| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఆశ్వాసాంత పద్యములు |
| ఉ. | సారమహోజ్జ్వల జ్వల సారవిభాసి! విభాసితాంగశృం గార! చరాచరాత్మక జగద్భరణా! కరుణకరాత్మ! వం దారుసుధీ! సుధీవిహరణక్రమదక్ష! మదక్షపాచర స్ఫారధరాధరాశని నిభా! రవిరాజ విరాజివీక్షణా! | 326 |
| కం. | శంబరహరజనక! జను శ్శంబర మృగయాపుళింద! సతతానందా! శంబరనిధి గృహ! రిపుగిరి శంబ! రమాకవితవక్ష! జలజదళాక్షా! | 327 |
| తోటకవృత్తము | కురువిందనిభోజ్జ్వలకుందరదా! దరదారుణ చక్రగదా భరణా! భరణాదరకీర్తి విభాస్వర! భా స్వరవాక్ ప్రథమాంచిత వర్ణమయా! | 328 |
| గద్యము | ఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణి వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంధాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు పంచమాశ్వాసము. |