ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరామచంద్రపట్టాభిషేక మహోత్సవము
శ్రీరామచంద్రపట్టాభిషేక మహోత్సవము
సీ.కనఁగల్గె నేఁటికైనను రాము ననుచుఁ గౌ - సల్యాది జనము లుత్సాహ మొంద
రామ నీ కీర్తి యారవిచంద్ర మవుఁగాత - మని వసిష్ఠుండు దీవన లొసంగఁ
దమరు సేసిన సుధర్మములు నేఁడు ఫలించె - నని పౌరు లుత్సవమ్మున మెలంగ
సకల దేశాధినాయకులు గానుక లిచ్చి - యలిక కీలితహస్తులై భజింప
 
గీ.భరత లక్ష్మణ శత్రుఘ్న పవనతనయ
భాను జాంగద జాంబవత్ప్రముఖధన్యు
లుచిత మగు నూడిగములు సేయుచును గొలువ
రాముఁ డప్పుడు పట్టాభిరాముఁడయ్యె
84
సీ.కమనీయ రత్నోర్మికలఁ బూని సితఫేన - చందనాంగకుఁడయ్యె సాగరుండు
పైరుపచ్చల తాళి మీఱ మొల్కల గగు - ర్పాటుఁ గంచుక మూనె రత్నగర్భ
వినుఁగెంపుఁ బతకంబు గనిపింప సురదీర్ఘి - కాచేలయై మించె గగనలక్ష్మి
విమల కోరక మౌక్తికములతోఁ జిగురుఁ గెం - బట్టుఁబుట్టముఁ గట్టె బహువనాళి
 
గీ.కుంభికుంభాగ్రశోణ మృత్కుంకుమంబు
దంతరుచి వజ్ర హారముల్‌ దాల్చె దిశలు
సీతతోఁ గూడి సరిలేని చెలువు పూని
శ్రీరఘుస్వామి పట్టాభిషిక్తుఁడైన
85
శా.దిగ్దంతుల్‌ నిదురించె నిర్భరతఁ జెందెన్‌ భూధరంబుల్‌ మరు
ద్భుగ్దేవేంద్రుఁడు భోగినీరతి సుఖంబుల్‌ గాంచె యజ్ఞాంగతి
ర్యగ్దాహంబు శమించె నాటవిడు పైన ట్లుండెఁ గూర్మంబు స
మ్యగ్దోర్దండమునన్‌ ధరాభరము రామక్ష్మావరుం డూనినన్‌
86
వ.ఇత్తెఱఁగున నత్తరణికులగ్రామణి సకలదిగ్రామణీయక యశశ్చంద్రచంద్రికా విశేషంబున నశేషబుధలోక చకోరకంబులతో నతజనమహోత్పలంబుల నలరింపుచుం దామస గుణాంధతమసంబుల విరియించుచు సింధురాట్‌ చతుష్టయపరివేష్టితబంధురవసుంధరాభార ధురంధరుండై యొక్కనాఁడు పూర్వ పర్వతోర్వీరమణ శిరోభాగ భాగరుణ మణీప్రభావగణితమకుట ప్రకటాతిశ యంబునకు నికటంబయి యంబుజ ప్రియబింబంబు డంబుసెందకయ ముందర నమందమకరంద రసాస్వాదనానంద రంగద్భృంగసంఘాత సంగీత ప్రసంగంబులతో వికసించు సితకమలంబుల విమల ప్రకాశంబునఁ జెలువొంద వందిమాగధజనబృందా భినందనంబునం దననేత్రార విందంబులు విచ్చి మచ్చికతో నెదుట వచ్చి నిలుచున్న పుడమికన్నె చిన్నారి నగుముద్దు మొగంపుటద్దంబుం గనుంగొనుచుం బాన్పు డిగ్గి సమయోచితా చారంబులు సంఘటించి, కొలువు సింగారంబై యభంగతరాష్టాంగ వజ్రమయకుడ్య మహాష్టాంగసంగంబునం గనుపట్టు గట్టురాయని పట్టి నెమ్మేని చాయలం దొట్టిన గట్టినీలంపు దూలంబుల దండితనంబు లెచ్చరించి హెచ్చునం బయిపయిం గ్రచ్చుకొను పచ్చయరుంగుపచ్చ లచ్చజిగిపచ్చికలని మచ్చికలతో వచ్చి మూర్కొను లీలాబాలకురంగంబులకు బెదరు పుట్టించు పులిచర్మంబులు గల చిత్తరుఁ దపసుల పెన్‌ జడల కెంజాయవలెఁ బుంజిగను మంజుల ప్రవాళమహాస్తంభంబుల రంగారు బంగారు బొమ్మల ప్రతిబింబంబులకు నెలవైన నిర్మల చంద్రకాంత జగతీస్థలంబులను గంగాజలంబులం దోఁగు చందువా చెందామరకెందొగలపువ్వుతెగలం గ్రందుకొను తుమ్మెదల యెమ్మెల కిమ్ముఁ జూపు సాంబ్రాణిధూపధూమంబులతో వాసించు ప్రాలంబకుసుమ మాలికాపరంపరల కాంతి సంపదల కిరుగు పొరుగులగు సోరణగండిగొప్ప సుప్పాణి ముత్తెంపుల తండంబులు భుజగాండకాండంబులని నిండుకొను గృహమయూరికల విప్పు గల పించెంబుల యొప్పుల నుప్పతిల్లు కొలుపు వెలయొప్పులాడుల కప్పుఁగీలుకొప్పులకు క్రొమ్మొగిలులకు మెఱుంగులగు తదుపరి పరివేష్టితకాంచనదామంబులతోఁ బురుడించు కాంచనతోరణ స్తంభంబులు నిజమణినభోమణికాంతి పరీక్షార్థం బరుణబింబంబు నంబరకలిత కరాగ్రం బులం బిలుచుచున్నవా యనఁ జెన్నగు నున్నత ధ్వజపటలంబుల పటాత్కా రంబుల కళుకు పద్మరాగ విటంకభాగ రటత్‌ పారావతవారంబుల యారావంబు “మించిన రఘువీరు నగరివాకిట నుండియు జలధిఘోషం బేల బేలతనంబున నేర్చితి” రని సుధాగౌరవర్ణ చ్ఛలంబున వాని నగు సౌధలక్ష్మి నవ్వుల వెన్నెలల ముకుళించిన కెందమ్మి మొగ్గలన నగ్గలంబగు పసిండిచూరు మొగ్గలనిగ్గులజగ్గు మను పుష్యరాగవలభీప్రతానంబులతో నుప్పరంబొరసి యుబ్బు చప్పరంబుల లోపల నేపొందు స్ఫటికోపల సోపానమార్గంబుల చెంగటి కురంగ నాభికాపంక సంకుమద పంకిలాంగణంబులు రంగయిన మణిమయ రంగవల్లికల ప్రభావల్లికలల్లుకొనఁ గొల్లలగు ఫలపుష్పభరానమ్ర కమ్రతరకనక కదళికా క్రముకతరుస్తంభంబుల మీఱు ప్రతిద్వారంబులఁ దీరయిన నవరత్న ఘటిత కవాట దేహళీవిశేషంబుల వాటంబగు కొలువుకూటంబుఁ బ్రవేశించి భద్రాసనాసీనుండయి నలువంకల భరతలక్ష్మణ శత్రుఘ్న హనుమత్సుగ్రీవాంగద నలనీలజాంబవత్‌ విభీషణాదులు సేవింప నిండుకొలువున్న సమయంబున87
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju