ఇతిహాసములు ఉత్తరరామాయణము ధనేశుని పంపునఁ బుష్పకంబు రామునిఁ గొలువవచ్చుట
ధనేశుని పంపునఁ బుష్పకంబు రామునిఁ గొలువవచ్చుట
చం.తదవసరంబునన్‌ దశరథప్రియసూతికి నొక్క దివ్యమూ
ర్తిదివి వసించి యిట్లనియె దేవ! కుబేరుని పుష్పకంబు మీ
పదములు గొల్వ వచ్చితిఁ గృపన్‌ ననుఁజేకొనుఁడన్న రాఘవుం
డిది తగునే? పతిన్‌ విడిచి యేటికి వచ్చితి విందు? నావుడున్‌.
313
ఆ.వె.ఆ విమానరాజ మనియె - దేవరయాజ్ఞ
యక్షు ప్రోలి పాలి కరుగ నతఁడు
మీ గుణంబు మెచ్చి మీ సేవఁగావింపు
మనుచు మరలఁ బనిచె నను నరేంద్ర!
314
ఉ.ఆయన పంపకున్న సుగుణాకర! యూరక నేను వత్తునే?
నాయెడ సంశయం బుడిగి నన్ను గ్రహింపుమటన్న జానకీ
నాయకుఁడుత్సహించి స్వజనంబులఁ బుష్పకరాజపూజనల్‌
సేయఁగఁబంచి మన్ననయుఁజెల్మియుఁదోఁపఁగఁబెల్కఁ గ్రమ్మఱన్‌.
315
కం.ఓ దేవయాన రత్నమ!
నేఁదలఁచినయపుడె రమ్ము నీకు నిలువ విం
పౌదెస కిప్పుడు పొమ్ము స
మాదృతి మము మఱవకుండుమని పనుచుటయున్‌.
316
ఆ.వె.అలరి సకల లక్షణాఢ్యుఁడౌ నా కృత
లక్షణునకు నది ప్రదక్షిణంబొ
నర్చి దక్షిణంబునకు నా క్షణంబున
నేఁగె నీక్షణముల కెఱుఁగఁబడక.
317
మ.రఘువంశాగ్రణి యంత సంతసివి యర్థస్వామి యౌరౌర! యెం
తఘనుం డాత్మవిమానమే యొసఁగె మత్సఖ్యంబుఁగాంక్షించి చె
ల్మి ఘటింపందగు రాజరా జతఁడు బల్మిం గల్మి నత్యున్నతుం
డఘదూరుండని బల్కఁబల్కె భరతుండావేళ హర్షబునన్‌.
318
ఉ.దేవ! భవత్ప్రతాపసముదీర్ణత నార్యనిరోధకారి యౌ
రావణుఁడీల్గెఁగాన ధనరాజు ప్రమోదముఁజెంది మీకు సం
భావనగా విమానమణిఁబంపె దశాస్యు భరించు దోషముం
బోవునె పుష్పకంబునకుఁబూని మిమున్‌ భజియింపకుండినన్‌?
319
చం.ఉరుమతి! మీ గుణంబులకు నొక్క కుబేరుఁడె యేల? యెల్ల ది
గ్వరులును జెల్మి సేయుటకె కాంక్ష వహింతురు, నైజభోగముల్‌
నిరుపమశక్తి మీరు కరుణించిన వంచునె యెంతు రెప్పు డే
పరుసున మీకు వేడ్క సలుపంగలమో యనుచుందు రాత్మలన్‌.
320
సీ.నిర్జరాధీశుండు నెల మూఁడు వానలు - కోరిన ధరనెల్లఁ గురియసాగె
జ్వలితప్రదక్షిణార్చులతోడ హవ్యంబు - నేవేళవహ్ని వహింపఁదొడఁగె
మిక్కిలి ముదుసళ్లఁదప్పఁదక్కినవారిఁ - బొలియింప శమనుండు పూనఁడయ్యె
వీచికాగ్రముల నవీనమణుల్‌ పూని - నీరధి - తటములనిండ నించె
 
గీ.శైత్య సౌరభ్య మాంద్య సంచారి యగుచు
గంధవహుఁ డెల్ల ప్రాణుల గాని మాన్చెఁ
బడిన గింజల ననలెత్తి పండె ధరణి
రఘుకులోత్తంస! మీరేలు రాజ్యమునకు.
321
సీ.సుతులులేక కలంగు సుదతులెక్కడ లేరు - సుతవియోగముఁజెందు సతులు లేరు
పతులఁబాసిన కళావతులెయ్యెడను లేరు - పడఁతులఁబాసిన పతులు లేరు
దారిద్య్రదుఃఖసంతప్తు లెందునులేరు - కలిమి గర్వముఁజెందు ఖలులు లేరు
వ్యాధుల నాధుల వగచువారలు లేరు - నింద లొందినవార లెందులేరు
 
గీ.లేరు జారులు చోరులు లేరు దుర్వి
చారు లగ్ని జలాహితృష్ణాక్షుదాది
వాత దుర్భిక్ష భయులైనవారు లేరు
రఘుకులోత్తంస! మీరేలు రాజ్యమునను
322
చం.క్రతువులు దానముల్‌ శత్రు లకల్మషచర్యలు దండనీతు లం
చితపశురక్ష పణ్యము కృషిక్రియలున్‌ ద్విజరాజవైశ్యసం
తతభజనంబునుం గలిగి నాలుగు వర్ణములుల్లసిల్లుటన్‌
గృతయుగముంబలెన్‌ జెలఁగెఁద్రేత రఘూత్తమ! యంచుఁబల్కినన్‌.
323
కం.ఆ భరతు మధురభాషల
చే భావము పల్లవింప సీతాంభోజా
క్షీభర్త కుండలద్యుతి
శోభిలు చెక్కుల స్మితంబు సొబగున నలరెన్‌.
324
కం.ఈ భంగి వెలయు రాముని
వైభవకథ చదివికొనిన వ్రాసిన వినినన్‌
శోభిల్లుదు రాజను లమి
తాభిమతార్థములు గలిగి యవ్విభు కరుణన్‌.
325
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju