| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| వ. | అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయుకొఱకును సుభద్రకుఁ బ్రియంబు సేయుకొఱకును గజపురంబునం గొన్ని నెలలుండి, ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయం దలంచి ధర్మనందనునకుం గృతాభినందనుం డగుచు నతనిచే నాలింగితుండై యామంత్రణంబు వడసి కొందఱు దనకు నమస్కరించినం గౌఁగిలించికొని కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు ద్రౌపదియుఁ గుంతియు నుత్తరయు గాంధారియు ధృతరాష్ట్రుండును విదురుండును యుధిష్ఠిరుండును యుయుత్సుండును గృపాచార్యుండును నకులసహదేవులును వృకోదరుండును ధౌమ్యుండును సత్సంగంబువలన ముక్తదుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువనోపం డట్టి హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాపశయనాసన భోజనంబులవలన నిమిషమాత్రంబును హరికి నెడ లేని వారలైన పాండవులం గూడికొని హరి మరలవలయునని కోరుచు హరి చనిన మార్గంబు సూచుచు హరివిన్యస్త చిత్తులయి లోచనంబుల బాష్పంబు లొలుక నంత నిలువంబడి రయ్యవసరంబున. | 233 |
| సీ. |
కనకసౌధములపైఁ గౌరవకాంతలు గుసుమవర్షంబులు గోరి కురియ మౌక్తికదామ సమంచిత ధవళాతపత్రంబు విజయుండు పట్టుచుండ నుద్ధవ సాత్యకు లుత్సాహవంతులై రత్న భూషితచామరములు వీవ గగనాంతరాళంబు గప్పి కాహళభేరి పటహ శంఖాది శబ్దములు మొరయ |
|
| ఆ. |
సకలవిప్రజనులు సగుణనిర్గుణరూప, భద్రభాషణములు పలుకుచుండ భువన మోహనుండు పుండరీకాక్షుండు, పుణ్యరాశి హస్తిపురము వెడలె. |
234 |
| వ. | తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాదశిఖర భాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి, వర్గంబులై మార్గంబుల రెండు దెసలం గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం దొల్లిటం బ్రళయంబున గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబున నొంటి దీపించు పురాణపురుషుం డితండనువారును, జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యెట్లను వారును, జీవోపాధి భూతంబు లయిన సత్త్వాదిశక్తుల లయంబు జీవుల లయంబను వారును, గ్రమ్మఱ సృష్టికర్తయైన యప్పరమేశ్వరుండు నిజవీర్య ప్రేరితయై నిజాంశ భూతంబులైన జీవులకు మోహిని యగుచు సృష్టి సేయ నిశ్చయించి నామరూపంబులు లేని జీవులందు నామరూపంబులు గల్పించుకొఱకు, వర్తిల్లు స్వమాయ నంగీకరించు ననువారును, నిర్మలభక్తి సముత్కంఠావిశేషంబుల, నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహానుభావు నిజరూపంబు దర్శింతు రనువారును, యోగమార్గమునంగాని దర్శింపరాదను వారునునై మఱియును. | 235 |
| మ. |
రమణీ! దూరము వోయెఁ గృష్ణురథమున్; రా దింక వీక్షింప నీ కమలాక్షుం బొడగానలేని దినముల్ గల్పంబులై తోఁచు; గే హములం దుండఁగ నేల పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం దము రమ్మా, యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై. |
236 |
| మ. |
తరుణీ! యాదవరాజు గాఁడితఁడు; వేదవ్యక్తుఁడై యొక్కఁడై వరుసన్ లోకభవస్థితి ప్రళయముల్ వర్తింపఁగాఁ జేయు దు స్తర లీలారతుఁడైన యీశుఁ, డితనిన్ దర్శించితిం బుణ్య భా సుర నే నంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్. |
237 |
| క. |
తామసగుణు లగు రాజులు, భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స త్త్వామలతనుఁడై యీతఁడు, భామిని! వారల వధించుఁ బ్రతికల్పమునన్. |
238 |
| వ. | ఇదియునుంగాక | 239 |
| సీ. |
ఈ యుత్తమశ్లోకుఁ డెలమి జన్మింపంగ యాదవకుల మెల్ల ననఘ మయ్యె; నీ పుణ్యవర్తనుఁ డేప్రొద్దు నుండంగ మధురాపురము దొడ్డ మహిమఁ గనియె నీ పూరుష శ్రేష్ఠు నీక్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి యీ మహాబలశాలి యెఱిఁగి శిక్షింపంగ నిష్కంటకం బయ్యె నిఖిలభువన |
|
| తే. |
మీ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశర భల్ల జాల విభజ్యమాన వివశ మానసమై వల్లవీసమూహ మితని యధరామృతము గ్రోలు నెల్లప్రొద్దు. |
240 |
| ఉ. |
ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁగాఁ జేకొని వేడ్కఁ గాఁపురము సేయుచు నుండెడి రుక్మిణీ ముఖా నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా స్తోక విశేషతీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోఁచిరో! |
241 |
| వ. | అని యిట్లు నానా విధంబులుగాఁ బలుకు పురసుందరుల వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె; ధర్మజుండును హరికి రక్షకంబులై కొలిచి నడువం జతురంగ బలంబులం బంచిన దత్సేనాసమేతులై దనతోడి వియోగంబున కోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మరలించి కురుజాంగల పాంచాల దేశంబులు దాటి, శూరసేన యామున భూములం గడచి బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీరాభీరసైంధవ విషయంబు లతిక్రమించి, తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు నానర్త మండలంబు సొచ్చి పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుండయిన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చనిచని. | 242 |