| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| వ. | ఇట్లు గనుంగొని యమ్మునీంద్రుని పాదంబులకుం బ్రణమిల్లి ముకుళితహస్తుండై యిట్లనియె ‘మునీంద్రా! లోకంబున సకల జనంబులు మనంబులు ఘనంబులగు సౌఖ్యంబు లందం దలంచి తత్ఫలప్రాప్తి హేతువులైన కర్మంబు లాచరించి దైవోపహతులై తత్కర్మంబులచేత నిష్ఫలారంభు లగుదురు; కర్మంబులు బంధకంబులును దుఃఖహేతువులునుం గాని సౌఖ్యదాయకంబులై పాపనివృత్తి జేయనోప; వది యట్లుండె; భూరి దుఃఖానుసారంబైన సంసార చక్రంబు నందుఁ బరిభ్రమించుచుం గామవిమోహితులై పూర్వకర్మానుగతంబులైన శరీరంబులు దాల్చుచుం జచ్చుచు మరలం బుట్టుచు నెంత కాలంబునకుఁ బాపనివృత్తిఁ గానక మాతృయౌవన వన కుఠారులై జనియించి వర్తించు మూఢాత్ములం, బశుప్రాయుల రక్షించుకొఱకుఁగాదె నారాయణపరాయణులైన మీవంటి పుణ్యాత్ములు లోకంబునం జరియించుట; యదియునుం గాక. | 181 |
| మ. |
అవివేకానుగత స్వకార్యజలవేలాకీర్ణమై మిత్ర బం ధు వధూపుత్ర జలగ్రహోగ్రయుతమై దుర్దాంత మైనట్టి దు ర్భవపాథోధిఁదరింపలేరు హరిసంబంధక్రియాలోల భా గవతానుగ్రహనావ లేని యధముల్ కారుణ్యసంధాయకా! |
182 |
| క. |
మునినాథచంద్ర! ననుఁ గై, కొని కాచు తలంపు బుద్ధిఁగూడిన యేనిన్ వినుము మదీప్సిత మది నా, చనవునఁగావింపవయ్య సజ్జనతిలకా! |
183 |
| వ. | అని వెండియు విదురుండు మైత్రేయుం జూచి మునీంద్రా! త్రిగుణాత్మకమాయానియంత యగు భగవంతుండు స్వంతంత్రుండయ్యు నవతరించి యే యే యవతారంబుల నే కర్మంబు లాచరించె? నదియు నిష్క్రియుండగు నీశుండు మొదలం బ్రపంచంబు నే విధంబునం గల్పించె? నే పగిదిం బాలించె? మఱియు నీ విశ్వంబు నాత్మీయ హృదయాకాశగతముం జేసి నివృత్తవృత్తి యగుచు యోగమాయయం దెట్లు వసియించె? బ్రహ్మాండంబునందు నే లీల వర్తించె? నందు బ్రహ్మాదిరూపంబులం బొంది బహుప్రకారంబుల నెట్లు క్రీడించె? భూసుర గోసురాదులఁ బరిరక్షించుటకై మత్స్యాద్యవతారంబులు ధరియించి యే యే ప్రయోజనంబులం దీర్చెఁ? బయోరుహ గర్భాండ కటాహాంతర్గతంబులై లోకపాలసహితంబులైన లోకంబులను లోకాలోక పర్యంతంబుల బహిర్భాగంబులను నే యే తత్త్వభేదంబులను నెత్తెఱంగునం బుట్టించె? నందు బ్రతీతంబగు జీవకోటి యెవ్వనిం గొల్చి బ్రదుకు? జనులకు గర్మ నామ రూప భేదంబు లెట్లు నిర్దేశించె? నింతయు సవిస్తరంబుగా వివరింపు; ముత్తమశ్లోకమౌళిమండనుండును, యోగీశ్వరుండును నైన పుండరీకాక్షుని చరిత్ర శ్రవణంబునం గాని జన్మమరణాది సకల దుఃఖాకరంబులును, దుష్కర్మప్రాప్తంబులును నగు భవబంధంబులు దెగవని వెండియు నిట్లనియె. | 184 |
| తరల. |
సతతమున్ సరసీరుహోదరసత్కథామృతపూరమున్ శ్రుతిపుటాంజలిచేత నిమ్ముల జుఱ్ఱియుందనివోదు భా రతకథామిషమూని విష్ణుఁబరాశరప్రియసూతి స న్మతి నుతించిన చోట సన్మునినాథ! నా మది నుబ్బుదున్. |
185 |
| క. |
ఇతర కథాకర్ణనముల, నతి హేయత నొందెఁ జిత్త మనఘాత్మ! రమా పతి చరితామృతరతి సం, సృతి వేదనలెల్లఁ బాయఁ జేయు మునీంద్రా! |
186 |
| తే. |
భూరివిజ్ఞాననిధులగు నారదాది, నిర్మలాత్ముల కయిన వర్ణింపరాని హరికథామృతపానంబునందు, విసివి యొల్ల ననువాడెపో వెఱ్ఱిగొల్లఁ డనఘ! |
187 |
| వ. | అదియునుంగాక. | 188 |
| సీ. |
అరవిందనాభుని యపరావతారమై జనన మొందిన పరాశరసుతుండు చతురవర్ణాశ్రమాచార ధర్మంబులు ఠవణింప లోకవిడంబనంబు లగు గ్రామ్యకథలు పెక్కర్థిఁ గల్పించుచు హరికథావర్ణన మందులోన నించుకించుక గాని యేర్పడఁ జెప్పమి నంచితవిజ్ఞానమాత్మ నిలుప |
|
| తే. |
కున్నఁజింతించి మఱి నారదోపదిష్టుఁ, డగుచు హరివర్ణనామృత మాత్మఁ గ్రోలి విమలసుజ్ఞాననిధి యన వినుతి కెక్కి, ధన్యుఁడయ్యెను లోకైకమాన్యుఁడగుచు. |
189 |
| వ. | కావున. | 190 |
| క. |
సరసిరుహోదరు మంగళ, చరితామృత మాత్మఁగ్రోలు జనుఁడితరకథా గరళముఁగ్రోలునె? హరి సం, స్మరణము జీవులకు నఖిలసౌఖ్యద మనఘా! |
191 |
| క. |
శ్రీవనితాధిప! నామ క, థా విముఖుల కిహముఁబరము దవ్వై పిదపం బోవుదురు నరకమునకున్, వావిరి నే వారిఁజూచి వగతు మునీంద్రా! |
192 |
| క. |
ఏ నరుఁడే నొక నిమిషం, బైన వృథావాదగతిని హరిపదకమల ధ్యానానందుఁడు గాఁడే, నా నరునకు నాయు వల్పమగు మునినాథా! |
193 |
| చ. |
మృదుగతిఁబువ్వుఁ దేనియ రమించుచుఁబానము సేయఁ బాఱు ష ట్పదమునుబోలి యార్తజనబాంధవు విశ్వభవస్థితివ్యయా స్పదమహితావతారుఁడగు పంకరుహోదరు నిత్యమంగళ ప్రద గుణకీర్తనామృతముఁ బాయక గ్రోలెదఁ జెప్పవే దయన్. |
194 |
| క. |
అని విదురుఁడు మైత్రేయుం, డను మునినాయకుని నడిగె నని వేదవ్యా సుని తనయుం డభిమన్యుని, తనయునకుంజెప్పి మఱియుఁ దగ నిట్లనియెన్. |
195 |
| వ. | ఇట్లు విదురుండు మైత్రేయు నడిగిన నతండతనిం గని యతిమృదుమధుర వచన రచనుండై యిట్లనియె: ననఘా! కృష్ణకథాశ్రవణ తత్పరుండవై నీవ నన్నడిగితివి గావున భద్రంబయ్యె: నీవు భగవద్భక్తుండవు గావున హరికథాసక్తుండవగుట విచిత్రంబు గా దదియును గాక మాండవ్యు శాపంబున సాత్యవతేయువలన భ్రాతృక్షేత్రంబున శూద్రయోనిం బుట్టినట్టి ప్రజాసంయమనుండవగు యముండవు: నారాయణునకుం బ్రియతముండవు గావునఁ గృష్ణుండు నిర్యాణకాలంబునం దన సన్నిధికిం జనిన నన్ను డాయం జీరి విజ్ఞానం బెల్ల నుపదేశించి నీకు నెఱింగింపు మని యానతిచ్చుటంజేసి యవశ్యంబును నీకు నెఱింగింతు; దత్తావధానుండవై వినుము. | 196 |
| క. |
వనజాక్షయోగమాయా, జనితంబగు విశ్వజననసంస్థానవినా శనముల తెఱఁగెఱిఁగింపుచు, ననఘా! విష్ణుని మహత్త్వ మభివర్ణింతున్. |
197 |
| సీ. |
సకలజీవులకెల్లఁ బ్రకటదేహము నాత్మ నాథుండుఁబరుఁడు నానావిధైక మత్యుపలక్షణ మహితుండు నగు భగవంతుండు సృష్టిపూర్వంబునందు నాత్మీయమాయాలయంబు నొందిన విశ్వగర్భుఁడై తాన యొక్కటి వెలుంగు పరమాత్ముఁ డభవుం డుపద్రష్ట యయ్యు వస్త్వంతరపరిశూన్యుఁడగుటఁజేసి |
|
| తే. |
ద్రష్ట గాకుండు మాయాప్రధానశక్తి, నతుల చిచ్ఛక్తి గలవాఁడు నగుచుఁదన్ను లేనివానిఁగఁ జిత్తంబులోనఁదలఁచి, ద్రష్ట యగుఁదన భువననిర్మాణవాంఛ. |
198 |
| తే. |
బుద్ధిఁదోఁచిన న మ్మహాపురుషవరుఁడు, కార్యకారణ రూపమై ఘనత కెక్కి భూరిమాయాభిధాన విస్ఫురితశక్తి, వినుతి కెక్కిన యట్టి యవిద్యయందు. |
199 |
| క. |
పురుషాకృతి నాత్మాంశ, స్ఫురణము గల శక్తి నిలిపి పురుషోత్తముఁ డీ శ్వరుఁ డభవుం డజుఁడు, నిజో, దరసంస్థితవిశ్వ మపుడు దగఁ బుట్టించెన్. |
200 |
| సీ. |
ధృతిఁబూని కాలచోదితము నవ్యక్తంబుఁ బ్రకృతియు నను పేళ్లఁబరఁగు మాయ వలన మహత్తత్త్వ మెలమిఁ బుట్టించె మాయాంశ కాలాదిగుణాత్మకంబు నైన మహత్తత్త్వ మచ్యుత దృగ్గోచర మగుచు విశ్వనిర్మాణవాంఛ నందుటఁజేసి రూపాంతరంబునఁ బొంది నట్టి మహత్తత్త్వమందు నోలిఁ |
|
| తే. |
గార్యకారణ కర్త్రాత్మకత్వమైన, మహిత భూతేంద్రియక మనోమయ మనంగఁ దగు నహంకారతత్త్వ ముత్పన్న మయ్యెఁ, గోరి సత్త్వరజస్తమోగుణక మగుచు. |
201 |
| వ. | వెండియు రూపాంతరంబులం బొందుచున్న సాత్త్వికాహంకారంబువలన మనంబును, వైకారిక కార్యభూతంబులైన దేవతా గణంబులును సంభవించె. ఇంద్రియాధిష్ఠాతలైన వానివలన శబ్దంబు పూర్వంబునఁ బ్రకాశం బగుటంజేసి జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబులును, కర్మేంద్రియంబు లయిన వాక్పాణిపాద పాయూపస్థములును, తైజసాహంకారంబున నుత్పన్నంబు లయ్యెఁ; దామసాహంకారంబువలన శబ్దస్పర్శరూప రసగంధంబు లుదయించె; నందు శబ్దంబు నిజగుణంబైన శబ్దంబు వలన నాకాశంబుఁ బుట్టించె. గగనంబు కాల మాయాంశ యోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శతన్మాత్రంబువలన వాయువుం గలిగించె; బవనుండు నభోబలంబున రూపతన్మాత్రంబువలన లోకలోచనంబైన తేజంబు నుత్పాదించెఁ; దేజంబు కాల మాయాంశ యోగంబున నుత్తమశ్లోకుని విలోకనంబునఁ బవమానయుక్తం బగుచు రసతన్మాత్రంబువలన నంబువులం బుట్టించె; సలిలంబు కాల మాయాంశయోగంబునం బరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజోయుక్తంబైన గంధగుణంబువలనఁ బృథివిం గలిగించె; నందు గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్దస్పర్శంబులును, దేజంబునకు శబ్దస్పర్శరూపంబులును, సలిలంబునకు శబ్దస్పర్శరూపరసంబులును, బృథివికి శబ్దస్పర్శరూపరస గంధంబులును గుణంబులై యుండుఁ; గాల మాయాంశ లింగంబులు గలిగి మహదాద్యభిమానంబును నొందిన దేవతలు విష్ణుకళాకలితు లగుదు; రట్టి మహదాదితత్త్వంబు లైక్యంబు సాలమిం బ్రపంచంబులు గల్పింప సమర్థంబులు గాక కృతాంజలులై యోగేశ్వరేశ్వరుండైన నారాయణు నిట్లని స్తుతియించె. | 202 |
| దండకము. | శ్రీనాథనాథా! జగన్నాథ! నమ్రైకరక్షా! విపక్షక్షమాభృత్సహస్రాక్ష! నీరేజపత్రేక్షణా! దేవదేవా! భవ ద్దాసవర్గోపతాపంబులం బాపఁగా నోపు దివ్యాతపత్రంబు నాఁబొల్చు యుష్మత్పదాంభోజ మూలంబు పుణ్యాలవాలంబుగాఁ బొంది యోగీంద్రు లుద్దామ సంసార తాపంబులం బోవఁగా మీటి వర్తింతురో తండ్రి! యీశా! సమస్తాఘ నిర్ణాశ! యీ విశ్వమందెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచేఁ గ్రాఁగి దుఃఖాబ్ధిలోఁ దోఁగి యే కర్మమున్ ధర్మముం బొందఁగా లేక సంసారచక్రంబునందుం బరిభ్రామ్యమాణాత్ములై యుందు ర మ్మూఢచేతస్కులం జెప్పఁగా నేల యో దేవ! విజ్ఞాన దీపాంకురంబైన నీ పాదపంకేరుహచ్ఛాయఁ బ్రాపింతు మబ్జాక్ష! సన్మౌనిసంఘంబు లైకాంతిక స్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘనిర్ణాశకాంబుప్రవాహాభ్ర గంగా నివాసంబు గా నొప్పు నీ పాదయుగ్మంబు యుష్మన్ముఖాంభోజ నీడోద్గతం బైన వేదాండజ శ్రేణిచేతన్ గవేషించి సంప్రాప్తులై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుట జ్ఞాన బోధాత్ము లైనట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబులం దే పరంజ్యోతి పాదాబ్జ పీఠంబు గీలించి కైవల్య సంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు; మింద్రాది వంద్యా! ముకుందా! సమస్తంబుఁ గల్పింపఁ బాలింపఁ దూలింపఁగాఁ; బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహ ధ్యానపారీణ సుస్వాంతులై యొప్పు భక్తాళికిన్ మోక్షదం బైన మీ పాద కంజాతముల్ గొల్తు; మీశా! రమాధీశ! పుత్త్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్ట క్రియా లోలురై దేహగేహంబుం దోలి వర్తించు దుర్మానవ శ్రేణులం దంతరాత్ముండవై యుండియున్ దూరమై తోఁచు నీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ! బాహ్యేంద్రియ వ్యాప్తి నుద్వృత్తులైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వ ప్రభావాఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీ కళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానఁగాఁ జాల; రప్పుణ్యులా దుష్టులం జూడఁగా నొల్ల రంభోధిరాట్కన్యకాకాంత! వేదాంత శుద్ధాంత సిద్ధాంతమై యొప్పు నీ సత్కథాపార చంచత్సుధాసారపూరంబులం గ్రోలి, సౌఖ్యోన్నతిన్ సోలి, ధీయుక్తులై వ్రాలి, తాపంబులం దోలి, మోదంబులం దేలి, సంపన్నులై మన్న నిత్యప్రపన్నుల్ మహోత్కంఠతం బేర్చి వైకుంఠ ధామంబు నల్పక్రియాలోలురై కాంతు; రద్దివ్యవాసైక సంప్రాప్తికిం గోరుచున్నార; మో దేవ! వైరాగ్యవిజ్ఞాన బోధాత్మ యోగక్రియారూఢి నంతర్బహిర్వ్యాప్తిఁ జాలించి శుద్ధాంతరంగంబు గావించి హృత్పద్మవాసుండవై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో విలాసోల్లసన్మూర్తిఁ జిత్తంబులం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వర శ్రేణికిం దావకీనానుకంపానులబ్ధిస్ఫుటజ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెంద; దో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తీ! భవద్దాసులైనట్టి మమ్మున్ జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్యవిస్ఫూర్తిఁ బుట్టించినం బుట్టుటే కాక నీ భవ్యలీలానుమేయంబుగా సృష్టినిర్మాణముం జేయ నే మెంతవారౌదు? మీ శక్తి యుక్తిన్ భవత్పూజ గావింతు; మట్లుండె నీ సత్కళాజాతులై నట్టి మమ్మెన్నఁగా నేల? యధ్యాత్మతత్త్వంబ వన్నం బరంజ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధిష్ఠాతవన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్త్వాదిత్రైగుణ్య మూలంబు నా నొప్పు మాయా గుణంబందు నుద్యన్మహా తత్త్వ మైనట్టి నీ వీర్యముం బెట్టుటం జేసి నీ వింతకుం గారణం బౌదు! వాయాయి కాలంబుల న్నీకు సౌఖ్యంబు లేమెట్లు గావింతు? మే రీతి నన్నంబు భక్షింతు? మెబ్భంగి వర్తింతు? మే నిల్కడన్నుందు? మీ జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచు న్నున్న యి క్కార్యసంధానులై నట్టి మాకుం జగత్కల్పనా శక్తికిన్ దేవ! నీ శక్తిఁ దోడ్పాటు గావించి, విజ్ఞానముం జూపి, కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీమనఃపల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరోహంస! దేవాదిదేవా! నమస్తే నమస్తే నమః. | 203 |
| సీ. |
అనినఁబ్రసన్నుఁడై హరి మహదాదుల కన్యోన్యమిత్రత్వ మందకున్న కతమున నిఖిలజగత్కల్పనాశక్తి వొడమ కుండుటఁదన బుద్ధి నెఱిఁగి కైకొని కాలవేగమున నుద్రేకంబు నొందిన ప్రకృతితోఁబొంది నిజ బ లము నిల్పి తా నురుక్రముఁడన సప్తవింశతి తత్త్వములయందు సమత నొక్క |
|
| తే. |
పరి ప్రవేశించి యా తత్త్వభవ్యగుణము, నందు జ్యేష్ఠానురూపంబు లలరఁ జెంది యొకటి నొకటిని గలయక యుండి విశ్వ, రచన మెఱుఁగని యా తత్త్వ నిచయమునకు. |
204 |
| వ. | ఇట్లు విశ్వనిర్మాణ నిపుణత్వంబు నెఱుంగం జూపుచు నన్నింటికి నన్యోన్యతం గల్పించి తన యనుగ్రహంబునం బ్రేరితంబై కానంబడి క్రియాసామర్థ్యంబునం జెన్నొందిన తత్త్వవితానంబు దేవప్రేరితం బయి స్వకీయంబు లగు నంశంబులచేతం బుట్టించిన విరాడ్విగ్రహంబై తత్త్వవితతి దమయందుఁ జెందిన పుండరీకాక్షుని కళాంశంబున నొకటి కొకటికి నైక్యంబు వాటిల్లి పరిణతంబై రూపాంతరంబును జెందు;నే తత్త్వంబునఁ జరాచరలోక పుంజంబులు నిండియుండు నా హిరణ్మయంబైన విరాడ్విగ్రహంబు నొందిన పురుషుండు సర్వజీవసమేతుండై యుండె నంత. | 205 |
| క. |
జలములలోపల నిమ్ముల, జలరుహజాతాండమందు సాహస్రాబ్దం బులు నిలిచెఁ గార్యరూపా, కలితంబగు నవ్విరాట్సుగర్భము వరుసన్. |
206 |
| తే. |
దైవకర్మాత్మ శక్తి వితానములను, దగిలి తనచేతఁదనుఁదాన దైవశక్తి యగుచు వెలుఁగొందుచును బ్రకారాంతరమునఁ, దనువు వితతంబు గాని చైతన్య మొంది. |
207 |
| తే. |
రూపసంసక్తిఁజేసి నిరూఢకర్మ, శక్తియును వృత్తిభేదసంసక్తి దశ వి ధములు గలిగిన ప్రాణరూపమున నాత్మ, శక్తి బోధత్వ మగుచున్న శక్తి కలిగి. |
208 |
| క. |
త్రివిధంబగుచును నాధ్యా, త్మ విభేదంబులను బాపి మఱి యధిభూతా త్మ విరాడ్రూప మ్మగు నిది, వివిధప్రాణులకు నాత్మవిధమై మఱియున్. |
209 |
| క. |
జీవంబై పరమాత్మకుఁ, దావలమై యాదిమావతారంబగు న ద్దేవుని గర్భంబున భూ, తావలితోడం బ్రపంచ మర్థిం దోఁచెన్. |
210 |
| వ. | ఇట్లు దోఁచిన విరాట్పురుషుం డాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులను భేదంబులచేఁ బూర్వోక్త క్రమంబున వెలుఁగొందు ననుచు విదురునకు మైత్రేయుం డెఱింగించె నని చెప్పి వెండియు నిట్లనియె. | 211 |
| చ. |
హరి పరమాత్ముఁ డీశుఁ డజుఁ డాఢ్యుఁ డనంతుఁ డనంతమూర్తి సా గర తనయాహృదీశుఁడు వికారవిదూరుఁడు నిత్యమంగళా కరుఁడు కృపాపయోనిధి యకల్మషచిత్తుఁడు సర్వశక్తి తా మరసవిలోచనుండు బుధమాన్యచరిత్రపవిత్రుఁడిమ్ములన్. |
212 |
| వ. | ఇత్తెఱంగున నీశుండగు నధోక్షజుండు మహదాది తత్త్వంబుల మనంబుల ఘనంబులగు తలంపులు దానెఱిఁగి యట్టి తత్త్వంబుల వివిధవృత్తి లాభంబునకై స్వకీయ చిచ్ఛక్తిచే నిట్టు లొనర్తునని చింతించి నిజకళాకలితంబగు విరాడ్విగ్రహంబునందు నగ్ని ప్రముఖంబగు దేవతావళి కెల్ల నివాసం బగుచుఁ గానంబడిన వైరాజపురుషుని యాస్యాద్యవయవంబుల వినిపింతు; దత్తావధానుండవై వినుము. | 213 |
| సీ. |
నరనుత! యా దివ్యపురుషోత్తముని పృథగ్భావంబు నొంది ముఖంబువలన భువనపాలకుఁడైన పవమాన సఖుఁ డంత రాత్ముఁ డీశ్వరు నంశ మైన వాణి కనయంబు ననుకూల మగుచు నిజస్థానమునఁ బ్రవేశించిన ముఖమునందుఁ బరఁగు జీవుండు శబ్దము నుచ్చరించుఁ బృథగ్భావములను నేత్రముల నినుఁడు |
|
| తే. |
చక్షురింద్రియయుక్తుఁడై సరవిఁ జెంది, రూపవిజ్ఞానమహిమ నిరూఢి నొందు మఱియుఁజర్మంబునను బవమానుఁ డీశ్వ, రాంశమై తత్త్వగింద్రియమందుఁగూడి. |
214 |
| వ. | నిజనివాసంబు నాశ్రయించిన జీవుండు స్పర్శేంద్రియ గతుండగు పృథగ్భావంబైన శ్రోత్రంబుల దిక్కు లచ్యుత కళాంశంబులగు, శ్రవణేంద్రియ యుక్తంబులై నిజస్థానంబునం బొందిన జీవుండు శబ్దజ్ఞాన గతుండగు; వెండియుఁ దాలువు నిర్భిన్నం బయిన లోకపాలుండగు వరుణుం డందుఁ బ్రవేశించి రసనేంద్రియంబుచేఁ బ్రకాశించినం బ్రాణి రసంబులం గ్రహించెఁ; బరమేశ్వరుని నాసికేంద్రియంబు పృథగ్భావంబు నొంది యాశ్వినేయాధిష్ఠానంబై ఘ్రాణాంశంబు నొందిన జంతువు గంధగ్రహణ సమర్థంబయ్యె; వెండియు భిన్నంబయిన చర్మంబును నోషధులును బరమపురుషాంశంబు లయిన కేశంబులంగూడి నిజనివాసంబు నొందిన జీవుండు కండూయమానుండగు; భిన్న భూతంబైన మేఢ్రంబునం బ్రజాపతి రేతంబున నిజస్థానంబు నొందిన జీవుం డానందంబునం బొరయు; భిన్నభావంబైన గుదంబున మిత్రుం డచ్యుతాంశంబును బొంది వాయువుం గూడి నిజాధిష్ఠానంబు నొందిన జీవుండు విసర్గంబుఁ జెందు; వేఱు వేఱైన బాహువులం ద్రిదశాధీశ్వరుండయిన పురందరుండు క్రయవిక్రయాది శక్తియుక్తుం డగుచు నిజస్థానంబు నొందిన జీవుండు వానిచేత జీవికం బొందు; మఱియుఁ బాదంబులు నిర్భిన్నంబు లయిన విష్ణుండు స్వావాసంబు గైకొని గతిశక్తిం బొందిన జీవుండు గమనాగమ నార్హుండయ్యె; వెండియు భిన్నభావంబయిన హృదయంబు మనంబుతోడం గలిసి నిజాధిష్ఠానంబునం జంద్రుండు ప్రవేశించిన జీవుండు శరీరసంకల్పాది రూపంబగు వికారంబునుం బొందు; భిన్నభావంబైన యహంకారంబున నహంకృతి యుక్తుండై రుద్రుండు నిజస్థానంబుగా వసియించు; నా యహంకృతిచే శరీరి కర్తవ్యంబులు నడపు; బుద్ధి వాగీశ్వరావాసంబై హృదయంబు తోడం గలిసి నిజాధిష్ఠానంబున బోధాంశంబుచే వెలింగిన శరీరి బోద్ధవ్యతం బొందు; భిన్నంబైన చిత్తంబు బ్రహ్మావాసంబై చేతనాంశంబు నొందినఁ బ్రాణి విజ్ఞానంబునుం బొందు; నట్టి విరాట్పురుషుని శీర్షంబున స్వర్గంబును, జరణంబుల వసుమతియు, నాభియందు గగనంబునుం గలిగె; సత్త్వాదిగుణ పరిణామంబుల నమరులైరి; ఊర్జిత సత్త్వగుణంబున న ద్దేవతలు త్రిదివంబునుం బొందిరి; రజోగుణంబున మనుజులును గవాదులును ధరణిం బొందిరి; తామసంబున భూతాదులైన రుద్రపారిషదులు ద్యావాపృథి వ్యంతరంబగు వియత్తలంబునుం బొందిరి; ముఖంబువలన నామ్నాయంబు లుత్పన్నంబులయ్యె. వెండియు- | 215 |
| క. |
ధరణీదివిజులు శ్రుతులును, నరవర! యమ్మేటి ముఖమునంబొడముట భూ సురుఁ డఖిలవర్ణములకున్, గురుఁడున్ ముఖ్యుండు నయ్యె గుణరత్ననిధీ! |
216 |
| క. |
ధర బ్రాహ్మణాదికము ద, స్కర బాధలఁ బొందకుండఁ గైకొని కావం బురుషోత్తము బాహువులన్, నరనాథకులంబు పుట్టె నయతత్త్వనిధీ! |
217 |
| క. |
గణుతింపఁగఁ గృషిగో ర, క్షణవాణిజ్యాది కర్మకలితంబుగ నా గుణనిధి యూరువులందుం, బ్రణుతింపఁగ వైశ్యజాతి ప్రభవం బయ్యెన్. |
