| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | హేతి ప్రహేతుల వృత్తాంతము |
| ఆ.వె. | రామ! యట్టి యక్షరాక్షసకోటిలో నెంచఁ దగిన వీరులిద్ద ఱైరి యెవ్వరన లయాగ్ని హేతిఁ బోలిన హేతి హస్తదీప్ర హేతి యగు ప్రహేతి | 196 |
| కం. | ఖేట ప్రతివీరులు మధు కైటభనిభ విక్రమప్రకారులు పటు బా హాటోపపేటు లాది ని శాటులు హేతి ప్రహేతు లద్భుతహేతుల్ | 197 |
| కం. | వారలయందుఁ బ్రహేతి యు దారుఁడు కామాదిరిపువిదారుఁడు శ్రితమం దారుఁడు గుణనందితబృం దారుం డనపేక్షితార్థదారుం డయ్యెన్ | 198 |
| మ. | భయదూరుం డల హేతి తాత పనుపన్ భార్యాకుమార స్పృహో భయసంగాత్మకుఁ డౌటఁ గాలభగినిన్ భద్రేభకుంభస్తనిన్ భయ యన్దానిఁ బరిగ్రహించె దశదిగ్భాగస్ఫురన్మల్లికా భ యశః పాండురమౌక్తిక ప్రతతి పైపై సేస గావింపఁగన్ | 199 |
| కం. | ఆ శాతోదరి విద్యు త్కేశుని సంధ్యాబ్దనికటదీపిత విద్యు త్కేశునిఁ దేజశ్శోచి ష్కేశునిఁ గనె హేతి ప్రీతి చెన్ను వహింపన్ | 200 |
| శా. | విద్యుత్కేశుఁడు తోయదాంబుజము ఠీవిన్ దాతృ కీర్త్యున్నతిన్ విద్యాభ్యాసి వివేకమున్వలె మహావిజ్ఞాని వైరాగ్య మ ట్లుద్యోగస్థుని కల్మిలీల హఠయోగోద్భాసి యాయుర్గతిన్ ఖద్యోతద్యుతి వృద్ధిఁ బొందెఁ పితృరక్షన్ జేసి నానాఁటికిన్ | 201 |
| మ. | నవవర్షాగమజృంభితాంబుదము చందానన్ మధుస్ఫూర్జితా టవిలీలన్ బటు యౌవనస్ఫురదవష్టంభంబునన్ పుత్త్రకుం డు విజృంభించిన రీతి హేతి గని సుష్ఠుప్రీతిఁ బ్రాపించి వా ని వయోరూపనిరూఢికిం దగిన కన్నెం గాంక్ష గావింపఁగన్ | 202 |
| సీ. | కమనీయ కమల కోశములతో సమములై - కులుకు గుబ్బమెఱుంగు గుబ్బ లమర నసమాననీలోత్పల సమాన రుచులొంది - కలికి సోయగపు వాల్గన్ను లలర శ్రీనందనస్యందనానందనరథాంగ - పటిమ విస్తృతనితంబము రహింపఁ గంజరాగము మీఱి సంజ గెంజిగి తీరు - వహియించి కెమ్మోని వన్నె మిగుల | |
| గీ. | నిరుల సరులను బెన్నెఱు లిరవు కొనఁగఁ దారకస్ఫూర్తి గన నఖోదారకాంతి సంధ్యవలె మించు సంధ్యాత్మజాలలామఁ బ్రియకుమారున కా హేతి పెండ్లి సేసె | 203 |
| శా. | తత్కాలంబునఁ జారుగాత్రియగు సంధ్యాపుత్త్రిఁ బ్రాపించి వి ద్యుత్కేశుండు శచీసమేతుఁ డగు నింద్రున్ రోహిణీయుక్తుఁడౌ సత్కాంతున్ గిరిజావిలోలుఁ డగు పశ్యత్ఫాలునిన్ బోలి య త్యుత్కంఠోత్థ రతిక్రియన్ మదనదేవోపాప్తి గావింపగన్ | 204 |
| ఉ. | నీలపయోదయుక్చపల నీటున నాథునిఁ గూడి యొప్పు నా సాలకటంకటాయువతి స్వాతిగతాంబుదవృష్టి శుక్తియున్ బోలె నిజేశుతేజమున భూరితరంబుగ నంత గర్భమున్ దాలిచి మందరాచల నితంబమునం దురుసాహసంబునన్ | 205 |
| మ. | పరులెవ్వారును గానకుండ నిజగర్భస్థార్భకున్ దద్ధరా ధరమధ్యంబున డించి వహ్నిజనితోద్యద్గర్భభారంబు మున్ శరమున్ జేర్చిన గంగఁ బోల సురతేచ్ఛాలోలయై జీవితే శ్వరుఁ జేరన్ జనెఁ బాప మెంచరు గదా చానల్ రఘుగ్రామణీ! | 206 |
| శా. | ఆ సంధ్యాతనయా విసృష్ట శిశు వాస్యాంతస్ఫురన్ముష్టియై యాసన్న క్షితిభృద్గుహల్ బదులు మ్రోయన్ కాలజీమూత గ ర్జాసామ్యధ్వని రోదనంబు ఘటియించన్ సాగె సింహాదినా నా సత్త్వంబులు తద్ధ్వనిన్ బెదరి చెంతన్ జేర లే కేఁగఁగన్ | 207 |
| వ. | అప్పుడు | 208 |
| సీ. | బలు కెంజడలతోడఁ దెలిగన్నెరుల వన్నె - గల క్రొన్నెల వతంసకంబుతోడ వలుఁద శూలముతోడ నలి నుబ్బు నలమబ్బు - వెలిద్రొబ్బు గరళభృద్గళముతోడ గిబ్బ తత్తడితోడ గిరిరాజు హరిరాజుఁ - గరిరాజు నగు మేని కాంతితోడఁ బునుక కంచముతోడ ననతూపు లన యేపు - గన నోపు దొర బూదిమినుకుతోడఁ | |
| గీ. | బ్రమథతతితోడఁ బార్వతీప్రమదతోడఁ గరిముఖాది కుమారవర్గంబుతోడ శివుఁడు మంథానగిరి తుంగ శృంగవీథిఁ జెలువు మీఱంగ స్వారి వేంచేయునపుడు | 209 |