| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సురలు మునులు శివుని పాలి కరిగి యసురలం బరిమార్పవేఁడుట |
| ఉ. | వారి యుపద్రవంబున నివారితవైభవులై సమస్త బృం దారకులున్ వసింపఁ దగు తా విఁక నెయ్యది? యేది త్రోవ? యె వ్వారికి విన్నవింపుదము వైరుల రాపని చింతఁ జేసి యి బ్బారి పురాపహారి యెడఁబాపఁ గలాఁడని నిశ్చితాత్ములై | 253 |
| తే.గీ. | శ్వేతరుచిభూతిఁ దగి భవ్యశృంగకలనఁ దనరి గజముఖ సంయుక్తిఁగని యనంత పాదకటకాప్తి నెంతయు బాగుమీఱి శివునివలె నున్న కైలాస శిఖరిఁ జేరి | 254 |
| సీ. | అహిరాజ భూషణుండైన యావేల్పు మా - యహి భయం బేరీతి నడఁచు ననక యెపుడుఁ గుత్తుక విషం బిడుకొని మాటాడు - నితని మాటలు నమ్ము టెట్టు లనక తనవారితనముతోఁగనుఁ బుణ్యజనుల నీ - యన పుణ్యజనవైరి యౌనె యనక త్య్రంబకుండితఁ డనేకాంబకుల్ దేవతా - రిపు లెట్టు వారి నిర్జించు ననక | |
| గీ. | యల సుకేశకుమార సంహారమునకు నెట్టు లొడఁబడు నితఁడన కింద్రముఖ్యు లటుల యాపన్నులై భద్రవటము నీడ నిండుకొలువున్న పార్వతీనేతఁ గనిరి | 255 |
| కం. | కని వినయము భయమును బెనఁ గొనఁ గరములు మొగిచి శివునకు బహుళసాష్టాం గ నమస్కృతు లొనరించి యి ట్లని పొగడిరి మునులఁగూడి యమరేంద్రముఖుల్ | 256 |
| మత్తేభగర్భిత సీసము. | అభవ! కందర్పమదాపహానలదృశా! - పద్మారికోటిప్రభా! జొహారు సుకవిసంస్తుత్య! రజోగుణేతరమతీ! - గౌరీవధూనాయకా! జొహారు ప్రభవ! కుంభీంద్ర విభంజన క్రమహరి! - బ్రహ్మాది దేవాధిపా! జొహారు త్రిభువనాధీశ్వర! దేవసంయమిమనః - పూజావిధేయాత్మకా! జొహారు | |
| గీ. | చంద్రశకలశిరోవతంసక! జొహారు సురధరాధర కోదండధర! జొహారు శరధికన్యా మనోహరశర! జొహారు ప్రణత రక్షా విచక్షణేక్షణ! జొహారు | 257 |
| చం. | రతిపతి వైరి! శంకర! పరాకు! సుకేశసురారినందన త్రితయముచేతి బాధ నతిదీనులమై గతిమాలి లోకసం తతులకు దిక్కు నీవగుటఁ దావక పాదము లాశ్రయింప వ చ్చితిమి దయాప్రసక్తి మముఁ జేకొని విన్నప మాదరింపవే! | 258 |
| ఉ. | కాలిచి రాశ్రమావళులఁ గార్ముకముక్తశరాగ్నికీలలం బ్రేలిచి రెల్లదేవతల భీరులఁ జేసిరి సిద్ధముఖ్యులం దాలిచి రుగ్రరూపములు దైవగృహాంతర గోపురాదులన్ గూలిచి రేమి దెల్పెదము క్రూరసురారుల చెయ్వులీశ్వరా! | 259 |
| సీ. | పద్మాసనస్థులై ప్రణవంబు నొడువుచు - ముక్కుఁ బట్టఁగఁ బాసె మునివరులకు నేపట్ల నైన స్వాహాపూర్వముగ హవ్య - మగ్ని వేల్వఁగఁ బాసె యజ్వలకును హవిరన్నకాంక్ష నే సవనకర్త గృహంబుఁ - దేఱి చూడఁగఁ బాసె దేవతలకు గుహలలో నొంటిగాఁ గూర్చుండి నీ పాద - చింతసేయఁగఁ బాసె సిద్ధులకును | |
| గీ. | జేరి గురుకులవాసంబుఁ జేసి శ్రుతులఁ జదువు కొనఁ బాసె నీ బ్రహ్మచారులకును బార్వతీనాథ! మాల్యవత్ప్రముఖ దైత్య శేఖరులు సేయు నాజ్ఞావిశేషమునకు | 260 |
| ఉ. | ఏమె యజాచ్యుతేశ్వరుల మేమె దిశేశహుతాశనక్షపా కాముల మేమె యింద్రయమకంధి వరేణ్యుల మంచు భీమసం గ్రామకుతూహలంబున జగత్త్రయమున్ బడలించు రాక్షస గ్రామణులన్ హరించి మముఁ గావఁగదే శివ యంచు మ్రొక్కినన్! | 261 |
| శా. | ఆ ముక్కంటి దరస్మితంబున సుపర్వాధీశులన్ జూచి మీ తో మోమోటము లేక తెల్పెద నవధ్యుల్ రాక్షసుల్ వారలన్ నే మర్దింపఁగ నోప వారి గెడపన్ నేర్చున్ ముకుందుండు మీ రీ మంత్రం బెద నమ్మి శౌరిఁ గనఁ బొం డిష్టార్థముల్ సేకుఱున్ | 262 |
| కం. | దితిజాహితుచేఁ దక్కఁగ నితరులచేఁ జెడరు వార లిది నిజమని య య్యతనుహరుం డాడిన నా శ్రితహిత మొనరింప మీకె చెల్లు నటంచున్ | 263 |