పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
భగవంతుని యేకవింశత్యవతారములు
వ. అది సకలావతారంబులకు మొదలి గనియైన శ్రీమన్నారాయణదేవుని విరాజమానంబయిన దివ్యరూపంబు; దానిం బరమయోగీంద్రులు దర్శింతురు; అ ప్పరమేశ్వరు నాభికమలంబువలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె; నతని యవయవ స్థానంబులయందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె; మొదల న ద్దేవుండు కౌమారాఖ్యసర్గంబు నాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరియించె, రెండవ మాఱు జగజ్జననంబు కొఱకు రసాతలగత యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుం డయి వరాహదేహంబు దాల్చె;మూఁడవ తోయంబున నారదుండను దేవర్షియై కర్మనిర్మోచకంబైన వైష్ణవతంత్రంబు సేసె; నాల్గవపరి ధర్మభార్యాసర్గంబునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు సేసెఁ; బంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వగ్రామనిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె; నాఱవ శరీరంబున ననసూయాదేవియందు నత్రిమహామునికిం గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాదముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె; నేడవ విగ్రహంబున నాకూతియందు రుచికి జన్మించి యజ్ఞుం డనఁ బ్రకాశమానుండై యమాది దేవతలం గూడి స్వాయంభువ మన్వంతరంబు రక్షించె; అష్టమ మూర్తిని మేరుదేవియందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండై విద్వజ్ఞనులకుఁ బరమహంసమార్గంబుం బ్రకటించె; ఋషులచేతఁ గోరంబడి తొమ్మిదవ జన్మంబునఁ బృథుచక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్తవస్తువులం బిదికె; చాక్షుషమన్వంతరసంప్లవంబున దశమంబయిన మీనావతారంబు నొంది మహీరూపంబగు నావ నెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె; సముద్రమథన కాలంబునం బదునొకండవమాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠకర్పరంబున నేరుపరియై నిలిపె; ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మథ్యమాన క్షీరపాథోధిమధ్య భాగంబున నమృతకలశహస్తుండై వెడలెఁ; బదుమూఁడవది యయిన మోహినీవేషంబున నసురుల మోహితులంజేసి సురల నమృతాహారులం గావించె; బదునాలుగవదియైన నరసింహరూపంబునం గనకకశిపుని సంహరించెఁ; బదునేనవదియైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించి మూఁడు లోకంబుల నాక్రమించెఁ; బదునాఱవదియైన భార్గవరామాకృతినిఁ గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులయిన రాజుల నిరువది యొక్క మాఱు వధియించి భూమి నిఃక్షత్త్రంబుఁ గావించెఁ; బదునేడవదియైన వ్యాసగాత్రంబున నల్పమతులయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; బదునెనిమిదవదైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబునొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబు లాచరించె; నేకోనవింశతి వింశతితమంబులైన రామకృష్ణరూపంబులచే యదువంశంబునందు సంభవించి విశ్వంభరాభారంబు నివారించె; నేకవింశతి తమంబైన బుద్ధనామధేయంబునం గలియుగా ద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి తేజరిల్లు; యుగసంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుండను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపఁగలండని యిట్లనియె. 63
మ. సరసిం బాసిన వేయుకాలువల యోజన్‌ విష్ణునందైన శ్రీ
కరనానాప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్‌
సురలున్‌ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్‌ విష్ణునంశాంశజుల్‌
హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్‌.
64
క. భగవంతుం డగు విష్ణుఁడు, జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగుం
దగ న వ్వేళలఁ దడయక, యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్‌.
65
ఆ. అతిరహస్యమైన హరిజన్మకథనంబు, మనుజుఁ డెవ్వఁడేని మాపు రేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార, దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.
66
వ. వినుం డరూపుండయి చిదాత్మకుండయి పరఁగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబులైన మహదాదిరూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితంబైన, గగనంబునందుఁ బవనాశ్రిత మేఘసమూహంబును, గాలియందుఁ బార్థివధూళిధూసరత్వంబును నే రీతి నా రీతి ద్రష్టయగు నాత్మయందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గాని వారిచేత నారోపింపంబడు. నీ స్థూలరూపంబు కంటె నదృష్ట గుణంబయి యశ్రుతంబైన వస్తువగుటంజేసి వ్యక్తంబు గాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముఁడయిన జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు; నెప్పు డీ స్థూలసూక్ష్మరూపంబులు రెండు స్వరూప సమ్యగ్‌జ్ఞానంబునం బ్రతిషేధింపంబడు నపుడు నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడు ననియుం దెలియు ననియు జీవుండు బ్రహ్మదర్శనంబున కధికారి యగు; దర్శనంబన జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణతయగు నప్పుడు జీవోపాధి యయిన స్థూలసూక్ష్మరూపంబు దహించి జీవుండు కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మ స్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుం డగు; నిట్లు తత్త్వజ్ఞులు సెప్పుదు రని సూతుం డిట్లనియె. 67
చ. జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్తచిత్త వ
ర్తనుఁ డగు చక్రికిం గవు లుదారపదంబుల జన్మకర్మముల్‌
వినుతులు సేయుచుండుదురు; వేదరహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్‌.
68
మ. భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం
తవిధిం జేయు, మునుంగఁ డందు; బహుభూతవ్రాతమం దాత్మ తం
త్రవిహారస్థితుఁడై షడింద్రియ సమస్త ప్రీతియున్‌ దవ్వులన్‌
దివిభంగిం గొనుఁ; జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్‌ నిబంధించుచున్‌.
69
చ. జగదధినాథుఁడైన హరి సంతతలీలలు నామరూపముల్‌
దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్‌
మిగిలి కుతర్కవాది దగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే ?
యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?
70
ఉ. ఇంచుక మాయ లేక మది నెప్పుడుఁ బాయని భక్తితోడ వ
ర్తించుచు నెవ్వఁడేని హరి దివ్యపదాంబుజగంధరాశి సే
వించు నతం డెఱుంగు నరవిందభవాదులకైన దుర్లభో
దంచితమైన యా హరి యుదారమహాద్భుత కర్మమార్గముల్‌.
71
మ. హరిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే
తిరుగం బాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్‌
ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్‌ సమస్తజ్ఞులున్‌
హరిచింతన్‌ మిముఁ జెంద వెన్నఁడును జన్మాంతర్వ్యథాయోగముల్‌.
72
సీ. పుణ్యకీర్తనుఁడైన భువనేశుచరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకలపురాణరాజము దొల్లి లోకభద్రముగ ధన్యముగ మోదముగఁ బ్రీతి
భగవంతుఁడగు వ్యాసభట్టారకుఁ డొనర్చి శుకుఁ డనియెడు తన సుతునిచేతఁ
జదివించె నింతయు సకలవేదేతిహాసములలోపల నెల్ల సారమైన
 
ఆ. యీ పురాణ మెల్ల నెలమి నా శుకయోగి, గంగ నడుమ నిల్చి ఘనవిరక్తి
యొదవి మునులతోడ నుపవిష్టుఁడగు పరీ, క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు.
73
వ. కృష్ణుఁడు ధర్మజ్ఞానాదులతోడం దనలోకంబునకుఁ జనిన పిమ్మటం గలికాలదోషాంధకారంబున నష్టదర్శనులైన జనులకు నిప్పు డిప్పురాణంబు కమలబంధుని భంగి నున్నది. నాఁ డందు భూరితేజుండయి కీర్తించుచున్న విప్రర్షివలన నేఁ బఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయు వినిపించెద ననిన సూతునకు మునివరుండయిన శౌనకుం డిట్లనియె. 74
శా. సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్‌ మునిశ్రేష్ఠు నే
శ్రోతల్‌ గోరిరి? యేమి హేతువునకై, శోధించి లోకైక వి
ఖ్యాతిన్‌ వ్యాసుఁడు మున్ను భాగవతముం గల్పించెఁ? దత్పుత్త్రుఁ డే
ప్రీతిన్‌ రాజున కీ పురాణకథఁ జెప్పెం? జెప్పవే యంతయున్‌.
75
వ. బుధేంద్రా! వ్యాసపుత్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం డేకాంతమతి మాయాశయ నంబువలనం దెలిసిన వాఁడు గూఢుండు మూఢుని క్రియ నుండు నిరస్తఖేదుం డదియునుం గాక. 76
తరల. శుకుఁడు గోఁచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల
జ్జకుఁ జలింపక చీర లొల్లక చల్లులాడెడి దేవ క
న్యకలు హా శుక, యంచు వెన్కఁ జనంగ వ్యాసునిఁ జూచి యం!
శుకములన్‌ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ!
77
వ. మఱియు నగ్నుండుఁ దరుణుండునై చను తన కొడుకుం గని వస్త్రపరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండును నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవరమణులం గని వ్యాసుండు కారణం బడిగిన వారలు నీ పుత్త్రుండు స్త్రీపురుషులనెడు భేద దృష్టి లేక యుండు; మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గలదని; రట్టి శుకుండు కురుజాంగలదేశంబులు సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె? మఱియు నున్మత్తుని క్రియ, మూఁగతెఱంగున, జడుని భంగి నుండు న మ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజుతోడ సంవాదం బెట్లు సిద్ధించె? కథనీయం బయిన శ్రీభాగవత నిగమవ్యాఖ్యానం బేరీతి సాఁగె? న య్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబుల గోవును బిదికినయంత తడవుగాని నిలువంబడం డతండు గోదోహనమాత్రకాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులగు నండ్రు; పెద్దకాలం బేక ప్రదేశంబున నెట్లుండె? భాగవతోత్తముండైన జనపాలుని జన్మకర్మంబు లే ప్రకారంబులు? వివరింపుము. 78
సీ. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ
బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ
గుంభజకర్ణాదికురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరుతండ్రి
గాంగేయసైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరుతాత
 
ఆ. యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిఁ
బరిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై యసువు లుండ, నేల యడఁగియుండె?
79
ఉ. ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నఁడుం
జిత్తములందు గోరరు హసించియు, లోకుల కెల్ల నర్థ సం
పత్తియు భూతియున్‌ సుఖము భద్రముఁ గోరుదు, రన్యరక్షణా
త్యుత్తమమైన మేను విభుఁ డూరక యేల విరక్తిఁ బాసెనో?
80
క. సారముల నెల్ల నెఱుఁగుదు, పారగుఁడవు భాషలందు బహువిధ కథనో
దారుఁడవు మాకు సర్వముఁ, బారము ముట్టంగఁ దెలియఁ బలుకు మహాత్మా!
81
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )