| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| సీ. |
విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన నేర్పడు ననువర్తనమున వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై తాన రా జగుచుఁ జిత్తమునఁ జేసి వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వ నికి నెండమావులు నీటఁ గాచాదుల నన్యోన్యబుద్ధిఁ దా నడరునట్లు |
|
| ఆ. |
త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద, ననఘు సత్యుఁ బరుని ననుదినంబు. |
34 |
| వ. | ఇట్లు “సత్యం పరం ధీమహి” యను గాయత్త్రీ ప్రారంభమున గాయత్రీనామబ్రహ్మస్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసురవధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు. | 35 |
| సీ. |
శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినఁ గోరువారల విమలచిత్తంబులఁ జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక; యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకుఁ గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును దగిలి యుండుట మహాతత్త్వబుద్ధిఁ |
|
| తే. |
బరఁగ నాధ్యాత్మికాదితాపత్రయంబు, నడఁచి పరమార్థభూతమై యధిక సుఖద మై సమస్తంబుఁ గాకయు నయ్యు నుండు, వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునందు. |
36 |
| ఆ. |
వేదకల్పవృక్షవిగళితమై శుక, ముఖసుధాద్రవమున మొనసియున్న భాగవతపురాణఫలరసాస్వాదన, పదవిఁ గనుఁడు రసికభావవిదులు. |
37 |
| క. |
పుణ్యంబై మునివల్లభ, గణ్యంబై కుసుమఫలనికాయోత్థిత సా ద్గుణ్యమయి నైమిశాఖ్యా, రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబులలోన్. |
38 |
| వ. | మఱియును మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథమహితంబై, బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై, నీలగళసభానికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటలమండితంబై, బలభేదిభవనంబునుం బోలె నైరావతామృత రంభాగణికాభిరామంబై, మురాసురునిలయంబునుంబోలె నున్మత్తరాక్షసవంశసంకులంబై, ధన దాగారంబునుం బోలె శంఖ పద్మకుంద ముకుంద సుందరంబై, రఘురాము యుద్ధంబునుం బోలె నిరంతర శరానలశిఖాబహుళంబై, పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై, దానవ సంగ్రామంబునుంబోలె నరిష్ట జంభనికుంభ శక్తియుక్తంబై, కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జునకాంచనస్యందనకదంబ సమేతంబై, కర్ణుకలహంబునుం బోలె మహోన్నతశల్య సహకారంబై, సముద్రసేతు బంధనంబునుంబోలె నలనీల పనసాద్యద్రిప్రదీపితంబై, భర్గు భజనంబునుం బోలె నానా శోకలేఖా ఫలితంబై, మరుని కోదండంబునుం బోలె బున్నాగశిలీముఖభూషితంబై, నరసింహరూపంబునుం బోలె గేసరకరజ కాంతంబై, నాట్యరంగంబునుం బోలె నటనటీసుషిరాన్వితంబై, శైలజా నిటలంబునుంబోలెఁ జందన కర్పూర తిలకాలంకృతంబై, వర్షాగమంబునుంబోలె నింద్రబాణాసన మేఘ కరక కమనీయంబై, నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై, మహాకావ్యంబునుం బోలె సరల మృదులతా కలితంబై, వినతానిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై, యమరావతీ పురంబునుం బోలె సుమనోలలితంబై, కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై, పురుషోత్తమసేవనంబునుం బోలె నమృతఫలదంబై, ధనంజయ సమీకంబునుంబోలె నభ్రంకష పరాగంబై, వైకుంఠపురంబునుం బోలె ఖడ్గ పుండరీక విలసితంబై, నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై లంకానగరంబునుంబోలె రామమహిషీవంచక సమంచితంబై, సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై, నారాయణస్థానంబునుం బోలె నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై, మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై, సూర్య రథంబునుం బోలె నురుతరప్రవాహంబై, జలదకాల సంధ్యాముహూర్తంబునుం బోలె బహువితత జాతిసౌమనస్యంబై, యొప్పు నైమిశారణ్యంబను శ్రీవిష్ణుక్షేత్రంబునందు శౌనకాదిమహామునులు స్వర్గలోకగీయమానుండగు హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండి రందొక్క నాఁడు వారలు రేపకడ నిత్య నైమిత్తికహోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుం జూచి. | 39 |