ఇతిహాసములు ఉత్తరరామాయణము ఆశ్వాసాంత పద్యములు
ఆశ్వాసాంత పద్యములు
చం.అనఘ జనావనైకచతురా! చతురాననచంద్రశేఖరా
ద్యనిమిషరాజమానసచరా! సచరాచరవిశ్వలోకవ
ర్తన మహనీయ రూపమధురా! మధురాపుర కామినీవిలో
చనకువలాబ్జ దాస్య వనజా! వనజాతవహాంబుదోపమా!
408
కం.భద్రాహృదయేశ్వర! బల
భద్రాదరజాగ్రగణ్య! భక్త శరణ్యా!
భద్రార్తిహరణకరణ సు
భద్రాధిపభద్రకరణ పారీణమతీ
409
సుగంధివృత్తముపన్నగాధిరాజతల్ప! పాదసేవనాపరా!
పన్నగామరేంద్ర చంద్ర పారదాభ కీర్తి సం
పన్న! గాలవాది వంద్యమాన! బాణధోరణీ
పన్నగాఢదేవశత్రు పార్శ్వ హస్తమస్తకా
410
గద్యముఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణి వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంధాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు తృతీయాశ్వాసము. 
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju