| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| చ. |
వనజదళాక్ష! భక్తజనవత్సల! దేవ! భవత్సుతుండు మ జ్జనకుఁడునైన పంకరుహజాతుఁడు మాకు రహస్య మొప్పఁ జె ప్పిన భవదీయమంగళగభీరపరిగ్రహవిగ్రహంబు మే మనయముఁజూడఁగంటిమి కృతార్థులమై తగమంటి మీశ్వరా! |
545 |
| సీ. |
దేవ! దుర్జనులకు భావింప హృదయసంగతుఁడవై యుండియుఁ గానఁబడవు కడఁగి నీ దివ్యమంగళవిగ్రహంబునఁ జేసి సమంచితాశ్రితుల నెల్లఁ జేకొని సంప్రీతచిత్తులఁగాఁజేయు దతిశయకారుణ్యమతిఁ దనర్చి కమలాక్ష! సర్వలోకైక నాయక! భవత్సందర్శనాభిలాషానులాప |
|
| తే. |
విదితదృఢభక్తియోగప్రవీణు లగుచు, నర్థిమై వీతరాగులైనట్టి యోగి జనమనఃపంకజాతనిషణ్ణమూర్తి, వని యెఱుంగుదురయ్య, నిన్నాత్మవిదులు. |
546 |
| క. |
యుక్తిందలఁప భవద్వ్యతి, రిక్తములై నట్టి యితర దృఢ కర్మంబుల్ ముక్తిదము లయిన నీ పద, భక్తులు దత్కర్మములను బాటింప రిలన్. |
547 |
| ఉ. |
కావునఁగీర్తనీయగతకల్మషమంగళతీర్థకీర్తి సు శ్రీవిభవప్రశస్తసుచరిత్రుఁడ వైన భవత్పదాబ్జ సే వా విమలాంతరంగబుధవర్గ మనర్గళభంగి నన్యమున్ భావమునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా! |
548 |
| చ. |
పరమతపోవిధూతభవపాపులమై చరియించు మాకు నేఁ డరయ భవత్పదాశ్రితుల కల్గి శపించిన భూరిదుష్కృత స్ఫురణ నసత్పథైకపరిభూతులమై నిజధర్మహానిఁగా నిరయము నొందఁగా వలసె నేరము వెట్టక మమ్ముఁగావవే! |
549 |
| చ. |
కర మనురక్తిషట్పదము కమ్రసుగంధమరందవాంఛచేఁ దరమిడి శాతకంటకవృతస్ఫుటనవ్యతరప్రసూన మం జరులను డాయుపోల్కిని భృశంబగు విఘ్నములన్ జయించి నీ చరణసరోజముల్ గొలువ సమ్మతి వచ్చితిమయ్య, కేశవా! |
550 |
| చ. |
అలరు భవత్పదాంబుజయుగార్పితమై పొలుపొందునట్టి యీ తులసి పవిత్రమైన గతిఁ దోయజనాభ! భవత్కథాసుధా కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్నఁగర్ణముల్ విలసితలీలమై భువిఁబవిత్రములై విలసిల్లు మాధవా! |
551 |
| చ. |
మహితయశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ స్పృహులకుఁగానరాక యతసీకుసుమద్యుతి నొప్పుచున్న నీ సహజశరీర మిప్పుడు భృశంబుగఁజూచి మదీయదృక్కు లిం దహహ! కృతార్థతంబొరసె నచ్యుత! మ్రొక్కెద మాదరింపవే! |
552 |
| క. |
అని సనకాదులు దత్పద, వనజములకు మ్రొక్కి భక్తివశమానసులై వినుతించిన గోవిందుఁడు, మునివరులంజూచి పలికె ముదితాత్ముండై. |
553 |
| వ. | ఈ యిరువురు జయవిజయాభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు, వీరు మిమ్ముం గైకొనక మదీయాజ్ఞాతిక్రమణులయి చేసిన యపరాధంబునకుఁ దగిన దండంబు గావించితిరి, అది నాకు నభిమతం బయ్యె, నదియునుం గాక భృత్యవర్గంబు సేయు నపరాధంబు స్వామిదియ, కాన యీ తప్పునకు మాననీయుండనైన నన్ను మన్నించి ప్రసన్ను లగుదురుగాక యని వెండియు నిట్లనియె. | 554 |
| చ. |
తనువునఁబుట్టినట్టి బెడిదంబగు కుష్ఠమహాగదంబుచే వనరి తదీయచర్మము వివర్ణత నొందినరీతి భృత్యు లొ ప్పని పని సేసినన్ విభులు బంధురచారుయశంబుఁబేరుఁబెం పును జెడిపోయి దుర్యశముఁబొందుచు నుందురు విష్టపంబులన్. |
555 |
| చ. |
అలవడ నాకు మీవలన నబ్బిన తీర్థసుకీర్తనీయ స ల్లలితవినిర్మలామృతవిలాసయశోవిభవాభిరామమై వెలయు వికుంఠనామ మపవిత్రమనశ్శ్వపచాధమాది లో కుల చెవి సోఁకఁ దత్క్షణమ కోరి పునీతులఁజేయు వారలన్. |
556 |
| తే. |
అట్టి నేను దలంప మీ యట్టిసాధు, జనుల కపకార మర్థిఁజేసిన మదీయ బాహుసములైనఁద్రుంతు నుత్సాహలీల, నన్న నితరుల మీ మ్రోల నెన్ననేల? |
557 |
| క. |
ధరణి సురోత్తమసేవా, పరిలబ్ధంబయిన యట్టి పాతకనాశం కర నిఖిలభువనపూత, స్ఫురితాంఘ్రిసరోజతోయములు గల నన్నున్. |
558 |
| క. |
అలఘుమతి విరక్తునిఁగాఁ, దలఁపక నిజ శుభకటాక్షదామకకలితా ఖిలసంపద్విభవ శ్రీ, లలనారత్నంబురస్స్థలంబును జెందెన్. |
559 |
| చ. |
క్రతువులు సేయుచో శిఖిముఖంబున వేలుచునట్టి తద్ఘృత ప్లుతచరుభక్షణన్ ముదముఁబొందదు నిస్పృహధర్మమార్గ సం గతుఁడగు భూసురోత్తము ముఖంబున వేడ్క భుజించు నయ్యవి స్తృతకబళంబునన్ మనము తృప్తి వహించినరీతి నిచ్చలున్. |
560 |
| సీ. |
సతతంబు నప్రతిహతయోగమాయా విభూతిచేఁబ్రఖ్యాతిఁబొందు నేను నే మహీసురుల సమిద్ధనిర్మలపాద నళినరజోవితానములు భక్తి హాటకనవరత్నకోటీరమునఁ దాల్తు నట్టి నా చరణాంబుజాంబువులను దవిలి ధరించి సద్యః పునీతాత్ములై రర్థిఁ జంద్రావతంసాదిదేవ |
|
| తే. |
చయము, లెవ్వాఁడు బ్రాహ్మణజనులు దమకు, నపకృతుల్ సేసిరేని మాఱలుగఁడతఁడు విప్రులను నన్నుఁగాఁగ భావించు నతఁడు, ధర్మపద్ధతి నా ప్రియతముఁడు వాఁడు. |
561 |
| ఉ. |
గోవితతిన్ ధరాదివిజకోటిని నన్నును దీనవర్గమున్ వావిరి భేదబుద్ధిఁగనువార లధోగతిఁబొంద, నందు నా శీవిషరోషవిస్ఫురణఁ జెంది కృతాంతభటుల్ మహోగ్ర గృ ధ్రావలివోలెఁ జంచువుల నంగము లుద్ధతిఁజింతు రెప్పుడున్. |
562 |
| చ. |
ధరణిసురోత్తముల్ బహువిధంబులఁదమ్ముఁబరాభవించినన్ దరహసితాస్యులై యతిముదంబున నిచ్చలుఁబూజ సేయుచున్ సరసవచోవిలాసముల సన్నుతి సేయుచుఁదండ్రి నాత్మజుల్ గర మనుర క్తిఁబిల్చుగతిఁ గైకొని పిల్చినవారు నా సముల్. |
563 |
| క. |
వినుఁడయ్యనఘచరిత్రుల, కనయముఁబ్రియతముఁడ నగుచుఁ నమ్ముడువోదున్ మును నన్ను భృగువు దన్నినఁ, గనలక పరితోషవృత్తిఁ గైకొంటిఁ గదే. |
564 |
| సీ. |
పొలుచు నా మానసాంభోజాతభావంబుఁ దెలియంగలేక యుద్వృత్తు లగుచుఁ గడఁగి మీ యానతిఁగడచినఁదద్దోష ఫలము వీరలకు సంప్రాప్తమయ్యె, మునులార! నా చిత్తమున నున్న రీతియు నిట్టిద, భూమిపైఁబుట్టి వీర లచిరకాలమున నా యంతికంబున కోలి నరుదెంచునట్లుగా ననుమతింప |
|
| తే. |
వలయునని య మ్ముకుందుండు వలుకుటయును, విని మనంబున సనకాదిమునివరేణ్యు లమ్మహాత్ముని మృదులభాషామృతంబుఁ, దవిలి క్రోలియు రోషసందష్టు లగుచు. |
565 |
| సీ. |
మునివరుల్ తమ చిత్తములఁదృప్తిఁ బొందక పంకజాతాక్షుఁడు పలికినట్టి పరిమితగంభీరబహుళార్థ దురవగాహములును విస్ఫురదమృతతుల్య మాధుర్యసుగుణసమన్వితమ్ములు వినిర్గతశబ్దదోషనికాయములును నైన వాక్యములకు నాత్మలఁబరితోష మంది యిట్లనిరి నెయ్యమున మనల |
|
| తే. |
నొడయఁడిప్పుడు నందించియో, తలంప, నర్థి నిందించియో, మత్కృతైకదండ మునకు సంకోచ మందియో, యనుచు సంశ, యాత్ము లగుచు వివేకించి యంతలోన. |
566 |
| క. |
నలినాక్షుఁడు దమదెసఁ గృప, గలిగిన భావంబుఁదెలిసి కౌతుక మొలయం బులకీకృతాంగులై యు, త్కలికన్ హర్షించి నిటలఘటితాంజలులై. |
567 |
| క. |
భరితనిజయోగమాయా, స్ఫురణందనరారు నతివిభూతియు బలముం బరమోత్కర్షముఁ గల యీ, శ్వరునకు నిట్లనిరి మునులు సద్వినయమునన్. |
568 |
| తే. |
పొలుపు దీపింప నిత్యవిభూతి నాయ కుఁడవు, భగవంతుఁడవు, ననఘుఁడవు, నీవు మత్కృతం బప్డు నీ కభిమత మటంటి, వీశ! భవదీయచారిత్ర మెఱుఁగఁ దరమె? |
569 |
| ఉ. |
దేవగణాళి కెల్లఁబరదేవతలై తనరారునట్టి వి ప్రావళి కాత్మనాయకుఁడవై పెనుపొందిన నీకు నీ ధరా దేవత లెల్ల నెన్న నధిదేవతలై రఁట, యెట్టి చోద్యమో దేవ! సమస్తపావన! సుధీజనతావన! విశ్వభావనా! |
570 |
| చ. |
కమలదళాక్ష! నీవలనఁగల్గిన ధర్మము తావకావతా రముల సురక్షితంబగుఁ, దిరంబగు, నీశ్వరనిర్వికార త త్త్వమునఁదనర్చు నిన్నరయఁదత్ఫలరూపముఁదత్ప్రధాన గో ప్యము నని పల్కుచుందురు కృపామయలోచన! పాపమోచనా! |
571 |
| చ. |
మహిఁదలపోయ నెవ్వని సమగ్రపరిగ్రహమున్ లభింప ని స్స్పృహమతులై మునీశ్వరులు మృత్యుభయంబునఁబాతు,రట్టి స న్మహితవివేకశాలి! గుణమండన! నీ కిల నన్యసత్పరి గ్రహ మది, యెట్టి చోద్యము? జగత్పరిపాలన! నిత్యఖేలనా! |
572 |
| సీ. |
సతతంబు నర్థార్థిజనశిరోఽలంకార పదరేణువులు గల పద్మ నేఁడు జలజకింజల్కనిష్యందమరందలోభాగత భ్రమరనాయకుని పగిది ధన్యజనార్పితోదంచిత తులసికాదామంబునకు నిజధామ మగుచు భాసిల్లు భవదీయపాదారవిందముల్ విలసితభక్తి సేవింపుచుండ |
|
| తే. |
కమలనయన! కృపావలోకనము లొలయ, నర్థిఁజూడవు భాగవతానురక్తిఁ జేసి భవదీయమహిమంబు చిత్ర మరయఁ, జిరశుభాకార! యిందిరాచిత్తచోర! |
573 |
| మ. |
చిరభాగ్యోదయ! దేవదేవ! లలితశ్రీవత్సలక్ష్మాంగ! యీ వరవిప్రానుపదైకపుణ్యరజమే వర్ణింప నీ మేని కా భరణంబంటివి, సర్వలోకులకు విప్రశ్రేణి మాహాత్మ్య మీ వెఱుఁగంజెప్పుటకై ధరించితి గదా యెన్నంబవిత్రాకృతిన్. |
574 |
| వ. | అదియునుంగాక. | 575 |
| సీ. |
ధర్మమూర్తివి జగత్కర్తవు నగు నీవు ప్రోవంగఁదగువారిఁబ్రోవవేని నవిరళవేదోక్తమగు ధర్మమార్గ మసన్మార్గ మగుఁ, గాన, సత్త్వగుణ వి శిష్టుండ వగుచు నీ జీవసంఘము సేమ మరసి రక్షింతు నీదైన శక్తి చేతను ధర్మవిఘాతుల దండించు నీకు నంచితమైన నిగమధర్మ |
|
| తే. |
మార్గనాశకవిధములు మదికి నింపు, గావు, విప్రులయందు సత్కరుణ మెఱసి ఘనతఁబలికిన వినయవాక్యములు నీకు, యుక్తమగుచుండు సతతంబు భక్తవరద! |
576 |
| వ. | అట్లయినం బరులయెడ వినయంబులు వలికినఁ బ్రాభవహాని యగు నని తలంచితివేని. | 577 |
| తే. |
విశ్వమునకెల్లఁ గర్తవు విశ్వనిధివి, విశ్వసంరక్షకుండవై వెలయు నీకుఁ గడఁగి ప్రాభవహాని యెక్కడిది? దలఁప, వినయములు నీకు లీలలై వెలయుఁగాన. |
578 |
| తే. |
మునులమగు మమ్ము నతిమోదమునను నీవు, సత్కరించుట లెల్ల సజ్జనపరిగ్ర హార్థమై యుండుఁగాదె, మహాత్మ! యొకటి, విన్నవించెద మీ జయవిజయులకును. |
579 |
| తే. |
అలిగి మేము శపించితి మంతకంటె, బెడిద మగు నాజ్ఞ సేయ నభీష్టమేనిఁ జేయు, మదిగాక సమధికశ్రీ దనర్పఁ, జేసి రక్షించెదేని రక్షింపు మీశ! |
580 |
| వ. | అట్లయిన మాకుం బ్రియం బగుం గావున ననపరాధులు నతినిర్మలాంతఃకరణులు నైన వీరలకు ననృతంబులు వలికితి మేని మమ్మయినం జిత్తంబు కొలంది నాజ్ఞాపింపు మని కరకమలంబులు మొగిచి కృతాంజలులై యున్న మునులం గరుణార్ద్రదృష్టిం గనుంగొని. | 581 |
| క. |
అనఘుఁడు భగవంతుం డి, ట్లనియెన్ మునులార! వీర లలరన్ భువికిం జని యచట నసురయోనిన్, జనియింతురు లోభమోహసంగతు లగుచున్. |
582 |
| క. |
దేవ జనావళి కుపహతిఁ, గావించుచు నిఖిలభువనకంటకవృత్తిన్ జీవించుచు నా యెడ సం, భావిత వైరానుబంధభావులు నగుచున్. |
583 |
| క. |
ఆహవముఖమున నను నతి, సాహసమున నెదిరి పోరి చక్రనిశిత ధా, రాహతిఁ దెగి వచ్చెద రు, త్సాహ మెలర్పంగ నాదు సన్నిధి కంతన్. |
584 |
| వ. | అదియునుంగాక. | 585 |
| క. |
నను వైరంబుననైనను, మనమునఁదలఁచుటను నా సమక్షమున మదా నన మీక్షించుచు నీల్గుట, ననఘాత్మకులై వసింతు రస్మత్పదవిన్. |
586 |
| క. |
వినుఁడిలమీఁద నిఁకెన్నఁటి, కిని బుట్టువు లేదు వీరికిన్, మీరలు వ ల్కిన యట్ల నాదు చిత్తము, నను దలఁతుంగాన మీ మనంబుల నింకన్. |
587 |
| ఉ. |
“దీనికిఁజింతఁదక్కుఁడు, సుధీజనపుంగవు”ల న్నఁ బ్రీతులై యా నలినాసనాత్మజు లనంతుని భావము దా మెఱింగి పెం పూనిన వేడ్కఁదేలి తెలివొందిన చిత్తములన్ నుతించి రం భోనిధిశాయి నార్తజనపోషణభూషణుఁబాపశోషణున్. |
588 |
| వ. | మఱియును. | 589 |
| ఉ. |
ఆ సనకాదు లంతఁబులకాంకురముల్ ననలొత్త బాష్పధా రాసుభగాక్షులై మునిశరణ్యవరేణ్యు నగణ్యు దేవతా గ్రేసరు దివ్యమంగళశరీరముఁ జారుతదీయధామమున్ భాసురలీలఁజూచి నవపద్మదళాక్షునకున్ వినమ్రులై. |
590 |
| క. |
తమ పలికిన భాషణములు, గమలోదరు భాషణములుగాఁ దలఁచుచు నె య్యమునన్ వైష్ణవలక్ష్మిం, బ్రమదంబునఁబ్రస్తుతించి పరమేశ్వరుచేన్ |
591 |
| క. |
ఆమంత్రితులై తగ నిజ, ధామములకుఁజనిరి వారు, దడయక లక్ష్మీ కాముఁడు జయవిజయుల నభి, రామంబుగఁజూచి పలికె రయ మొప్పారన్. |
592 |
| క. |
మీ రసురయోనియం దని, వారితులై జనన మందవలసెను, నే దు ర్వారబలాఢ్యుఁడ నయ్యును, వారింపఁగనోప విప్రవచనము లెందున్. |
593 |
| క. |
అది గాన దనుజయోనిం, బదపడి జనియించి మద్విపక్షులరై మీ మది నెపుడు నన్నె తలఁచుచు, వదలక నాచేతఁ జచ్చి వచ్చెద రిటకున్. |
594 |
| ఉ. |
పొండని యానతిచ్చి హరి ఫుల్లసరోరుహపత్రనేత్రుఁ డా ఖండలముఖ్యదిగ్వరనికాయకిరీటలసన్మణిప్రభా మండితపాదపీఠుఁడు రమారమణీమణి దోడ నేఁగుదే నిండిన వేడ్క నేఁగె నిజనిర్మలపుణ్యనివాసభూమికిన్. |
595 |
| వ. | అంత. | 596 |
| క. |
నిజతేజోహానిగ జయ, విజయులు ధరఁగూలి రపుడు విహ్వలు లగుచుం ద్రిజగముల సురవిమాన, వ్రజముల హాహారవంబు గ్రందుగఁజెలఁగన్. |
597 |
| క. |
వారలె యా దితిగర్భా, గారంబున నున్నవారు గడఁగి తదీయో దారఘనతేజ మిపు డని, వారణ మీ తేజ మెల్ల వమ్ముగఁ జేసెన్. |
598 |
| ఉ. |
ఇంతకు మూల మా హరి, రమేశ్వరుఁడర్థి నొనర్చు కార్యముల్ వింతలె? సర్వభూత భవవృద్ధివినాశనహేతుభూతుఁ డా ద్యంతవికారశూన్యుఁడు దయానిధి మీ యెడ మేలు సేయు నీ చింతఁదొఱంగి వే చనుఁడు, చేకుఱు మీకు మనోరథార్థముల్. |
599 |
| క. |
అని వనజాసనుఁడాడిన, విని తద్వృత్తాంత మెఱిఁగి విబుధులు నాకం బున కేగిరి, దితి నిజ నా, థుని మాటలు తలఁచి యపరితోషము తోడన్. |
600 |