| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | తృణబిందుఁడు పులస్త్యదర్శనముచే గర్భిణియైన తన పుత్త్రిని బులస్త్య బ్రహ్మ కొసంగుట |
| సీ. | మునిచంద్ర! సద్గుణంబున మించు నీ కన్య - హస్తాభియుక్తి నీ కగు వహింపు వ్రతిమహేశ్వర! సతీత్వము గన్న దీ శ్యామ - మహిభృత్ కుమారిఁ బ్రేమమున నేలు జటిల భాస్కర! చారుసంజ్ఞ యీ పద్మిని - ఛాయానుసారిణి సమ్మతింపు మపరాత్మ భవ! నిర్మలాంగి యీ మృదువాణి - విద్యావతి దయార్ద్ర వీక్షఁ జూడు | |
| గీ. | యోగిచక్రేశ! విను మిప్పయోజపాణి శ్రీ విలాసినిఁ బోలుఁ బరిగ్రహింపు శమధవర్షభ! కామితార్థము లొసంగు సురుచిశుభరాశి యీబంధుసురభిఁ బ్రోవు | 144 |
| కం. | ఆతపమునందె నిలిచి మ హాతపము లొనర్చి బడలి యరుదెంచిన మీ కీ తరుణి కల్పలత వలె శీతల సత్క్రియల నింపు సేయక యున్నే | 145 |
| శా. | అశ్రాంతశ్రుతి పాఠయత్నజనితాయాసంబు పంచాగ్ని మ ధ్యశ్రద్ధాసహితప్రకల్పిత తపస్యాకార్శ్య మత్యుగ్రయో గశ్రాంతిస్ఫురణంబు మాన్పఁ గల దీ కన్యాలలామంబు మీ శుశ్రూషార్థము దీనిఁ గైకొనుఁడటంచుం బుత్రి నర్పించినన్ | 146 |
| ఆ.వె. | ఆ మహర్షి మిగుల హర్షించి రాజఋ షీంద్రు సుతఁ బరిగ్రహించి మామ సత్కరించి పనుప శౌరికి మామయౌ నబ్ధికరణిఁ బొంగుఁ చతఁడు సనియె | 147 |
| సీ. | స్నానంబు గావించి చనుదెంచు నంతలో - జపవేదిఁ దగురీతిఁ జక్కఁ జేయు జపనిష్ఠ యొనరించి చాలించునంతలోఁ - జక్కఁగా దేవపూజకు నమర్చు దేవపూజ యొనర్చి తిలకించు నంతలో - షడ్రసాపూర్ణ భోజనము వెట్టు భోజనంబై కరంబులు గడ్గునంతలోఁ - బర్ణాజినములచేఁ బా న్పొనర్చుఁ | |
| గీ. | బాన్పుపైఁ జేరునంతలో బడలి రని మ నంబునఁ దలంచి తాలవృంతమున విసరి తొడలపై నంఘ్రు లుంచి యొత్తుచు ననేక సేవ లొనరించుఁ దపసి కచ్చిగురుబోఁడి | 148 |
| ఉ. | తోయము లాడుచో నొడలు తోమెడు కూర్మి కొకింత యాఁకటన్ గాయము డయ్యనీక యొడికంబుగ నన్నము వెట్టు ప్రేమకున్ రేయిఁ బగల్ సపర్య లొనరించుటకుం గరఁగెం దపస్వి లేఁ బ్రాయపుటాలిసేవలఁ గరంగరె? ఎంతటి వారు రాఘవా! | 149 |
| చం. | పలికినచో సదుత్తరము వల్కుటె కాని బహూక్తు లాడఁగాఁ దలఁకుట కెప్పుడేది యుచితం బది సేయుటకున్ మనోగతుల్ దెలిసి మెలంగ నేర్చుటకు దీమసమున్ వినయంబుఁ దాల్మియున్ గలుగుట కుబ్బి తాపసుఁ డొకానొకనాఁ డల కన్యతో ననున్ | 150 |