ఇతిహాసములు ఉత్తరరామాయణము పులస్త్య దర్శనముచేఁ దృణబిందుని పుత్రి గర్భిణి యగుట
పులస్త్య దర్శనముచేఁ దృణబిందుని పుత్రి గర్భిణి యగుట
మ.కనకాంగీమణి కంచు గీచినగతిం గంఠంబు మీఱన్‌ జటాం
త నిరూఢశ్రుతిపాఠ మొందిన పులస్త్య బ్రహ్మ వేద ధ్వనిన్‌
విని యా రక్తజటాధరుం గుశతృణాన్వీతాసనస్థున్‌ మృగా
జినవాసః పిహితాంగు న జ్జటిలుఁ గాంచెం దత్సమీపంబునన్‌
129
మ.కనుఁగొ న్నంతనె కన్యకామణికి లేఁ గౌనింత గాన్పించెఁ జ
న్మొనలన్‌ నీలిమ యావరించె ముఖపాండుశ్రీ మిటారించెఁ గు
ల్కునడల్‌ గొంచెఁ గృశించె మే నరుచి యాలో మించె నారుల్ల సిం
చె నురుశ్రాంతి జనించె గర్భము రహించెన్‌ మించె నిట్టూరుపుల్‌
130
కం.ఈలాగున బాలామణి
చూలాలితనంబు దనకుఁ జొప్పడిన మదిం
జాలన్‌ జాలింబడి యిది
యేలీల ఘటిల్లె హేతు వెయ్యదియొ కదా!
131
తే.గీ.పేరు ఋషిగాని మాతండ్రి పేరు పెంపు
గల మహారాజమణి యట్టి ఘను కడుపునఁ
బుట్టి యే నిట్టి ఱట్టడిఁ గట్టుకొన్నఁ
జెట్టయని తిట్టరే తోడి చేడె లెల్ల
132
కం.వచ్చిన వేళాగుణమో
యిచ్చటి యోషధుల మహిమ మిటు సేసినదో
మచ్చరమునఁ గన్నెఱిక
మ్మొచ్చెము గన నెవ్వరిటుల యొనరించిరొకో!
133
మ.కడు లేఁబ్రాయపుఁ బూప చన్నుఁగవ సింగారంబుఁ బోనాడి యీ
కడుపున్‌ నేనును బోయి మ్రోల నిలువం గన్నయ్య కాపట్య మెం
చఁడె విన్నయ్యలు విశ్వసింపుదురె? యే సంబంధమున్‌ లేని యీ
సడి నావంటి లతాంగికిన్‌ విధి ఘటించం జెల్లునే యక్కటా!
134
వ.అని చింతింపుచు135
మ.స్తనభారానతయై మదావృత సముద్యద్గర్భ దౌల్బల్య సం
జనితోచ్ఛ్వాస పరంపరాగతకవోష్ణ మ్లానితాస్యాబ్జయై
కనదాలోక నిరోధి బాష్పకణయై గాఢత్రపాక్రాంతయై
జనకుం జేరి కుమారి యేమియు గణించన్‌ నేరకున్నంతటన్‌
136
కం.వంచిన తల యెత్తక తన
యంచల నిలుచున్న కన్నె నట్టే యవలో
కించి యొకించుక సంశయ
మెంచి వెఱ వహించి తండ్రి యిట్లని పలికెన్‌
137
ఉ.ఎక్కడఁబోయి తింత తడ వెవ్వరి కప్రియ మాచరించి తీ
వెక్కఠినుండు నిన్ను శపియించె నిమేషములోన నీకుఁ జూ
లె క్కరిణిన్‌ ఘటిల్లెఁ దగ వెంచక యింత యకృత్య మెవ్వఁడే
దిక్కున నుండి చేసె నిది తెల్లముగా వివరింపు మమ్మరో!
138
చం.కుల మపకీర్తి జెంద జనకుండును వెల్వెలఁ బోవ బాంధవా
వలి దలవంపఁ దల్లి వగవం జెలికత్తెలు సిగ్గుసేటులం
గళవళ మొంద నెవ్వఁడును గైకొన కేఁగఁగ జన్మనష్టి గా
నళుకుఁ దొఱంగి కన్నెఱిక మాఱడి వెట్టుదురేమె కూఁతురా!
139
మ.తలవంపుల్‌ ఘటియించి తందఱకుఁ గాంతా! యింక నీకేల యౌ
దలవంపన్‌ వివరింపు మెట్లొదవె? నేతద్దౌహృదశ్రీ యనన్‌
జెలి బద్ధాంజలియై వడంకుచు భయస్వేదంబుతో మోము వె
ల్వెలఁ బాఱం దనుఁ గన్నతండ్రిఁ గని పల్కెం బల్కు దొట్రిల్లఁగన్‌
140
శా.ఏ నే పాప మెఱుంగ నాటలకుఁ దండ్రీ! యా పులస్త్యాశ్రమ
స్థానాభ్యంతర భూమికిం జని వయస్యాసంఘముం గాన క
చ్చో నే నొంటి చరింప నద్భుతముగాఁ జూ లేర్పడెన్‌ హేతువుం
గానన్‌ నీ చరణంబు లాన మదిఁ జక్కం జూడవే! నావుడున్‌
141
శా.ఆ రాజర్షివరుండు పుత్త్రి వచనం బాలించి ధ్యానావధా
నారూఢాంచిత దృష్టి దర్పణముచే నాద్యంతముం జూచి యెం
తే రోమాంచముతోఁ గుమారిఁ గని తల్లీ! నిన్ను శోధింప కే
నేరం బెంచితి వంతఁ జెందకుము సందేహంబు దీఱెన్‌ మదిన్‌
142
మ.తనుఁ గన్గొన్నది గర్భమౌనని పులస్త్య బ్రహ్మ మున్‌ పల్కె నా
తని శాపం బిది నీవెఱుంగ కెదుటన్‌ దర్శింప నిట్లైతి విం
దున నీకేమి కొఱంత యంచుఁ దృణబిందుం డప్పుడే పుత్త్రిఁ దో
డ్కొని బ్రహ్మాత్మజుఁ జేరఁ బోయి భయభక్తుల్‌ మీఱఁగా నిట్లనున్‌
143
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju