| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| మ. |
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారకన్ గలహంసావృత హేమపద్మపరిఖా కాసారకన్ దోరణా వళి సంఛాదిత తారకన్ దరులతా వర్గానువేలోదయ త్ఫలపుష్పాంకుర కోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్. |
243 |
| వ. | ఇట్లు తన ప్రియపురంబు డగ్గఱి | 244 |
| మత్త. |
అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్ ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిలజంతు చై తన్యమున్ భువనైక మాన్యము దారుణధ్వని భీత రా జన్యమున్ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున్. |
245 |
| శా. |
శంఖారావము వీనులన్ విని జనుల్ స్వర్ణాంబర ద్రవ్యముల్ శంఖాతీతము కొంచు వచ్చిరి దిదృక్షాదర్పితోత్కంఠన ప్రేంఖద్భక్తులు వంశకాహళమహా భేరీగజాశ్వావళీ రింఖారావము లుల్లసిల్ల దనుజారిం జూడ నాసక్తులై. |
246 |
| క. |
బంధులుఁ బౌరులుఁ దెచ్చిన, గంధేభ హయాదులైన కానుకలు దయా సింధుఁడు గైకొనె నంబుజ, బంధుఁడు గొను దత్త దీప పంక్తులభంగిన్. |
247 |
| వ. | ఇట్లాత్మారాముండును బూర్ణకాముండునైన యప్పరమేశ్వరునికి నుపాయనంబు లిచ్చుచు నాగరులు వికసితముఖులయి గద్గద భాషణంబులతోడ డయ్యకుండ నడపునయ్యకు నెయ్యంపుఁ జూపుల నడ్డంబు లేని బిడ్డల చందంబున మ్రొక్కి యిట్లనిరి. | 248 |
| శా. |
నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో నాపాదింతు గదా, ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్. |
249 |
| క. |
ఉన్నారము సౌఖ్యంబున, విన్నారము నీ ప్రతాపవిక్రమకథలన్ మన్నారము ధనికులమై, కన్నారము తావకాంఘ్రి కమలములు హరీ! |
250 |
| క. |
ఆరాటము మది నెఱుఁగము, పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ జోరాటన మెగయదు నీ, దూరాటన మోర్వలేము తోయజనేత్రా! |
251 |
| ఉ. |
తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా తండ్రివి తల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ; వే తండ్రులు నీక్రియం బ్రజల ధన్యులఁ జేసిరి; వేల్పు లైన నో తండ్రి! భవన్ముఖాంబుజము ధన్యతఁ గానరు మా విధంబునన్. |
252 |
| క. |
చెచ్చెరఁ గరినగరికి నీ, విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ వెచ్చోటికి విచ్చేయక, మచ్చికతో నుండుమయ్య మా నగరమునన్. |
253 |
| ఆ. |
అంధకారవైరి యపరాద్రి కవ్వలం, జనిన నంధమయిన జగముభంగి నిన్నుఁ గానకున్న నీరజలోచన!, యంధతమసమతుల మగుదుమయ్య! |
254 |
| వ. | అని యిట్లు ప్రజలాడెడి భక్తియుక్త మధుర మంజులాలాపంబులు గర్ణకలాపంబులుగా నవధరించి, కరుణావలోకనంబులు వర్షించుచు హర్షించుచుఁ దనరాక విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జనభోజనశయనాది కృత్యంబు లొల్లక యుగ్రసేనాక్రూర వసుదేవ బలభద్ర ప్రద్యుమ్న సాంబ చారుధేష్ణ గద ప్రముఖ యదుకుంజరులు కుంజర తురగ రథారూఢులై దిక్కుంజరసన్నిభంబయిన యొక్క కుంజరంబు ముందట నిడుకొని, సూతమాగధ నట నర్తక వందిసందోహంబుల మంగళ భాషణంబులును, భూసురాశీర్వాద వేదఘోషణంబులును, వీణావేణు భేరీపటహశంఖ కాహళ ధ్వానంబులును, రథారూఢ విభూషణ భూషిత వారయువతీ గానంబులును, నసమానంబులై చెలంగ నెదురుకొని యథోచిత ప్రణామాభివాదన పరిరంభ కరస్పర్శన సంభాషణ మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు సేసి, వారలుం దానును భుజగేంద్ర పాలితంబైన భోగవతీనగరంబు చందంబున స్వ సమాన బల యదు భోజ దాశార్హ కుకు రాంధక వృష్ణివీరపాలితంబును, సకల కాల సంపద్యమానాంకుర పల్లవ కోరక కుట్మల కుసుమ ఫలమంజరీపుంజ భార వినమిత లతా పాదపరాజ విరాజితోద్యాన మహావనోపవనారామ భాసితంబును, వనాంతరాళ రసాల సాల శాఖాంకుర ఖాదనక్షుణ్ణకషాయ కంఠ కలకంఠ మిథునకోలాహల ఫల రసాస్వాద పరిపూర్ణ శారికా కీరకుల కలకల కహ్లార పుష్పమకరంద పాన పరవశ భృంగభృంగీకదంబ ఝంకారసరోవర కనకకమల మృదులకాండఖండ స్వీకారమత్త వరాటాయత్త కలహంసనివహ క్రేంకారసహితంబును, మహోన్నతసౌధజాల రంధ్ర నిర్గత కర్పూర ధూపధూమపటల సందర్శన సంజాత జలధర భ్రాంతి విభ్రాంత సముద్ధతపింఛ నర్తనప్రవర్తమాన మత్తమయూర కేకారవ మహితంబును, నానారూపతోరణధ్వజ వైజయంతికా నికాయ నిరుద్ధతారకాగ్రహప్రకాశంబును, ముక్తాఫల విరచిత రంగవల్లి కాలంకృత మందిరద్వార దేహళీవేదికా ప్రదేశంబును, ఘనసార గంధసార కస్తూరికా సంవాసిత వణిగ్గేహగేహళీ నికర కనకగళంతికా వికీర్యమాణ సలిలధారా సంసిక్తవిపణి మార్గంబును, బ్రతినివాస బహిరంగణ సమర్పిత రసాలదండ ఫలకుసుమ గంధాక్షత ధూపదీప రత్నాంబరాది వివిధోపహార వర్గంబును, బ్రవాళనీలమరకతవజ్ర వైడూర్య నిర్మిత గోపురాట్టాలకంబును, విభవనిర్జిత మహేంద్రనగరాలకంబును నైన పురవరంబుం బ్రవేశించి రాజమార్గంబున వచ్చు సమయంబున. | 255 |
| మత్త. |
కన్నులారఁగ నిత్యమున్ హరిఁ గాంచుచున్ మనువారల య్యు న్నవీన కుతూహలోత్సవయుక్తి నాగర కాంత ల త్యున్నతోన్నత హర్మ్యరేఖల నుండి చూచిరి నిక్కి చే సన్నలం దమలోనఁ దద్విభుసౌకుమార్యము సూపుచున్. |
256 |
| సీ. |
కలుముల నీనెడు కలకంఠి యెలనాఁగ వర్తించు నెవ్వాని వక్షమందు జనదృక్చకోరకసంఘంబునకు సుధా పానీయపాత్రమే భవ్యుముఖము సకలదిక్పాలక సమితికి నెవ్వాని బాహుదండంబులు పట్టుఁగొమ్మ లాశ్రితశ్రేణి కే యధిపుని పాదరాజీవ యుగ్మంబులు చేరుగడలు |
|
| ఆ. |
భువనమోహనుండు పురుషభూషణుఁ, డెవ్వఁ డట్టి కృష్ణుఁ డరిగె హర్మ్యశిఖర రాజమాన లగుచు రాజమార్గంబున, రాజముఖులు గుసుమరాజిఁ గురియ. |
257 |
| ఉ. |
జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళచ్ఛత్రంబుతోఁ జామరం బులతోఁ బుష్ప పిశంగచేలములతో భూషామణి స్ఫీతుఁడై నలినీబాంధవుతో శశిధ్వజముతో నక్షత్రసంఘంబుతో బలభిచ్చాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్. |
258 |
| వ. | ఇట్లరిగి తల్లిదండ్రుల నివాసంబు సొచ్చి దేవకీ ప్రముఖులయిన తల్లుల కేడ్వురకు మ్రొక్కిన. | 259 |
| క. |
బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు, జడ్డన నంకముల నునిచి చన్నుల తుదిఁ బా లొడ్డగిలఁ బ్రేమభరమున, జడ్డువడం దడిపి రక్షిజలముల ననఘా! |
260 |