| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| ఉ. |
పాండునృపాలనందనులు బాహుబలంబున ధార్తరాష్ట్రులన్ భండనభూమిలో గెలిచి పాండురశారదచంద్రచంద్రికా ఖండయశఃప్రసూనకలికావళిఁ గౌరవరాజ్యలక్ష్మి నొం డొండ యలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండఁగన్. |
3 |
| క. |
మనుజేంద్ర! విదురుఁ డంతకు, మును వనమున కేఁగి యచట మునిజనగేయున్ వినుతతపోధౌరేయున్, ఘను ననుపమగుణవిధేయుఁగనె మైత్రేయున్. |
4 |
| క. |
కనుఁగొని తత్పాదంబులు, దన ఫాలము సోక మ్రొక్కి తగ నిట్లనియెన్ మునివర! సకల జగత్పా, వన చరితుఁడు గృష్ణుఁ డఖిలవంద్యుండెలమిన్. |
5 |
| క. |
మండిత తేజోనిధి యై, పాండవ హితమతిని దూతభావంబున వే దండపురి కేగి కురుకుల, మండనుఁడగు ధార్తరాష్ట్రు మందిరమునకున్. |
6 |
| తే. |
చనఁగ నొల్లక మద్గృహంబునకు భక్త, వత్సలుండగు కృష్ణుండు వచ్చుటేమి కతము? నాకది యెఱిఁగింపు కరుణతోడ, ననుచు విదురుండు మైత్రేయు నడిగె ననిన. |
7 |
| క. |
విని వెఱఁగంది పరీక్షి, న్మనుజవరేణ్యుండు విమలమతి నిస్తంద్రున్ మునికుల జలనిధి చంద్రున్, సునిశిత హరిభక్తిసాంద్రు శుకయోగీంద్రున్. |
8 |
| క. |
కని యిట్లనె మైత్రేయుని, ననఘుండగు విదురుఁ డేరహస్యము లడిగెన్? ముని యేమి చెప్పె? నే పగి, దిని దీర్థము లాడె? నెచటఁ దిరుగుచు నుండెన్? |
9 |
| తే. |
ఇన్ని దెలియంగ నానతి యిచ్చి నన్ను, నర్థి రక్షింపవే విమలాంతరంగ! ఘన దయాపాంగ! హరిపాద కమలభృంగ!, మహిత గుణసంగ! పాపతమఃపతంగ! |
10 |
| చ. |
అనవుడు బాదరాయణి ధరాధిపుతో ననుఁ బూరువంశ వ ర్ధన! విను కష్టుఁడైన ధృతరాష్ట్రనృపాలుఁడు పెంపుతో సుయో ధన ముఖ పుత్రులం గడు ముదంబునఁ బెంపుచుఁ బాండురాజు ద ప్పిన పిదపన్ దదాత్మజులు పెల్కుఱి తన్నని చేర వచ్చినన్. |
11 |
| వ. | ఇట్లు వచ్చిన పాండవులయెడ నసూయానిమగ్నులై సుయోధనాదులు | 12 |
| క. |
పెట్టిరి విషాన్న, మంటం, గట్టిరి ఘనపాశములను, గంగానదిలో నెట్టిరి, రాజ్యము వెడలం, గొట్టిరి, ధర్మంబు విడిచి కుటిలాత్మకులై. |
13 |
| క. |
క్రూరాత్ములగుచు లాక్షా, గారంబున వారు నిద్ర గైకొని యుండన్ దారుణశిఖి దరికొలిపిరి, మారణకర్మముల కప్రమత్తులు నగుచున్. |
14 |
| తే. |
సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ, విలస దవభృథస్నాన పవిత్రమైన ద్రౌపదీచారువేణీభరంబు వట్టి, కొలువులోపల నీడ్చిరి కుత్సితమున. |
15 |
| క. |
కావున వారల కపకృతిఁ, గావింపని దొక దినంబు గలుగదు, తమ జ న్మావధి నిజనందనులను, వావిరి న య్యంధనృపతి వలదనఁడయ్యెన్. |
16 |
| తే. |
మాయజూదంబు వన్ని దుర్మార్గవృత్తిఁ, బుడమిఁగొని యడవులకుఁబోనడువ నచటఁ దిరిగి వారలు సమయంబు దీర్చి యేఁగు, దెంచి తమ యంశ మడిగినఁ బంచి యిడక. |
17 |
| వ. | ఉన్న యెడ. | 18 |
| చ. |
సకలనియంతయైన హరి సర్వశరణ్యుఁడు మాధవుండు సే వక నవకల్పకంబు భగవంతుఁ డనంతుఁ డనంతశక్తి నం దకధరుఁ డబ్జలోచనుఁడు ధర్మతనూభవుచే నియుక్తుఁడై యకుటిల భక్తియోగమహితాత్మకుఁడై ధృతరాష్ట్రుపాలికిన్. |
19 |
| క. |
చని యచట భీష్మ గురు త, త్తనయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్ విని యనుమోదింపఁగ ని, ట్లనియెన్ ధృతరాష్ట్రుతోడ నవనీనాథా! |
20 |
| క. |
కౌరవపాండవు లిరువురు, నారయ నీ కొక్క రూప యవనీవర! నీ వే రీతి నైనఁబాండు కు, మారుల పాలొసఁగితేని మను నుభయంబున్. |
21 |
| క. |
అని ధర్మబోధమునఁ బలి, కిన మాటలు చెవుల నిడమిఁగృష్ణుడు విదురున్ ఘన నీతిమంతుఁబిలువం, బనిచినఁ జనుదెంచెఁగురుసభాస్థలమునకున్. |
22 |
| వ. | చనుదెంచి యచటి జనంబులచేత నుపస్థితంబైన కార్యంబు దెలుపఁబడినవాఁడై ధృతరాష్ట్రు నుద్దేశించి యిట్లనియె. | 23 |
| మ. |
ధరణీనాయక! పాండుభూవిభుఁడు నీ తమ్ముండు; దత్పుత్త్రులన్ బరిరక్షించిన ధర్మముందగవునుంబాటిల్లు; వంశంబు సు స్థిర సౌఖ్యోన్నతిఁ జెందు; శత్రుజయమున్ జేకూరు; గోపాల శే ఖరు చిత్తంబును వచ్చు నట్లగుటయౌఁ గౌరవ్యవంశాగ్రణీ! |
24 |
| ఆ. |
వారి తండ్రి పాలు వారికి నొసఁగి నీ, పాలు సుతుల కెల్లఁబంచి యిచ్చి చలము విడిచి ధర్మమలవడ నీ బుద్ధిఁ, జొనుపవయ్య! కులము మనుపవయ్య! |
25 |
| చ. |
వినుము నృపాల! నా పలుకు, వేయును నేల సమీరసూతి నీ తనయుల పేరు విన్నఁ బదతాడిత దుష్టభుజంగమంబు చా డ్పునఁ గనలొందు నింతయును మున్నునుఁ జెప్పితిఁగాదె వాని చే తన భవదీయపుత్త్రులకుఁదప్పదు మృత్యు వదెన్ని భంగులన్. |
26 |
| వ. | అదియునుంగాక | 27 |
| క. |
నీ పుత్త్రుల శౌర్యంబును, చాపాచార్యాపగాత్మజాత కృపభుజా టోపంబును గర్ణు దురా, లాపంబును నిజముగాఁదలంతె మనమునన్. |
28 |
| వ. | అట్లేని వినుము. | 29 |
| ఉ. |
ఏ పరమేశుచే జగము లీ సచరాచరకోటితో సము ద్దీపిత మయ్యె; నే విభుని దివ్యకళాంశజు లబ్జగర్భ గౌ రీపతి ముఖ్యదేవ ముని బృందము; లెవ్వఁ డనంతుఁ డచ్యుతుం డా పురుషోత్తముండు కరుణాంబుధి గృష్ణుఁడు వో నరేశ్వరా! |
30 |
| ఉ. |
అట్టి జగన్నివాసుఁడు మురాసురభేది పరాపరుండు చే పట్టి సఖుండు వియ్యమును బాంధవుఁడున్ గురుఁడున్ విభుండునై యిట్టల మైన ప్రేమమున నెప్పుడుఁ దోడ్పడుచుండు వారలన్ జుట్టనవ్రేల నెవ్వరికిఁ జూపఁగ వచ్చును బార్థివోత్తమా! |
31 |
| ఉ. |
కావునఁ బాండునందనులఁ గాఱియపెట్టక రాజ్యభాగమున్ వావిరి నిచ్చి రాజ్యమును వంశముఁ బుత్త్రుల బంధువర్గమున్ గావుము; కాక లోభియగు కష్టసుయోధను మాట వింటివే భూవర! నీ యుపేక్ష నగుఁబో కులనాశము బంధునాశమున్. |
32 |
| తే. |
ఒకనికై యిట్లు కుల మెల్ల నుక్కడంప, నెత్తుకొనఁజూచె దిది నీతియే నృపాల! వినుము నా మాట; నీ సుయోధనుని విడిచి, కులము రాజ్యంబుఁదేజంబు నిలుపవయ్య! |
33 |
| క. |
అని యిట్లు దఱిమి చెప్పిన, విని దుర్యోధనుఁడు రోషవివశుండై తా నినతనయ శకుని దుశ్శా, సనుల నిరీక్షించి తామసంబునఁ బలికెన్. |
34 |
| క. |
దాసీపుత్త్రుని మీర లు, దాసీనుంజేయ కిటకుఁదగునె పిలువఁగా? నాసీనుండై ప్రేలెడు, గాసిలి చెడిపోవ వెడలఁగా నడువుఁడిఁకన్. |
35 |
| వ. | అని యిట్లు దుర్యోధనుం డాడిన దురాలాపంబులు దనకు మనస్తాపంబుసేయం గార్యంబు విచారించి ధైర్యం బవలంబించి యొండు పలుక నొల్లక శరశరాసనంబులు విడిచి క్రోధంబు నడఁచి వనంబునకు జని యందు. | 36 |
| సీ. |
విష్ణుస్వయంవ్యక్త విమలభూములను బవిత్రంబులగు హరిక్షేత్రములను నెలకొని దేవతానిర్మితహరిదివ్యభూముల గంగాదిపుణ్యనదుల సిద్ధపురాణప్రసిద్ధ పుణ్యాశ్రమ స్థలముల నుపవనస్థలములందు గంధమాదనముఖక్ష్మాభృత్తటంబుల మంజులగిరికుంజపుంజములను |
|
| తే. |
వికచకైరవ పద్మ హల్లక మరంద, పాన పరవశ మధుకర గాన బుద్ధ రాజహంస విలాస విరాజమాన, మగుచుఁ జెలువొందు పంకేరుహాకరముల. |
37 |
| క. |
మఱియును ఋష్యాశ్రమ వన, సరి దుపవన నద పుళింద జనపద గిరి గ హ్వర గోష్ఠ యజ్ఞశాలా, పుర దేవాయతన పుణ్యభూములయందున్. |
38 |
| క. |
కూరలుఁ గాయలు నీ ళ్ళా, హారముగాఁ గొనుచు నియమ మలవడఁగ నసం స్కార శరీరుం డగుచు ను, దారత నవధూతవేషధరుఁడై వరుసన్. |
39 |
| క. |
హర్షము గదురఁగ భారత, వర్షమునంగలుగు పుణ్యవరతీర్థము లు త్కర్షంజూచుచు విగతా, మర్షుండై సంచరించె మనుజవరేణ్యా! |
40 |
| వ. | ఇట్లు సంచరించుచుఁ బ్రభాసతీర్థమ్మునకు వచ్చునపుడు | 41 |
| చ. |
అరుగుచు దైత్యభేదన దయాపరిలబ్ధ సమస్త మేదినీ భరణధురంధరుండగుచుఁబాండుసుతాగ్రజుఁడొప్పుచుండ న త్తఱి విదురుండుఁదత్సరిదుదంచిత సాల రసాల మాధవీ కురవక మాలతీ వకుళ కుంజ లసత్తటమందు నున్నెడన్. |
42 |
| చ. |
నరవర! వేణుజానలవినష్ట మహాటవిమాడ్కిఁ బాండు భూ వర! ధృతరాష్ట్ర సూను లనివార్య నిరూఢ విరోధ మెత్తి యొం డొరుల జయింపఁగోరి కదనోర్విఁగురుక్షితిపాలముఖ్యు లం దఱు మృతు లౌటయున్ విని ఘనంబుగ శోకనిమగ్నచిత్తుఁడై. |
43 |
| ఉ. |
ఆ యెడఁ గాలు దన్నక రయంబున నేఁగి సరస్వతీనదీ తోయములందుఁగ్రుంకి మునితుల్యుఁడు వే చనియెం దనూనపా త్తోయరుహాప్తభార్గవ పృథుత్రిత సోమ సుదాస శక్తి భృ ద్వాయు యమాభిధానయుత వాహినులందనురక్తిఁగ్రుంకుచున్. |
44 |
| ఉ. |
వెండియుఁ బుణ్యభూములఁ బవిత్రసరిత్తులఁ జూచుచున్ రమా మండనుఁడుండు దివ్యరుచిమన్మణి చారుకవాట గేహళీ మండిత సౌధగోపుర విమానము లున్నతభక్తిఁ జూచుచున్ నిండిన వేడ్కఁ గృష్ణపద నీరజచింతనుఁడై క్రమంబునన్. |
45 |