ఇతిహాసములు ఉత్తరరామాయణము సౌధవర్ణనము
సౌధవర్ణనము
ఉ.నీలపుఱాల మేడలకు నిచ్చలపుం బటికంపు మెట్టులం
బోలు మెఱుంగు గోపురపు మొత్తపు వాకిటి కీలు జాళువా
మేలిపసిండి బొమ్మ చనుమిట్టలకుం దెలిచల్వపైఠిణీ
చేల చెఱంగులై యచటఁ జెల్వగు వేలుపు టేటి పెందెరల్‌
7
సీ.కేళీసరః పద్మపాళీవిహారియై - కాంచు సుగంధంబు గంధవహుఁడు
లీలాద్రివన్యామహైరావళుల్‌ డాసి - గ్రహియించు విరులచాల్‌ గగనలక్ష్మి
నూతనాంశుకరత్నకేతనాంశుకయుక్తిఁ - బ్రాపించుఁ జిత్రాంబరములు హేళి
గణనీయ వివిధ తోరణ నికాయము లాని - మొనయు ముత్తెపుఁబేరు లనిమిషనది
 
గీ.నర్మహర్మ్యాంతరస్త్రైణనవ్యగాన
కౌశలీద్రవమాణాబ్జకాంత వారి
పుషిత చాతకమైన యప్పురవరమునఁ
జతురలంకార వితతు లాశ్రితుల కరుదె?
8
మ.జను లెల్లప్పుడుఁ దోయదానమునఁ జంచత్తాళవృంతానిలం
బునఁ బాంథవ్రజ మొందు దప్పియు శ్రమంబున్‌ మాన్పఁ ప్రోల్లచ్చియున్‌
వనితాగానరసద్రవచ్ఛశిమణీ వార్ధారచేఁ జాతకా
వనముం జేసి ధ్వజాశుగాప్తి నడఁచున్‌ వైమానిక శ్రాంతియున్‌
9
చం.ఘనజఘనస్తనద్వితయ గౌరవముల్‌ ధరియించి యాకసం
బునఁ జరియింపలేక తమ ముందట నందముఁ జెందు జాళువా
మినుకుఁబసిండి మేలిపని మెచ్చులమేడలు సూచి సోలి వ్రా
లిన యమరీశిరోమణుల లీలఁ జెలంగుదు రింతు లప్పురిన్‌
10
మ.త్రిదివోద్యానము డాయు మాడువులపైఁ గ్రీడించు పూఁబోండ్లకున్‌
ద్రిదశస్త్రీలు వయస్యలై సవినయోక్తిం జూడుఁ డా రంభ యి
ల్లదె! యా చెంగటిదే! తిలోత్తమ నికాయ్యం బూర్వశీమందిరం
బిదె యంచున్‌ వివరించి చూపుదురు వా రింపొంది వీక్షింపఁగన్‌
11
మ.విధుకాంతోజ్జ్వల సౌధవీథికల ఠీవిన్‌ దంపతుల్‌ గూడి యి
క్షుధనుఃకేళికిఁ జొక్కి కూర్కుటయు నచ్చో వేకువన్‌ వంది మా
గధ సంఘాతము పోల్కి మేల్కొలుపు నుత్కంఠార్భటిన్‌ నాకలో
కధునీహాటక పద్మఝాటచరచక్రక్రౌంచ చక్రాంగనల్‌
12
చం.ఘనతరరత్న సంఘటిత కాంచన సౌధము లప్పురంబునం
దనరఁగఁ జూచి భాస్కరుఁడు దైవతశైలము వీనితోడ జో
డనఁగఁ దగుం బరాశుగహతాంచిత శృంగము గాక యున్నచో
ననుచు ననూరుతో ననుఁ దదంతిక జాలక మార్గవర్తియై
13
తే.గీ.అహికులము లావరింప నయ్యడుగు వట్టి
తెలియఁ బడకున్న భోగవతియు దివంబు
పేరుగని యా సురలకుఁ బ్రాపింపఁదగిన
స్వర్గపురము నప్పురముతో సాటియగునె
14
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju