ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుండు వరుణసుతులతో సమరంబు సేసి గెల్చుట
రావణుండు వరుణసుతులతో సమరంబు సేసి గెల్చుట
మ.ఉపలక్షించి పయోధినాథసుతు లోహో! నిల్వుఁడం చాసురా
ధిపసేనానుల నిల్వరించి యసిపంక్తిన్‌ నొంచి తేరుల్‌ పయో
దపథంబంటి చరింపఁజేసి బహుమార్తండ ప్రభల్‌ మీఱఁదో
రపుఁగోపంబునఁ బంక్తికంఠుని శరీరం బమ్ములన్‌ ముంచినన్‌
394
శా.ఆ శౌర్యంబు మహోదరుండు గని యీర్ష్యన్‌ మించి విన్వీథి కెం
తే శీఘ్రంబున నుద్గమించి పటుశక్తి స్ఫార సర్పోగ్ర బా
హాశుంభత్పరిఘ ప్రహార పరుష వ్యాపారముల్‌ సూపె న
ప్పాశిప్రోద్భవ సూతరథ్య రథముల్‌ భగ్నంబులై కూలఁగన్‌
395
చం.అరదములున్‌ హయంబులు, నియంతలుఁ గూలిన బీఱు వోవక
వ్వరుణసుతుల్‌ ప్రభావమున వాయుపథంబున నిల్చి భూనభోం
తరములు మ్రోయఁ గార్ముక గుణంబులు దీటుచు నమ్మహోదరున్‌
శరముల నొవ్వ నేసి వివశత్వము నొందగఁజేసి రీసునన్‌
396
వ.మఱియును397
చం.అశని సమూహముల్‌ గురియు నంబుదసంఘములో! మహోష్ణక
ర్కశకరముల్‌ నిగుడ్చు లయకాల విభాకరమూర్తులో! యనన్‌
నిశితశర ప్రకాండము లనేకము లొక్కట నించి నొంచి ర
ద్దశముఖు నాతడుం బ్రకటిత భ్రుకుటీకుటిలేక్షణోగ్రుఁడై
398
శా.జ్యాభూరిధ్వను లాకసంబుఁ బగిలించం బాశహస్తప్రజల్‌
క్షోభించన్‌ శరశూలముద్గరగదా కుంతాది శస్త్రోత్కరం
బాభీలోద్ధతిఁబైపయిన్‌ నిగుడ జేయన్‌ మర్మముల్‌ గాడ నెం
తో భీతిల్లి పదాతులై ధరణి కా వ్యోమాధ్వగుల్‌ డిగ్గినన్‌
399
మ.అవలోకించి హసింపుచున్‌ దశముఖుం డాహా! ననున్‌ మించిపో
వ వశంబే? సుతహీనుఁజేసెద నిఁకన్‌ వార్ధీశుఁ గల్పాంతవా
యువు బారిం బడినట్టు లైతిరి గదా! యొండేల? ప్రాణంబు లా
స విసర్జింపుఁ డటంచు వారలపయిన్‌ సైన్యంబులం బంచినన్‌
400
తే.గీ.ఆ బలంబులు శస్త్రాస్త్రహతుల నొంప
బడలి వరుణుని కొడుకులు పుడమిఁబడిరి
యనుచరుల్‌ గొనిపోవ గేహములు సేరఁ
జూచియార్చుచు రావణాసురుఁడు వలికె
401
కం.శరధులు గలిగియుఁ గాండ
స్ఫురణకు దొరయైనవాని పుత్త్రకు లయ్యున్‌
బరసేనలు వెనుసఱచుచుఁ
బఱతేరఁగఁ బాఱిపోవఁ బాడియె మీకున్‌
402
కం.బలము సెడి నీళ్ళకంటెను
బలుచనయైతి రిఁక మిమ్ము బాధింపఁగరా
దిలుసేరి తండ్రినైనం
గలనికిఁ బనుపుఁడని బెట్టుగా నతఁ డనఁగన్‌
403
కం.ఆ మాటలఁ బఱచుచు వరు
ణామాత్యుండగు ప్రభాసుఁడాలించి పటు
స్థేమమున నిలిచి దనుజ
గ్రామణి విన నిట్టులనియె ఘనవాక్ప్రౌఢిన్‌
404
మ.అసురాధీశ్వర! యీడ లేఁడు వరుణుం డబ్జాసనుం గొల్వఁబో
యె సమానుం డగునే నినుందొడర? నీ వీరేడు లోకంబులం
దసమానుండవు నీ ప్రతాపమున కీ యంభోధిరాట్పుత్త్రపౌ
త్త్రసుహృత్పుంగవు లోడి రాతఁడిక వేఱా? బుద్ధినూహింపుమా!
405
కం.వరుణ సహస్రము వచ్చినఁ
దరమే నిను గెల్వ ననిన దశముఖుఁ డుత్సా
హరసోన్నతి నార్చుచు న
ప్పురి వెలువడి చనియెఁ దూర్యముల రొద లెసఁగన్‌
406
కం.అని కలశజుఁ డెఱిఁగించిన
విని రామస్వామి యవల వింశతిబాహుం
డనిఁ గోరి యెచటి కరిగెనొ?
యనఘా! వినవలతుఁ దెలుపుఁడని యడుగుటయున్‌
407
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju