| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | హనుమంతుని జనన వృత్తాంతము |
| ఉ. | చండకరాన్వయాంబునిధిచంద్ర! రఘూద్వహ! యీ సమీరపు త్రుండు మహాత్ముఁ డౌనెకద! తొట్లిటి పుట్టుక నేకపాదరు ద్రుం డితఁ డంచుఁ గొందఱు బుధుల్ గణియింపుదురా రహస్యమె వ్వండెఱుఁగున్ జరాచరభవంబు లెఱింగిన నీవు దక్కఁగన్ | 85 |
| శా. | సాక్షాచ్ఛంభుఁడు గాకయున్నఁ గలవే చర్చింప నీ శౌర్య ధై ర్యక్షాంతిప్రతిభాప్రభావములు? రుద్రాంశంబునం బార్వతీ కుక్షిన వృద్ధి వహించి పావకునిలోఁ గొన్నాళ్ళు వర్తించి యీ యక్షయ్యద్యుతి పిమ్మటం బవనగర్భాంతస్థుఁడై భాసిలెన్ | 86 |
| చం. | అనిలు వరంబుచేఁబిదప నంజనకున్ జనియించి జన్మ మె త్తి నపుడె భానునిం బొదివె దేవతలిచ్చు వరంబులొంది యం దున శిశువౌట గర్వివలెఁ దోఁచిన మౌనులు శాపమిచ్చి రీ తని కొకరుండు పేర్కొనినదాఁక స్వశక్తి యెఱుంగకుండఁగన్ | 87 |
| తే.గీ. | దానఁ దన లావెఱుంగఁడు గాన నితఁడు వాలి వధియింపఁ డదిగాక వాలి భాను సుతులఁగొన్నాళ్ళు సరిగాఁగఁజూచి కొలిచి యుండెఁగావునఁ బగఁబూన నొల్లఁడయ్యె | 88 |
| కం. | లేకున్న హనుమ కెదురే పాకారికుమారుఁ డితఁడు ప్రభవించుట సీ తాకాంత! లెస్సఁ దెలిపెద నా కర్ణింపుమని మఱియు నమ్ముని యనియెన్ | 89 |
| సీ. | తన ధైర్యరమ కోడి కనకాచలేంద్రంబు - సిగ్గుతోఁ దన భర్తఁ జేరికొనఁగఁ దన నామమున కుచితంబుగాఁ దనుఁదాఁకి - శంబసాదన సామజంబు గూలఁ దన తపోనియమంబుఁగను భరద్వాజాది - వాచంయములకు నేవలు జనింపఁ దన బాహు శాఖలు దైతేయ భీతామ - రులకును నిలువ నీడలు ఘటింపఁ | |
| గీ. | దనరుఁ గేసరి యనుపేర వనచరేంద్రుఁ డతని కంజన యనెడి కన్యక నొసంగె నతని మాతులుఁ డురు విక్రమాతులుండు కుంజరుం డను వానరకుంజరుండు | 90 |
| కం. | రంజిల్లఁజేసెఁ గేసరి యంజన నిది వింత యనుచు నంద ఱనఁగ న క్కుంజరసుతతో నక్కపి కుంజరుఁ డొక కొన్నియేండ్లు కూడి సుఖించెన్ | 91 |
| శా. | సంసారోత్సవ కారణంబగు తనూజాతోదయం బెంచి యా హంసీగామినితో బహువ్రతపరుండై దాన నవ్వానరో త్తంసుం డిష్టముఁ జెంద నేరక మరుద్దైవంబుచే దైన్యవి ధ్వంసంబౌ నతనిన్ భజింపుమని కాంతారత్నముం బంచినన్ | 92 |
| కం. | పతి యనుమతి గౌరీసతి ప్రతి యగు నయ్యువతి నియమభవ్యమతి సదా గతియ సదా గతియని యు గ్రతపం బొనరించెఁ బెక్కుకాలం బధిపా! | 93 |
| ఉ. | ఆయమసేయు ఘోరతప మంతట మెచ్చి సదాశివాజ్ఞన వ్వాయువు స్వోదరస్థిత శివ స్థిర తేజముఁ దెచ్చి యిచ్చినన్ దోయజగంధి గర్భమయి తోరపు వేడుక నొక్క వర్ష మి య్యాయతతేజుఁ దాల్చె, మఱి యంచితమౌ నొక వాసరంబునన్ | 94 |
| మ. | అమరుల్ దివ్య సుమావళుల్ గురియ రంభాద్యప్సరః కాంత లా డ మరుద్వైరుల గుండియల్ బెడద మింటన్ భేరికా గోముఖ ప్రముఖ ధ్వానము లుప్పతిల్ల దిశలొప్పన్ గౌంజరీగర్భవా సమునందుండియు నిర్ణయించె నితఁ డంచద్బాల భానుప్రభన్ | 95 |
| వ. | అప్పుడు | 96 |
| సీ. | లలితసౌదామనీ తులితదేహమువాని - నరుణారుణాంబుజూస్యంబు వాని రత్నకుండల భాసుర కపోలములవాని - రంగత్పిశంగ నేత్రముల వాని నాజానుదీర్ఘ బాహాదండముల వాని - ధవళయజ్ఞోపవీతములవాని హారప్రభామనోహారి వక్షమువానిఁ - గమనీయకరకంకణములవాని | |
| గీ. | మంజు రుచిపుంజిఁగను హొన్ను ముంజివానిఁ బసిమిచాయల నునుబట్టు పంచెవాని? వాసవధ్వజ నిభవాల వల్లివాని నక్కుమారునిఁ గని తల్లి యాత్మనలరె | 97 |
| ఆ.వె. | అలరి చెక్కు నొక్కి యక్కునఁ జేర్చి ము ద్దాడి నీకు ఫలము లారగింప వలసినన్ని తెత్తు వాపోవకుండు నా యన్న! యనుచుఁ దల్లి యడవి కరిగె | 98 |