| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| వ. | అంత వాసుదేవుండు వ్యాస ప్రముఖభూసుర పూజితుండయి యుద్ధవ సాత్యకులు గొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం బాండవుల వీడ్కొని రథారోహణంబు సేయు సమయంబునం దత్తరపడుచు నుత్తర సనుదెంచి కల్యాణ గుణోత్తరుండైన హరి కిట్లనియె. | 177 |
| మ. |
ఇదె కాలానల తుల్య మైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చు చు న్నది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు నీ పదపద్మంబులె కాని యొం డెఱుఁగ నీ బాణాగ్ని వారింపవే! |
178 |
| క. |
దుర్భర బాణానలమున, గర్భములో నున్న శిశువు ఘన సంతాపా విర్భావంబును బొందెడి, నిర్భరకృపఁ గావుమయ్య నిఖిలస్తుత్యా! |
179 |
| క. |
చెల్లెలి కోడల, నీ మే, నల్లుఁడు శత్రువులచేత హతుఁ డయ్యెను, సం ఫుల్లారవిందలోచన!, భల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపఁగదే! |
180 |
| ఆ. |
గర్భమందుఁ గమల గర్భాండశతములు, నిముడుకొన వహించు నీశ్వరేశ! నీకు నొక్క మానినీగర్భరక్షణ, మెంత బరువు నిర్వహింతు గాక! |
181 |
| వ. | అనిన నాశ్రితవత్సలుండగు నప్పరమేశ్వరుండు సుభద్రకోడలి దీనాలాపంబు లాలించి, యిది ద్రోణనందనుండు లోక మంతయు నపాండవం బయ్యెడు మని యేసిన దివ్యాస్త్రంబని యెఱింగె; నంతఁ బాండవుల కభిముఖంబయి ద్రోణనందన దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబులు డగ్గఱిన బెగ్గడిలక వారును బ్రత్యస్త్రంబు లందికొని పెనంగు సమయంబున. | 182 |
| మ. |
తనసేవారతిచింత గాని పరచింతా లేశమున్ లేని స జ్జనులం బాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణ నం దను బ్రహ్మాస్త్రము నడ్డపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా ధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్. |
183 |
| మ. |
సకల ప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురుసంతానార్థియై యడ్డమై ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్. |
184 |
| వ. | ఇట్లు ద్రోణతనయుండేసిన ప్రతిక్రియారహితంబయిన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకం బయ్యె; నిజమాయా విలసనమున సకలలోక సర్గస్థితి సంహారంబు లాచరించు నట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు; తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాలీ సహితయై గొంతి, గమనోన్ముఖుండయిన హరిం జేరవచ్చి యిట్లనియె. | 185 |