| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| సీ. |
అనిన మునీంద్రుఁ డిట్లనియె జీవాదృష్టపరుఁడు మాయాయుక్తపురుషవరుఁడుఁ గాలాత్మకుఁడు నను కారణంబున నిర్వికారుఁ డైనట్టి జగన్నివాసుఁ డాదిజాతక్షోభుఁడయ్యె, నమ్మేటివలనను గుణత్రయంబును జనించె; నా గుణత్రయమునందయ్యె మహత్త్తత్త్వ, మది రజోగుణహేతువైన దాని |
|
| తే. |
యందహంకార మొగిఁ ద్రిగుణాత్మకమునఁ, బొడమె, మఱి దానివలనఁ బ్రభూత మయ్యెఁ బంచతన్మాత్ర, లందు సంభవము నొందె, భూతపంచక మీ సృష్టిహేతు వగుచు. |
718 |
| వ. | అవియును దమలోనఁ బ్రత్యేకంబ భువన నిర్మాణ కర్మంబునకు సమర్థంబులు గాక యన్నింటి సంఘాతంబునఁ బాంచభౌతికంబైన హిరణ్మయాండంబు సృజియించె, నదియును జలాంతర్వర్తియై వృద్ధిఁ బొందుచుండె నంత. | 719 |
| సీ. |
నారాయణాఖ్య నున్నతి నొప్పు బ్రహ్మంబు సాహస్రదివ్యవర్షంబు లోలి వసియించి యుండె, నా వాసుదేవుని నాభియందు సహస్రసూర్యప్రదీప్తిఁ దనరుచు సకలజీవనికాయయుత మగు పంకజాతంబు సంభవము నొందెఁ, బరఁగంగ నందులో భగవదధిష్ఠితుండై స్వరాట్టగు చతురాననుండు |
|
| తే. |
జనన మందెను తత్పద్మసంభవుండు, నామరూపగుణాదిసంజ్ఞాసమేతుఁ డగుచు నిర్మాణ మొనరించె నఖిలజగము, వనజజుండు నిజచ్ఛాయవలన మఱియు. |
720 |
| సీ. |
తామిస్రమును నంధతామిస్రమును దమమును మోహనము మహామోహనంబు నను పంచమోహరూపాత్మకమైన యవిద్యఁ బుట్టించి యవ్వేళఁ దనకు నది తమోమయదేహ మని ధాత రోసి తత్తనువు విసర్జించె, ధాతృముక్త దేహంబు సతత క్షుత్తృష్ణల కావాసమును రాత్రిమయము నయ్యెను దలంప, |
|
| తే. |
నందులో యక్షరక్షస్సు లన జనింప, వారి కప్పుడు క్షుత్తృషల్ వఱలఁగొంద ఱా చతుర్ముఖు భక్షింత మనిరి, కొందఱతని రక్షింత మని తగ నాడి రంత. |
721 |
| వ. | ఇట్లు వలుకుచు భక్షించువారలయి ధాత సన్నిధికిం జనిన నతండు భయవిహ్వలుండై యేను మీ జనకుండను, మీరలు మత్పుత్త్రులరు, నన్ను హింసింపకుండనుచు “మా మా జక్షత”, “రక్షత” యను శబ్దంబులు వలుకం దన్నిమిత్తంబున వారలకుం గ్రమంబున యక్షరక్షోనామంబులు ప్రకటంబు లయ్యె, వెండియుం బ్రభావిభాసితంబైన యొక్క కాయంబు ధరించి సత్త్వగుణ గరిష్ఠులుం బ్రభావంతులు నగు సుపర్వులం బ్రముఖులుంగా సృజియించి తత్ప్రభామయగాత్ర విసర్జనంబు సేసిననది యహోరూపంబై దేవతావళికి నాశ్రయంబయ్యె, మఱియు జఘనంబువలన నతిలోలుపులైన యసురులం బుట్టింప వార లతికాముకు లగుటంజేసి యయ్యజునిం జీరి మిథున కర్మం బపేక్షించిన విరించి నగుచు నిర్లజ్జులయిన యసురులు దనవెంటం దగులం బఱచి ప్రపన్నార్తిహరుండును, భక్త జనానురూప సందర్శనుండును నైన నారాయణుం జేరి తత్పాదంబులకుంబ్రణమిల్లి యిట్లనియె. | 722 |
| క. |
రక్షింపుము రక్షింపు ము, పేక్షింపక వినుత నిఖిల బృందారక వి శ్వక్షేమంకర విను మిటు, దక్షత నీ యాజ్ఞ నేను దల నిడి వరుసన్. |
723 |
| తే. |
ఈ ప్రజాసృష్టి కల్పనం బే నొనర్ప, నందుఁ బాపాత్ములైన యీ యసురు లిపుడు నను రమింపఁగ డాయ వచ్చినఁ గలంగి, యిటకు వచ్చితి, ననుఁగావు మిద్ధచరిత! |
724 |
| వ. | అదియునుంగాక లోకంబువారలకుం గ్లేశంబు లొనరింపను, గ్లేశంబునం బొందిన వారల క్లేశంబు లపనయింపను నీవ కాక యితరులు గలరే? యని స్తుతియించినఁ బద్మజు కార్పణ్యం బెఱుంగ నవధరించి వివిక్తాధ్యాత్మదర్శనుం డగుచుఁ గమల సంభవ! భవద్ఘోరతనుత్యాగంబు సేయు మని యానతిచ్చిన నతండు నట్ల చేసెనంత నదియును. | 725 |
| సీ. |
నవ్యకాంచనరణన్మణినూపురారావ విలసితపాదారవిందయుగళ కాంచీకలాపసంకలితదుకూల వస్త్రస్ఫారపులిననితంబబింబ రాజితాన్యోన్యకర్కశ పీనకరికుంభ పృథుకుచభారకంపితవలగ్న మదిరారసాస్వాద మదవిఘూర్ణిత చారు సితనవవికచరాజీవనయన |
|
| తే. |
యపరపక్షాష్టమీ శశాంకాభ నిటల, మదవదలికులరుచిరోపమానచికుర లలితచంపకకుసుమవిలాసనాస, హాసలీలావలోకన యబ్జపాణి. |
726 |
| క. |
అనఁదగి సంధ్యారూపం, బున లలనారత్న మపుడు పుట్టిన దానిం గనుఁగొని దానవు లుపగూ, హన మొగిఁ గావించి పలికి రందఱుఁ దమలోన్. |
727 |
| క. |
ఈ సౌకుమార్య మీ వయ, సీ సౌందర్యక్రమంబు, నీ ధైర్యంబు, న్నీ సౌభాగ్య విశేషము, నే సతులకుఁగలదు చూడ నిది చిత్ర మగున్. |
728 |
| చ. |
అని వెఱఁగంది య ద్దనుజు లందఱు నిట్లని రీ తలోదరిం గని మన మంతనుండియును గాముకవృత్తిఁ జరించుచుండఁగా మనయెడ దీని చిత్తమున మక్కువ లేమికి నేమి హేతువో? యని బహుభంగులంబలికి యా ప్రమదాకృతియైన సంధ్యతోన్. |
729 |
| వ. | ఇట్లనిరి. | 730 |
| క. |
ఓ కదళీస్తంభోరువ!, యే కుల? మే జాడదాన? వెవ్వరి సుత? వి ట్లేకాంతంబున నిచ్చట, నే కారణమునఁ జరించె? దెఱిఁగింపు తగన్. |
731 |
| క. |
భవదీయచారురూప, ద్రవిణలసత్పుణ్యభూమిఁ దగు మోహమునం దవిలిన దుర్భరులను మముఁ, గవయవు పుష్పాస్త్రుబాధ ఘనమయ్యెఁ గదే! |
732 |
| వ. | మఱియుఁ దదీయ సౌందర్యంబుగ్గడింప నలవిగాక చింతించుచు. | 733 |
| సీ. |
గురుకుచభారసంకుచితావలగ్నంబు దనరారు నాకాశతలము గాఁగ లలితపల్లవపాణితలమునఁ జెన్నొందు చెండు పతత్పతంగుండు గాఁగ సలలితనీలపేశలపృథుధమ్మిల్లబంధంబు ఘనతమఃపటలి గాఁగఁ బ్రవిమలతరకాంతభావవిలోకన జాలంబు దారకాసమితి గాఁగఁ |
|
| తే. |
గడఁగి మైపూఁత సాంధ్యరాగంబు గాఁగ, నంగనాకృతి నొప్పు సంధ్యావధూటిఁ గదిసి మనముల మోహంబు గడలుకొనఁగ, నసురు లందఱుఁ గూడి యిట్టనిరి మఱియు. |
734 |
| క. |
వెలయఁగఁ బద్మంబేక, స్థలముననే యొప్పుఁగాని త్వత్పదపద్మం బిల బహుగతుల ననేక, స్థలములఁ దనరారుఁ గాదె తరుణాబ్జముఖీ! |
735 |
| క. |
అని దనుజులు దమ మనముల, ననురాగము లుప్పతిల్ల నందఱు నా సం ధ్యను బట్టికొనిరి, వనజా, సనుఁ డప్పుడు హృదయమందు సంతస మందెన్. |
736 |
| క. |
సరసిజభవుఁ డయ్యెడఁ దన, కర మాఘ్రాణింప నపుడు గంధర్వులు న ప్సరసలుఁ బుట్టిరి, ధాతయుఁ, బరువడి నాత్మీయతనువుఁ బాసిన నదియున్. |
737 |
| వ. | చంద్రికారూపంబైన, తద్గాత్రంబు విశ్వావసు పురోగములగు గంధర్వాప్సరోగణంబులు గైకొనిరి. వెండియుం గమలగర్భుండు తంద్రోన్మాద జృంభికా నిద్రా రూపంబైన శరీరంబు దాల్చి పిశాచ గుహ్యక సిద్ధ భూత గణంబులం బుట్టించిన వారలు దిగంబరులు, ముక్తకేశులు నయినం జూచి ధాత లోచనంబులు ముకుళించి తద్గాత్రంబు విసర్జనంబు గావించిన నది వారలు గైకొనిరి, వెండియు నజుండు దన్ను నన్నవంతునింగాఁ జింతించి యదృశ్యదేహుం డగుచుం బితృ సాధ్యగణంబులం బుట్టించిన వారలు దమ్ముఁ బుట్టించిన యదృశ్య శరీరంబునకుం గార్యంబగు దేవభాగంబుఁ గైకొనినం దత్కారణంబునం బితృసాధ్యగణంబుల నుద్దేశించి శ్రాద్ధంబుల హవ్యకవ్యంబు లాచరింతురు, మఱియును. | 738 |
| సీ. |
సజ్జనస్తుత!, విను చతురతఁ బంకజాసనుఁడు దిరోధానశక్తివలన నరసిద్ధవిబుధకిన్నరులను బుట్టించి తవిలి వారికిఁ దిరోధాననామ ధేయ మైనట్టి యా దేహంబు నిచ్చెను వెండియు భారతీవిభుఁడు దనకుఁ బ్రతిబింబ మగు శరీరమునఁ గిన్నరులఁ గింపురుషులఁ బుట్టింపఁ బూని వారు |
|
| తే. |
ధాతృప్రతిబింబదేహముల్ దాల్చి వరుస, నిద్ద ఱిద్దఱు గవగూడి యింపులొదవ బ్రహ్మపరమైన గీతముల్ పాడుచుండి, రంతఁ బంకజసంభవుఁ డాత్మలోన. |
739 |
| క. |
తన సృష్టి వృద్ధి లేమికిఁ, గనలుచు శయనించి చింతఁ గరచరణాదుల్ గొనకొని కదలింపఁగ రా, లిన రోమము లుగ్రకుండలివ్రజ మయ్యెన్. |
740 |
| క. |
వనజజుఁడు దన్నుఁ గృత కృ, త్యునిఁగా భావించి యాత్మఁ దుష్టి వహింపన్ మనమున నిఖిలజగత్పా, వను లగు మనులం ద్రిలోకవరుల సృజించెన్. |
741 |
| సీ. |
పుట్టించి వారికిఁ బురుషరూపంబైన తన దేహ మిచ్చినఁ దగిలి వారు గనుఁగొని మున్ను పుట్టినవారిఁ గూడి యా వనజసంభవున కిట్టనిరి, దేవ! యఖిలజగత్స్రష్టవైన నీచేతఁ గావింపంగఁబడిన యీ వితతసుకృత మాశ్చర్యకరము, యజ్ఞాదిక్రియాకాండ మీ మనుసర్గమం దీడ్య మయ్యెఁ |
|
| తే. |
దద్ధవిర్భాగములు మాకుఁ దవిలి జిహ్వ, లందు నాస్వాదనములు సేయంగఁ గలిగె ననుచు మనముల హర్షంబు లతిశయిల్ల, వినుతి సేసిరి భారతీవిభుని మఱియు. |
742 |
| వ. | వరతపోయోగ విద్యా సమాధి యుక్తం బగుచు ఋషివేషధరుండును, హృషీకాత్ముండునునై ఋషిగణంబులం బుట్టించి సమాధి యోగైశ్వర్య తపో విద్యా విరక్తి యుక్తంబగు నాత్మీయ శరీరాంశంబు వారికిం గ్రమంబున నొక్కొక్కనికి నిచ్చెనని మైత్రేయుండు సెప్పిన విని విదురుండు పరమానందంబునం బొంది గోవిందు చరణారవిందంబులు డెందంబునందలంచి వెండియు మైత్రేయునింజూచి యిట్లనియె. | 743 |
| సీ. |
వరగుణస్వాయంభువమనువంశంబిలఁ బరమసమ్మతము, దప్పదు, తలంపఁ గొనకొని తద్వంశమున మిథునక్రియఁ జేసి ప్రజావృద్ధిఁ జెప్పి తీవు, అదియునుగాక స్వాయంభువమనువుకుఁ బూని ప్రియవ్రతోత్తానపాదు లను నందనులు గల రంటివి, వారు సప్తద్వీపవతియైన ధాత్రి నెల్ల |
|
| తే. |
ధర్మమార్గంబు లేమియుఁ దప్పకుండ, ననఘులై యెట్లు పాలించిరయ్య? వారి చరిత యెల్లను సత్కృపానిరతబుద్ధి, నెఱుఁగ వినిపింపు నాకు మునీంద్రచంద్ర! |
744 |
| వ. | అదియునుంగాక తన్మనుపుత్రియు యోగలక్షణ సమేతయు నగు దేవహూతి యను కన్యకారత్నంబును స్వాయంభువుండు గర్దమునకు నే విధంబునం బెండ్లి చేసె? నా దేవహూతి యందు మహాయోగి యయిన కర్దముండు ప్రజల నేలాగునం బుట్టించె? నదియునుం గాక కర్దముండు రుచి యను కన్యను దక్షప్రజాపతి కిచ్చె నని చెప్పితివి, ఆ రుచియందు నమ్మహాత్ముం డీ సృష్టి యేలాగునం బుట్టించె? నవి యన్నియుం దెలియ నానతీయ వలయునని యడిగిన విదురునకు మైత్రేయుండిట్లనియె. | 745 |