218 |
| తే. |
తివిరి సేవక ధర్ములై దేవదేవు, పదములను శూద్రసంతతు లుదయమైరి వీర లందఱుఁదమ తమ విహితకర్మ, మలరఁజేయుచు జనకుండు నాత్మగురుఁడు |
219 |
| క. |
అగు సర్వేశుఁ బరాత్పరు, జగదేకప్రభుని పాదజలజాతంబుల్ దగిలి భజింతురు సతతము, నిగమోక్తిన్ భక్తియోగనిపుణాత్మకులై. |
220 |
| తే. |
మహిమ దీపింపఁ గాలకర్మ స్వభావ, శక్తి సంయుక్తుఁడగు పరేశ్వరుని భూరి యోగమాయా విజృంభణోద్యోగ మెవ్వఁ, డెఱిఁగి నుతియింపఁగా నోపు నిద్ధచరిత! |
221 |
| ఉ. |
అన్యకథానులాపము లహర్నిశముంబఠియించి చాల మా లిన్యము నాత్మశోభనవిలీనత నొందు మదీయజిహ్వ సౌ జన్యము నొందె నేఁడు హరిసద్గుణ దివ్యకథామృతంబు స న్మాన్యచరిత్రమై నెగడు మద్గురువాక్యపదంబుఁజెందఁగన్. |
222 |
| మ. |
హరినామాంకిత సత్కథామృతరసవ్యాలోలుఁడైనట్టి స త్పురుషశ్రేష్ఠుఁడసత్కథాలవణవాఃపూరంబుఁదాఁగ్రోలునే? వరమందారమరందపానకుతుకస్వాంతద్విరేఫంబు స త్వరమై పోవునె చేఁదు వేములకుఁదద్గంధానుమోదాత్మమై. |
223 |
| క. |
హరిమహిమముఁ దన్నాభీ, సరసిజసంజాతుఁడైన చతురాననుఁడుం బరికించి యెఱుఁగఁడన్న ని, తరమనుజులఁజెప్పనేల తత్త్వజ్ఞనిధీ! |
224 |
| తే. |
శ్రుతులు దమలోన వివరించి చూచి పుండ, రీకలోచను నుత్తమశ్లోకచరితు నమరగుణవంద్యమానపాదాబ్జయుగళు, వెదకి కనుఁగొనలేవండ్రు విమలమతులు. |
225 |
| క. |
హరియుందన మాయాగతిఁ, బరికించియుఁ గానఁడయ్యెఁబరిమితి లేమిన్ మఱి మాయావిని మోహిని, చరితముఁగనుఁగొందు రెట్లు చతురాస్యాదుల్? |
226 |
| క. |
ఆ దివిజాధీశుఁడు, మహదాదులు, దిక్పతులుఁ, బంకజాసనుఁడున్, గౌ రీ దయితుఁడు గనఁజాలని, శ్రీ దేవుని పదయుగంబుఁజింతింతు మదిన్. |
227 |
| క. |
అని మైత్రేయుం డవ్విదు, రున కెఱిఁగించిన తెఱంగు రుచిరముగా న ర్జునపౌత్త్రునకుఁ బరాశర, ముని మనుమం డెఱుఁగఁజెప్పి ముదము దలిర్పన్. |
228 |
| వ. | వెండియు నిట్లనియె. | 229 |
| క. |
భూమీశ్వర! మైత్రేయ మ, హాముని విదురునకు నట్లు హరి శుభగుణ లీ లా మాహాత్మ్యముఁజెప్పిన, నా మైత్రేయునకు విదురుఁడనియెన్ మఱియున్. |
230 |
| క. |
అగుణుండగు నీశ్వరునకు, జగదవనోద్భవవినాశసత్కర్మములుం దగులీల లెట్టు లాతఁడు, సగుణుండై యుండు టెట్లు సౌజన్యనిధీ! |
231 |
| సీ. |
అని యర్భకునిగతి యనుకొని మైత్రేయమునిఁజూచి విదురుఁడిట్లనియె మరల బాలుఁడు క్రీడావిలోలమానసమున దీపించు లీలానురూపుఁడగుచుఁ గానిచోఁగామానుగతుఁడై రమించును నర్భకుఁడర్థి వస్త్వంతరమున నర్భకాంతరమున నైనను బాలకేళీసంగుఁ డగుచు నోలిని జరించు |
|
| తే. |
హరియు నెపుడు నివృత్తుఁడత్యంతతృప్తుఁ, డగుట వర్తించు టెట్లు క్రీడాదులందు? మఱియుఁద్రిగుణాత్మకంబైన మాయఁగూడి, యఖిలజగములఁగల్పించె ననుట యెట్లు? |
232 |
| సీ. |
అమ్మాయచేత నీ యఖిలంబు సృజియించి పాలించి పొలియించి పరమపురుషుఁ డనఘాత్మ! దేశకాలావస్థలందును నితరులయందు నహీనమైన జ్ఞానస్వభావంబుఁబూని యా ప్రకృతితో నెబ్భంగిఁగలసె దా నేకమయ్యుఁ గోరి సమస్తశరీరంబులందును జీవరూపమున వసించి యున్న |
|
| తే. |
జీవునకు దుర్భగక్లేశసిద్ధి యెట్టి, కర్మమున సంభవించెను? గడఁగి నాదు చిత్త మజ్ఞానదుర్గమస్థితిఁగలంగి, యధికఖేదంబు నొందెడు ననఘచరిత! |
233 |
| వ. | అది గావున సూరిజనోత్తముఁడవైన నీవు మదీయ మానసిక సంశయంబులం దొలఁగింప నర్హుండవని విదురుండు మైత్రేయమహామునీంద్రు నడిగె నని బాదరాయణతనూభవుఁడభిమన్యునందనున కిట్లనియె. | 234 |
| క. |
సరసిరుహోదరమంగళ, చరితామృతపానకుతుకసంగంబున ని ర్భరుఁడగు విదురునకు మునీ, శ్వరుఁ డగు మైత్రేయుఁడనియె సజ్జనతిలకా! |
235 |
| చ. |
వినుము వితర్కవాదములు విష్ణుని ఫుల్లసరోజపత్ర నే త్రుని ఘనమాయ నెప్పుడు విరోధము సేయుఁ బరేశు నిత్య శో భనయుతు బంధనాదికవిపద్దశలుం గృపణత్వ మెప్పుడే ననయముఁబొందలేవు విభుఁడాద్యుఁడనంతుఁడు నిత్యుఁడౌటచేన్. |
236 |
| వ. | మఱియును. | 237 |
| చ. |
పురుషుఁడు నిద్రవోఁ గలలఁబొందు సమస్తసుఖంబు లాత్మ సం హరణశిరోవిఖండనము లాదిగ జీవునికింబ్రబోధమం దరయఁగఁ దోఁచుచున్న గతి నాదిఁ బరేశుఁడు బంధనాదులం బొరయక తక్కు టెట్లనుచు బుద్ధిని సంశయ మందె దేనియున్. |
238 |
| వ. | అవ్విధంబతనికింగలుగ నేర దది యెట్లంటేని- | 239 |
| చ. |
లలితవిలోలనిర్మలజలప్రతిబింబిత పూర్ణచంద్ర మం డలము దదంబుచాలనవిడంబన హేతువు నొందియున్ వియ త్తలమునఁగంప మొందని విధంబున సర్వశరీరధర్మముల్ గలిగి రమించు నీశునకుఁగల్గఁగనేరవు కర్మబంధముల్. |
240 |
| వ. | కావున జీవునకు నవిద్యామహిమంజేసి కర్మబంధనాదికంబు సంప్రాప్తం బగుంగాని సర్వభూతాంతర్యామి యైన యీశ్వరునకుంబ్రాప్తంబు గానేరదని వెండియు | 241 |
| చ. |
నరునకు నాత్మదేహజగుణంబులఁబాపఁగ నోపుఁ బంకజో దరచరణారవిందమహితస్ఫుటభక్తియ; యింద్రియంబు లీ శ్వరవిషయంబులైన మది సంచితనిశ్చలతత్త్వ మైనచో సరసిజనేత్రు కీర్తనమె చాలు విపద్దశలన్ జయింపఁగన్. |
242 |
| చ. |
హరిచరణారవిందయుగళార్చనసన్నుతి భక్తియోగముల్ నిరతముఁగల్గువారు భవ నీరజగర్భుల కందరాని భా సురపదమందుఁజేరుదురు; సూరిజనస్తవనీయ! యట్టి స త్పురుషుల పూర్వజన్మఫలమున్ గణుతింపఁ దరంబె యేరికిన్. |
243 |
| వ. | అని చెప్పిన విదురుండు మైత్రేయుం గనుంగొని ముకుళిత హస్తుండును వినమిత మస్తకుండును నగుచుఁ దన మనంబున శ్రీహరిం దలంచుచు వినయ వచనరచనుండై యిట్లనియె. మునీంద్రా! భవదీయ వాక్యంబులచేత నా మనంబున నారాయణుండు లోకైకనాథుం డెట్లయ్యె ననియు, శరీరధారియైన జీవునికిఁ గర్మబంధంబు లేరీతి సంభవించె ననియునుం బొడమిన సంశయంబు నేఁడు నివృత్తం బయ్యె; నెట్లనిన లోకంబున కీశ్వరుండు హరి యనియు జీవుండు పరతంత్రుం డనియును దలంపుదు; నారాయణభక్తిప్రభావంబు ప్రాణిగోచరంబైన యవిద్యకు నాశనకారణం బనం దనరుచుండు; నారాయణుండు దనకు నాధారంబు లేక సమస్తంబునకుం దాన యాధారభూతుండై విశ్వంబుం బొదివి యందుఁ దా నుండు తెఱంగెట్లు? శరీరాభిమానంబును బొంది యెవ్వఁడు మూఢతముండై సంసారప్రవర్తకుం డగు? నెవ్వండు భక్తిమార్గంబునఁ బరమాత్ముండైన పుండరీకాక్షునిం జెందు? వీర లిద్దఱును సంశయ క్లేశంబులు లేమింజేసి సుఖానంద పరిపూర్ణులై యభివృద్ధి నొందువార లగుదు; రెవ్వండు సుఖదుఃఖానుసంధానంబుచే లోకానుగతుం డగుచుం బ్రమోద వేదనంబుల నొందు; నతండు దుఃఖాశ్రయుండగు; నారాయణ భజనంబున సమస్త దుఃఖనివారణం బగునని భవదీయచరణ సేవానిమిత్తంబునం గంటిఁ: బ్రపంచంబు ప్రతీతిమాత్రంబు గలిగి యున్న దయిన నందులకుఁ గారణంబు లేకుండుటంజేసి తెలియనివాఁడనై వర్తింతునని వెండియు. | 244 |
| క. |
లలి నా మదిఁ దలఁపుదు సుమ, తులు గొనియాడంగఁదగిన తోయజనాభుం డలవడఁ డల్పతపోనిరతుల, తలపోఁతలకు మిగుల దుర్లభుఁ డనియున్. |
245 |
| సీ. |
ఇంద్రియంబులతోడ నెలమి నొప్పెడి మహదాదుల నితరేతరానుషంగ ముగఁజేసి వానియందొగి విరాడ్దేహంబు పుట్టించి యందుఁజేపట్టి తాను వసియించు నాతఁడు వరుస సహస్ర సంఖ్యాకంబులగు మస్తకాంఘ్రిబాహు కలితసత్పురుషునిగా బ్రహ్మవాదులు పలుకుదు రా విరాట్ప్రభువునందు |
|
| తే. |
భువనజాలంబు లలజడిఁ బొరయకుండుఁ, బ్రాణదశకంబు నింద్రియార్థములు నింద్రి యాధిదైవతములుఁగూడ ననఘ! త్రివిధ, మగుచు విప్రాదివర్ణము లయ్యె నందు. |
246 |
| క. |
ఇలఁ బుత్త్రపౌత్త్రసంపద, గలిగిన వంశములతోడఁ గడుఁ జోద్యముగా లలిఁ బ్రజ లే గతిఁ గలిగిరి?, కలిగిన యాప్రజలచే జగము లెట్లుండెన్? |
247 |
| క. |
చతురత దీపింపఁ బ్రజా, పతులకుఁ బతి యనఁగ వెలయు పద్మాపతి యే గతిఁ బుట్టించెను స్రష్టృ, ప్రతతులచే నవవిధప్రపంచము మఱియున్. |
248 |
| తే. |
వాని భేదంబులును మనువంశములును, మనుకులాధీశ్వరులును దన్మనుకులాను చరితములు నే విభూతి నే జాడ దీని, నింతయునుఁబుట్టఁజేసె? నా కెఱుఁగఁబలుకు. |
249 |
| క. |
సరవిం గ్రిందన్ మీఁదం, ధరణికిఁగల లోకములను దత్తత్‌స్థితులన్ వరుసంబరిణామంబుల, నెఱిఁగింపఁ గదయ్య నాకు నిద్ధచరిత్రా! |
250 |
| క. |
సురతిర్యఙ్నరరాక్షస, గరుడోరగసిద్ధసాధ్యగంధర్వ నభ శ్చరముఖభవములు మునికుం, జర! గర్భజస్వేదజాండజముల తెఱంగున్. |
251 |
| క. |
త్రిగుణప్రధానకంబుగ, నగు నవతారములఁబూర్ణమై వెలసిన యా జగదుత్పత్తి స్థితిలయ, నిగమముల విధంబు వాని నిలుకడలు దగన్. |
252 |
| క. |
చక్రాయుధుసౌందర్య ప, రాక్రమముఖగుణములును, ధరామరముఖ వ ర్ణ క్రమములు, నాశ్రమ ధ, ర్మక్రియలును, శీలవృత్తమతభావములున్. |
253 |
| తే. |
యోగవిస్తారమహిమలు యాగములును, జ్ఞానమార్గములును బరిజ్ఞానసాధ నములునై యొప్పు సాంఖ్యయోగములు వికచ, జలజనయన స్మృతంబులౌ శాస్త్రములును. |
254 |
| సీ. |
పాషండమార్గంబుఁ బ్రతిలోమకుల విభాగములు జీవులు గుణకర్మములును బలుకులు గతులును గలిగెడి ధర్మమోక్షములయందలి పరస్పరవిరోధ ములు లేని సాధనములు భూమిపాలక నీతివార్తలు దండనీతి జాడ యును బృథగ్భావంబులును విధానములును బితృమేధములును దత్పితృవిసర్గ |
|
| తే. |
గతులుఁ దారాగ్రహంబులుఁ గాలచక్ర, మున వసించిన నిలుకడలును దపములు దానములుఁ దత్ఫలంబులుఁ దనరు ప్రబల, ధర్మములు బ్రజ లొనరించు కర్మములును. |
255 |
| చ. |
వదలక భూజనావళికి వచ్చు విపద్దశధర్మముల్, సరో జదళనిభాక్షుఁడేగతిని సంతస మందెడు? నెట్టివారి మేల్ వదలక కానవచ్చు, గురులంబ్రియశిష్యులు గొల్వ వారు స మ్మదమునఁగోరు నర్థములు మానుగ నెట్లెఱిఁగింతు రిమ్ములన్. |
256 |
| క. |
విలయాదిభేదముల న, య్యలఘునిఁబరమేశు నెవ్వ రంచితభక్తిం గొలుతు రదెవ్వరిలో ను, త్కలికన్ సుఖియించు జీవతత్త్వము? మఱియున్. |
257 |
| క. |
గోవిందుని రూపంబును, జీవబ్రహ్మలకు నైక్యసిద్ధియు నెటులౌ? భావన నుపనిషదర్థం, బై వెలసెడి జ్ఞాన మెట్టి దార్యస్తుత్యా! |
258 |
| తే. |
ఉచితమగునట్టి శిష్యప్రయోజనములు, సజ్జనులచేత విజ్ఞానసాధనములు నేమి పలుకంగఁబడు, వాని నెల్ల మఱియుఁ, బొలుచు వైరాగ్యమునఁదగు పురుషభక్తి. |
259 |
| తే. |
ఇన్నియుఁదెలియ నానతి యిచ్చి నన్ను, నర్థి రక్షింపు; యజ్ఞదానాదిపుణ్య ఫలము, వేదంబు సదివిన ఫలము, నార్త, జనులఁగాచిన ఫలముతో సమము గావు. |
260 |
| క. |
అని విదురుఁడు మైత్రేయుని, వినయంబునఁదెలియ నడుగు విధమెల్లను వ్యా సుని సుతుఁ డభిమన్యుని నం, దనున కెఱింగించి మఱియుఁదగ నిట్లనియెన్. |
261 |
| చ. |
ఇలఁగల మానవావళికి నెల్ల నుతింప భజింప యోగ్యమై వెలసిన పూరువంశము పవిత్రము సేయఁగఁబుట్టి సద్గుణా కలితయశఃప్రసూనలతికాతతికింబ్రతివాసరంబుఁ బెం పలరఁగఁబ్రోదివెట్టుదు గదయ్య! ముకుందకథామృతంబునన్. |
262 |
| తే. |
అల్పతరమైన సుఖముల నందుచున్న, జనుల దుఃఖంబు మాన్పంగఁజాలునట్టి పుండరీకాక్షగుణకథాప్రోతమైన, వితతనిగమార్థమగు భాగవతము నీకు. |
263 |
| వ. | ఎఱింగింతు విను మని యిట్లనియె. | 264 |
| సీ. |
అమ్మహాభాగవతామ్నాయ మొకనాఁడు గైకొని పాతాళలోకమందు నప్రతిహతబుద్ధియై వాసుదేవాఖ్యఁబొలుచు సంకర్షణమూర్తి దివ్య పురుషుండు దనుఁ దాన బుద్ధిలోఁ జూచుచు సలలితధ్యానముకుళితనేత్రుఁ డై సనందాభ్యుదయార్థంబు గను విచ్చి చూచినవారు సంస్తుతు లొనర్ప |
|
| తే. |
నమరగంగావగాహనులై యహీంద్ర, కన్య లార్ద్రజటాబంధకలిత లగుచు భర్తృవాంఛానుబుద్ధి నప్పరమపురుషుఁ, గదియ నేతెంచి తత్పాదకమలయుగము. |
265 |
| క. |
సేవించి భక్తితో నా, నావిధ పూజోపహారనతినుతులను నా దేవుని హృదయము వడసిరి, యావేళ సనందనాదు లమ్మహితాత్మున్. |
266 |
| మ. |
ఘనసాహస్రకిరీటరత్నవిలసత్కాంతప్రసిద్ధప్రభా జనితోదగ్రరుచి ప్రకాశితఫణాసాహస్రుఁడౌ దేవతా వనదీక్షాచణు రూపకృత్యము లొగిన్ వాంఛం బ్రశంసించి వా రనురాగస్ఖలితోక్తు లొప్ప నడుగన్ హర్షించి యా దేవుఁడున్. |
267 |
| తే. |
భూరి నిగమార్థసార విచార మగుచుఁ, దనరు నీ భాగవతము సాదరతఁ బలికె నలినభవసూతి యైన సనత్కుమార, కునకు నెఱిఁగించె సాంఖ్యాయనునకు నతఁడు. |
268 |
| క. |
పరఁగ నతండంతఁ బరా, శరునకు నుపదేశ మిచ్చె సమ్మతి; నతఁడున్ సురగురున కొసఁగె; నాతఁడు, గర మరుదుగ నాకుఁజెప్పెఁగైకొని యేనున్. |
269 |
| క. |
నీ కిప్పుడు వివరించెద, నాకర్ణింపుము సరోరుహాక్షుండగు సు శ్లోకుని చరితామృత పరి, షేకుఁడవై ముదము గదురఁజెలఁగుము విదురా! |
270 |
| వ. | ఇట్లు భగవత్ప్రోక్తంబును, ఋషి సంప్రదాయానుగతంబును, పురుషోత్తమస్తోత్రంబును, పరమ పవిత్రంబును, భవలతాలవిత్రంబును నయిన భాగవత కథా ప్రపంచంబు శ్రద్ధాళుండవు భక్తుండవు నగు నీకు నుపస్యసించెద, వినుము. | 271 |
| సీ. |
అనఘ! యేకోదకమై యున్న వేళ నంతర్నిరుద్ధానల దారువితతి భాతిఁ జిచ్ఛక్తి సమేతుఁడై కపట నిద్రాలోలుఁ డగుచు నిమీలితాక్షుఁ డైన నారాయణుండంబుమధ్యమున భాసురసుధాఫేనపాండురశరీర రుచులు సహస్రశిరోరత్నరుచులతోఁ జెలిమి సేయఁగ నొప్పు శేష భోగ |
|
| తే. |
తల్పమునఁబవ్వళించి యనల్పతత్త్వ, దీప్తిఁ జెన్నొందఁగా నద్వితీయుఁడగుచు నభిరతుండయ్యుఁగోర్కులయందుఁ బాసి, ప్రవిమలాకృతి నానందభరితుఁ డగుచు. |
272 |
| తే. |
యోగమాయా విదూరుఁడై యుగసహస్ర, కాలపర్యంత మఖిలలోకములు మ్రింగి పేర్చి మఱి కాలశక్త్యుపబృంహితమున, సమత సృష్టిక్రియాకలాపములఁదగిలి. |
273 |
| క. |
తన జఠరములోపలఁదాఁ, చిన లోకనికాయముల సృజించుటకును సా ధనమగు సూక్ష్మార్థము మన, సునఁగని కాలానుగతరజోగుణ మంతన్. |
274 |
| సీ. |
పుట్టించెఁదద్గుణంబునఁబరమేశ్వరు నాభిదేశమునందు నలిననాళ ముదయించె మఱి యప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందుఁ దన తేజమునఁబ్రవృద్ధంబైన జలముచే జలజాప్తుగతిఁ బ్రకాశంబు నొందఁ జేసి లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందు |
|
| తే. |
నిజకళా కలితాంశంబు నిలిపె, దానివలన నామ్నాయమయుఁడును వరగుణుండు నాత్మయోనియు నైన తోయజభవుండు, సరవిఁజతురాననుండు నా జనన మయ్యె. |
275 |
| తే. |
అతఁడు తత్పద్మకర్ణికయందు నిలిచి, వికచలోచనుఁడై లోకవితతి దిశలు నంబరంబును నిజచతురాననములఁ, గలయఁబరికించి చూచుచుఁగమలభవుఁడు. |
276 |
| చ. |
అలఘుయుగాంతకాలపవనాహతసంచలదూర్మిజాల సం కలితజలప్రభూత మగు కంజముఁదద్వనజాత కర్ణికా తలమున నున్న తన్ను విశదక్రియఁగల్గిన లోకతత్త్వమున్ నలిఁదెలియంగ నోపక మనంబునఁజాల విచార మొందుచున్. |
277 |
| వ. | ఇట్లని వితర్కించె. | 278 |
| ఉ. |
ఈ జలమందు నీ కమల మే గతి నుద్భవ మయ్యె? నొంటి యే నీ జలజాతపీఠమున నే గతి నుంటి? మదాఖ్య యెద్ది? నా కీ జననంబు నొందుటకు నెయ్యది హేతువు? బుద్ధిఁజూడ నే యోజ నెఱుంగలేనని పయోరుహగర్భుఁడు విస్మితాత్ముఁడై. |
279 |
| క. |
ఆ వనజనాళమూలం బా, వనములలోన నర్థి నరయుటకొఱకై యా వనజాతప్రభవుం, డా వనరుహనాళవివరమందభిముఖుఁడై. |
280 |
| మ. |
అతిగంభీరవిశాలవారినిధితోయాంతర్నిమగ్నాంగుఁడై చతురాస్యుండొగి దివ్యవత్సరసహస్రంబబ్జమూలంబు స న్మతి నీక్షించియుఁ గానలేక భగవన్మాయామహత్త్వంబు వి స్మృతిఁగావింప విభీతుఁడై మరలఁజేరెందత్సరోజాతమున్. |
281 |
| తే. |
అట్లు గ్రమ్మఱఁజేరి యయ్యబ్జపీఠ, మందు నష్టాంగయోగక్రియానురక్తిఁ బవను బంధించి మహితతపస్సమాధి, నుండి శతవర్షములు సనుచుండ నంత. |
282 |
| ఆ. |
అట్టి యోగజనితమైన విజ్ఞానంబు, గలిగియుండి దానఁ గమలనయనుఁ గానలేక హృదయకమలకర్ణికయందు, నున్నవానిఁదన్నుఁగన్నవాని. |
283 |
| మ. |
కనియెన్ నిశ్చలభక్తి యోగమహిమం గంజాతగర్భుండు శో భనచారిత్రు జగత్పవిత్రు విలసత్పద్మాకళత్రున్ సుధా శనముఖ్యస్తుతిపాత్రు దానవచమూజైత్రున్ దళత్పద్మ నే త్రు నవీనోజ్జ్వలనీలమేఘనిభగాత్రుం బక్షిరాట్పత్త్రునిన్. |
284 |
| వ. | మఱియును. | 285 |
| చ. |
అలఘుఫణాతపత్ర నిచయాగ్ర సమంచిత నూత్నరత్న ని ర్మలరుచిచే యుగాంతతిమిరంబు నడంచి యకల్మషోల్లస జ్జలములఁజేసి యందు నవసారసనాళసితైక భోగముం గలిగిన శేషతల్పమును గైకొని యున్న మహాత్ము నొక్కనిన్. |
286 |
| సీ. |
వరపీతకౌశేయపరిధానకాంతి సంధ్యాంబుదరుచినిచయంబు గాఁగఁ గమనీయనవహేమకలితకిరీటంబు రమణఁ గాంచనశిఖరంబు గాఁగ మానితమౌక్తికమాలికారుచి సాను పతితనిర్ఝరపరంపరలు గాఁగఁ జెలువొందు నవతులసీదామకములు లాలితతటజౌషధీలతలు గాఁగ |
|
| తే. |
వరభుజంబులు నికటస్థవంశములుగఁ, బదము లంగణపాదపప్రచయములుగ లలితగతి నొప్పు మరకతాచలవిడంబి, తాత్మ దేహంబు గలుగు మహాత్ము హరిని. |
287 |
| వ. | మఱియు నపరిచ్ఛిన్నంబును నిరుపమానంబును నిఖిలలోక సంగ్రహంబును నతివిస్తార వర్తులాయామం బును నై వివిధ విచిత్ర దివ్యమణి విభూషణంబుల నాత్మీయనిర్మల ద్యుతిచేతం బ్రకాశంబు నొందంజేయు దివ్య దేహంబు దనర వివిధంబులగు కామంబు లభిలషించి విశుద్ధంబైన వేదోక్తమార్గంబున భజియించు పురుషశ్రేష్ఠులకుఁ గామధేను వనం దగిన పాదపద్మ యుగంబును, నలిక ఫలక లలితరుచి నిచయంబులకు నోటువడి కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబులఁ బదసరోజంబుల నాశ్రయించె నన నొప్పు పదనఖంబులును, కమలాభూకాంతలకు నుపధానరూపంబు లనందగి నీలకదళికాస్తంభంబుల డంబు విడంబించు నూరు యుగళంబును, కనకమణిమయ మేఖలాకలాపాభిరామంబును, గదంబ కింజల్క శోభిత పీతాంబరాలంకృతంబునునై విలసిల్లు కటిమండలంబును, శృంగారవాహినీ జలావర్తంబు నాఁ బొలుపొందు నాభివివరంబును, జఠరస్థనిఖిల బ్రహ్మాండ ముహుర్ముహు రుద్భవకృశీభూతం బనం దగు మధ్యభాగంబును, మహిత ముక్తాఫలమాలికా విరచితరంగవల్లీ విరాజితంబు, నవతులసీదామ కిసలయతల్పంబుఁ, గుసుమ మాలికాలంకృతంబు, ఘనసార కస్తూరికా చందనవిలిప్తంబుఁ, గౌస్తుభరత్న దీప్తప్రదీప్తంబు, శ్రీవత్సలక్షణలక్షితంబు నై యిందిరారమణికిఁ గేళీమందిరం బనం బొల్చు వక్షస్స్థలంబును, సుఖకేళీ సమారంభ పరిరంభణాంభోధిరాట్కన్యకా కరాంభోజ కీలిత కనక మణికంకణ నికషంబులనం బొలుపారు రేఖాత్రయ విరాజమానంబైన కంబుకంధరంబును, సుమహితానర్ఘ దివ్యమణి ప్రభావిభాసిత కేయూర కంకణ ముద్రికాలంకృతంబు లయిన బాహువులును, సకలలోకార్తి నివారక దరహాసచంద్రికా ధవళితంబులై కర్ణకుండల మండన మణిమరీచులు నర్తనంబులు సలుపం దనరి నిద్దంబులగు చెక్కుటద్దంబులును, బరిపక్వ బింబఫల ప్రవాళపల్లవారుణాధరంబును, నఖిలభువన పరిపాలనంబునకు నేన చాలుదు నని వివాదించు నయనయుగళంబునకు సీమాస్తంభంబును, చంపక ప్రసూనరుచి విభాసంబును నగు నాసాదండంబును, గమలకుముదంబులకుం బెంపు సంపాదించుచుఁ గరుణామృత తరంగి తాపాంగంబులై కర్ణాంత విశ్రాంతంబులై చెలువొందు నేత్రంబులును, సలలితశ్రీకారంబునకు నక్షరత్వంబు సార్థకంబయ్యె ననందగు కర్ణంబులును, నిక్షుచాప చాప ద్వయంబునాఁ జూపట్టు భ్రూయుగళంబును, నపరపక్షాష్టమీ శశాంకశంకాస్పద ఫాలఫలకంబును, నీలగిరీంద్ర శృంగసంగత బాలమార్తాండ మండల విడంబిత పద్మరాగ మణిఖచిత కాంచన కిరీటంబునం బొలుపారి సూర్యేందు పవనానల ప్రకాశంబులకు నవకాశంబు సూపక త్రిలోక వ్యాపక సమర్థంబులగు తేజోవిశేషంబులఁ జెలువొంది సంగర రంగంబుల దానవానీకంబుల హరింపంజాలు సుదర్శనాదిదివ్యసాధనంబులచే దురాసదంబగు దివ్యరూపంబునుంగలిగి మఱియును. | 288 |
| ఉ. |
హారకలాపపుష్పనిచయంబులఁజంచదనర్ఘ రత్న కే యూరకరాంగుళీయకమహోజ్జ్వలబాహుసహస్రశాఖ లొ ప్పారఁగఁజూడ నొప్పి భువనాత్మకలీల నదృష్ట మూల వి స్ఫారితభోగివేష్టితవిభాసితచందనభూరుహాకృతిన్. |
289 |
| మ. |
విలసత్కుండలిరాజసఖ్యమున నుర్వీభృత్సమాఖ్యన్ సము జ్జ్వలితోదారశిరోవిభూషణసహస్రస్వర్ణకూటంబులన్ సలిలావాసతఁ జారుకౌస్తుభవిరాజద్రత్నగర్భంబునన్ నలినాక్షుండు గనుంగొనంగఁదగె మైనాకావనీభృద్గతిన్. |
290 |
| క. |
వితతార్థజ్ఞాన జప, స్తుతి మకరందప్రహృష్టశ్రుతిజాతమధు వ్రతగణపరివృతశోభా, గతకీర్తిప్రసవమాలికలు గలవానిన్. |
291 |
| వ. | కనుంగొని చతురాననుండు. | 292 |
| సీ. |
అనఘు సర్వేశ్వరు నాద్యంతశూన్యుని ధన్యుని జగదేకమాన్యచరితుఁ దన్నాభిసరసిజోద్భవసరోజంబును నప్పుల ననిలుని నంబరమును మానితభువననిర్మాణదృష్టిని బొడఁగనెఁ; గాని యితరముఁగానలేక యాత్మీయకర్మ బీజాంకురంబును రజోగుణయుక్తుఁడగుచు నకుంఠిత ప్ర |
|
| తే. |
జాభిసర్గాభిముఖత నవ్యక్తమార్గుఁ, డైన హరియందుఁ దన హృదయంబుఁజేర్చి యమ్మహాత్మునిఁబరము ననంతు నభవు, నజు నమేయుని నిట్లని యభినుతించె. |
293 |
| సీ. |
నలినాక్ష! మాయాగుణవ్యతికరమునఁ జేసి కార్యంబైన సృష్టిరూప మునఁబ్రకాశించు నీఘనరూపవిభవంబు రూపింప దేహధారులకు దుర్వి భావ్యంబు దలపోయ భగవంతుఁడవునైన పద్మాక్ష! నీ స్వరూపంబుకంటె నన్య మొక్కటి సత్యమై బోధకంబైన యది లేదు గాన నీ యతుల దివ్య |
|
| తే. |
మైన రూపంబు నాకుఁబ్రత్యక్షమయ్యె, నదియుఁ గాక వివేకోదయమునఁజేసి వరద! నీ రూప మజ్ఞానగురుతమో ని, వారకంబయ్యె నాకు శశ్వత్ప్రదీప! |
294 |
| క. |
ఘన సత్పురుషానుగ్రహ, మునకై యమితావతారమూలంబగుచుం దనరెడి నీరూపము శో, భనమగు భవదీయనాభిపద్మమువలనన్. |
295 |
| క. |
జననం బందిన నాచే, ననయము మొదలనె గృహీత మయ్యె; జగత్పా వన! నీదు సుస్వరూపము, ఘనరుచిరంబై స్వయంప్రకాశక మగుటన్. |
296 |
| వ. | మఱియు జ్ఞానానందపరిపూర్ణ మాత్రంబును, ననావృతప్రకాశంబును, భేదరహితంబును, బ్రపంచ జనకంబును, బ్రపంచ విలక్షణంబును, భూతేంద్రియాత్మకంబును, నేకంబును, నైన రూపంబు నొందియు నెందును బొడగాన నట్టి నిన్ను నాశ్రయించెద; నదియునుంగాక జగన్మంగళ స్వరూపధరుండవై నీ యుపాసకులమైన మా మంగళంబులకొఱకు నిరంతర ధ్యానంబుచేత నీ దివ్యరూపంబునం గానంబడితి, విట్టి నీవు నిరయభాక్కులై నిరీశ్వరవాదంబునం జేసి కుతర్కంబులు ప్రసంగించు భాగ్యరహితులచే నాదృతుండవు గావు; మఱియు కొందఱు కృతార్థులైన మహాత్ములు భవదీయ శ్రీచరణారవిందకోశగంధంబు వేదమారుతానీతం బగుటంజేసి తమ తమ కర్ణకుహరంబులచేత గ్రహించుదురు; వారల హృదయకమలంబులయందు భక్తిపారతంత్ర్యంబున గృహీతపాదారవిందంబులు గలిగి ప్రకాశింతు; వదియునుంగాక ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తం బయిన భయంబును దన్నాశనిమిత్తం బయిన శోకంబును, ద్రవ్యాది స్పృహయును దననిమిత్తం బయిన పరిభవంబును, మఱియు నందుఁ దృష్ణయు నది ప్రయాసంబున లబ్ధంబైన నార్తియు, తదీయంబైన వృథాగ్రహంబును నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబును బ్రాప్తంబు లగుంగాని మానవాత్మనాయకుండవగు నిన్ను నాశ్రయించిన భయనివృత్తి హేతువైన మోక్షంబు గలుగు; మఱియునుం గొందఱు సకలపాప నివర్తకంబయిన త్వదీయనామస్మరణ కీర్తనంబులందు విముఖులై కామ్యకర్మ ప్రావీణ్యంబునం జేసి నష్టమతులై యింద్రియ పరతంత్రులై యమంగళంబులైన కార్యంబులు సేయుచుందురు; దానంజేసి వాతాదిత్రిధాతు మూలంబైన క్షుత్తృడాదులచేతను, శీతోష్ణవర్ష వాతాది దుఃఖంబులచేతను, నతిదీర్ఘంబైన కామాగ్నిచేతను, నవిచ్ఛిన్నంబగు క్రోధంబుచేతనుం దప్యమాను లగుదురు; వారలం గనిన నా చిత్తంబు గలంకం బొందు; జీవుండు భవదీయమాయా పరిభ్రామ్యమాణుండై యాత్మ వేఱని యెప్పుడు దెలియు, నంత కాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబు తరియింపంజాలకుండు; సన్మునీంద్రులైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితరవిషయాసక్తులైరేని వారలు దివంబులందు వృథాప్రయత్నులై సంచరించుచు, రాత్రులయందు నిద్రాసక్తులై స్వప్నగోచరంబు లయిన బహువిధసంపదకు నానందించుచు, శరీరపరిణామాది పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబులైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్కామధర్ములై నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితంబైన హృత్సరోజ కర్ణికాపీఠంబున వసియింతు వదియునుంగాక. | 297 |
| మ. |
వరయోగీంద్రులు యోగమార్గముల భావంబందు నే నీ మనో హరరూపంబుఁదలంచి యే గుణగణధ్యానంబు గావింతు, ర ప్పురుషశ్రేష్ఠపరిగ్రహంబునకునై పొల్పారఁదద్ధ్యాన గో చరమూర్తిన్ ధరియింతు గాదె పరమోత్సాహుండవై మాధవా! |
298 |
| తే. |
అరయ నిష్కామధర్ములై నట్టి భక్తు, లందు నీవు ప్రసన్నుండ వైనరీతి హృదయముల బద్ధకాములై యెనయు దేవ, గణములందుఁబ్రసన్నత గలుగ వీవు. |
299 |
| చ. |
అరయ సమస్తభూతహృదయంబులయందు వసించి యేకమై పరఁగి సుహృత్క్రియానుగుణభాసితధర్ముఁడవుంబరాపరే శ్వరుఁడవునై తనర్చుచు నసజ్జనదుర్లభ మైన యట్టి సు స్థిరమగు సర్వభూతదయచేఁబొడఁగానఁగ వత్తు వచ్యుతా! |
300 |
| మ. |
క్రతుదానోగ్రతపస్సమాధిజపసత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదుల నాదరింప; వఖిలవ్యాపారపారాయణ స్థితి నొప్పారెడి నీ పదాబ్జయుగళీసేవాభిపూజాసమ ర్పితధర్ముండగువాని భంగి నసురారీ! దేవచూడామణీ! |
301 |
| తే. |
తవిలి శశ్వత్స్వరూపచైతన్యభూరి, మహిమచేత నపాస్తసమస్తభేద మోహుఁడ వఖిలవిజ్ఞానమునకు నాశ్ర, యుండవగు నీకు మ్రొక్కెద నో రమేశ! |
302 |
| క. |
జననస్థితివిలయంబుల, కనయంబును హేతుభూతమగు మాయా లీ లను జెంది నటన సలిపెడు, ననఘాత్మక! నీ కొనర్తు నభివందనముల్. |
303 |
| సీ. |
అనఘాత్మ! మఱి భవదవతార గుణకర్మ ఘనవిడంబనహేతుకంబు లయిన రమణీయమగు దాశరథి వసుదేవ కుమారాది దివ్యనామంబు లోలి వెలయంగ మనుజులు వివశాత్ములై యవసానకాలంబున సంస్మరించి జన్మ జన్మాంతర సంచిత దురితంబుఁ బాసి కైవల్యసంప్రాప్తు లగుదు |
|
| తే. |
రట్టి దివ్యావతారంబు లవధరించు, నజుఁడవగు నీకు మ్రొక్కెద ననఘచరిత! చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! భక్తమందార! దుర్భవ భయవిదూర! |
304 |
| తరల. |
జననవృద్ధివినాశహేతుక సంగతింగల యేను నీ వును హరుండుఁద్రిశాఖలై, మనువుల్ మరీచిముఖామరుల్ దనర నందుపశాఖలై, భవదాత్మ దీనికి మూలమై యనయమున్ భువనద్రుమాకృతివైన నీ కిదె మ్రొక్కెదన్. |
305 |
| మ. |
పురుషాధీశ! భవత్పదాబ్జయుగళీ పూజాదికర్మక్రియా పరతం జెందని మూఢచిత్తునిఁ బశుప్రాయున్ మనుష్యాధమున్ జరయున్ నాశము నొందఁజేయు నతిదక్షంబైన కాలంబు; త ద్గురు కాలాత్ముఁడవైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్. |
306 |
| సీ. |
సర్వేశ! కల్పాంతసంస్థితమగు జలజాతమం దేను సంజనన మంది భవదీయ సుస్వరూపముఁ జూడ నర్థించి బహువత్సరములు దపంబు సేసి క్రతుకర్మములు పెక్కు గావించియును నినుఁ బొడగానఁగా లేక బుద్ధి భీతిఁ బొందిన నాకు నిప్పుడును నిర్హేతుక కరుణచే నఖిలలోకైకవంద్య |
|
| తే. |
మాన సతత ప్రసన్న కోమల ముఖాబ్జ, కలిత భవదీయ దివ్యమంగళ విలాస మూర్తి దర్శింపఁ గలిగె భక్తార్తిహరణ, కరణ! తుభ్యం నమో విశ్వభరణ! దేవ! |
307 |
| సీ. |
అమర తిర్యఙ్మనుష్యాది చేతనయోను లందు నాత్మేచ్ఛచేఁ జెందినట్టి కమనీయశుభమూర్తి గలవాఁడవై ధర్మసేతువనంగఁ బ్రఖ్యాతి నొంది విషయసుఖంబుల విడిచి సంతత నిజానందానుభవసమున్నతిఁదనర్తు; వది గాన పురుషోత్తమాఖ్యఁజెన్నొందుదు వట్టి ని న్నెప్పుడు నభినుతింతు; |
|
| తే. |
నర్థి భవదీయపాదంబు లాశ్రయింతు; మహితభక్తిని నీకు నమస్కరింతు; భక్తజనపోషపరితోష! పరమపురుష! ప్రవిమలాకార! సంసారభయవిదూర! |
308 |
| సీ. |
తలకొని పంచభూతప్రవర్తక మైన భూరిమాయాగుణస్ఫురణఁజిక్కు వడక, లోకంబులు భవదీయ జఠరంబులో నిల్పి ఘనసమాలోలచటుల సర్వంకషోర్మిభీషణవార్ధి నడుమను ఫణిరాజభోగతల్పంబునందు యోగనిద్రారతి నుండంగ నొక కొంత కాలంబు సనఁగ మేల్కనిన వేళ |
|
| తే. |
నలఘుభవదీయ నాభితోయజమువలన, గడఁగి ముల్లోకములు సోపకరణములుగఁ బుట్టఁజేసితి వతులవిభూతి మెఱసి, పుండరీకాక్ష! సంతతభువనరక్ష! |
309 |
| క. |
నిగమస్తుత! లక్ష్మీపతి!, జగదంతర్యామి వగుచు సర్గము నెల్లం దగు భవదైశ్వర్యంబున, నగణితసౌఖ్యానుభవము నందింతు గదే! |
310 |
| సీ. |
జలజాక్ష! యెట్టి విజ్ఞానబలంబునఁ గల్పింతు వఖిలలోకంబు లోలి నతజన ప్రియుఁడవు నాకట్టి సుజ్ఞాన మర్థిమైఁ గృపసేయుమయ్య వరద! సృష్టినిర్మాణేచ్ఛఁ జెంది నా చిత్తంబు దత్కర్మకౌశలిఁ దగిలియుండి యును గర్మవైషమ్యమును బొందు కతమున దురితంబుఁ బొరయక తొలఁగునట్టి |
|
| తే. |
వెరవు నా కెట్లు గలుగు న వ్విధముఁ దలఁచి, కర్మవర్తను నను భవత్కరుణ మెఱసి తగఁ గృతార్థునిఁ జేయవే నిగమవినుత! సత్కృపామూర్తి! యో దేవచక్రవర్తి! |
311 |
| చ. |
భవదుదరప్రభూతమగు పద్మమునందు వసించి యున్న నే నవిరళతావకీనకలితాంశమునం దనరార విశ్వముం దవిలి రచించుచున్ బహువిధంబులఁబల్కెడి వేదజాలముల్ శివతరమై ఫలింపఁగృపసేయుము భక్తఫలప్రదాయకా! |
312 |
| చ. |
అని యనుకంప దోఁప వినయంబునఁజాఁగిలి మ్రొక్కి చారు లో చన సరసీరుహుండగుచు సర్వజగత్పరికల్పనారతిం దనరిన నన్ను బ్రోచుటకుఁదా నిటు సన్నిధియైన యీశ్వరుం డనయము నాదు దుఃఖము దయామతిఁబాపెడు నంచు నమ్రుఁడై. |
313 |
| క. |
వనరుహసంజాతుఁడు నె, మ్మనమున హర్షించె ననుచు మైత్రేయ మహా ముని ఘనుఁడగు విదురునకున్, వినయంబున నెఱుఁగ జెప్పి వెండియుఁ బలికెన్. |
314 |
| మ. |
వనజాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుఁడై పద్మ లో చను గోవిందు ననంతు నాఢ్యుఁ దన వాక్ఛక్తిన్ నుతింపన్ సుధా శనవంద్యుండు ప్రసన్నుఁడై నిఖిలవిశ్వస్థాపనాలోకనం బునఁ జూచెన్ విలయప్రభూత బహువాఃపూరంబులన్ వ్రేల్మిడిన్. |
315 |
| తే. |
అట్లు వొడగని యార్తుఁడై నట్టి పద్మ, భవునివాంఛిత మాత్మఁదీర్పంగఁదలఁచి యతని మోహనివారక మైనయట్టి, యమృతరసతుల్యమధురవాక్యముల ననియె. |
316 |
| చ. |
తలకొని నీ యొనర్చు పని తప్పి మదిందలపోయు దుఃఖముం దలఁగుము; నాదులీలకుఁబ్రధానగుణంబగు సృష్టికల్పనం బలవడఁజేయు బుద్ధి హృదయంబునఁజొన్పి తపస్సమాధి ని ష్ఠల నుతిభక్తులన్ ననుఁబ్రసన్నునిఁజేయుము చెందుఁగోరికల్. |
317 |
| క. |
నీ వొనరించు తపో వి, ద్యావిభవవిలోకనీయమగు నీ సృష్టిం గావింపుము లోకంబుల, లోవెలిఁగెడి నన్నుఁగందు లోకస్తుత్యా! |
318 |
| క. |
నాలోని జీవకోటులు, వాలాయము నీకుఁ గానవచ్చు నిపుడు, నీ వాలోకింపుము దారు వి, లోలహుతాశనుని కరణి లోకస్తుత్యా! |
319 |
| సీ. |
నలు వొంద నఖిలజీవులయందుఁ గల నన్నుఁదెలిసి సేవింపుము నలినగర్భ! భవదీయదోషముల్ వాయును భూతేంద్రియాశ్రయవిరహితమై విశుద్ధ మైన జీవుని విమలాంతరాత్ముఁడనై నను నేకముగఁజూచు నరుఁడు మోక్ష పదమార్గవర్తియై భాసిల్లు, బ్రహ్మాండ మందున వివిధకర్మానురూప |
|
| తే. |
పద్ధతులఁ జేసి పెక్కు రూపముల నొందు, జీవతతి రచియించు నీ చిత్త మెపుడు మత్పదాంబుజయుగళంబు మరగియున్న, కతన రాజసగుణమునఁగలుగ దఘము. |
320 |
| క. |
వినుమదియుఁగాక ప్రాణుల, కనయము నెఱుఁగంగరాని యనఘుఁడఁ దేజో ధనుఁడఁబరేశుఁడ నీ చే, తను గానంబడితి నిదె పితామహ! కంటే. |
321 |
| వ. | మఱియు భూతేంద్రియ గుణాత్ముండనియు జగన్మయుండనియు నన్ను నీ చిత్తంబునందుఁ దలంపుము; తామరసనాళవివరపథంబు వెంటంజని జలంబులలోనం జూడంగోరినట్టి మదీయస్వరూపంబ | 322 |
| క. |
నీ కిప్పుడు గానంబడె, నాకులకును నురగపతి పినాకులకైనన్ వాకొనఁగం దలపోయను, రాకుండు మదీయరూపరమ్యత్వంబుల్. |
323 |
| క. |
కావున మచ్చారిత్ర క, థావిలసితమైన సుమహితస్తవము జగ త్పావనము విగతసంశయ, భావుఁడవై బుద్ధి నిలుపు పంకజజన్మా! |
324 |
| క. |
అగుణుఁడ నై లీలార్థము, జగములఁగల్పింపఁదలఁచు చతురుని నన్నున్ సగుణునిఁగా నుతియించితి, తగ సంతసమయ్యె నాకుఁదామరసభవా! |
325 |
| క. |
ఈ మంజుస్తవరాజము, నీ మనమునఁ జింతఁ దక్కి నిలుపుము భక్తిన్ ధీమహిత! నీ మనంబునఁ, గామించిన కోర్కు లెల్లఁ గలుగుం జుమ్మీ. |
326 |
| క. |
అనుదినమును ద్రిజగత్పా, వనమగు నీ మంగళస్తవంబుఁబఠింపన్ వినినను జనులకు నేఁ బొడ, గనఁ బడుదు నవాప్తసకలకాముఁడ నగుచున్. |
327 |
| తే. |
వన తటాకోపనయన వివాహ దేవ భవన, నిర్మాణ భూమ్యాది వివిధ దాన జప తపో వ్రత యోగ యజ్ఞముల ఫలము, మామక స్తవఫలము సమంబు గాదు. |
328 |
| క. |
జీవావలిఁగల్పించుచు, జీవావలిలోనఁదగ వసించుచుఁ బ్రియ వ స్త్వావలిలోపలఁబ్రియ వ, స్త్వావలినై యుండు నన్ను ననిశముఁబ్రీతిన్. |
329 |
| క. |
తలఁపుము మత్ప్రీతికినై, కలిగించితి నిన్ను భువనకారణ! నా లో పల నడఁగి యేకమై ని, శ్చలగతి వసియించి యున్న జగముల నెల్లన్. |
330 |
| తే. |
తగ నహంకారమూలతత్త్వంబు నొంది, నీవు పుట్టింపు మనుచు రాజీవభవుఁడు వినఁగ నానతి యిచ్చి యవ్విష్ణుఁ డభవుఁ, డంత నంతర్హితుండయ్యె ననఘచరిత! |
331 |
| క. |
అని చెప్పిన మైత్రేయునిఁ, గనుఁగొని విదురుండు వలికెఁగడు ముద మొప్పన్ జననుత; నలినదళాక్షుఁడు, సనినం బద్మజుఁడు దేహసంబంధమునన్. |
332 |
| క. |
మానవసంబంధంబును, బూనిన యీసర్గ మెట్లు పుట్టించె? దయాం భోనిధివై నా కింతయు, మానుగ నెఱిఁగింపవయ్య మహితవిచారా! |
333 |
| వ. | అనవుడు నమ్మునివరేణ్యుండు విదురున కిట్లనియెఁ బుండరీకాక్షవరదాన ప్రభావంబునం బంకజాసనుండు శతదివ్యవత్సరంబులు భగవత్పరంబుగాఁ దపంబు గావించి తత్కాలవాయువుచేఁ గంపితంబగు నిజనివాసంబయిన పద్మంబును వాయువును జలంబులను గనుంగొని యాత్మీయ తపశ్శక్తిచేత నభివృద్ధిం బొందిన విద్యాబలంబున వాయువు బంధించి, తోయంబులతోడ నొక్క తోయంబ సమస్తంబునుం గ్రోలి, యంత గగనవ్యాపి యగు జలంబును గనుంగొని. | 334 |
| ఉ. |
వారిజసంభవుండు బుధవంద్యుఁడు చిత్తమునం దలంచె దై త్యారిఁబయోవిహారి సముదంచితహారి నతాఖిలామృతా హారి రమాసతీహృదయహారి నుదారి విదూరభూరి సం సారి భవప్రహారి విలసన్నుతసూరి నఘారి నయ్యెడన్. |
335 |
| తే. |
అట్లు దలఁచి సరోజజుఁడంబుజమును, గగనతలమునఁజూచి యా కమలకోశ లీనమై యున్న లోకవితానములను, నొయ్యఁబొడగని హరిచే నియుక్తుఁడైన. |
336 |
| తే. |
వానిఁగాఁ దన్నుఁదలఁచి య వ్వనరుహంబు, లోపలికిఁబోయి మున్నందులోన నున్న ముజ్జగంబులఁజూచి యిమ్ముల సృజించె, మఱి చతుర్దశభువనముల్ మహిమఁజేసి. |
337 |
| క. |
పరఁగ సుధాశన తిర్య, ఙ్నర వివిధస్థావరాది నానాసృష్టి స్ఫురణ నజుండొనరించెం, బరువడి నిష్కామధర్మ ఫలరూపమునన్. |
338 |
| వ. | ఇట్లు భువనంబులం బద్మజుండు గల్పించెనని మైత్రేయుండు విదురున కెఱింగించిన. | 339 |
| క. |
విదురుఁడు దురితావనిభృ, ద్భిదురుఁడు మునివరునిఁజూచి ప్రియము మనమునం గదురఁగ నిట్లని పలికె న, తి దురంతంబయిన విష్ణుదేవుని మహిమన్. |
340 |
| తే. |
అమరె భువనంబు లతని కాలాఖ్యతయును, గణుతిసేయు తదీయలక్షణము లర్థి నాకు నెఱిఁగింపుమయ్య వివేకచరిత!, యనిన మైత్రేయుఁ డ వ్విదురునకు ననియె. |
341 |
| సీ. |
ఆద్యంతశూన్యంబు నవ్యయంబై తగు తత్త్వమింతకు నుపాదాన మగుట గుణవిషయములు గైకొని కాలమును మహదాదిభూతములు దన్నాశ్రయింప గాలానురూపంబుఁగైకొని యీశుండు దన లీలకై తనుఁ దా సృజించెఁ గరమొప్ప నఖిలలోకములందుఁదా నుండుఁ దనలోన నఖిలంబుఁదనరుచుండుఁ |
|
| తే. |
గాన విశ్వమ్మునకుఁగార్యకారణములు దాన; యమ్మహాపురుషుని తనువువలనఁ బాసి విశ్వంబు వెలియై ప్రభాస మొందె, మానితాచార! యీ వర్తమానసృష్టి. |
342 |
| క. |
తెఱఁగొప్ప నఖిలవిశ్వముఁ, బురుషోత్తము మాయచేతఁబుట్టుం బెరుఁగున్ విరతింబొందుచు నుండుం, గర మర్థిన్ భూతభావికాలములందున్. |
343 |
| వ. | అట్టి సర్గంబు నవవిధం; బందుఁ బ్రాకృతవైకృతంబులు గాల ద్రవ్య గుణంబులను త్రివిధంబగు భేదంబులచేఁ బ్రతిసంక్రమంబు లగుచు నుండు; నందు మహత్తత్త్త్వంబు ప్రథమసర్గం; బాది నారాయణసకాశంబున గుణవైషమ్యంబునం బొందు. ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబైన యహంకార తత్త్వంబు ద్వితీయసర్గంబు; శబ్దస్పర్శరూప రసగంధంబు లను పంచతన్మాత్ర ద్రవ్య శక్తియుక్తంబైన పృథివ్యాది భూతసర్గంబు మూఁడవదియై యుండు; జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులుఁ గర్మేంద్రియంబులైన వాక్పాణిపాదపాయూపస్థలు నను దశవిధేంద్రియ జననంబు చతుర్థ సర్గంబు; సాత్త్వికాహంకార జనితంబైన సుమనోగణసర్గం బైదవసర్గంబై యొప్పు; నది మనోమయంబై యుండు; జీవలోకంబునకు నబుద్ధికృతంబులైన యావరణ విక్షేపంబులం జేయు తామససర్గం బాఱవదై యుండు; నియ్యాఱు నీశ్వరునకు లీలార్థంబు లయిన ప్రాకృతసర్గంబు లయ్యె; నింక వైకృతసర్గంబు నేడవది మొదలుగాఁ గలుగునవి వినిపింతు, వినుము; పుష్పోత్పత్తిరహితంబులై ఫలించెడు నశ్వత్థోదుంబర పనస న్యగ్రోధాదులైన వనస్పతులును, బుష్పితంబులై ఫలపాకాంతంబులైన వ్రీహి యవ ముద్గా ద్యోషధులును, నారోహణానపేక్షంబులైన మాలతీమల్లికాది లతలును, ద్వక్సారంబులైన వేణ్వాదులును; గఠినీభూతమూలంబులును, శిఖావిస్తృతంబులు నగు లతా విశేషరూపంబులైన వీరుధంబులును; బుష్పవంతంబు లయి ఫలప్రాప్తంబులగు చూతాది ద్రుమంబులును నవ్యక్తచైతన్యంబులు నూర్ధ్వస్రోతంబులు నంతస్స్పర్శంబులుఁ దమఃప్రాయంబులునై స్థావరంబు లయిన యీ యాఱు నేడవ సర్గంబయ్యె; నెనిమిదవ సర్గంబు తిర్యక్సర్గంబు. ఇది యిరువది యెనిమిది భేదంబులు గలిగి శ్వస్తనాది జ్ఞానశూన్యంబులయి యాహారాది జ్ఞానమాత్ర నిష్ఠంబులయి, ఘ్రాణంబువలన నెఱుంగం దగినవాని నెఱుంగుచు హృదయంబున దీర్ఘానుసంధాన రహితంబులై వర్తించు ద్విశఫంబులు గల వృషభ మహిషాజ కృష్ణ సూక రోష్ట్ర గవయ రురు మేష ముఖర నవకంబును, నేక శఫంబు గల ఖరాశ్వాశ్వతర గౌర శరభ చమర్యాది షట్కంబును, బంచనఖంబులు గల శునక సృగాల వృక వ్యాఘ్ర మార్జార శశ శల్యక సింహ కపి గజ కూర్మ గోధాముఖ భూచర ద్వాదశకంబును, మకరాది జలచరంబులును, గంక గృధ్ర బక శ్యేన భాస భల్లూక బర్హి హంస సారస చక్రవాక కాకోలూకాది ఖేచరంబులు నయ్యె, నర్వాక్స్రోతంబై యేకవిధంబగు మానుష సర్గంబు రజోగుణప్రేరితంబై కర్మకరణదక్షంబై దుఃఖంబందును సుఖంబు గోరు; నిది తొమ్మిదవ సర్గం బనందగు; నీ త్రివిధసర్గంబులు వైకృతసర్గంబు లనంబడు; నింక దేవసర్గంబు విను మదియు నెనిమిది తెఱంగులు గలిగి యుండు; నందు విబుధ పితృసురాదులు మూఁడును, గంధర్వాప్సరసలొకటియు, యక్షరక్షస్సు లేకంబును, భూతప్రేతపిశాచంబు లొకటియు, సిద్ధచారణ విద్యాధరు లేకంబును, గిన్నర కింపురుషు లొకటియునుంగా దేవసర్గం బయ్యె; నిట్టి బ్రహ్మ నిర్మితంబులైన దశవిధసర్గంబులు నెఱింగించితి; నింక మనువులం దదంతరంబుల నెఱింగించెదఁ; గల్పాదులయందు నీ ప్రకారంబున స్వయంభూతుండును, నమోఘ సంకల్పుండును నగు నప్పుండరీకాక్షుండు రజోగుణయుక్తుండై స్రష్ట యగుచు స్వస్వరూపంబయిన విశ్వంబు నాత్మీయ సామర్థ్యంబునం గల్పించె; నయ్యీశ్వరుని మాయావ్యాపారంబులచే నీ సృష్టియందు నద్యావర్తంబులంబడి భ్రమించుచున్న మహీరుహంబులంబోలె బూర్వాపరభావంబు లెఱుంగంబడకుండు; నీ కల్పంబునం దుండు దేవాసురాదులు ప్రతిమన్వంతరంబు నందును నిట్ల నామ రూపంబులచే నిర్దేశింపంబడుదురు; మఱియు నిం దొక్కవిశేషం బెఱింగించెదఁ. గౌమారసర్గం బనునది దేవ సర్గాంతర్భూతం బయ్యును బ్రాకృత వైకృతోభయాత్మకంబై దేవత్వ మనుష్యత్వ రూపంబైన సనత్కుమారాది సర్గం బనంబడె; నమోఘసంకల్పుండైన పుండరీకాక్షుండు దనుఁ దాన యిట్లు విశ్వభేదంబును గల్పించెనని మైత్రేయుండు విదురునకుంజెప్పి కాలలక్షణంబెఱింగించువాఁడై యిట్లనియె. | 344 |
| సీ. |
భువిఁదన కార్యాంశమునకు నంతము నన్య వస్తుయోగంబు నేవలన లేక ఘటపటాదికజగత్కార్యంబునకు నిజ సమవాయకారణత్వమునఁబరఁగి జాలసూర్యమరీచి సంగతగగనస్థ మగు త్రసరేణుషడంశమరయఁ బరమాణు వయ్యెఁ; దత్పరమాణువం దర్క గతి యెంత తడవు దత్కాల మగును |
|
| తే. |
సూక్ష్మకాలంబు; విను మది సూర్యమండ, లంబు ద్వాదశరాశ్యాత్మకంబనంగఁ గలుగు జగమున నొక యేఁడు గడచి చనినఁ, గాల మెంతగు నది మహత్కాల మనఘ! |
345 |
| వ. | అందుఁ బరమాణు ద్వయంబొక్క “యణు” వగు; నణుత్రితయం బొక్క “త్రసరేణు” వగు; నవి మూఁడు గూడ నొక్క “త్రుటి” యగు; నాత్రుటిశతం బొక్క “వేధ” యనంబరఁగు; నట్టి వేధలు మూఁడు గూడ నొక్క “లవం” బనందగు; నవి మూఁడైన నొక్క “నిమేషం” బనంజను; నిమేషత్రయం బొక్క “క్షణం బగు; తత్‌క్షణ పంచకం బొక్క “కాష్ఠ” యనం దగు; నవి పదియైన నొక్క “లఘు” వన నొప్పు; నట్టి లఘుపంచ దశకంబొక్క “నాడి” యనంబరఁగు; నట్టి నాడికాద్వయం బొక్క “ముహూర్తం” బయ్యె; నట్టి నాడిక లాఱైన-నేడైన-మనుష్యులకు నొక “ప్రహరం” బగు; నదియ “యామం” బనంజను; దివసపరిమాణ విజ్ఞేయంబగు నాడికోన్మాన లక్షణం బెఱింగింతు వినుము; షట్ఫల తామ్రంబునం బాత్రంబు రచియించి చతుర్మాష సువర్ణంబునం జతురంగుళాయామశలాకంబుఁ గల్పించి దానం దత్పాత్రమూలంబున ఛిద్రంబుఁ గల్పించి తచ్ఛిద్రంబునం బ్రస్థమాత్ర తోయంబు పరిపూర్ణంబు నొందునంత కాలం బొక్క “నాడిక” యగు; యామంబులు నాలుగు సన నొక్క “పగ” లగు; రాత్రియు నిప్పగిది జరగు;నట్టి యహర్నిశంబులు గూడ మర్త్యుల కొక “దివసం” బగు; నవి పదునేనైన నొక్క “పక్షం” బగు; శుక్ల కృష్ణ నామంబులం బరఁగిన యప్పక్షంబులు రెండుగూడ నొక్క ‘మాసం’ బగు; నది పితృదేవతలకు నొక్క “దివసం” బగు; నట్టి మాసంబులు రెండైన నొక్క “ఋతు” వగు; షణ్మాసంబు లరిగిన నొక్క ‘యయనం’ బగు; దక్షిణోత్తర నామంబులం బరఁగినట్టి యయనంబులు రెండుగూడి ద్వాదశ మాసంబులైన నొక్క “సంవత్సరం” బగు; నట్టి సంవత్సరశతంబు నరులకుం బరమాయు వైయుండుఁ; గాలాత్ముండును నీశ్వరుండునునైన సూర్యుండు గ్రహ నక్షత్ర తారా చక్రస్థుండై పరమాణ్వాది సంవత్సరాంతంబైన కాలంబునం జేసి ద్వాదశ రాశ్యాత్మకంబైన జగంబున సౌర బార్హస్పత్య సావన చాంద్ర నాక్షత్ర మాన భేదంబులం గానంబడు చున్నవాఁడై సంవత్సర పరీవత్స రేడావత్స రానువత్సర వత్సర నామంబుల సృజ్యంబైన బీజాంకురంబుల శక్తిం గాలరూపంబైన స్వశక్తిచేత నభిముఖంబుగాఁ జేయుచుఁ బురుషులకు నాయురాది వ్యయంబులం జేసి విషయాసక్తి నివర్తింపం జేయుచుం గోరికలు గల వారికి యజ్ఞ ముఖంబులం జేసి గుణమయంబులైన స్వర్గాది ఫలంబుల విస్తరింపంజేయుచు, గగనంబునఁ బరువువెట్టు వత్సరపంచక ప్రవర్తకుండగు మార్తాండునకుం బూజ గావింపు మని మైత్రేయుండు పలికిన విదురుండిట్లనియె. | 346 |
| క. |
నరపితృసుర పరమాయుః, పరిమాణము లెఱుఁగ నాకుఁబలికితివి, మునీ శ్వర! యెఱిఁగింపు త్రిలోకో, పరిలోక విలోకనైకపరులగు వారిన్. |
347 |
| ఉ. |
పూనిన యోగసిద్ధి దగఁబొందిన నేత్రయుగంబునన్ బహిర్ జ్ఞానము గల్గి యుండి భువనంబులఁజూచుచు నుండువారికిన్ మానుగఁగల్గు కాలగతి నా కెఱిఁగింపు మునీంద్ర! నావుడు న్నా నయశాలి యవ్విదురు నాదర మొప్పఁగఁజూచి యిట్లనున్. |
348 |
| సీ. |
జననుత! కృతయుగసంఖ్య నాలుగువేల దివ్యవర్షములు; దదీయసంధ్య లెనిమిది నూఱేండ్లు; విను త్రేతవత్సర త్రిసహస్రము లగుఁదదీయసంధ్య లాఱునూఱేఁడులు నగు; ద్వాపరము రెండు వేల వత్సరముల వెలయు సంధ్య లోలి నన్నూఱేఁడు; లొగిఁ గలియుగము సహస్రవర్షములు సంధ్యాంశ మరయ |
|
| తే. |
రెండు నూఱేఁడులును నిల్చి యుండుఁ జువ్వె?, యనఘ! సంధ్యాంశ మధ్యంబునందు ధర్మ మతిశయించును; సంధ్యాంశమందు ధర్మ, మల్పమై కానఁబడుచుండు ననఘచరిత! |
349 |
| వ. | మఱియు ధర్మదేవత కృతయుగంబున నాలుగు పాదంబులును, ద్రేతయందు మూఁడు పాదంబులును, ద్వాపరంబునం బాదద్వయంబును, గలియుగంబున నేకపాదంబును, గలిగి సంచరించు నట్టగుటం జేసి. | 350 |
| క. |
పాదవిభేదంబున మ, ర్యాదలును దఱుఁగు, నధర్మ మాకొలఁదినె యు త్పాదిల్లి వృద్ధిఁ బొందు ధ, రాదివిజులు పాపబుద్ధిరతు లగుదు రిలన్. |
351 |
| సీ. |
భూర్భువస్స్వర్లోకములకంటెఁ బొడువునఁ గడు నొప్పు సత్యలోకంబునందు నుండు బ్రహ్మకుఁజతుర్యుగసహస్రము లేఁగ దివ మొక్కటి యగు రాత్రియును నిట్ల చన ధాత నిద్రవో జగము లడంగు, మేల్కని చూడ మరల లోకములు పుట్టుఁ; దద్దినమ్మునఁజతుర్దశమను లగుదు; రందొక్కొక్క మనువున కొనర దివ్య |
|
| తే. |
యుగము లోలిని డెబ్బదియొక్క మాఱు సనిన, మనుకాలమయ్యె; నమ్మను కులంబు సురలు మునులును సప్తర్షు లరయ భగవదంశమునఁబుట్టి పాలింతు రఖిలజగము. |
352 |
| క. |
హరి పితృ సుపర్వ తిర్యఙ్న, ర రూపములన్ జనించి నయమున మన్వం తరముల నిజసత్త్వంబునఁ, బరిపాలించును జగంబుఁబౌరుష మొప్పన్. |
353 |
| క. |
క్రమమునఁద్రైవర్గిక స, ర్గము సెప్పంబడె, సరోజగర్భుఁడు దివసాం తమునఁదమఃపిహిత పరా, క్రముఁడై శయనించు నిద్రఁగైకొని యంతన్. |
354 |
| సీ. |
ఆ రాత్రి భువనత్రయము దమఃపిహితమై భానుచంద్రులతో విలీనమైన సర్వాత్ముఁడగు హరి శక్తి రూపంబయి కడఁగి వెలుంగు సంకర్షణాగ్ని భువనత్రయంబును దవిలి దహింప న య్యనలకీలలఁబొడమిన మహోష్మ మలమినఁగమలి మహర్లోకవాసులు జనలోకమునకును జనుదు రపుడు |
|
| తే. |
విలయసమయసముత్కటవిపులచండ, వాతధూతోర్మిజాలదుర్వారవార్ధి భువనములు ముంచు నమ్మూఁడు భువనములను, దత్పయోరాశిమీదఁబద్మావిభుండు. |
355 |
| ఉ. |
చారుపటీరహీరఘనసారతుషారమరాళచంద్రికా పూర మృణాళహారపరిపూర్ణసుధాకరకాశమల్లికా సార నిభాంగశోభితభుజంగమతల్పమునందు యోగ ని ద్రారతిఁజెంది యుండు జఠరస్థితభూర్భువరాదిలోకుఁడై. |
356 |
| క. |
జనలోకనివాసకు లర్థిని, వినుతింపంగ నతుల దివ్యప్రభచేఁ దనరుచు మీలితనిజ లో, చనుఁడై వసియించు నతఁడు సముచితలీలన్. |
357 |
| వ. | ఇవ్విధంబున. | 358 |
| సీ. |
కైకొని బహువిధకాలగత్యుపలక్షితములై యహోరాత్రతతులు జరుగ శతవత్సరంబులు జనులకుఁబరమాయు వైనరీతిని బంకజాసనునకుఁ బరమాయువగు శతాబ్దంబు; లందుల సగ మరిగిన నదియుఁ బరార్ధ మండ్రు; గాన పూర్వార్ధంబు గడచుటఁ జేసి ద్వితీయపరార్ధంబు దీని పేరు; |
|
| తే. |
గడఁగి పూర్వపరార్ధాదికాలమందు, బ్రహ్మకల్పాఖ్య నెంతయు బరఁగు; నందు బ్రహ్మ యుదయించుటంజేసి బ్రహ్మకల్ప, మనియు శబ్దాత్మకబ్రహ్మ మనియు నెగడు. |
359 |
| క. |
విను మెన్నఁడు పంకజనా, భుని నాభీసరసియందు భువనాశ్రయమై తనరిన పద్మము వొడమును, ననఘా! యది “పద్మకల్ప” మన విలసిల్లున్. |
360 |
| వ. | పూర్వపరార్ధాదినిం గలిగిన బ్రహ్మకల్పంబుఁ జెప్పితి; నింక ద్వితీయ పరార్ధంబు మొదలు నెన్నఁడేని హరి సూకరాకారంబు దాల్చు నది వరాహకల్పం బనందగు, నట్టి వరాహకల్పం బిపుడు వర్తమానం బగుచున్నది; వెండియు. | 361 |
| సీ. |
దీపింపఁగాలస్వరూపుఁడై నట్టి పద్మాక్షుఁ డనంతుఁడనాదిపురుషుఁ డఖిలవిశ్వాత్మకుఁడగు నీశునకుఁ బరమాణ్వాది యుగపరార్ధాంత మగుచు జరుగు నీకాలంబు చర్చింప నొక్కనిమేషకాలంబయి మెలఁగుచుండుఁ గాని యీశ్వరునకుఁ గర్తగాఁజాల; ది క్కాలంబు విను మదిగాక దేహ |
|
| తే. |
మందిరార్థాదికర్మాభిమానశీలు, రైనవారికి నాశ్రయంబగుటఁజేసి యరయ హరి తద్గుణవ్యతికరుఁడు, గానఁకాల మమ్మేటి కెన్నఁడు గర్త గాదు. |
362 |
| వ. | మఱియు షోడశ వికారయుక్తంబై, పృథివ్యాది పంచభూత పరివృతంబయి, దశావరణంబులు గలిగి పంచాశత్కోటివిస్తీర్ణంబై బ్రహ్మాండకోశంబు దనరుచుండు. | 363 |
| చ. |
హరి పరమాణురూపమున నందు వసించి విరాజమానుఁడై సరి వెలుఁగొందు, నిమ్ముల నసంఖ్యములైన మహాండకోశముల్ నెఱిఁదనయందు డింద, నవనీరజనేత్రుఁడనంతుఁడాద్యుఁ డ క్షరుఁడు పరాపరుండఖిలకారణకారణుఁడప్రమేయుఁడై. |
364 |
| క. |
నిరతిశయోజ్జ్వల తేజః, స్ఫురణం దనరారు పరమపురుషుని విష్ణుం బురుషోత్తము వర్ణింపను, సరసిజభవభవులకైన శక్యమె చెపుమా! |
365 |
| క. |
అని మైత్రేయుఁడు విదురుం, గనుఁగొని వెండియును బలికెఁ; గాలాహ్వయుఁడై తనరిన హరి మహిమల నే, వినిపించితి సృష్టిమహిమ విను మెఱిఁగింతున్. |
366 |
| వ. | పరమేష్ఠి యీ సృష్ట్యాది నహమ్మను దేహాభిమానబుద్ధి గల మోహంబును, నంగనాసంగమ స్రక్చందనాది గ్రామ్య భోగేచ్ఛలు గల మహామోహంబును, దత్ప్రతిఘాతజాతంబైన క్రోధంబునందుఁ గలుగు తామిస్రంబును, దన్నాశంబునం “దహ మేవ మృతోఽస్మి” యను నంధతామిస్రంబును, జిత్తవిభ్రమంబును నను నవిద్యా పంచక మిశ్రంబుగా సర్వభూతావలిం బుట్టించి యాత్మీయ చిత్తంబునం బాపసృష్టిఁ గల్పించుటకుఁ బశ్చాత్తాపంబు నొంది భగవద్ధ్యానామృత పూతమానసుండై యూర్ధ్వరేతస్కులును, బరమ పవిత్రులునునైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను మునుల నతిసత్త్వగరిష్ఠుల ధీరజనోత్తముల నార్యుల హరిప్రపన్నులనుంగా దివ్యదృష్టిం గల్పించి వారలం జూచి మీ మీ యంశంబులం బ్రజలం బుట్టించి ప్రపంచంబు వృద్ధిఁ బొందింపుం డనిన; వారలు తద్వచనంబు లపహసించుచుఁ బద్మజుం గని మోక్షధర్ములును నారాయణపరాయణులునై ప్రపంచ నిర్మాణంబునకుఁ బ్రతికూల వాక్యంబులు పలికిన నుదయించిన క్రోధంబు బుద్ధిచే నిగ్రహింపఁబడినను నరవిందసంభవుని భ్రూమధ్యంబువలనం గ్రోధస్వరూపంబున నీలలోహితుండు నిఖిలసురాగ్రజుండై యుదయించుచు నాక్రందనంబొనరించె నంత. | 367 |
| మ. |
జననంబందిన నీలలోహితుఁడు గంజాతాసనుంజూచి యి ట్లను “నో దేవ! మదాఖ్య లెట్టివి? మదీయావాసముల్ వీఁక నా కనయంబు న్నెఱిఁగింపవే” యనుడు నయ్యంభోజగర్భుండు లా లనముందోఁపఁగుమార! నీ జననవేళన్ రోదనంబిచ్చుటన్. |
368 |
| తే. |
రుద్రనామంబు నీకు నిరూఢ మయ్యెఁ, జంద్రసూర్యానలానిలసలిలగగన పృథివిప్రాణతపోహృదింద్రియము లనఁగఁ, గలుగు నేకాదశస్థానములు వసింప. |
369 |
| వ. | అని వెండియు మన్యు మను మహాకాల మహచ్ఛివ ఋతధ్వజోరురేతో భవ కాల వామదేవ ధృతవ్రతులను నేకాదశనామంబులు గలిగి ధీవృత్త్యశనోమానియు త్సర్పి రిలాంబి కేలావతీ సుధా దీక్షా నామ పత్నీసమేతుండవై పూర్వ నియుక్తంబు లయిన నామంబులం దత్తన్నివాసంబుల వసియించి ప్రజలం గల్పింపుమని నిర్దేశించిన భగవంతుఁడగు నీలలోహితుండు విశ్వగురుండైన పితామహునిచే నియుక్తుండై సత్త్వాకృతి స్వభావంబుల నాత్మసములైన ప్రజలంగల్పించె. | 370 |
| ఉ. |
రుద్రునిచేత నీ గతి నిరూఢమతిన్ సృజియింపఁబడ్డ యా రుద్రగణంబు లోలి నవరుద్ధత విశ్వము మ్రింగె; నమ్మహో పద్రవశాంతికై యజుఁడు భర్గులఁజూచి కుమారులార! మీ రౌద్రవిలోకనానలభరంబునఁగ్రాఁగె సమస్తలోకముల్. |
371 |
| క. |
మీ సృష్టి చాలు; నింకన్, ధీసత్తములార! వినుఁడు ధృతి మీరు తపో వ్యాసంగచిత్తులై చనుఁ, డా సన్మంగళము లగు దృఢంబుగ మీకున్. |
372 |
| మ. |
భగవంతుం బురుషోత్తమున్ హరిఁగృపాపాథోధి లక్ష్మీశ్వరున్ సుగుణభ్రాజితు నచ్యుతుం బరుఁ బరంజ్యోతిం బ్రభున్ సర్వ భూ త గుహావాసు నధోక్షజున్ శ్రితజనత్రాణైకపారీణు నా జగదాత్ముం గనుచుందు రార్యులు దపశ్శక్తిన్ స్ఫుటజ్ఞానులై. |
373 |
| వ. | అనిన విని. | 374 |
| ఉ. |
కైకొని యిట్లు పంకరుహగర్భనియంత్రితులైన రుద్రు లు ద్రేకము దక్కి కానలకు ధీయుతులై తపమాచరింప న స్తోకచరిత్రు లేఁగిరి; చతుర్ముఖుఁడంతఁబ్రపంచకల్పనా లోకనుఁడై సృజించె జనలోకశరణ్యుల ధీవరేణ్యులన్. |
375 |
| తే. |
వినుము! భగవద్బలాన్విత వినుతగుణులు, భువనసంతానహేతువిస్ఫురణకరులు పద్మసంభవతుల్యప్రభావయుతులు, పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు. |
376 |
| సీ. |
అరవిందసంభవు నంగుష్ఠమున దక్షుఁడూరువువలనను నారదుండు నాభిఁబులహుఁడు గర్ణములఁబులస్త్యుండు త్వక్కున భృగువు హస్తమునఁ గ్రతువు నాస్యంబువలన నయ్యంగిరసుఁడు ప్రాణమున వసిష్ఠుఁడు మనమున మరీచి గన్నుల నత్రియుఁగాఁబుత్త్రదశకంబు గలిగిరి; వెండియు నలినగర్భు |
|
| తే. |
దక్షిణస్తనమువలన ధర్మమొదవె, వెన్నువలనను నుదయించె విశ్వభయద మైన మృత్యు వధర్మంబు నంద కలిగె, నాత్మఁగాముండు జననము నందె; మఱియు. |
377 |
| సీ. |
భ్రూయుగళంబునఁగ్రోధంబు, నధరంబునందు లోభంబు, నాస్యమున వాణి యును, మేఢ్రమందుఁబయోధు, లపానంబునందు నఘాశ్రయుఁడైన నిరృతి, లాలితచ్ఛాయవలన దేవహూతి విభుండు గర్దముఁడును, బుట్టి రంత నబ్జజుఁడాత్మ దేహమున జనించిన భారతిఁజూచి విభ్రాంతిఁబొరసి |
|
| తే. |
పంచశరబాణనిర్భిన్నభావుఁడగుచుఁ, గూఁతు రని పాపమునకు సంకోచపడక కవయఁగోరిన జనకునిఁగని మరీచి, మొదలుగాఁగల య మ్మునిముఖ్యు లెఱిఁగి. |
378 |
| వ. | ఇట్లనిరి. | 379 |
| ఉ. |
చాలుఁ! బురే! సరోజభవ! సత్పథవృత్తిఁ దొఱంగి కూఁతు ని ట్లాలరివై రమింప హృదయంబునఁ గోరుట ధర్మరీతియే? బేలరి వైతి, నీ తగవుఁ, బెద్దతనంబును, నేలపాలుగా శీలము వోవఁ దట్టి యిటు సేసినవారలు మున్ను గల్గిరే? |
380 |
| ఉ. |
నీవు మహానుభావుఁడ వనింద్యచరిత్రుఁడ; విట్టిచోట “రా జీవభవుండు దా విధినిషేధము లాత్మ నెఱుంగఁడయ్యె; నీ భావభవప్రసూనశరబాధితుఁడై తన కూఁతుఁబొందెఁ బో వావి దలంప లే” కనుచు వారక లోకులు ప్రువ్వఁదిట్టరే! |
381 |
| క. |
పాపము దలఁపక, నిమిషము, లోపలఁజెడు సౌఖ్యమునకు లోనైతివె? యిం తే పో ధారుణిఁ ‘గామా, న్ధోఽపి న పశ్యతి’ యనంగఁదొల్లియు వినమే. |
382 |
| మ. |
అని యిబ్భంగి మునీంద్రు లాడిన కఠోరాలాపముల్ వీనుల న్విని లజ్జావనతాననుండగుచు నా నీరేజగర్భుండు స య్యన దేహంబు విసర్జనీయముగఁ జేయన్ దిక్కు లేతెంచి త త్తనువుంగైకొనఁబుట్టె దిక్కలితమై తామిస్రనీహారముల్. |
383 |
| వ. | అంత. | 384 |
| చ. |
ఉడుగక పంకజాతభవుఁడొండొక దేహముఁదాల్చి ధైర్యమున్ విడువక సృష్టిపూర్వసమవేతముగన్ సృజియించు నేర్పు దాఁ బొడమమి కాత్మలోనఁదలపోయుచు నుండఁజతుర్ముఖంబులన్ వెడలె ననూనరూపముల వేదములంచిత ధర్మయుక్తితోన్. |
385 |
| తే. |
మఱియు మఖములు, మహితకర్మములుఁ దంత్ర ములును, నడవళ్ళు, నాశ్రమములుఁ, దదీయ ముఖచతుష్కమునందునఁ బొడమె ననిన విని మునీంద్రునిఁ జూచి య వ్విదురుఁడనియె. |
386 |
| క. |
తోయజసంభవుఁడత్తఱి, నే యే ముఖమండలమున నే యే సృష్టిన్ ధీయుతుఁడై సృజియించెను, బాయక యత్తెఱఁగుఁదెలియఁబలుకుము నాకున్. |
387 |
| వ. |
అని యిట్లు విదురుం డడిగిన మైత్రేయుం డతనితో నిట్లనియె; ఋగ్యజుస్సామాథర్వంబులను వేదంబులును, హోతృకర్మంబు లయిన యప్రగీతమంత్రస్తోత్రంబులగు శస్త్రంబులును, నధ్వర్యు కర్మం బైన యిజ్యయు, సంప్రగీత స్తోత్రంబయిన స్తుతియును, నుద్గాతృప్రయోజ్యంబైన ఋక్సముదాయ రూపం బగు స్తోమంబును, బ్రాయశ్చిత్తంబగు బ్రహ్మకర్మంబును, నాయుర్వేద ధనుర్వేద గాంధర్వ వేదంబులను నుపవేదంబులును, విశ్వకర్మ శాస్త్రం బగు స్థాపత్యంబును, బ్రాగాది ముఖంబుల నుత్పన్నంబు లయ్యెన్; బంచమ వేదంబగు నితిహాస పురాణంబులు సర్వముఖంబులం గలిగె; మఱియుఁ గర్మ తంత్రంబు లయిన షోడశ్యుక్థ్యములును, జయనాగ్నిష్టోమంబులును, నాప్తోర్యామాతిరాత్రంబులును, వాజపేయగోసవంబులును, ధర్మపాదంబులైన విద్యాదాన తపస్సత్యంబులును, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ యత్యాశ్రమంబులును గలిగె; వీనికి నొక్కొక్కటికి జతుర్విధంబులైన వృత్తులును గలిగియుండు; నందు సావిత్రంబను బ్రహ్మచర్యంబును, ఉపనయనం బాదిగా దివసత్రయంబు గాయత్రి జపించుటయను ప్రాజాపత్యంబును, వేదవ్రత చతుష్టయంబందు బ్రతివ్రతంబును, వ్రతులు సంవత్సర పర్యంతంబుగా నాచరింపనగు బ్రాహ్మంబును, వేదగ్రహణాంతంబు నాచరింపం దగు నైష్ఠికంబును నను బ్రహ్మచారి వృత్తిచతుష్టయంబును; ననిషిద్ధకృష్యాది వృత్తియగు వార్తయు, యజనాది కర్మోపయుక్తంబైన యాచ్ఞాది రూపధన సంచయంబును, బరుల యాచింపకుండు నయాచితంబను శాలీనంబును, క్షేత్రపతిత కణిశ కణ సంగ్రహణ రూపంబగు శిలోంఛంబును నను గృహస్థవృత్తులు నాలుగును; నకృష్ట పచ్యాహారులగు వైఖానసులును, నూతనఫలంబు లబ్ధంబైనఁ బూర్వసంచిత పదార్థత్యాగంబు గల వాలఖిల్యులును, బ్రాతఃకాలంబున నే దిక్కు విలోకింతు రద్దిక్కునకు జని యచ్చట లభించు పదార్థంబుల భుజించి జీవించు నౌదుంబరులును, దమంత ఫలించి తరు పతితంబు లగు ఫలంబులఁ దినుచుండు ఫేనపులును నను చతుర్విధ వృత్తులు గల వానప్రస్థులును; స్వాశ్రమ విహితకర్మంబులం బ్రధానుం డగు కుటీచకుండును, గర్మం బుపసర్జనంబు సేసి జ్ఞాన ప్రధానుం డయిన బహూదుండును, గేవలజ్ఞానాభ్యాసనిష్ఠుం డగు హంసుండును, బ్రాప్తంబైన పరబ్రహ్మ తత్త్వంబుగ నిష్క్రియుండును నను సన్న్యాసిచతుర్విధవృత్తులును, మోక్షఫలప్రదంబై యాత్మానాత్మ వివేక విద్యారూపంబగు నాన్వీక్షకియు, స్వర్గాది ఫలప్రదంబై కర్మవిద్యారూప మగు త్రయియు, జీవనఫలప్రదానంబై కృష్యాదిరూపంబగు వార్తయు, నర్థసంపాదనైక ప్రయోజనంబగు దండనీతియు నను మోక్షధర్మ కామార్థంబులైన న్యాయవిద్యా చతుష్టయంబును, “భూర్భువస్సువః” యను వ్యాహృతులును, బూర్వాది ముఖంబులవలన నుదయించె. మఱియు నతని హృదయాకాశంబువలనం బ్రణవంబును, రోమంబులవలన నుష్ణిక్ఛందంబును, త్వగింద్రియము వలన గాయత్త్రీ ఛందంబును, మాంసంబువలనం ద్రిష్టుప్ఛందంబును, స్నాయువువలన ననుష్టుప్ఛందంబును, నస్థివలన జగతీఛందంబును, మజ్జవలన పంక్తిచ్ఛందంబును, బ్రాణంబువలన బృహతీ ఛందంబును, కకారాది పంచవర్గాత్మకంబు లయిన స్పర్శంబుల వలన జీవుండును, అకారాది స్వరాత్మకంబైన దేహంబును, నూష్మంబులను శషసహవర్ణ చతుష్టయ రూపంబులగు నింద్రియంబులును, నంతస్స్థంబులగు యరలవ లను వర్ణంబులును, షడ్జాదిసప్త స్వరరూపంబు నాత్మబలంబయిన శబ్దబ్రహ్మంబును, చతుర్ముఖుని లీలావిశేషంబున నుత్పన్నంబయ్యె. వ్యక్తావ్యక్తంబై వైఖరీ ప్రణవాత్మకంబైన శబ్దబ్రహ్మంబువలనం బరమాత్మ యవ్యక్తాత్మకుం డగుటంజేసి పరిపూర్ణుండును, వ్యక్తాత్మకుం డగుటంజేసి యింద్రాది శక్త్యుపబృంహితుండునై కానంబడుఁ; బదంపడి యజుండు భూరివీర్యవంతు లయిన ఋషిగణంబుల సంతతి యవిస్తృతంబని తలంచి పూర్వతను పరిగ్రహంబు సాలించి యనిషిద్ధ కామాసక్తంబైన దేహాంతర పరిగ్రహంబు సేసి నిత్యంబుఁ బ్రజాసృష్టియందు వ్యాసక్తుండనైనను బ్రజ లభివృద్ధి నొందక యుండుట కేమి కారణం బగునని యచ్చెరువొంది తద్వృద్ధి యగు విధం బాలోచించుచు దైవం బిచ్చట విఘాతుకంబు గాన తదానుకూల్యం బావశ్యకం బని దాని నెదురు చూచుచు యథోచితకృత్య కరణదక్షుం డగుచుండ చతుర్ముఖుని దేహంబు ద్వివిధం బయిన నట్టి రూపద్వయవిభాగంబు స్వరాట్టగు “స్వాయంభువ” మనువును, దన్మహిషి యగు “శతరూప” యను కన్యకయుంగా మిథునంబయి జనియించె; నమ్మిథునంబువలనం బ్రియవ్రతోత్తానపాదులను పుత్రద్వయంబు, నాకూతి దేవహూతి ప్రసూతులను కన్యకాత్రయంబును గలిగి; రందు నాకూతిని రుచికునకును, దేవహూతిం గర్దమునకును, బ్రసూతిని దక్షునకును నిచ్చె; వీరలవలనఁ గలుగు ప్రజాసంతతులచేత జగంబులు పరిపూర్ణంబు లయ్యె. |
388 |