| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | హనుమంతుఁడు ఫలభ్రాంతి రవిరాహుల మ్రింగనుద్యోగించుట |
| ఉ. | అంతటిలోన నీతఁ డుదయాద్రిపయిం బొడతెంచు పద్మినీ కాంతు జపాప్రసూన రుచికాంతుఁ గనుంగొని పండటంచు వి భ్రాంతి వహించి యాఁకటి తొరన్ రవిపై కెగసెన్ సమీరనా గాంతక బాణవేగ పరిహాసి సమిద్ధమహాజవోన్నతిన్ | 99 |
| తే.గీ. | ఎగసి చనుచున్న యీతని తెగువఁ జూచి గగనచరులైన గంధర్వగరుడయక్ష సిద్ధ సాధ్యులు నివ్వెఱఁజెంది యమ్మ హామహుం డెవఁడో యను నంతలోన | 100 |
| తే.గీ. | భానుకడకేఁగు నప్పిన్నవాని మేని కెండ దాఁకకయుండ నుద్దండవృత్తి నుడిగి మిన్నేటి తమ్మి పుప్పొడి దుమార మెనసి వలిగాడ్పు వెనువెంటఁ జనుచునుండె | 101 |
| సీ. | పదతాడనములచే బ్రద్ధలై పాథోధి - పాళికల్ దూలికాభంగిఁ జెదర నూరుఘట్టనలచే నూర్ధ్వగంధర్వాది - నగరముల్ ఛిన్నభిన్నములుగాఁగ బాహువేగంబుచేఁ బఱతెంచు వైమాని - కుల విమానంబులు కూలఁబడఁగ వాల విక్షేపంబుచే లాజలను బోలి - తూలి నక్షత్రముల్ నేల రాల | |
| గీ. | దేహకాంతులు చక్కఁగాఁదేఱి చూడ లేక ఖచరులు బెగడి చీకాకుఁజెంద నేదియును జూడ కీ జగద్ధిత చరిత్రుఁ డట్టె చని బాలభానునిఁబట్టె నపుడు | 102 |
| సీ. | ఒద్ద సేవలు సేయుచున్న ఛాయాదేవి - భీతిల్లి కరములఁ బిసికికొనఁగ భయనివారణమంత్ర పరతంత్రులై వాల - ఖిల్యాది మౌనులు క్రేవ నొదుగ జడుపుతో కైదువుల్ విడిచి మాఠరముఖ్య - పారిపార్శ్వికు లెల్లఁ బాఱిపోవ హతశేష మందేహు లట్లు గావలయుఁ బో - యీ భానున కటంచు నిచ్చలనర | |
| గీ. | నలరు నా పద్మహితుఁబట్టి యాననమునఁ బెట్టుకొను బిట్టు వేఁడిగా నట్టె విడుచు నడుచుఁజేతులు సెగయైన యది యటంచుఁ గినిసి యాఁకటి కడిమి నియ్యనిలసుతుఁడు | 103 |
| చం. | జగదుపకారి యీ ప్లవగచంద్రుఁ డటంచుఁ దలంచి భానుఁడున్ దగదగమండుచుండు కిరణంబుల వేఁడిమిఁ జూపఁడయ్యె రెం డు గడియ లేఁగ నంతఁదపనున్ గ్రహియింపఁగ నాఁడు పర్వమౌ టఁ గదియవచ్చె రాహు వచటం గలవా రరుదంది చూడఁగన్ | 104 |
| ఉ. | ఆ గ్రహరాజుఁ బట్టిన మహామహు నీతనిఁ జూచి రాహు వ త్యాగ్రహ వృత్తితోఁ గహకహార్భటిఁ జేయుచు డాయ నంత సూ ర్యగ్రహణంబు మాని యవురా! యిది నల్లనిపండు వచ్చె నం చుగ్రలయోగ్ర విగ్రహత నొక్కటి నాతని మ్రింగఁ బోవఁగన్ | 105 |
| చం. | జడిసి విధుంతుదుం డితనిఁ జక్కఁ గనుంగొనలేక యయ్యెడన్ వడిఁ బరువెత్తి యత్తెఱఁగు వాసవుతో నెఱిఁగింప నాతఁడున్ గడు వెఱఁగంది, నీ క్రమముఁ గైకొను నంతటి వీరుఁ డెవ్వఁ డం చడుగుచు నాల్గు కొమ్ముల మహాకరి నెక్కి శతారహస్తుఁడై | 106 |
| చం. | నలుగడలన్ వియచ్చరగణంబులు గొల్వఁగ నేఁగుదెంచి, య జ్జలరుహబంధుచెంతఁ బ్రతిచండకరుండన దుర్నిరీక్ష్య కాం తులఁ దులకించు నీ ఘను గనుంగొని, యెవ్వఁడొ వీఁ డటంచుఁ పే రలుక వహించి, మత్తకరి నట్టె పయిం గవియించి, యార్చుడున్ | 107 |
| కం. | పాండురుచి మించినది యీ పండు హరింతు నని తీవ్రపడి కడుఁ బసి పా పం డగుటఁ దెలియ కీతఁడు చండాంశుని విడిచి యల గజముపై కుఱికెన్ | 108 |
| వ. | ఇవ్విధంబున | 109 |
| తే.గీ. | కేసరికిశోర ముద్భట క్రీడ మీఁది కుఱికినంత భయభ్రాంతు లొంది చండ పవన హతిఁ దూలు శారదాభ్రంబు లీల నభ్రము విభుండు దెరల జంభారి గెరలి | 110 |
| ఉ. | భద్రగజంబుపై నుఱుకు పావని నొండొకటన్ జయింప లే కద్రుల్ వ్రక్కలించు కులిశాయుధ ముద్ధతిఁ బూని వైవ న య్యద్రిచరుండు వామహనువందున నొచ్చిన మూర్ఛఁజెంది పూ ర్వాద్రిపయింబడెన్ గహకహార్భటిఁ జేయుచు రాహు వుబ్బఁగన్ | 111 |