| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| వ. | అని యిట్లు మహనీయగుణగరిష్ఠులయిన శౌనకాదిమునిశ్రేష్ఠు లడిగిన రోమహర్షణ పుత్త్రుండయి యుగ్రశ్రవసుం డనుపేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు. | 54 |
| మ. |
సముఁడై యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై సన్న్యాసియై యొంటిఁబో వ మహాప్రీతి నొహో కుమార! యనుచున్ వ్యాసుండు చీరంగ వృ క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె మున్నట్టి భూ తమయున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్. |
55 |
| సీ. |
కార్యవర్గంబును గారణ సంఘంబు నధికరించి చరించు నాత్మతత్త్వ మధ్యాత్మ మనఁబడు నట్టి యధ్యాత్మముఁ దెలియఁజేయఁగఁ జాలు దీప మగుచు సకలవేదములకు సారాంశమై యేకమై యసాధారణమగు ప్రభావ రాజకంబైన పురాణ మర్మంబును గాఢసంసారాంధకారపటలి |
|
| తే. |
దాఁటఁ గోరెడివారికి దయ దలిర్ప, నే తపోనిధి వివరించె నేర్పడంగ నట్టి శుకనామధేయు మహాత్మగేయు, విమలవిజ్ఞానరమణీయు వేడ్కఁ గొలుతు. |
56 |
| క. |
నారాయణునకు నరునకు, భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు నమ స్కారము సేసి వచింతు ను, దారగ్రంథంబు దళితతనుబంధంబున్. |
57 |
| వ. | అని ఇట్లు దేవతాగురునమస్కారంబు సేసి యిట్లనియె ‘మునీంద్రులారా! నన్ను మీరలు నిఖిల లోక మంగళంబయిన ప్రయోజనం బడిగితిరి. ఏమిటం గృష్ణసంప్రశ్నంబు సేయంబడు నెవ్విధంబున నాత్మ ప్రసన్నంబగు, నిర్విఘ్నయు నిర్హేతుకయునైన హరిభక్తి యే రూపంబునం గలుగు నది పురుషులకుఁ బరమధర్మంబగు, వాసుదేవునియందు బ్రయోగింపంబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు. నారాయణకథలవలన నెయ్యే ధర్మంబులు దగులువడ వవి నిరర్థకంబులు. అపవర్గపర్యంతంబయిన పరధర్మంబునకు దృష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబు గాదు. ధర్మంబునం దవ్యభిచారియైన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు. విషయభోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు గాదు. ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు, తత్త్వజిజ్ఞాసగల జీవునకుఁ గర్మంబులచేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు; తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస యగుటఁ గొందఱు ధర్మంబే తత్త్వంబని పలుకుదురు; తత్త్వవిదులు జ్ఞానంబను పేర నద్వయంబైన యది తత్త్వంబని యెఱుంగుదురు. ఆ తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మమనియు, హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు, సాత్త్వతుల చేత భగవంతుం డనియును బలుకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞానవైరాగ్యంబులతోడం గూడిన భక్తిచేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మయందుఁ బరమాత్మం బొడగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు, పురుషులు వర్ణాశ్రమధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి. ఏక చిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపను వర్ణింపనుం దగుఁ జక్రాయుధ ధ్యానం బను ఖడ్గంబున వివేకవంతు లహంకారనిబద్ధంబైన కర్మంబు ద్రుంచివైతురు; భగవంతునియందలి శ్రద్ధయు నపవర్గదంబగు తత్కథాశ్రవణాదులయం దత్యంతాసక్తియుఁ బుణ్య తీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు. కర్మనిర్మూలన హేతువులైన కమలలోచను కథలం దెవ్వండు రతిసేయు, విన నిచ్చగించు, వాని కితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు. పుణ్యశ్రవణకీర్తనుండైన కృష్ణుండు దన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబు లాచరించు; నశుభంబులు పరిహరించు; నశుభంబులు నష్టంబు లయిన, భాగవతశాస్త్రసేవావిశేషంబున నిశ్చలభక్తి యుదయించు; భక్తి గలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నం బగుఁ; బ్రసన్నమనస్కుండైన ముక్తసంగుండగు; ముక్తసంగుండైన నీశ్వరతత్త్వజ్ఞానంబు సిద్ధించు; నీశ్వరుండు గానంబడినఁ జిజ్జడగ్రథనరూపంబైన యహంకారంబు భిన్నంబగు; నహంకారంబు భిన్నంబైన నసంభావనాదిరూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు; సంశయ విచ్ఛేదంబైన ననారబ్ధఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం గావున. | 58 |
| క. |
గురుమతులు తపసు లంతః, కరణంబుల శుద్ధిసేయ ఘనతరభక్తిన్ హరియందు సమర్పింతురు, పరమానందమున భిన్నభవబంధనులై. |
59 |
| తరల. |
పరమపూరుషు డొక్కఁ డాఢ్యుఁడు పాలనోద్భవనాశముల్ సొరిదిఁ జేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞలఁ బ్రాకృత స్ఫురిత సత్త్వరజస్తమంబులఁ బొందు నందు శుభస్థితుల్ హరి చరాచరకోటి కిచ్చు ననంతసత్త్వనిరూఢుఁడై. |
60 |
| వ. | మఱియు నొక్క విశేషంబు గలదు; కాష్ఠంబు కంటె ధూమంబు, ధూమంబు కంటెఁ ద్రయీ మయంబయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబు కంటె బ్రహ్మప్రకాశంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు; తొల్లి మునులు సత్త్వమయుండని భగవంతు హరి నధోక్షజుం గొలిచిరి; కొందఱు సంసారమందలి మేలు కొఱకు నన్యుల సేవింతురు; మోక్షార్థు లయినవారలు ఘోరరూపులయిన భూతపతుల విడిచి దేవతాంతర నింద సేయక శాంతులయి నారాయణ కథల యందే ప్రవర్తింతురు; కొందఱు రాజసతామసులయి సిరియు నైశ్వర్యంబును బ్రజలనుం గోరి పితృభూతప్రజేశాదుల నారాధింతురు. మోక్ష మిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు; వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు; నిర్గుణుం డయిన పరమేశ్వరుండు గలుగుచు లేకుండుచుఁ ద్రిగుణంబులతోడం గూడిన తన మాయచేత నింతయు సృజియించి గుణవంతుని చందంబున నిజ మాయావిలసితంబు లయిన గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞానవిజృంభితుండై వెలుంగు; నగ్ని యొక్కరుండయ్యుఁ బెక్కుమ్రాఁకులందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుం డొక్కండ తన వలనం గలిగిన నిఖిలభూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడంగూడి గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందుఁ దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు; లోకకర్తయైన యతండు దేవ తిర్యఙ్మనుష్యాది జాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించు నని మఱియు సూతుం డిట్లనియె. | 61 |
| సీ. |
మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై చారు షోడశ కళాసహితుఁ డగుచుఁ బంచమహాభూతభాసితుండై శుద్ధసత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ జరణోరుభుజముఖశ్రవణాక్షినాసాశిరములు నానాసహస్రములు వెలుఁగ నంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కువే లమరుచుండఁ |
|
| తే. |
బురుష రూపంబు ధరియించి పరుఁ డనంతుఁ, డఖిలభువనైకవర్తనయత్న మమర మానితోదార జలరాశి మధ్యమునను, యోగనిద్రావిలాసియై యొప్పుచుండు. |
62 |