పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
ద్రౌపది యశ్వత్థామను జూచి సంభాషించుట
వ. ఇట్లర్జునుండు దెచ్చి చూపిన బాలవధ జనిత లజ్జా పరాఙ్ముఖుండైన కృపి కొడుకుం జూచి మ్రొక్కి సుస్వభావయగు ద్రౌపది యిట్లనియె. 159
మ. పరఁగన్‌ మా మగవార లందఱును మున్‌ బాణప్రయోగోప సం
హరణాద్యాయుధవిద్య లన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్త్రాకృతి నున్న ద్రోణుఁడవు, నీ చిత్తంబులో లేశముం
గరుణాసంగము లేక శిష్యసుతులన్‌ ఖండింపఁగాఁ బాడియే?
160
క. భూసురుఁడవు, బుద్ధిదయా, భాసురుఁడవు శుద్ధవీరభటసందోహా
గ్రేసరుఁడవు, శిశుమారణ, మాసురకృత్యంబు; ధర్మమగునే తండ్రీ!
161
శా. ఉద్రేకంబున రారు శస్త్రధరులై, యుద్ధావనిన్‌ లేరు, కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్‌
భద్రాకారులఁ బిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్‌
నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతు లెట్లాడెనో?
162
ఉ. అక్కట! పుత్త్ర శోక జనితాకుల భార విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్నభంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేఁ
డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో!
163
వ. అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె. 164
ఉ. ద్రోణునితో శిఖిం బడక ద్రోణకుటుంబిని యున్న దింట న
క్షీణతనూజశోకవివశీకృతనై విలపించుభంగి, నీ
ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో!
ప్రాణవియుక్తుఁడైన నతిపాపము; బ్రాహ్మణహింస మానరే!
165
క. భూపాలకులకు విప్రులఁ, గోపింపం జేయఁదగదు; కోపించినఁ ద
త్కోపానలంబు మొదలికి, భూపాలాటవులఁ గాల్చు భూకంపముగన్‌.
166
వ. అని యిట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్వ్యళీకంబును సమంజసంబును శ్లాఘ్యంబునుం గాఁబలుకు ద్రౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె. నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి; సమ్మతింపక భీముం డిట్లనియె. 167
చ. కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు బాలఘాతుకున్‌
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది; వీఁడు విప్రుఁడే?
విడువఁగ నేల? చంపుఁ; డిటు వీనిని మీరలు చంపరేని నా
పిడికిటిపోటునన్‌ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్‌.
168
వ. అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె; భీముని సంరంభంబు సూచి హరి చతుర్భుజుండయి రెండు చేతుల భీముని వారించి కడమ రెంటను ద్రుపదపుత్రికను దలంగించి నగుచు భీమున కిట్లనియె. 169
ఉ. అవ్యుఁడు గాఁడు వీఁడు శిశుహంత, దురాత్మకుఁ డాతతాయి హం
తవ్యుఁడు బ్రహ్మబంధుఁడగుఁ దప్పదు నిక్కము ‘బ్రాహ్మణో న హ
న్తవ్య’ యటంచు వేదవిదితం బగుఁ గావున ధర్మదృష్టిఁ గ
ర్తవ్యము వీనిఁ గాఁచుట యథాస్థితిఁ జూడుము పాండవోత్తమా!
170
వ. అని సరసాలాపంబు లాడి పవననందను నొడంబఱచి యర్జునుంజూచి ద్రౌపదికి నాకు భీమసేనునకు సమ్మతంబుగ మున్న నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపుసేయుమని, నారాయణుం డానతిచ్చిన నర్జునుండును నారాయణానుమతంబున. 171
శా. విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహావీరుండు ఘోరాసిచే
నశ్వత్థామ శిరోజముల్‌ దఱిఁగి చూడాంతర్మహారత్నమున్‌
శశ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాతబంధంబులన్‌
విశ్వాసంబున నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగముం బాసిపోన్‌.
172
క. నిబ్బరపు బాలహంతయు, గొబ్బునఁ దేజంబు మణియుఁ గోల్పడి నతుఁడై
ప్రబ్బిన వగచే విప్రుఁడు, సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిఁ జనియెన్‌.
173
ఆ. ధనము గొనుట యొండెఁ దల గొఱుగుట యొండె నాలయంబు వెడల నడచు టొండెఁ,
గాని చంపఁదగిన కర్మంబు సేసినఁ జంపఁదగదు విప్రజాతిఁ బతికి.
174
వ. ఇట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడల నడిచి, పాండవులు పాంచాలీ సహితులై పుత్త్రులకు శోకించి మృతులైన బంధువుల కెల్ల దహనాదికృత్యంబులు సేసి యుదక ప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందట నిడికొని గోవిందుండునుం దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరిపాద పద్మజాతపవిత్రంబులయిన భాగీరథీజలంబుల స్నాతులయి యున్న యెడం బుత్త్రశోకాతురు లయిన గాంధారీధృతరాష్ట్రులను, గుంతీద్రౌపదులను జూచి మాధవుండు మునీంద్రులుం దానును బంధుమరణశోకాతురు లయిన వారల వగపు మానిచి మన్నించె నివ్విధంబున. 175
శా. పాంచాలీ కబరీవికర్షణ మహాపాపక్షతాయుష్కులం
జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పించెన్‌ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ, గల్పించెన్‌ మహాఖ్యాతిఁ జే
యించెన్‌ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్‌.
176
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )