పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
హిరణ్యాక్షుఁడు యజ్ఞవరాహంబగు హరి నెదిరించి పోరుట
చ. అనవుడు దానవేంద్రుఁడు హుతాశనుకైవడి మండి పద్మలో
చను నెదిరించు వేడుకలు సందడిఁగొల్ప ననల్పతేజుఁడై
ఘనగదఁగేలఁబూని త్రిజగద్భయదాకృతిఁదాల్చి వ్రేల్మిడిం
జనియె రసాతలంబునకుఁజండభుజాబలదర్ప మేర్పడన్‌.
631
వ. చని జలమధ్యంబున. 632
క. దివిజారి యెదురఁదగఁగనె, నవిరళదంష్ట్రాభిరాము నమరలలామున్‌
గువలయభరణోద్దామున్‌, సవనమయస్తబ్ధరోము జలదశ్యామున్‌.
633
వ. అ య్యవసరంబున సూకరాకారుండైన హరియు. 634
క. వనజరుచిసన్నిభములగు, తన లోచనయుగళదీప్తిఁదనరఁదదాలో
కనముల దనుజాధీశుని, తనుకాంతి హరింపఁజేసెఁ దత్‌ క్షణమాత్రన్‌.
635
వ. మఱియు న య్యాదివరాహం బవార్యశౌర్యంబున మాఱులేని విహారంబునం జరియించునట్టి యెడ. 636
సీ. తుదమొదళ్లకుఁ జిక్కి తునిసి పాఱఁగ మోరఁ గులశైలములఁజిమ్ముఁగొంత తడవు,
బ్రహ్మాండభాండంబు పగిలి చిల్లులు వోవఁ గొమ్ములఁదాటించుఁగొంత తడవు,
జలధు లేడును బంకసంకులంబై యింక ఖురముల మట్టాడుఁ గొంత తడవు,
ఉడురాజు సూర్యుండు నొక్క మూలకుఁ బోవఁ గుఱుచ వాలము ద్రిప్పుఁ గొంత తడవు,
 
తే. గునియుఁ గుప్పించు లంఘించుఁ గొప్పరించు, నెగయు ధరఁ ద్రవ్వు బొఱియఁగా నేపు రేఁగి
దానవేంద్రుని గుండెలు దల్లడిల్లఁ, బంది మెల్లన రణపరిస్పంది యగుచు.
637
వ. మఱియును, 638
క. కనుఁగవ నిప్పులు రాలఁగ, సునిశితదంష్ట్రాగ్రయుతవసుంధరుఁ డగుచుం
దన కెదురేతేఁగని య, వ్వనచర మే రీతి నిపుడు వనచర మయ్యెన్‌.
639
క. అని యాశ్చర్యభయంబులు, దన మనమునఁదొంగలింప దనుజాధిపుఁ డి
ట్టనియెన్‌ భీకరసూకర, తనువొంది చరించు దనుజదర్పాపహుతోన్‌.
640
క. ఘనసూకర! మూఢాత్మక!, వనరుహసంభూతదత్తవరదానమునం
గనిన రసాతలగతభువి, యనయంబును నా యధీనమై వర్తించున్‌.
641
క. గొనకొని నీ వీ ధరణిం, గొని పోకుము, విడుము కాక కొని పోయెద వేఁ
గొనియెద నీ ప్రాణముఁ గై, కొను నా వచనములు చలముగొన నేమిటికిన్‌?
642
క. మాయావి వగుచు నిప్పుడు, పాయక యీ పుడమిఁ జోరభావంబున నీ
వీ యెడఁ గొనిపోఁజూతునె, యాయతభుజబలముచేత నడఁపక యనుచున్‌.
643
సీ. అవిరళయోగమాయాబలంబునఁజేసి యల్పపౌరుషమున నలరు నిన్ను
నర్థి సంస్థాపించి యస్మత్సుహృద్భృత్య కులుల కెల్లను మోద మొలయఁ జేయఁ
జెలువేది మద్గదాశీర్ణుఁడవగు నిన్నుఁ గనుఁగొని దేవతాగణము లెల్ల
నిర్మూలులై చాల నెఱి నశించెద రన్న విని యజ్ఞపోత్రియై వెలయుచున్న
 
తే. హరి సరోజాతభవముఖామరుల కెల్ల, వచ్చు దురవస్థ కాత్మలో వంత నొంది
నిశితదంష్ట్రాగ్రలసితయై నెగడు ధరణి, దేవితో నొప్పె నా దేవదేవుఁ డంత.
644
క. సురరిపు వాక్యాంకుశముల, గురుకుపితస్వాంతుఁడగుచుఁగొమరారె వసుం
ధరతోడ భీతి నొందిన, కరిణింగల కరికులేంద్రుకరణింబెలుచన్‌.
645
తే. నిశితసితదంతరోచులు నింగిఁ బర్వఁ, గంధి వెడలి భయంకరాకారలీల
నరుగు భీషణ మఖవరాహావతార, మొనరఁ దాల్చిన పద్మలోచనుని వెనుక
646
క. కరివెనుకఁదగులు నక్రము, కరణింజని దైత్యవిభుఁడు గదిసి యిటు లనున్‌
దురితపయోనిధితరికిం, గిరికిన్‌ ఖురదళితమేరుగిరికిన్‌ హరికిన్‌.
647
క. నిందకు రోయక లజ్జం, జెందక వంచనను రణము సేసి జయంబుం
బొందెద నని తలఁచుచు నిటు, పందగతింబాఱ బంటుపంతమె? నీకున్‌.
648
వ. అని యాక్షేపించినం బుండరీకాక్షుండు గోపోద్దీపితమానసుండై. 649
క. తోయములమీఁద భూమి న, నాయాసత నిల్పి దాని కాధారముగాఁ
దోయజనాభుఁడు దన బల, మాయతమతిఁ బెట్టె సురలు హర్షము నొందన్‌.
650
తే. కుసుమముల వృష్టి బోరనఁగురిసె, నంత, విభవ మొప్పార దేవదుందుభులు మొరసెఁ,
గడఁక వీతెంచె గంధర్వగానరవము, నందితములయ్యె నప్సరోనర్తనములు.
651
వ. అయ్యవసరంబున నయ్యజ్ఞవరాహమూర్తిధరుండైన కమలలోచనుండు గనక కుండల కేయూర గ్రైవేయకటకాంగుళీయకభూషణరోచులు నింగిఁబర్వ సమరసన్నద్ధుండై. 652
చ. ఘనగదఁగేలఁబూని మణికాంచననవ్యవిచిత్రవర్మ మిం
పొనరఁగఁ దాల్చి దానవనియుక్తదురుక్తనిశాతబాణముల్‌
దన ఘనమర్మముల్‌ గలఁప దానవహంత నితాంతశౌర్యుఁడై
కనలుచు వచ్చు న ద్దనుజుఁగన్గొని రోషవిభీషణాకృతిన్‌.
653
వ. ఒప్పియు నగుచు నిట్లనియె. 654
మ. వినరా యోరి యమంగళాచరణ! యుద్వృత్తిన్‌ ననున్‌ నీమది
న్ననయంబున్‌ వనగోచరంబగు మృగంబంచుందలంతౌర, నే
నెనయన్‌ వన్యమృగంబ యౌదు, బలిమి న్నేతెంచు నీబోఁటి యీ
శునకశ్రేణి వధింతు నేఁ డనిమొనన్‌ సోఁకోర్చి వర్తించినన్‌.
655
క. బలిమి గలదేని నాతోఁ, గలనను నెదిరించి పోరఁగడఁగుము, నీ కో
ర్కులు నేఁడు దీర్తు, నూరక, తలపోయ వికత్థనంబు దగదు దురాత్మా!
656
చ. విను, మది గాక సంగరవివేకవిశారదులైన యట్టి స
జ్జనములు మృత్యుపాశములఁజాల నిబద్ధులు నయ్యు నీవలెన్‌
గొనకొని యాత్మసంస్తుతులకున్‌ ముద మందిరె? యేల యీ విక
త్థనములు బంటుపంతములె దైత్యకులాధమ! యెన్ని చూడఁగన్‌.
657
మ. ధృతిఁబాతాళమునందు నీవనెడి సందీప్తోగ్ర నిక్షేప మే
నతిదర్పంబునఁగొందుఁ,జూడు మిదె దేవారాతి! నన్నెన్నె దౌ
గతలజ్జుండన దాఁగి యుండి రణముంగావింతు, యుష్మద్గదా
వితతద్రావితుఁడన్న న న్నెదురుమా, వే తీర్తు నీ కోరికల్‌.
658
ఉ. ఎన్నఁబదాతియూథముల కెల్ల విభుండవు, పోటుబంటవై
నన్ను రణోర్వి నేఁడెదిరినన్‌ భవదీయబలంబు నాయువున్‌
మిన్నక కొందుఁజూడు, మిది మేరగ మేదిని వీతదైత్యమై
వన్నెకు నెక్కఁజేసెద నవార్యపరాక్రమవిక్రమంబునన్‌.
659
చ. నను నెదురంగఁజాలిన ఘనంబగు శౌర్యము ధైర్యమున్‌ బలం
బును గలదేని నిల్వు రణభూమిని, నీ హితులైన వారికిం
గనుఁగవ బాష్పపూరములు గ్రమ్మఁగ మాన్పఁగ నోపుదేనిఁ జ
య్యనఁజనుదెమ్ము దానవకులాధమ! యూరక రజ్జు లేటికిన్‌?
660
క. నను నిట సంస్థాపించెద, నని పలికితి, వంతవాఁడ వౌదువు, నీకున్‌
నెనరైన చుట్టములఁ బొడ, గని రా యిదె యముని పురికిఁ గాఁపుర మరుగన్‌.
661
మ. అని యిబ్భంగి సరోరుహాక్షుఁడు హిరణ్యాక్షున్‌ విడంబించి ప
ల్కిన హాసోక్తుల కుల్కి రోషమదసంగీభూతచేతస్కుఁడై
కనుఁగ్రేవన్‌ మిడుఁగుర్లు సాలఁ బొడమంగాఁగిన్కమైఁదోఁక ద్రొ
క్కిన కృష్ణోరగరాజుమాడ్కి మదిలోఁగీడ్పాటు వాటిల్లఁగన్‌.
662
క. చలితేంద్రియుఁడై నిట్టూ, ర్పులు నిగిడించుచును బొమలు ముడివడ రోషా
కులమానసుఁడై గదఁగొని, జలజాక్షున కెదురు నడచె సాహస మొప్పన్‌.
663
వ. అత్తఱి హిరణ్యాక్షుండతిభయంకరాకారుండై. 664
మ. గద సారించి మదాసురేంద్రుఁడు సమగ్రక్రోధుఁడై మాధవున్‌
గుదియన్‌ వేసిన వ్రేటు గై కొనక రక్షోహంత శౌర్యోన్నతిన్‌
గదఁగేలన్‌ ధరియించి దానిఁదునుకల్‌ గావించినన్‌ దైత్యుఁడు
న్మదుఁడై యొండు గదన్‌ రమావిభుని భీమప్రక్రియన్‌ వ్రేసినన్‌.
665
చ. అది దనుఁదాఁకకుండ దనుజారి గదారణకోవిదక్రియా
స్పదకరలాఘవక్రమముఁబైకొని చూపి విరోధి పేరురం
బదరఁగ వేయ వాఁడు వివశాకులభావము నొంది యంతలో
మదిఁదెలివొంది వ్రేసె రిపుమానవిమర్దను నా జనార్దనున్‌.
666
వ. ఇట్లు దలపడి యన్యోన్యజయకాంక్షల నితరేతరతుంగ తరంగ తాడితంబులగు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబునఁ బరస్పర శుండాదండ ఘట్టితమదాంధ గంధ సింధుర యుగంబు చందంబున రోషభీషణాటోపంబులం దలపడు బెబ్బులుల గబ్బున, నతిదర్పాతిరేకంబున నెదిర్చి ఱంకెలు వైచు మదవృషభంబుల రభసంబున, నసహ్య సింహపరాక్రమంబున విక్రమించి పోరునెడ హిరణ్యాక్షుండు సవ్యమండల భ్రమణంబునం బరివేష్టించినం బుండరీకాక్షుండు దక్షిణ మండల భ్రమణంబునం దిరిగి విపక్షు వక్షం బశనిసంకాశంబగు గదాదండంబునం బగిల్చిన వాఁడు దెప్పిఱి తెలివొంది లేచి దనుజపరిపంథి ఫాలంబు నొప్పించె, నప్పు డమ్మేటి వీరులు శోణితసిక్తాంగులై పుష్పితాశోకంబులఁ బురుడించుచుం బాయుచు డాయుచు వ్రేయుచు రోయుచు నొండొరుల రుధిరంబు లాఘ్రాణించుచుఁ దిరస్కార పరిహాసోక్తుల నిచ్చుచుఁ బోరు సమయంబున న మ్మహాబలుల సమరంబుఁ జూచు వేడ్కఁ బద్మసంభవుండు నిఖిల మునీంద్రసిద్ధసాధ్య దేవగణంబుల తోడఁ జనుదెంచి ధరిత్రీనిమిత్తం బసురవరునితోడం బోరు యజ్ఞవరాహున కిట్లనియె. 667
ఉ. అంచితదివ్యమూర్తి! పరమాత్మక! యీ కలుషాత్ముఁడైన న
క్తంచరుఁడస్మదీయవరగర్వమునన్‌ భువనంబు లెల్లఁ గా
రించు మదించి యిట్టి విపరీతచరిత్రునిఁ ద్రుంప కిట్లుపే
క్షించుట గాదు, వీని బలిసేయు వసుంధరకున్‌ శుభంబగున్‌.
668
క. బాలుఁడు గరమున నుగ్ర, వ్యాళము ధరియించి యాడువడువున రక్షః
పాలునిఁ ద్రుంపక యూరక, పాలార్చుట నీతియే శుభప్రద! యింకన్‌.
669
వ. అదియునుంగాక. 670
మ. అనఘా! యీ యభిజిన్ముహూర్తమున దేవారాతి మర్దింపవే
ననయంబున్‌ మఱి దైత్యవేళ యగు సంధ్యాకాల మేతెంచినన్‌
ఘనమాయా బలశాలియైన దనుజున్‌ ఖండింపఁగా రాదు గా
వున నీ వేళన త్రుంపు సజ్జనహితప్రోద్యోగరక్తుండవై.
671
క. అని సరసిజగర్భుఁడు వ, ల్కిన వచనము లర్థి విని, నిలింపులు గుంపుల్‌
గొని చూడ సస్మితానన, వనజము చెలువొంద నసురవరు కభిముఖుఁడై.
672
తే. పుండరీకాక్షుఁడయ్యును భూరిరోష, నిరతిఁదరుణారుణాంభోజనేత్రుఁడగుచు
ఘనగదాదండ మెత్తి రాక్షసుని హనువు, నుగ్రగతి మొత్తె వాఁడును నోసరించె.
673
క. పరువడి దితిసుతుఁడతి భీ, కరగదఁ జేఁబూని చిత్రగతులను బద్మో
దరు డాసి చేతిగద సా, గరమునఁ బడ నడిచె బాహుగర్వ మెలర్పన్‌.
674
వ. అంత. 675
తే. హరి నిరాయుధుఁడైన, సురారి సమర, ధర్మమాత్మను దలఁచి యుద్ధంబు దక్కి
నిలిచి చూచుచునుండెను, నింగి యమర, వరుల హాహారవంబుల భరిత మయ్యె.
676
క. సరసిజనేత్రుఁడు దనుజే, శ్వరు సంగరధర్మమునకు సమధికశౌర్య
స్ఫురణకుఁ దన చిత్తంబునఁ, గర మాశ్చర్యంబు నొంది కడఁక దలిర్పన్‌.
677
మ. కుతలోద్ధర్త మనంబునందలఁచె రక్షోరాడ్వధార్థంబుగా
దితిసంతానకులాటవీమహితసందీప్తప్రభాశుక్రమున్‌,
సతతోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్చక్రమున్‌, సంతతా
శ్రితనిర్వక్రముఁ, బాలితప్రకటధాత్రీచక్రముం జక్రమున్‌.
678
వ. అదియునుం బ్రచండ మార్తాండ మండల ప్రభాపటల చటుల విద్యోతమానంబును, బటునట జ్జ్వాలి కాపాస్త సమస్త కుపితారాతి బలాఖర్వ దుర్వార బాహాగర్వాంధకారంబును, నసహ్యకహ కహ నినదాధరీకృత సాగర ఘోషంబును, సకల దేవతాగణ జేగీయమానంబును, ననంత తేజో విరాజితంబును, నిజప్రభాపటల పూరిత బ్రహ్మాండ కటాహంబునునై రయంబునం జనుదెంచి, దనుజారి దక్షిణకర సరోజంబు నలంకరించిన నా శుభాంగుండు రథాంగపాణియై దివంబున నమరగణంబులు జయజయ శబ్దంబులు వలుక నసురవిభున కెదురు నడచిన. 679
క. పొడగని దనుజుఁడు పెదవులు, దడుపుచుఁబొలివోని బంటుతనమున బీరం
బుడుగక భీషణగదఁగొని, యడిచెన్‌ మఖమయవరాహు నమితోత్సాహున్‌.
680
క. త్రిదశారి దన్ను వ్రేసిన, గదఁ బదమునఁబోవఁదన్ని కమలాక్షుఁడు పెం
పొదవఁగ మనమున మోదము, గదురఁగ లేనగవు వదనకమలముఁబొదువన్‌.
681
వ. ఇ వ్విధంబున గదఁబోవందన్ని యసురవిభునితో నిట్లనియె. 682
చ. ఘనగదఁగేలఁబూని భుజగర్వ మెలర్పఁగ నన్ను సంగరా
వని నెదిరింతు రార! యనివారణ దైత్యకులేశ్వరాధమా!
యనవుడు వాఁడు నుబ్బి గద నంబుజనాభుని వ్రేసె,వ్రేసినం
దనుజవిభేది వట్టికొనెఁ దార్‌క్ష్యుఁడహీంద్రునిఁబట్టుకైవడిన్‌.
683
క. దితిజుఁడు దన బల మప్రతి, హతతేజుండగు సరోరుహాక్షుని శౌర్యో
న్నతిమీఁదఁ బెట్టకుండుట, మతి నెఱిఁగియుఁ బెనఁగె దురభిమానము పేర్మిన్‌.
684
వ. అంత. 685
సీ. కాలానలజ్వలజ్జ్వాలా విలోల క, రాళమై పెంపొందు శూల మంది
సురవైరి యజ్ఞసూకరరూపధరుఁడైన, వనజనాభునిమీఁద వైవ నదియు
సద్ద్విజోత్తముమీఁదఁజపలతఁగావించు, నభిచారకర్మంబునట్ల బెండు
పడి పఱతేఁ గని పద్మోదరుఁడు దానిఁ, జక్రధారాహతిఁజండవిక్ర
 
తే. మమున నడుమన వడిఁద్రుంచె, నమరభర్త, మహితదంభోళిచే గరుత్మంతు పక్ష
మతిరయంబునఁద్రుంచిన గతిఁజెలంగి, సురలు మోదింప నసురులు సొంపు డింప.
686
వ. అయ్యవసరంబున నయ్యసుర దనశూలంబు చక్రంబుచేత నిహతం బగుటంగని. 687
క. దితిజుఁడు రోషోద్ధతుఁడై, యతినిష్ఠురముష్టిఁబొడిచె హరి, నా లోకో
న్నతుఁ డొప్పెఁ గుసుమమాలా, హతి దిగ్గజరాజుఁబోలె నతిదర్పితుఁడై.
688
మ. హరిమీఁదన్‌ దితిసంభవుండు ఘనమాయాకోట్లు పుట్టించినన్‌
ధరణీచక్రము భూరిపాంసుపటలధ్వాంతంబునంగప్పె, భీ
కరపాషాణపురీషమూత్రఘనదుర్గంధాస్థిరక్తావళుల్‌
గురిసెన్‌ మేఘము లభ్రవీథిని మహాక్షోభక్రియాలోలమై.
689
వ. మఱియును. 690
చ. తవిలి విముక్త కేశపరిధానము లుగ్రకరాళదంత తా
లువులును రక్తలోచనములుంగల భూతపిశాచడాకినీ
నివహము లంతరిక్షమున నిల్చి నిజాయుధపాణులై మహా
రవముగ యక్షదైత్యచతురంగబలంబులఁగూడి తోఁచినన్‌.
691
వ. అంత. 692
క. త్రిసవనపాదుండగు నా, బిసరుహనేత్రుండు లోకభీకరమగు నా
యసురాధిపు మాయావి ని, రసనకరంబైన శస్త్రరాజముఁబనిచెన్‌.
693
క. ఆ చక్రభానుదీప్తి ధ, రా చక్రమునందు నిండి రయమున నమ్మా
యాచక్రము నడఁగించెను, నీచక్రముఁడైన యామినీచరు నెదురన్‌.
694
వ. అంత నిక్కడ. 695
క. దితి తన విభువాక్యంబుల, గతి దప్పద యనుచుఁ దలఁపఁగాఁ జన్నుల శో
ణితధార లొలికె రక్షః, పతి యగు కనకాక్షు పతన భావము దోఁపన్‌.
696
వ. అయ్యవసరంబున నసురవిభుండు దన చేసిన మాయాశతంబులు గృతఘ్నునకుం గావించిన యుపకారంబులుంబోలె హరిమీఁదఁ బనిసేయక విఫలంబు లయినం బొలివోవని బంటుతనంబునఁ బుండరీకాక్షుఁ జేరం జనుదెంచి బాహుయుగళంబు సాఁచి పూఁచి పొడిచి రక్షోవైరివక్షంబుఁ బీడించిన నయ్యధోక్షజుండు దప్పించుకొని తలంగినం జెలంగి దైత్యుండు నిష్ఠురంబగు ముష్టింబొడిచిన నసురాంతకుండు మిసిమింతుండు గాక రోషభీషణాకారంబున వాసవుండు వృత్రాసురుం దెగటార్చిన చందంబున వజ్రివజ్రసన్నిభంబగు నఱచేతం గఱకుటసురకటితటంబుఁ జటులగతి వ్రేసిన నా హిరణ్యాక్షుండు దిర్దిరందిరిగి యుదస్తలోచనుండై సోలి యెట్టకేలకు నెదుర నిలువంబడె, నంత. 697
క. దిట చెడి లోఁబడె దైత్యుఁడు, సటికిన్‌, దంష్ట్రావిభిన్నశత్రుమహోర
స్తటికిన్‌, ఖరఖురపుటికిం, గటితటహతకమలజాండఘటికిం, గిటికిన్‌.
698
వ. ఇట్లు లోఁబడిన. 699
మ. దివి నింద్రాదులు సంతసింప హరి మొత్తెం గర్ణమూలంబునం
బవిసంకాశకఠోరహస్తమున శుంభల్లీలమై దాన దా
నవలోకేశుఁ డుదస్తనేత్రుఁ డగుచున్‌ దైన్యంబు వాటిల్లఁగా
భువిమీఁదన్‌ వడిఁగూలె మారుతహతోన్మూలావనీజాకృతిన్‌.
700
క. బుడ బుడ నెత్తురు గ్రక్కుచు, వెడరూపము దాల్చి గ్రుడ్లు వెలి కుఱుక, నిలం
బడి పండ్లు గీటుకొనుచును, విడిచెంబ్రాణములు దైత్యవీరుండంతన్‌.
701
తే. పడిన దనుజేశ్వరునిఁజూచి పద్మసంభ, వాది దివిజులు వెఱఁగంది రాత్మలందు
నితఁడు వొందుట యెట్లొకో యీ యవస్థ, నని తలంచుచు మఱియు నిట్లనిరి వరుస.
702
మ. వరయోగీంద్రులు యోగమార్గముల నెవ్వానిన్‌ మనోవీథి సు
స్థిరతన్‌ లింగశరీరభంగమునకై చింతింతు, రా పంకజో
దరు పాణ్యాహతిఁదన్ముఖాంబురుహమున్‌ దర్శించుచుంజచ్చె దు
ర్భరితోత్తంసుని దైత్యవల్లభుని సౌభాగ్యంబు దా నెట్టిదో.
703
చ. సమమతి వీరు దైత్యకులశాసను పారిషదుల్‌, మునీంద్ర శా
పమున నికృష్టజన్మమునఁబైకొని పుట్టియు నేఁడు విష్ణుచే
సమయుటఁ జేసి మీఁదనగు జన్మమునన్‌ జలజాక్షు నిత్య వా
సమున వసింతు రెన్నఁటికిఁజావును బుట్టువు లేవు వీరికిన్‌.
704
క. అని వెఱఁగు నొంది పావన, తనువొందిన యట్టి వికచతామరసాక్షు
న్ననిమిష ముని యోగిజనా, వనదక్షున్‌ దనుజకరటి వరహర్యక్షున్‌.
705
వ. కనుంగొని. 706
చ. వనజదళాక్ష! యీ జగతివారల మర్మము లీ వెఱింగి యీ
సునఁబగఁబట్టు నీ దివిజసూదనుఁజంపితి గాన యింక శో
భన మగునంచు హస్తములు ఫాలములంగదియించి యందఱున్‌
వినమితులై నుతించిరి వివేకవిశాలునిఁబుణ్యశీలునిన్‌.
707
వ. అంత. 708
చ. సవనవరాహమూర్తి సురశాత్రవుఁద్రుంచినమీఁద భారతీ
ధవముఖదేవతామునికదంబము దన్ను నుతించునట్టి సం
స్తవమున కాత్మలోనఁబ్రమదంబును బొంది సమగ్రమంగళో
త్సవము దలిర్ప నందఱఁబ్రసాదవిలోకనమొప్పఁజూచుచున్‌.
709
చ. అరిగె వికుంఠధామమున క మ్మహితోత్సవసూచకంబుగా
మొరసె సుపర్వదుందుభు లమోఘములై, ధరణీతలంబునం
గురిసెఁ బ్రసూనవృష్టి, శిఖికుండము లెల్లెడఁ దేజరిల్లె, భా
స్కరశశిమండలంబులు నిజద్యుతితో వెలుఁగొందె నత్తఱిన్‌.
710
క. అని యీ పుణ్యచరిత్రము, వనరుహసంభవుఁడు ద్రిదివవాసులకుం జె
ప్పిన యది మైత్రేయుఁడు విదు, రున కెఱిఁగించిన విధంబు రూఢము గాఁగన్‌.
711
క. శుకయోగి పరీక్షిత్తున, కకుటిలమతి నెఱుఁగఁజెప్పె నని సూతుఁడు శౌ
నకముఖ్యులైన మునివరు, లకుఁ దెలియఁగఁ జెప్పె మఱియు లాలన మొప్పన్‌.
712
వ. ఇవ్విధంబున మైత్రేయుండు సెప్పిన విని విదురుండు సంతసిల్లె నని. 713
క. అనఘంబగు నీ చరితము, వినినఁబఠించిన లభించు విశ్రుతకీర్తుల్‌
వనజోదరు పదభ క్తియుఁ, మునుకొని యిహపరసుసౌఖ్యములు జనములకున్‌.
714
వ. అని చెప్పి వెండియు సూతుండు మహర్షుల కిట్లనియె. నట్లు పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని “మునీంద్రా, హిరణ్యాక్ష వధానంతరంబున వసుంధర సమస్థితిం బొందిన విధంబును, స్వాయంభువ మనువుం బుట్టించిన యనంతరంబున విరించి దిర్యగ్జాతిజంతు సృష్టినిమిత్తంబులైన మార్గంబు లెన్ని సృజించె, మహాభాగవతోత్తముండయిన విదురుండు గృష్ణున కపకారంబు దలంచిన పాపవర్తనులగు ధృతరాష్ట్ర పుత్రులం బాసి జనకుండగు కృష్ణద్వైపాయనునకు సముండగుచుఁ దన మనోవాక్కాయకర్మంబులు గృష్ణునంద చేర్చి భాగవతజనోపాసకుండై పుణ్యతీర్థ సేవా సమాలబ్ధయశో విగత కల్మషుండగుచు మైత్రేయ మహాముని నేమి ప్రశ్నంబు లడిగె? నవి యెల్లం దెలియ నానతి” మ్మనిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 715
సీ. విమలాత్ముఁడైన య వ్విదురుండు మైత్రేయమునివరుఁ జూచి యిట్లనియెఁ బ్రీతిఁ
జతురాత్మ! సకలప్రజాపతియైనట్టి జలజగర్భుఁడు ప్రజాసర్గమందు
మును ప్రజాపతులను బుట్టించి వెండియుఁ జిత్తమందేమి సృజింపఁదలఁచె?
మును సృజించినయట్టి మును లమ్మరీచ్యాదు లబ్జజునాదేశ మాత్మ నిలిపి
 
తే. యర్థి నెట్లు సృజించిరి యఖిలజగము?, మెఱసి మఱి వారు భార్యాసమేతు లగుచు
నేమి సృజియించి? రదిగాక కామినులను, బాసి యేమి సృజించి రా భద్రయశులు?
716
క. అందఱుఁదమలో నైక్యముఁ, జెందినచో నేమిఁదగ సృజించిరి? కరుణా
కందళితహృదయ! యిన్నియుఁ, బొందుగ నెఱిఁగింపుమయ్య బుధనుత! నాకున్‌.
717
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )