ఇతిహాసములు ఉత్తరరామాయణము మాల్యవదాదులకు వజ్రముష్ట్యాది రాక్షసులు పుట్టుట
మాల్యవదాదులకు వజ్రముష్ట్యాది రాక్షసులు పుట్టుట
మ.అనిశక్రోధుఁడు వజ్రముష్టియు విరూపాక్షాఖ్యుఁడున్‌ దుర్ముఖుం
డును సుప్తఘ్నుఁడు యజ్ఞకోపుఁ డనువాడున్‌ మత్తుఁ డున్మత్తకుం
డనలానామకుమారియున్‌ బొడమినన్‌ హర్షించె నమ్మాల్యవ
న్మనుజాశీంద్రుఁడు పుత్త్రవంతుఁడును సంపన్నుండునై రాఘవా!
247
కం.కేతుమతి దృగ్మిషాంగజ
కేతుమతి సుమాలిసతి శుకీవాణి తనూ
జాతలఁ దనుజాతులఁగనె
సీతాధిప! వారిపేళ్ళు సెప్పెద వినుమా!
248
వ.సుప్రహస్తుండనన్‌ దగు ప్రహస్తుండును, రణస్థలాకంపనుండగు నకంపనుండును, సురవికటుం డగు వికటుండును, విధ్వస్తశత్రురథన్యస్త శకటీముఖుండగు శకటీముఖుండునున్‌, బరుషానలధూమ్రాక్షుం డగు ధూమ్రాక్షుండును, నుద్దండభుజాదండుం డగు దండుండునున్‌ జతురంగ బలాక్రాంత సుపార్మ్వుం డనన్‌ దగు సుపార్శ్ముండును నశని సంహ్రాదియగు సంహ్రాదియున్‌ దనుప్రభాప్రహసితోద్దీప్ర ఘనుండగు ప్రఘనుండును మాగధీభూతసుస్తవన శ్రవణ సముదాస కర్ణుండగు భాసకర్ణుండునున్‌ బుట్టి దిట్టతనంబున్‌ జేపట్టి రట్టిరట్టడి వీరులకుఁ దోఁబుట్టువులై బాలయున్‌ బుష్పోత్కటయున్‌ గైకసియున్‌ గుంభీనసయు ననన్‌ దగు కన్నెలు చెన్నువహించి రంత249
మ.వసుదావోపశమాంబుద ప్రతిమ దీవ్యద్గాత్రుఁ డమ్మాలియున్‌
వసుదారిద్య్రయుతుండు పెన్నిధులఁ జెందన్‌ గోరుచందంబునన్‌
వసుదాభామినిఁ గూడి శౌర్యనిధులన్‌ వాంఛించి విద్విడ్విభా
వసుదాయాదులఁ గాంచెఁ బుత్రులఁ జతుర్వారాశి సంకాశులన్‌
250
కం.సరసుం డనలుఁడు ననిలుఁడు
హరుఁడున్‌ సంపాతి యనఁగ నల్ల నలువురున్‌
బురుషార్థంబులవలె నొ
ప్పిరి రాఘవ! వారెకద! విభీషణమంత్రుల్‌
251
మ.ఇటు లమ్మాల్యవదాదు లాత్మజులతోఁ నింద్రాది దిక్పాలకో
త్కట సంపద్గరిమంబుతోఁ ద్రిభువన త్రాసప్రదోద్యద్భటో
ద్భటధాటీఘటితార్భటీ పటిమతోఁ దా రందఱన్‌ గూడి ము
న్పటిలీలన్‌ గరుడోరగామరమునీంద్రశ్రేణి బాధింపఁగన్‌
252
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju