పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
విదురుం డుద్ధవుంగని కృష్ణాదుల వృత్తాంతం బడుగుట
చ. చని చని తొంటి మత్స్య కురుజాంగలభూము లతిక్రమించి చ
య్యన యమునానదింగదిసి యచ్చట భాగవతున్‌ సరోజ లో
చన దృఢభక్తు సద్గుణవిశారదు శాంతుని దేవమంత్రి శి
ష్యుని మహితప్రసిద్ధుఁ బరిశోషితదోషుఁ బ్రబుద్ధు నుద్ధవున్‌.
46
క. కని యనురాగవికాసము, దన మనమునఁ దొంగలింపఁ దగ గాఢాలిం
గన మాచరించి నెయ్యం, బునఁ గుశలప్రశ్న సేసి ముదమునఁ బలికెన్‌.
47
క. హరిభక్తులు పుణ్యాత్ములు, దురితవిదూరులు విరోధిదుర్దమబలులుం
గురుకులతిలకులు గుంతీ, వరసూనులు గుశలులే యవారితభక్తిన్‌.
48
చ. హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ
శ్వరుఁ డతిభక్తి వేఁడ యదువంశమునన్‌ బలకృష్ణమూర్తులై
పరఁగ జనించి భూభరముఁబాపిన భవ్యులు రేవతీందిరా
వరు లట శూరసేనుని నివాసమునన్‌ సుఖ మున్నవారలే?
49
చ. కురుకులు లాదరింపఁగ సఖుండును నాప్తుఁడునై తనర్చి సో
దర తరుణీజనంబులను దత్పతులంగడు గారవంబునం
గరుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతిఁ బ్రోచువాఁడు సు
స్థిరమతి నున్నవాఁడె వసుదేవుఁడు వృష్ణికులప్రదీపకా!
50
శా. కందర్పాంశమునం దనూజుఁబడయంగామించి భూదేవతా
బృందంబున్‌ భజియించి తత్కరుణ దీపింపం బ్రభావంబు పెం
పొందన్‌ రుక్మిణి గన్న నందనుఁడు ప్రద్యుమ్నుండు భాస్వచ్చమూ
సందోహంబులు దన్నుఁగొల్వ మహితోత్సాహంబునన్‌ మించునే.
51
క. సరసిజలోచను కరుణా, పరిలబ్ధ సమస్త ధరణిపాలన మహిమం
బరమప్రీతి సుఖించునె, చిరవిభవోదారుఁడుగ్రసేనుఁడు జగతిన్‌.
52
చ. లలిత పతివ్రతామణి విలాసవతీ తిలకంబు పార్వతీ
లలన గుమారుఁగన్నటు సులక్షణ జాంబవతీలలామ ని
ర్మలగతిఁగన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో
త్కలిక సుఖించునే గుణకదంబుఁడు సాంబుడు వృష్ణిపుంగవా!
53
క. హరిపదసేవకుఁ డరి భీ, కరుఁ డర్జునువలన మిగులఁగార్ముకవిద్యల్‌
దిరముగఁగఱచిన సాత్యకి, వరసుఖవిభవముల నున్నవాఁడె ధరిత్రిన్‌?
54
మ. జలజాతాంకుశ చక్ర చాప కులిశ చ్ఛత్రాది రేఖాంకితో
జ్జ్వల గోవింద పదాబ్జ లక్షిత విరాజన్మార్గ ధూళిచ్ఛటా
కలితాంగుండు విధూతకల్మషుఁడు నిష్కామైకధర్ముండు స
త్కులజాతుండన నొప్పునట్టి ఘనుఁడక్రూరుండు భద్రాత్ముఁడే?
55
క. శ్రుతులును గ్రతుజాతము స, మ్మతిఁ దాల్చినయట్టి వేదమాతగతిన్‌ శ్రీ
పతిఁ దన గర్భమ్మున ర, క్షితుఁ జేసిన గరిత దేవకీసతి సుఖమే.
56
వ. మఱియు మహాత్మా! మహితోపాసకులగువారల కోర్కులు నిండింపంజాలిన భగవంతుండును, శబ్దశాస్త్రంబునకుం గారణంబని తన్ను నఖిలదేవతాజనంబు లగ్గింప గల మేటి యగుటంజేసి మనోమయుండును, సకలజీవ చతుర్విధాంతఃకరణంబులయిన చిత్తాహంకారబుద్ధిమనంబులకుం గ్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యు మ్నానిరుద్ధు లధిదైవతంబు లగుదు రట్టి చతుర్విధ తత్త్వంబులకుఁ దుర్యంబైన తత్త్వంబునునైన యనిరుద్ధకుమారుండు సంతోషచిత్తుం డగునే యని. 57
మ. ఇతరారాధన మాని కృష్ణుఁగమలాధీశుం బయోజాసనా
ర్చితు భక్తిన్‌ నిజనాథుఁగా సతతమున్‌ సేవించు పుణ్యుల్‌ జగ
న్నుతు లధ్యాత్మవిదుల్‌ మహాభుజులు మాన్యుల్‌ ధర్మమార్గుల్‌ సము
న్నతి సత్యాత్మజచారుధేష్ణగదు లానందాత్ములే యుద్ధవా!
58
తే. క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు, వొలుచు నెవ్వనిసభఁ జూచి కలుష మొదవి
మనములోన నసూయానిమగ్నుఁ డయ్యె, నట్టి ధర్మజుఁ డున్నాఁడె యనఘచరిత!
59
తే. ఘనగదాభ్యాస చిత్రసంగతుల మెఱసి, కురుకుమారుల భూరిసంగరములోన
హతులఁ గావించి వెలసినయట్టి జెట్టి, వాయుతనయుండు గుశలియై వఱలునయ్య!
60
చ. హరికరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య వి
స్ఫురణఁదనర్చి తన్ను నని బోయగతిన్‌ గిరిశుం డెదిర్చినన్‌
బరవస మొప్పఁగా గెలిచి పాశుపతాస్త్రముఁగొన్న శత్రు భీ
కరుఁడు ధనంజయుండు సుభగస్థితి మోదము నొందుచుండునే?
61
మ. తెఱఁగొప్పన్‌ జననీవియోగమునఁ గుంతీస్తన్యపానంబు సో
దర సంరక్షయుఁగల్గి దేవవిభు వక్త్రస్థామృతంబుం ఖగే
శ్వరుఁ డర్థిం గయికొన్నమాడ్కిఁ గురువంశశ్రేణి నిర్జించి త
ద్ధరణీరాజ్యముఁగొన్న మాద్రికొడుకుల్‌ ధన్యాత్ములే? యుద్ధవా!
62
తే. పాండుభూమీశ్వరుండు సంప్రాప్తమరణుఁ, డైన శిశువులఁబ్రోచుటకై నిజేశుఁ
గూడి చనకున్న యట్టి యా కుంతిభోజ, తనయ జీవించునే నేఁడు? మనుచరిత్ర!
63
వ. అని వెండియు. 64
మ. అనుజాతుండగు పాండుభూవిభుఁడు నిర్యాణంబునంబొంద నా
తని పుత్త్రుల్‌ దనుఁజేర వచ్చినను మాధ్యస్థంబుఁబోఁదట్టి యె
గ్గొనరించెన్‌ ధృతరాష్ట్ర భూమివిభుఁ డట్లూహింపఁగా నెగ్గు సే
సిన వాఁడే యగుఁగాక మేలు గలదే చింతింపఁగా నుద్ధవా!
65
క. అనుజుఁడు వీఁ డనకయ తన, తనయులు నను వెడల నడువఁదా నూరక యుం
డిన ధృతరాష్ట్రుఁడు నరకం, బునఁ బడు నాదైన దుఃఖమున ననఘాత్మా!
66
వ. అదియునుంగాక పరమశాంతుండ వైన నీ మనంబున దుఃఖంబు గర్తవ్యంబు గాదంటేని. 67
క. నరలోకవిడంబనమున, హరి పరమపరుండు మానవాకృతితో ని
ద్ధరఁబుట్టి యాత్మమాయా, స్ఫురణన్‌ మోహింపఁజేయు భూజనకోటిన్‌.
68
ఉ. కావున న మ్మహాత్ముని వికారవిదూరుని సర్వమోహ మా
యావిల మానసుండనగునప్పుడు సంసృతిదుఃఖి నౌదు న
ద్దేవుని సత్కృపామహిమఁ దేలిన వేళ సుఖింతు నేన కా
దా విధి శంకరప్రభృతు లవ్విభుమాయఁ దరింప నేర్తురే?
69
వ. అయిన నమ్మహాత్ముని కరుణాతరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞానదీపాంకుర నిరస్త సమస్త దోషాంధకారుండనగుటంజేసి మదీయచిత్తంబు హరిపదాయత్తంబయిన కారణంబునను దత్త్వంబు సతతంబు నిరీక్షించుచు నుండుదు; మఱియును. 70
సీ. అట్టి సరోజాక్షుఁ డాత్మీయ పదభక్తు లడవుల నిడుమలఁ గుడుచుచుండ
దౌత్యంబుసేయఁ గొందఱు విరోధులు పట్టి బద్ధునిఁజేయ సన్నద్ధులైన
బలహీనుమాడ్కి మార్పడలేఁడ యసమర్థుఁడని తలంచెదవేని నచ్యుతుండు
పరుల జయింప నోపక కాదు విద్యాభిజన ధనమత్తులై జగతిఁ బెక్కు
 
తే. బాధల నలంచు దుష్టభూపతుల నెల్ల, సైన్య యుక్తంబుగా నని సంహరించు
కొఱకు సభలోన నప్పు డా కురుకుమారు, లాడు దుర్భాషణములకు నలుగఁడయ్యె.
71
మ. జననంబందుట లేని యీశ్వరుఁడు దా జన్మించు టెల్లన్‌ విరో
ధి నిరాసార్థము; వీతకర్ముఁడగు న ద్దేవుండు గర్మప్రవ
ర్తనుఁడౌటెల్లఁ జరాచర ప్రకట భూత శ్రేణులం గర్మ వ
ర్తనులంజేయఁదలంచికాక కలవే దైత్యారికింగర్మముల్‌.
72
క. హరి నరుల కెల్లఁబూజ్యుఁడు, హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడునై
పరఁగిన భవకర్మంబులఁ, బొరయండఁట; హరికిఁగర్మములు లీల లగున్‌.
73
క. మదిఁదన శాసన మిడి నిజ, పదములు సేవించు లోకపాలాదుల పెం
పొదవింప యదుకులంబున, నుదయించెను భువిని బలసహోదరుఁ డగుచున్‌.
74
తే. చలన మందక భూరి సంసరణ తరణ, మైన సత్కీర్తి దిక్కుల నతిశయిల్లి
వఱల సమమతియై యున్నవాఁడె కృష్ణుఁ, డనుచు నుద్ధవుని విదురుఁడడుగుటయును.
75
వ. అట్టి యెడ నయ్యుద్ధవుండు. 76
క. యదుకులనిధి యగు కృష్ణుని, పదజలజ వియోగతాపభరమున మాటల్‌
ప్రిదులక హృదయం బెరియఁగఁ, బెదవులు దడుపుచును వగలఁ బెంపఱియుండెన్‌.
77
క. అని చెప్పి బాదరాయణి, మనుజేంద్రుని వలను సూచి మఱి యిట్లనియెన్‌
విను మొకనాఁ డీ యుద్ధవుఁ, డనయము నైదేండ్ల బాలుఁడై యున్న తఱిన్‌.
78
వ. మున్ను కృష్ణునిం గూడి యాడు బాలకులలో నొక్క బాలునిఁ గృష్ణునింగా భావించి పరిచర్య సేయుచుండ గుణవతీమతల్లియగు తల్లి సనుదెంచి “యాఁకొంటి; విదియేల రావన్న” యని పిలిచిన జననీ వాక్యంబులు గైకొనక యఖండతేజోనిధియైన పుండరీకాక్షు పాదారవింద మకరంద సేవానురక్తిం జేసి యున్న యుద్ధవుండు నేఁడు కృష్ణ వియోగతాపంబున హరివార్త విదురునకుఁ జెప్పజాలక యొప్పఱి యుండుట యేమి చిత్రంబని వెండియు నిట్లనియె; నంత నుద్ధవుండు సరోజాక్ష పాదారవింద మకరంద సుధాజలనిధి నిమగ్న మానసుండై సముత్కంఠం జింతించి యొక్క ముహూర్తమాత్రంబునకు బాష్పజల పూరితలోచనుండై గద్గదకంఠుండగుచు. 79
క. ఘనముగ నెమ్మనమున మిం, చిన కృష్ణవియోగ జనిత శిఖి దరికొనఁగాఁ
గనుఁగవఁ బెడచే నొత్తుచుఁ, బెనుపొందిన దురితశిఖరిభిదురున్‌ విదురున్‌.
80
వ. కనుంగొని యిట్లనియె. 81
క. యముఁడను ఘనకాలభుజం, గమ పుంగవుఁడెగచి పట్టఁగా యదువంశో
త్తముల చరిత్రలుఁ దత్కుశ, లము లేమని చెప్పుదుంగలంగెడి మనమున్‌.
82
సీ. మునిజనముఖపద్మములు ముకుళింపంగ ఖలజనలోచనోత్పలము లలర
జారచోరుల కోర్కి సఫలత నొందంగ దానవదర్పాంధతమస మడర
వరయోగి జనచక్రవాకంబు లడలంగఁ గలుషజనానురాగంబు పర్వ
భూరిదోషానలస్ఫూర్తి వాటిల్లంగ నుదితధర్మక్రియ లుడిగి యడఁగ
 
తే. మానుషాకారరుచికోటి మందపఱిచి, యనఘ! యే మన నేర్తుఁ గృష్ణాభిధాన
లోకబాంధవుఁ డుత్తమశ్లోకమూర్తి, మించు తేజంబుతో నస్తమించెనయ్య!
83
వ. మఱియును. 84
క. హల కులిశ జలజరేఖా, లలిత శ్రీకృష్ణ పాదలక్షితయై ని
ర్మలగతి నొప్పెడు ధరణీ, లలనామణి నేఁ డభాగ్యలక్షణ యయ్యెన్‌.
85
క. యాదవులవలన రాజ్య, శ్రీ దొలఁగెను; ధర్మగతి నశించెను; భువి మ
ర్యాదలు దప్పె నధర్మో, త్పాదనమున; దైత్యభేది దప్పిన పిదపన్‌.
86
వ. మఱియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరణ సుషమా విశేష విడంబిత విమల సలిలం బులందుఁ బ్రతిఫలిత సంపూర్ణ చంద్రమండల రుచి నిరీక్షించి జలచర బుద్ధిం జేసి తజ్జల విలోలమీనంబు లనూన స్నేహంబునం దలంచు చందంబునఁ గృష్ణానుచరులైన యదు వృష్ణికుమారు లమ్మహనీయ మూర్తిం దమకు నగ్రేసరుండని కాని లీలామానుష విగ్రహుండైన పరమాత్ముండని యెఱుంగక హరిమాయా జనితంబగు నసద్భావంబునంజేసి భోజనశయనాసనానుగమనంబులం జేరి సహోదరాదిభావంబులం గూడి చరియింతు; రద్దేవుని మాయా పయోనిధి నిమగ్నులు గాకుండ నబ్జభవాదులకైనం దీఱదు. సర్వగుణ గరిష్ఠులును, సత్పురుషశ్రేష్ఠులును నగు పరమభాగవతులకుం దక్కఁ దక్కినవారలకుం జెప్పనేల? అదియునుంగాక యభిజన విద్యాధన బలగర్వ మదాంధీభూత చేతస్కులైన శిశుపాలాది భూపాలకు లమ్మహాత్మునిం బరతత్త్వంబని యెఱుంగక నిందించు దుర్భాషలు దలంచి మనస్తాపంబు నొందుచుండుదు నని వెండియు. 87
మ. అవితృప్తేక్షణ ధీసమాహిత తపోవ్యాసంగు లైనట్టి భా
గవతశ్రేష్ఠుల కాత్మమూర్తి నిఖిలైక జ్యోతిమైఁ జూపి శో
క విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మా
నవరూపంబగు దేహమున్‌ వదలి యంతర్ధానుఁడయ్యెంజుమీ.
88
సీ. మానవైకవికాసమానమై తనకును విస్మయజనకమై వెలయునట్టి
యాత్మీయ యోగమాయాశక్తిఁ జేపట్టి చూపుచు నత్యంతసుభగ మగుచు
భూషణంబులకును భూషణంబై వివేకముల కెల్లను బరాకాష్ఠ యగుచు
సకలకల్యాణసంస్థానమై సత్యమై తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి
 
తే. తాన తనమూర్తి నిజశక్తిఁ దగ ధరింప, యమతనూభవు రాజసూయాధ్వరంబు
నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ, నిండు వేడుకఁ జూచి వర్ణించి రెలమి.
89
క. ప్రకటముగఁ గమలభవ సృ, ష్టికిఁ గారణ మి మ్మహాత్ముఁడే యనుచును ను
త్సుకులై తన్మూర్తినిఁ ద, ప్పక చూచిరి గాదె తత్సభాజను లెల్లన్‌.
90
వ. మఱియు శాంతోగ్రరూపధరుండైన సర్వేశ్వరుండు శాంతరూపుండు గావునఁ బరకృతాపరాధ నిపీడ్యమాన మానసుండయ్యు ననుకంపాయత్తచిత్తుండై వర్తించు పరాపరుండును బ్రకృతికార్యం బైన మహత్త్త్వరూపుండును జననవిరహితుం డయ్యును దారువులవలన ననలంబు దోఁచు చందంబున జననంబు నందుచుండు నట్టి సరోజనాభుని హాసరాస లీలానురాగ విలోకన ప్రతిలబ్ధమానలైన గోపకామినులు తన్మూర్తి దర్శనానుషక్తమనీషలంగలిగి వర్తించి రదియునుంగాక. 91
చ. దివిజుల కోర్కిఁ దీర్ప వసుదేవుని యింట జనించి కంస దా
నవుఁడు వధించునన్‌ భయమునం జని నందుని యింట నుంటకున్‌
యవన జరాసుతాదులకు నాజి నెదుర్పడలేక సజ్జన
స్తవ మథురాపురిన్‌ విడిచి దాఁగుటకున్‌ మదిఁజింతనొందుదున్‌.
92
వ. అదియునుంగాక. 93
సీ. కడఁగి పెక్కిడుమలఁగుడుచుచుఁ జిత్తముల్‌ గలఁగఁగ బంధనాగారములను
వనరిన దేవకీవసుదేవులను డాయఁజనుదెంచి భక్తి వందన మొనర్చి
తలిదండ్రులార! యేఁగలుగంగ మీరలు కంసుని నలజడి గ్రాఁగుచుండఁ
గడఁగి శత్రునిఁజంపఁగా లేక చూచుచు నున్న నా తప్పుఁ బ్రసన్ను లగుచుఁ
 
తే. గావుఁడని యానతిచ్చిన దేవదేవు, నద్భుతావహమధురవాక్యములఁ దలఁచి
తలఁచి నా చిత్తమునఁ బెద్ద గలఁగుచుందుఁ, బృథులపాతక భూమిభృద్భిదుర! విదుర!
94
క. విమలమతిఁదలఁప నెవ్వని, బొమముడి మాత్రమున నిఖిల భూదేవీ భా
రము వాయు నట్టి హరిపద, కమలమరందంబు గ్రోలు ఘనుఁడెవ్వాఁడో?
95
క. మందప్రజ్ఞుఁడనై గో, విందుని మురదైత్యహరుని విష్ణునిఁ బరమా
నందుని నందతనూజుని, మందరధరుఁ జిత్తమందు మఱతునె యెందున్‌.
96
చ. అదియునుగాక మీరు నృపులందఱుఁజూడఁగ ధర్మసూతి పెం
పొదవిన రాజసూయసవనోత్సవమందును జన్మమాదిగాఁ
బదపడి యెగ్గొనర్చు శిశుపాలుఁడు యోగిజనంబు లిట్టి ద
ట్టి దని యెఱుంగ నోపని కడిందిపదంబును బొందెనే కదా!
97
చ. కురునృప పాండునందను లకుంఠితకేళిఁజమూసమేతులై
యరిగి రణోర్వి నెవ్వని ముఖాంబురుహామృత మాత్మలోచనో
త్కరములఁగ్రోలి పార్థ విశిఖప్రకర క్షత పూతగాత్రులై
గురుతరమోక్షధామమునకుం జని సౌఖ్యము నొందిరో గదా!
98
సీ. అట్టి సరోజాక్షుఁడాద్యంత శూన్యుండు సుభగుండు త్రైలోక్యసుందరుండు
కమనీయసాగరకన్యకా కుచకుంకుమాంకిత విపులబాహాంతరుండు
సకలదిక్పాలభాస్వత్కిరీటన్యస్తపద్మరాగారుణ పాదపీఠుఁ
డజుఁ డనంతుఁడు సమానాధికవిరహితుం డిద్ధమూర్తిత్రయాధీశ్వరుండు
 
తే. నైన హరి యుగ్రసేనుని నఖిలరాజ్య, రుచిరసింహాసనమునఁగూర్చుండఁబెట్టి
భృత్యభావంబు నొంది సంప్రీతి నతని, పనుపుసేయుట కెపుడు నా మనము గుందు.
99
వ. అని వెండియు నిట్లనియె, ‘ననఘా! పరాత్పరుండును యోగీశ్వరేశ్వరుండును నగు కృష్ణుండు భగవద్భక్తుండును బరమభాగవతోత్తముండును నైన యుగ్రసేనుని సేవించుట యాశ్చర్యంబు కాదు; తన్ను హరియింపఁదలంచి కుచంబుల విషంబు ధరియించి స్తన్యపానంబు సేయించిన దుష్టచేతన యైన పూతనకుం జన్నిచ్చి పెంచిన యశోదాదేవికి నైన నందరాని పదంబు గారుణ్యాయత్తచిత్తుండై యొసంగె’ ననిన ‘నిజపద ధ్యానపరాయణులగువారల ననుసరించి సేవించుట సెప్పనేల? యనిన నుద్ధవునికి విదురుం డిట్లనియె; భక్తవత్సలుండును గారుణ్యజలనిధియునై భాగవతజనుల ననుగ్రహించు పుండరీకాక్షుండు నిజదాస లోకంబున కొసంగు పరమపదంబు నుగ్రకర్ములైన రాక్షసుల కెట్లొసంగె న త్తెఱం గెఱింగింపు’ మనిన విదురునకు నుద్ధవుం డిట్లనియె. 100
మ. దనుజానీక మనేకవారములు దోర్దర్పంబు సంధిల్లఁగా
వినతాసూను భుజావరోహుఁడగు నవ్విష్ణున్‌ సునాభాస్త్రుఁ దా
రనిలో మార్కొని పోకు పోకు హరి! దైత్యారాతి యంచుం దదా
ననముంజూచుచుఁగూలి మోక్షపదమున్‌ బ్రాపింతు రత్యున్నతిన్‌.
101
క. ధీరజనోత్తమ! నవ సిత, సారసలోచనుఁడు కృష్ణు జననంబును ద
చ్చారిత్రము నెఱిఁగింతు ను, దారత నీ విపుడు వినుము తద్విధ మెల్లన్‌.
102
చ. ధరణిభరంబుఁబాపుటకుఁదామరసాసను ప్రార్థనన్‌ రమా
వరుఁడల కంసబంధననివాసమునన్‌ వసుదేవదేవకీ
వరులకు నుద్భవింప బలవంతుఁడు కంసుఁడు హింస సేయు న
న్వెఱపున నర్ధరాత్రి సుతునింగొని య వ్వసుదేవుఁడిమ్ములన్‌.
103
క. నందుని మందకుఁ జని త, త్సుందరి తల్పమునఁబరులు సూడకయుండన్‌
నందనుని నునిచి యానక, దుందుభి మఱలంగ నేఁగెఁ దొల్లిటి పురికిన్‌.
104
క. హరి యేకాదశ సంవ, త్సరములు నందవ్రజమునఁ దను హరి యని యె
వ్వరు నెఱుఁగకుండ నా హల, ధరుతోఁ గ్రీడించుచుండెఁదద్దయుఁబ్రీతిన్‌.
105
క. గోపాల వరుల కైనను, నాపోవఁగఁ దన సమంచితాకార మొగిం
జూపని శ్రీపతి వేడుక, గోపాలురఁ గూడి కాచె గోవత్సములన్‌.
106
వ. అయ్యవసరంబునంగృష్ణుండు లీలావినోదంబులు దోడి గోపాలబాలురకుంజూపందలంచి. 107
చ. వరయమునానదీసలిల వర్ధిత సౌరభయుక్తపుష్ప మే
దుర మకరంద పాన పరితుష్ట మధువ్రతయూథ మాధవీ
కురవక కుంద చందన నికుంజములందు మయూర శారికా
పరభృత రాజకీరమృదుభాషలభంగిఁజెలంగి పల్కుచున్‌.
108
ఉ. శ్రీరమణీమనోవిభుఁడు సింహకిశోరముఁబోలి లీలఁ గౌ
మారదశన్‌ రమా విమల మందిరముంబురుడించు గోతతిన్‌
వారక మేపుచుండెఁ దన వంశ రవస్ఫుట మాధురీ సుధా
సారముచేత గోపజనసంఘములన్‌ ముదమందఁజేయుచున్‌.
109
వ. మఱియును. 110
మ. చిరకేళీరతి బాలకుల్‌ తృణములన్‌ సింహాదిరూపంబులం
గరమొప్పన్‌ విరచించి వాని మరలన్‌ ఖండించు చందంబునం
గరుణాతీతులఁ గామరూపులగు న క్కంసప్రయుక్తక్షపా
చరులం గృష్ణుఁడు సంగరస్థలములం జక్కాడె లీలాగతిన్‌.
111
చ. వరయమునానదీజల నివాస మహోరగ విస్తృతాస్య వి
స్ఫురితవిషానలప్రభల సోఁకునఁ గ్రాఁగిన గోపగోధనో
త్కరముల నెల్లఁగాచి భుజగప్రవరున్‌ వెడలంగఁదోలి త
త్సరిదమలాంబుపానమున సంతసమందఁగఁజేసె గోతతిన్‌.
112
మ. దివిజాధీశు గుఱించి వానకొఱకై దీపింప నందాది వ
ల్లవు లేఁ టేఁట ననూనసంపదల నుల్లాసంబునంజేయు ను
త్సవముం గృష్ణుఁడు మాన్పి గోపగణముల్‌ సంప్రీతినొందన్‌ శచీ
ధవు గర్వంబడఁపంగ నవ్యయముగాఁ దాఁజేసె గోయాగమున్‌.
113
చ. హరిహయుఁడంత రోషవివశావిలమానసుఁడై సరోరుహో
దరు మహిమంబెఱుంగక మదంబడరంగ వలాహకాది భీ
కరఘనపంక్తిఁబంపిన నఖండశిలామయభూరివర్షముల్‌
గురిసె ననూనగర్జనల గోకుల మాకుల మౌచుఁగుందఁగన్‌.
114
ఉ. ఆ తఱి మంద కొందలము నందఁగ వల్లవులెల్లఁ గృష్ణ యీ
చేతను లెల్ల నిట్టి జడిఁ జిందఱవందఱలై కలంగుచుం
గాతరులైరి నీవు కృపఁగావుము కావు మనాథనాథ! ని
ర్ధూతకళంక! భక్తపరితోషణ భూషణ! పాపశోషణా!
115
మ. అని యిబ్భంగి విపన్నులై పలుకఁ గుయ్యాలించి కృష్ణుండు స
జ్జనవర్ధిష్ణుఁడు గోప గోనివహ రక్షాదక్షుఁడై దేవతా
జను లగ్గింపఁగరాంబుజాతమున సచ్ఛత్రంబుఁగాఁ దాల్చె బో
రన గోవర్ధనశైలముందటచరద్రమ్యామరీజాలమున్‌.
116
వ. వెండియు. 117
సీ. శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమాచంద్ర సాంద్రాతపోజ్జ్వలిత మగుచు
వెలయు బృందాటవీవీథియందొకనాఁడు రాసకేళీమహోల్లాసుఁడగుచు
రుచిరసౌభాగ్యతారుణ్య మనోరమస్ఫూర్తిఁజెన్నొందిన మూర్తి దనర
సలలిత ముఖచంద్రచంద్రికల్‌ గోపికా నయనోత్పలముల కానంద మొసఁగ
 
తే. భవ్యచాతుర్యభంగిఁ ద్రిభంగి యగుచు, నబ్జనాభుఁడు సమ్మోద మతిశయిల్ల
లీలఁ బూరించు వరమురళీ నినాద, మర్థి వీతేర విని మోహితాత్మ లగుచు.
118
చ. పతులు మఱందులున్‌ సుతులు బావలు నత్తలు మామలున్‌ సము
న్నతి వలదన్న మానక మనంబునఁగృష్ణపదాబ్జ సేవనా
న్వితరతి గోపకామినులు వే చనుదేర దయాపయోధి శో
భితగతి రాసకేళి సలిపెం దరుణీనవపుష్పచాపుఁడై.
119
ఉ. రాముఁడు దానుగూడి మధురాపురికిం జని యందు వైభవో
ద్దామనృపాసనంబున ముదంబున నున్న దురాత్ముఁ గంసు దు
ష్టామరశత్రుఁ ద్రుంచి ముదమారఁగఁ దల్లినిఁ దండ్రి నంచిత
శ్రీమహితాత్ములై తనరఁ జేసె సరోరుహనాభుఁ డున్నతిన్‌.
120
మ. నలువొప్పంగ షడంగయుక్త మహితామ్నాయంబు చౌషష్టి వి
ద్యలు సాందీపనిచే నెఱింగెఁజెలువొందన్‌ విన్నమాత్రంబు లో
పలనే లోకగురుండు దాన తనకున్‌ భావింప నన్యుల్‌ గురు
ల్గలరే లోకవిడంబనార్థ మగు లీలల్‌ గావె యమ్మేటికిన్‌.
121
ఉ. మించి ప్రభాసతీర్థమున మృత్యువశంబునఁబొందిపోయి యా
పంచజనోదరస్థుఁడగు బాలకు దేశికనందనుం బ్రభో
దంచిత లీలఁదెచ్చి గురుదక్షిణగా నతిభక్తి యుక్తి న
ర్పించె గురుండు చిత్తమునఁబెంపెసలార మురారి వెండియున్‌.
122
సీ. ఘనుఁడు విదర్భేశుఁడననొప్పు భీష్మకు వరసుతామణి నవవారిజాక్షిఁ
బద్మాసమానరూపశ్రీవిభాసితఁ గమనీయభూషణఁ గంబుకంఠిఁ
జతురస్వయంవరోత్సవ సమాగత చైద్య సాల్వ మాగధ ముఖ్య జనవరేణ్య
నికరసమావృతఁ బ్రకట సచ్చారిత్ర, రుక్మిణి నసమానరుక్మకాంతి
 
తే. నమరగుప్తామృతంబు విహంగవిభుఁడు, గొనిన కైవడి మనుజేంద్ర కోటిఁ దోలి
కమలనాభుండు నిజభుజాగర్వ మలరఁ, దెచ్చి వరియించె నతని నుతింప వశమె!
123
చ. పరువడిఁబట్టి సప్తవృషభంబుల ముక్కులు గుట్టఁదద్బల
స్ఫురణ సహింపఁజాలక నృపుల్‌ దలపడ్డ జయించి నగ్నజి
ద్ధరణిపు నందనన్‌ వికచతామరసాక్షిఁబ్రమోదియై స్వయం
వరమునఁబెండ్లియాడె గుణవంతుఁ డనంతుఁ డనంతశక్తితోన్‌.
124
మ. ప్రతివీరక్షయకారినాఁ బరఁగి సత్రాజిత్తనూజా హృ దీ
ప్సితముం దీర్పఁదలంచి నాకమునకుం బెంపారఁగా నేఁగి వ
ర్ణిత శౌర్యోన్నతిఁ బారిజాత మిలకున్‌ లీలాగతిం దెచ్చె ను
ద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుఁడన నేతన్మాత్రుఁడే చూడఁగన్‌.
125
సీ. మానితాఖిలజగన్మయదేహమునఁబొల్చు ధరణిదేవికిఁబ్రియతనయుఁడైన
నరకదానవుని సునాభాఖ్యఁజెన్నొందు ఘనచక్రధారావిఖండితోత్త
మాంగునిఁజేయ న య్యవనీలలామంబు వేఁడినఁ దత్పుత్త్రు విపులరాజ్య
పదమున నిల్పి లోపలి మందిరంబులఁ జిరముగ నరకుండు సెఱలఁ బెట్టి
 
తే. నట్టి కన్యలు నూఱుఁబదాఱువేలు, నార్తబంధువుఁడైన పద్మాక్షుఁజూచి
హర్షబాష్పాంబుధారాప్రవర్ష మొదవఁ, బంచశరబాణనిర్భిన్నభావలగుచు.
126
చ. లలితతదీయసుందరవిలాసవిమోహిత లైన వారి నిం
పొలసిన కోర్కిఁదీర్చుటకు నొక్క ముహూర్తమునన్‌ వరించి క
న్యల లలితావరోధభవనంబుల నందఱ కన్ని రూపులై
కలసి సుఖస్థితిం దనిపెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్‌.
127
క. చతురతతో నం దొక్కొక, యతివకుఁ బదురేసి సుతుల నాత్మసముల ను
న్నతభుజశక్తులఁగాంచెను, వితతంబై కీర్తి దిశల వినుతికి నెక్కన్‌.
128
సీ. మధురాపురముఁ జతుర్విధబలౌఘములతో నావరించిన కాలయవన సాల్వ
మగధ భూపాలాది మనుజేంద్ర లోకంబు సైన్యయుక్తము గాఁగ సంహరించి
తన బాహుశక్తిఁ జిత్తముల నర్థించిన భీమపార్థులకు నుద్దామవిజయ
మొసఁగి తద్వైరుల నుక్కడంగఁగఁ ద్రుంచి బాణశంబరమురపల్వలాది
 
తే. దనుజనాయక సేనావితానములను హలధరాదిసమేతుఁడై హతులఁ జేసె
దంతవక్త్రాదిదైత్యులు దన్ను నెదుర భండనములోనఁద్రుంచె దోర్బలము మెఱసి.
129
వ. వెండియుం గృష్ణుండు కౌరవ పాండవ భండనంబునకుం దోడ్పడి రాజన్యు లన్యోన్య మాత్స ర్యోత్సాహసమేతులై సైనిక పాదఘట్టనంబుల ధరాచక్రంబు కంపింప ననన్య సామాన్యంబు లైన శంఖ భేరీ ప్రముఖ తూర్యఘోషంబుల నింగి మ్రింగఁ దురంగమ రింఖా సముద్ధూత ధూళి పటల పరిచ్ఛన్న భానుమండలంబుగాఁ జనుదెంచి కురుక్షేత్రంబున మోహరించిన నుభయపక్షబలంబులం దునుమాడి నిఖిలరాజ్యవైభవ మదోన్మత్తుం డయిన సుయోధనుండు నిఖిలరాజ సమక్షంబునఁ గర్ణశకుని దుశ్శాసనాదుల దుర్మంత్రంబున నిరంతరంబుఁ గుంతీనందనుల కెగ్గు చేసిన దోషంబునం జేసి సంగరరంగంబున భీమ గదాఘాతంబునం దొడలు విఱిగి పుడమింబడి గతాయుశ్శ్రీవిభవుండై యుండఁ జూచినంగదా పరితుష్ట చిత్తుండ నగుదు నని యపరిమిత బాహుబలోత్సాహులైన భీష్మ ద్రోణ భీమార్జునులచేత నిఖిలధరాపతుల నష్టాదశాక్షౌహిణీ బలంబులతోడం దునిమించి మఱియు స్వసమానబలులైన యదువీరుల జయింప నెంతవారల కైనం దీరదు; మధుపాన మదవిఘూర్ణితాతామ్ర విలోచనులై ప్రవర్తించు యాదవుల కన్యోన్య వైరంబులు గల్పించి పోరించి యితరేతర కరాఘాతంబుల హతులై తన్నుఁ గలసినంగాని భూభారం బుడుగదని చిత్తంబునం దలంచి యంత ధర్మనందనుచే నిస్సపత్నంబగు రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయించుచు మర్త్యులకుం గర్తవ్యంబులైన ధర్మపథంబులు సూపుచు, బంధుమిత్రుల నెల్లఁ బరితోషంబు నొందించుచుం దత్పరోక్షంబున వారి వంశం బుద్ధరింపం దలంచి యభిమన్యువలన నుత్తర యందు గర్భంబు నిలిపి, గురుతనయ ప్రయుక్తమహిత బ్రహ్మాస్త్రపాతంబునం దద్గర్భదళనంబు గాకుండ నర్భకుని రక్షించి, నిజపదారవింద సేవారతుండైన ధర్మసుతుచేఁ గీర్తిప్రతాపంబులు నివ్వటిల్లం దురంగమేధంబులు మూఁడు సేయించి వెండియు. 130
సీ. వలనొప్ప లౌకికవైదికమార్గముల్‌ నడపుచు ద్వారకానగరమందు
నవిదితాత్మీయ మాయా ప్రభావమున నిస్సంగుఁడై యుండి సంసారిపగిదిఁ
జెంది కామంబులచేత విమోహితుం డై సుఖించుచు ముదితాత్ముఁడగుచు
నంచితస్నిగ్ధస్మితావలోకముల సుధాపరిపూర్ణసల్లాపములను
 
తే. శ్రీనికేతనమైన శరీరమునను, బాండునందనయదుకులప్రకరములను
లీలఁ గారుణ్య మొలయఁ బాలించుచుండె, నార్తరక్షాచణుండు నారాయణుండు.
131
సీ. సంపూర్ణ పూర్ణిమాచంద్రచంద్రిక నొప్పు రమణీయశారదరాత్రులందు
సలలితకాంచన స్తంభసౌధోపరిచంద్రకాంతోపలస్థలములందు
మహిత కరేణుకా మధ్య దిగ్గజముల గతిని, సౌదామనీ లతల నడిమి
నీలమేఘంబుల లీల, ముక్తా మధ్య లాలిత శక్ర నీలములభాతి
 
తే. సతతయౌవనసుందరీయుతవిహారుఁ డగుచు సతు లెంద ఱందఱ కన్ని రూప
ములను గ్రీడించెఁ బెక్కబ్దములు సెలంగి, నందనందనుఁ డభినవానందలీల.
132
వ. అంత నొక్కనాఁడు 133
చ. మునివరు లేఁగుదేర యదుభోజవరేణ్యులు గూడి ముట్టఁ బ
ల్కినఁగనలొంది వారు దమకించి శపించినఁగొన్ని మాసముల్‌
సనునెడ దైవయోగమున జాతరఁబో సమకట్టి వేడుకల్‌
మనములఁదొంగలింప గరిమన్‌ నిజయానము లెక్కి యాదవుల్‌.
134
ఉ. కోరి ప్రభాసతీర్థమునకుం జని తన్నదిఁగ్రుంకి నిర్మలో
దారత నందు దేవమునితర్పణముల్‌ పితృతర్పణంబులున్‌
వారని భక్తిఁజేసి నవవత్సలతోఁబొలుపారు గోవులన్‌
భూరిసదక్షిణాకముగ భూసురకోటికి నిచ్చి వెండియున్‌.
135
క. అజినపటరత్నకంబళ, రజత మహారజతతిలధరావరకన్యా
గజతురగరథములను స, ద్ద్విజకోటికి నిచ్చి పెంపు దీపింపంగన్‌.
136
వ. ఇట్లు సఫలంబు లయిన భూదానంబు మొదలుగాఁ గల దానంబు లనూనంబులుగా భగవదర్పణబుద్ధిం జేసి యనంతరంబ. 137
తే. ఎసఁగు మోదంబు సంధిల్ల నిష్టమైన, రసికమృదులాన్న మర్థిఁబారణలు సేసి
మంజులాసవరసపానమత్తు లగుచుఁ, గడఁగి యన్యోన్యహాస్యవాక్యములఁ గలఁగి.
138
వ. ఇట్లు దమలోన మదిరాపాన మద విఘూర్ణిత తామ్రలోచనులై మత్సరంబుల నొండొరులం బొడిచి సమస్త యాదవులును వేణు జాతానలంబునఁ దద్వంశపరంపరలు దహనంబు నొందుచందంబునం బొలిసి; రది యంతయుంగనుంగొని శ్రీకృష్ణుం డప్పుడు. 139
క. చతురతతో నిజమాయా, గతిఁ జూచి లసద్విలోలకల్లోలసమం
చితవిమలకమలసార, స్వత జలముల విహితవిధులు సలిపినవాఁడై.
140
క. ఒక వృక్షమూలతలమున, నకలంక గుణాభిరాముఁ డాసీనుండై
యకుటిలమతి బదరీవన, ముకు ననుఁబొమ్మనుచు మొఱఁగి పోయిన నేనున్‌.
141
క. క్రమమున నిజకుల సంహా, రము సేయఁగడంగు టెఱిఁగి రమణీయ శ్రీ
రమణు చరణాబ్జయుగ విర, హమునకు మది నోర్వలేక యనుగమనుఁడనై.
142
క. హరి నరయుచుఁజని చని యొక, తరుమూలతలంబునందుఁదన దేహరుచుల్‌
పరఁగఁగ నున్న మహాత్మునిఁ, బరునిఁ బ్రపన్నార్తిహరుని భక్తవిధేయున్‌.
143
వ. మఱియును. 144
సీ. అస్మత్ప్రియస్వామి నచ్యుతుఁ బరు సత్త్వగుణగరిష్ఠుని రజోగుణవిహీను
సురుచిరద్వారకాపురసమాశ్రయు ననాశ్రయు నీలనీరదశ్యామవర్ణు
దళదరవిందసుందరపత్రనేత్రు లక్ష్మీయుతుఁబీత కౌశేయవాసు
విలసితవామాంకవిన్యస్తదక్షిణ చరణారవిందు శశ్వత్ప్రకాశు
 
తే. ఘనచతుర్బాహు సుందరాకారు ధీరుఁ, జెన్నుగల లేఁత రావిపై వెన్ను మోపి
యున్న వీరాసనాసీను నన్నుఁ గన్న, తండ్రి నానంద పరిపూర్ణు దనుజహరుని.
145
మత్త. కంటిఁగంటి భవాబ్ధి దాఁటఁగఁగంటి నాశ్రితరక్షకుం
గంటి యోగిజనంబు డెందముఁగంటిఁ జుట్టముఁగంటి ము
క్కంటికింగనరాని యెక్కటిఁగంటి దామరకంటిఁ జే
కొంటి ముక్తినిధానముందలకొంటి సౌఖ్యము లందఁగన్‌.
146
వ. అయ్యవసరంబునం బరమ భాగవతోత్తముండును, మునిజన సత్తముండును, ద్వైపాయన సఖుండును, మహాయోగిప్రముఖుండును, నఘశూన్యుండును, నఖిలజనమాన్యుండును, బుధజనవిధేయుండును నగు మైత్రేయుండు తీర్థాచరణంబు సేయుచుం జని చని. 147
మ. కనియెం దాపసపుంగవుం డఖిలలోకఖ్యాతవర్ధిష్ణు శో
భన భాస్వత్పరిపూర్ణ యౌవనకళాభ్రాజిష్ణు యోగీంద్ర హృ
ద్వనజాతైకచరిష్ణుఁ గౌస్తుభముఖోద్యద్భూషణాలంకరి
ష్ణు నిలింపాహితజిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్‌.
148
క. తదనంతరంబ హరిఁ దన, హృదయాబ్జమునందు ముకుళితేక్షణముల స
మ్మదమునఁజూచుచు నానత, వదనుండై యుండె ముదము వఱలఁగ ననఘా!
149
వ. అంత డగ్గఱ నేతెంచి యున్న మైత్రేయుండు వినుచునుండ దరహాస చంద్రికా సుందర వదనార విందుండును, నానంద సుధానిష్యంద కందళిత హృదయుండును, భక్తానురక్త దయాసక్త విలోకనుండును నగు పుండరీకాక్షుండు నన్ను నిరీక్షించి యిట్లని యానతిచ్చె; పూర్వభవంబున వసుబ్రహ్మలు సేయు సత్త్రయాగంబున వసువై, భవదీయహృదయంబున నితర పదార్థంబులు గోరక మదీయపాదారవిందసేవం గాంక్షించితివి, కావునం దన్నిమిత్తంబున నేను నీ హృదయంబున వసియించి సమస్తంబును గనుచుండుదు; నాత్మారాముండ నైన నన్ను నెవ్వరేని సదసద్వివేకులై యెఱుంగంజాలరు వారలకు నేను నగోచరుండనై యుండుదు; మత్పరిగ్రహంబు గల నీకు నీజన్మంబ కాని పునర్భవంబు నొంద కుండుటకు భవదీయ పూర్వజన్మకృత సుకృత విశేషంబు కతంబున నియ్యాశ్రమంబున మత్పాదారవింద సందర్శనంబు గలిగె; నదియునుంగాక పద్మకల్పంబునందు మన్నాభి పద్మ మధ్య నిషణ్ణుం డయిన పద్మసంభవునకు జన్మమరణాది సంసృతి నివర్తకంబును నవిరతానశ్వర సౌఖ్యప్రవర్తకంబును నగు మన్మహత్త్వంబుఁ దెలియం జేసితి నట్టి దివ్యజ్ఞానంబు నీకు నెఱింగింతు నని య మ్మహనీయ తేజోనిధి యానతిచ్చిన సుధాసమాన సరసాలాపంబులు కర్ణకలాపంబులై మనస్తాపంబులం బాపిన రోమాంచ కంచుకిత శరీరుండును, నానంద బాష్పధారా సిక్త కపోలుండును, బరితోష సాగరాంతర్నిమగ్న మానసుండును నయి యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి యిట్లంటి. 150
క. పురుషోత్తమ! నీ పద, సర సీరుహ ధ్యానామృతాభిషేక స్ఫురణం
గర మొప్పిన నా చిత్త మి, తరవస్తువులందు వాంఛఁ దగులునె యెందున్‌.
151
చ. జననము లేని నీవు భవసంగతి నొందుట కేమి కారణం
బనియును, గాలసంహరుఁడవై జగముల్‌ విలయించు నీవు పా
యని రిపుభీతికై సరిదుదంచితదుర్గము నాశ్రయించు టె
ట్లనియును దేవ! నామనమునందుఁదలంతు సరోజలోచనా!
152
వ. అదియునుంగాక. 153
క. శ్రీ రమణీశ్వర! నీ వా, త్మారాముఁడవయ్యు లీలఁ దరుణీకోటిం
గోరి రమించితి వనియును, వారక యేఁదలఁతు భక్తవత్సల! కృష్ణా!
154
క. పరతత్త్వజ్ఞులు కరుణా, కర! నిను సంసారి వనుచుఁ గడఁకఁదలంప
న్నరసి ననుఁగాచు టెల్లను, గర మరుదు తలంచి చూడఁ గమలాధీశా!
155
వ. దేవా! నీ వఖండిత విజ్ఞాన రూపాంతఃకరణుండ వయ్యును ముగ్ధభావంబునఁ బ్రమత్తుని చందంబున విమోహికైవడిం బ్రవర్తించుచు నెందేని నొదిగి యుండుటం దలంచి నా డెందంబు గుందుచుండు; నరవిందలోచన! సురవందిత! ముకుంద! యిందిరా సుందరీ రమణ! సరస్వతీరమణునకుం గరుణించిన సుజ్ఞానంబు ధరించు శక్తి నాకుం గలదేనిఁ గృపసేయుము! భవదీయశాసనంబు ధరియించి భూరిసంసార పారావారోత్తరణంబు సేయుదు నని విన్నవించి బహుభంగులం బ్రస్తుతించిన భగవంతుఁడును బ్రపన్నపారిజాతంబును నైన కృష్ణుండు పరతత్త్వనిర్ణయంబు నెఱింగించిన. 156
క. సరసిజలోచన కరుణా, పరిలబ్ధ జ్ఞానకలితభావుఁడ నగుటం
బరతత్త్వవేత్తనై త, చ్చరణసరోజముల కెఱఁగి సమ్మతితోడన్‌.
157
క. హరిపద జలరుహ విరహా, తురతన్‌ దుర్దాంత దుఃఖతోయధిఁ గడవన్‌
వెరవేది తిరుగ వలసెను, సరసిజభవకల్ప విలయ సమయముదాఁకన్‌.
158
వ. ఇట్లు దిరుగుచు. 159
మ. నరనారాయణతాపసాశ్రమపదౌన్నత్యంబునంబొల్చు భా
సురమందారరసాలసాలవకుళాశోకామ్లపున్నాగ కే
సరజంబీరకదంబనింబకుటజాశ్వత్థస్ఫురన్మల్లికా
కరవీరక్షితిజాభిరామబదరీకాంతారసేవారతిన్‌.
160
క. చనుచున్నవాఁడ నని ప, ల్కిన పలుకుల కులికి కళవళించుచు విదురుం
డనుపమశోకార్ణవమున, మునిఁగియు నిజయోగసత్త్వమునఁ దరియించెన్‌.
161
వ. ఇట్లు విదురుండు శోకపావకునిం దన వివేకజలంబుల నార్చి యుద్ధవున కిట్లనియె. 162
మ. అనఘా! యుద్ధవ! నీకుఁ గృష్ణుఁ డసురేంద్రారాతి మన్నించి చె
ప్పిన యధ్యాత్మరహస్యతత్త్వ విమలాభిజ్ఞానసారంబు బో
రన నన్నుం గరుణించి చెప్పినఁగృతార్థత్వంబునంబొందెదన్‌
విను పుణ్యాత్ములు శిష్యసంఘముల నుర్వింబ్రోవరే వెండియున్‌.
163
క. భగవద్భక్తులు సుజనులు, దగ వెఱిఁగి పరోపకారతాత్పర్య వివే
క గరిష్ఠులై చరింతురు, జగతిం బొగడొంది వృష్ణిసత్తమ! యెందున్‌.
164
క. అనవుడు నుద్ధవుఁ డవ్విదు, రున కిట్లను ననఘ! మునివరుఁడు సాక్షా ద్వి
ష్ణునిభుండగు మైత్రేయుఁడు, దన మనమున మనుజగతి వదలఁ దలఁచి తగన్‌.
165
క. హరి మురభేదిఁ బరాత్పరుఁ, గరుణాకరుఁదలఁచునట్టి ఘనుఁ డమ్ముని కుం
జరు కడకేఁగిన నాతఁడు, గర మర్థిందెలుపు తాత్త్వికజ్ఞానంబున్‌.
166
వ. అని యుద్ధవుండు విదురుం గూడి చని చని. 167
ఉ. ముందటఁగాంచె నంత బుధముఖ్యుఁడు హల్లకఫుల్లపద్మ ని
ష్యందమరందపానవిలసన్మదభృంగఁ, జలత్తరంగ, మా
కంద లవంగ లుంగ లతికాచయసంగ, సురాంగనాశ్రితా
నందితపుణ్యసంగ, యమునన్‌, భవభంగ, శుభాంగ నర్మిలిన్‌.
168
క. కని డాయ నేఁగి మోదం, బునఁ దత్సరిదమలపులినభూములఁ దగ నా
దిన శేషము నివసించెను, వనజోదరపాదపద్మవశమానసుఁడై.
169
క. మఱునాఁడు రేపకడ భా, సురపుణ్యుఁడు ఘనుఁడు మధు నిషూదన చరణ
స్మరణ క్రీడాకలితుఁడు, దరియించెన్‌ గలుష గహనదమనన్‌ యమునన్‌.
170
వ. ఇట్లుద్ధవుండు యమునానది నుత్తరించి బదరికాశ్రమంబునకుం జనియె ననిన విని రాజేంద్రుండు యోగీంద్రున కిట్లనియె. 171
క. శౌరియు నతిరథ వరులు మ, హారథ సమరథులు యదు బలాధిపు లెల్లం
బోరి మృతిఁబొంద నుద్ధవుఁ, డేరీతిన్‌ బ్రదికె నాకు నెఱిఁగింపు తగన్‌.
172
సీ. నావుడు రాజేంద్రునకు శుకయోగీంద్రుఁ డిట్లను మున్ను లోకేశుచేత
సంప్రార్థితుండైన జలరుహనాభుండు వసుమతిపై యదువంశమందు
నుదయించి తనుఁ దాన మదిలోనఁ జింతించి తెలివొంది యాత్మీయ కులవినాశ
మొనరించి తాను బంచోపనిషన్మయ మగు దివ్యదేహంబునందుఁ జెందఁ
 
తే. దలఁచి విజ్ఞానతత్త్వంబు ధరణిమీఁదఁ, దాల్చి జనకోటి కెఱిఁగింపఁదగిన ధీరుఁ
డుద్ధవుఁడు దక్క నితరులే నోప రితఁడు, నిర్జితేంద్రియుఁడాత్మసన్నిభుఁడటంచు.
173
క. క్షితిపై నిలిపిన కతమున, నతనికి మృతి దొరక దయ్యె నవనీశ! రమా
పతి యభిమానము గలిగిన, యతిపుణ్యుఁడు సనియె బదరికాశ్రమమునకున్‌.
174
వ. అంత. 175
క. ఉద్ధవుఁడరిగిన పిదప స, మిద్ధ పరిజ్ఞాను, సుజనహితు, మైత్రేయున్‌
వృద్ధజనసేవ్యుఁ, దాపస, వృద్ధశ్రవుఁ జూడఁగోరి విదురుఁడు గడఁకన్‌.
176
వ. యమునానది దాఁటి కతిపయ ప్రయాణంబులఁ బుణ్యనదుల, హరిక్షేత్రంబులను దర్శించుచు నతిత్వరిత గమనంబున. 177
క. చని చని ముందటఁగనుఁగొనె, ఘనపాప తమఃపతంగఁ, గరుణాపాంగన్‌,
గనదుత్తుంగతరంగన్‌, జనవరనుత బహుళపుణ్యసంగన్‌, గంగన్‌.
178
క. అందు నరవిందసౌరభ, నందితపవమానధూతనటదూర్మి పరి
స్పందితకందళశీకర, సందోహలసత్ప్రవాహజలమజ్జనుఁడై.
179
సీ. ఘనసారరుచివాలుకాసముదంచిత సైకతవేదికాస్థలమునందు
యమనియమాదియోగాంగక్రియా నిష్ఠఁ బూని పద్మాసనాసీనుఁడగుచు
హరిపాదసరసీరుహ న్యస్తచిత్తుఁడై బాహ్యేంద్రియవ్యాప్తిఁబాఱఁదోలి
సకలవిద్వజ్జనస్తవనీయసముచితాచార వ్రతోపవాసములఁ గ్రుస్సి
 
తే. యున్న పుణ్యాత్ము, విగతవయోవికారు, వినుతసంచారు, భువనపావనవిహారు
యోగిజనగేయు, సత్తతి భాగధేయు, నాశ్రితవిధేయు, మైత్రేయు నచటఁగాంచె.
180
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )