, కర్మస్థితుల్ తెలియన్ శక్యము గావు మాదృశులకున్, దేవేంద్ర! నీ కర్మమే కలఁగించెన్ నిను నిట్లు పూర్వకథ యాకర్ణింపుమా తెల్పెదన్ | 22 |
| వ. | అని పల్కి శతానందుండు పురందరున కిట్లనియె | 23 |