| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| క. |
ఆ తాపసు లిట్లనిరి వి నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతున్, నుతహరిగుణ సం, ఘాతున్, సూతున్, నితాంత కరుణోపేతున్. |
40 |
| మ. |
సమతం దొల్లి పురాణపంక్తు లితిహాసశ్రేణులున్ ధర్మ శా స్త్రములున్ నీవ యుపన్యసింపుదువు వేదవ్యాసముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిం; దత్ప్రసా దమునం జేసి యెఱుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా! |
41 |
| క. |
గురువులు ప్రియశిష్యులకుం, బరమరహస్యములు దెలియ బలుకుదు రచల స్థిరకల్యాణం బెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. |
42 |
| క. |
మన్నాఁడవు చిరకాలము, గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాఁడవు వినఁదగినవి, యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్. |
43 |
| చ. |
అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై యలవడు? నేమిటం బొడము నాత్మకు శాంతి? మునీంద్ర! చెప్పవే? |
44 |
| సీ. |
ఎవ్వని యవతార మెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిఁ జేయు నెవ్వని శుభనామ మే ప్రొద్దు నుడువంగ సంసార బంధంబు సమసిపోవు నెవ్వని చరితంబు హృదయంబుఁ జేర్పంగ భయమంది మృత్యువు పరువువెట్టు నెవ్వని పదనది నేపారు జలములు సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ |
|
| తే. |
దపసు లెవ్వని పాదంబు దగిలి శాంతి, తెరువుఁ గాంచిరి వసుదేవదేవకులకు నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ, నిచ్చ పుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత! |
45 |
| క. |
భూషణములు వాణికి నఘ, పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ త్తోషణములు కల్యాణ వి, శేషణములు హరి గుణోపచిత భాషణముల్. |
46 |
| క. |
కలిదోషనివారకమై, యలఘుయశుల్ వొగడునట్టి హరికథనము ని ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు, వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు? మహాత్మా! |
47 |
| ఆ. |
అనఘ! విను రసజ్ఞులై వినువారికి, మాటమాట కధికమధురమైన యట్టి కృష్ణుకథన మాకర్ణనము సేయఁ, దలఁపు గలదు మాకుఁ దనివి లేదు. |
48 |
| మ. |
వరగోవిందకథాసుధారసమహావర్షోరుధారాపరం పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి స్తరదుర్దాంతదురంతదుస్సహజనుస్సంభావితానేకదు స్తరగంభీరకఠోరకల్మషకనద్దావానలం బాఱునే? |
49 |
| సీ. |
హరినామకథనదావానలజ్వాలచేఁ గాలవే ఘోరాఘకాననములు వైకుంఠదర్శనవాయుసంఘంబుచేఁ దొలఁగవే భవదుఃఖతోయదములు కమలనాభధ్యానకంఠీరవంబుచేఁ గూలవే సంతాపకుంజరములు నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ దీఱవే షడ్వర్గతిమిరతతులు |
|
| ఆ. |
నలిననయనభక్తినావచేఁ గాక సం, సారజలధి దాఁటి చనఁగ రాదు; వేయు నేల! మాకు విష్ణుప్రభావంబుఁ, దెలుపవయ్య సూత! ధీసమేత! |
50 |
| వ. | మఱియుఁ గపటమానవుండును గూఢుండునైన మాధవుండు రామసహితుండై యతిమానుషంబులైన పరాక్రమంబులు సేసెనఁట! వాని వివరింపుము, కలియుగంబు రాఁగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘసత్త్రనిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి. దైవయోగంబున. | 51 |
| క. |
జలరాశి దాఁటఁ గోరెడి, కలముజనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిన్ గలిదోషహరణవాంఛా, కలితులమగు మేము నిన్నుఁ గంటిమి సూతా! |
52 |
| క. |
చారుతర ధర్మరాశికి, భారకుఁడగు కృషుఁ డాత్మపదమున కేగన్ భారకుఁడు లేక యెవ్వనిఁ, జేరెను ధర్మంబు బలుపు సెడి మునినాథా! |
53 |