ఇతిహాసములు ఉత్తరరామాయణము సుకేశుండను రాక్షసుని వృత్తాంతము
సుకేశుండను రాక్షసుని వృత్తాంతము
కం.వాపోయెడు సంధ్యా తన
యాపత్యము దిక్కుఁ జూచె నభవుఁడు కారు
ణ్యాపార సుధాపూర
వ్యాపార కటాక్ష వీక్షణాతిశయమునన్‌
210
కం.అంగజహరుఁ గని ప్రియమెన
యంగ జగజ్జనని గిరిజ యవధా రహిరా
డంగద యీ పసిపాపని
యంగదఁ బాయంగఁ జేయ నర్హం బనినన్‌
211
మ.ప్రియురా లాడినమాట దాఁటక పురస్త్రీ చిత్రకక్షాళనా
క్షయదుర్ధర్షశరుండు శంభుఁడు దయాంచద్భుద్ధిఁ దద్బాలుఁ జూ
చి యమర్త్యత్వము మాతృసన్నిభ వయశ్శ్రీస్ఫూర్తియున్‌ విశ్వది
గ్జయతేజంబు నభశ్చరత్పురముఁ గల్గంగా వరం బిచ్చినన్‌
212
శా.శ్రీ గౌరీజలజాయతాక్షి పలలాశిశ్రేణికిం గూర్మి స
ద్యోగర్భాతిశయ ప్రసూతులును సద్యోయౌవనప్రాప్తి స
ద్యోగాఢ ప్రతిభాపరాక్రమజయోద్యోగంబు లిచ్చెన్‌ లస
ద్యోగారూఢమనః ప్రసన్నుఁడగు కాంతుండట్టు లౌఁగా కనన్‌
213
కం.దేవికి వేడుక యవు నని
దేవరయును వరము లొసఁగ దేవరఁ గనుచున్‌
దేవియు సాటికి బేటికి
దీవింపఁగ దైత్యశిశువు తేజము నొందెన్‌
214
చం.జనని సుఖంబె కోరి కని శైలతటంబునఁ బాఱవైచి పో
యిన శిశు వేడ? వానికి యతీంద్రులకున్‌ గనరాని వేలుపుల్‌
గనఁబడి కోర నేరఁడని గాఢవరంబులొసంగు టేడ? య
ద్దనుజుని పూర్వజన్మ సుకృతం బెటువంటిదొ గాక రాఘవా!
215
ఉ.ధారుణిలో నరక్షితుఁడె దైవసురక్షితుఁ డందు రార్యులౌ
వా రది యట్టు లుండె రఘువంశసుధాంబుధిచంద్ర! వింటివే
యా రజనీచరార్భకుఁడు నంత సుకేశుఁడనన్‌ బ్రసిద్ధుఁడై
గౌరియు శంభుఁడున్‌ బనుపఁగా శివదత్త పురానువర్తియై
216
సీ.జలజాతరాగమండల పిచండిల మండ - లావిష్టుఁడగు భాను ననుకరించి
తపనీయదివ్యరత్నవిమాన సంచరి - ష్ణుత నిర్వహించు జిష్ణుని హసించి
బహుయోజనాయతప్రథమాన రథమెక్కి - చరియించు పూర్ణిమాచంద్రుఁ దెగడి
కనకాచలాంగ సంగతపతంగ పతంగ - వాహనుం డగు విష్ణువైఖరి నగి
 
గీ.గగన బహుపాద్ధరారుహాగ్రము స్వకీయ
పురమణీదీప్రవప్రగోపుర విభామ
తల్లికా వల్లికా శ్రేణు లల్లికొన సు
కేశుఁ డలరారె నంబరకేశుకరుణ
217
కం.ఆ మనుజాశి స్తోమల
లామునికీర్తి ప్రతాపలావణ్యంబుల్‌
గ్రామణియనుగంధర్వ
గ్రామణి తిలకించి కౌతుకం బలరారన్‌.
218
సీ.వేణికా రుచిఁ గృష్ణ విభవంబు వహియించి - ముఖదీప్తిఁ బూర్ణ సోముని గ్రహించి
తనుకాంతిఁ గనక గర్భనిరూఢిఁ బ్రాపించి - స్తనలీల గిరిజాతఘనతఁగాంది
వరనాభిగతి దేవవల్లభోన్నతినొంది - మధ్యరీతి ననంగ మహిమఁ జెంది
కటితటస్ఫురణఁ జక్రహితాభ్యుదయ మాని - నడలచే శిఖివాహనటన మూని
 
గీ.సౌరభంబున సుమనః ప్రసక్తి మీఱి
యఖిల సుమనోగుణంబుల నతిశయించు
దేవవతి యను తన కన్యఁ దెచ్చి యిచ్చె
నల సుకేశాఖ్యునకు భానుకులవరేణ్య!
219
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju