| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| సీ. |
కైకొని మఱి పూర్వకర్మానుగుణమున శశ్వత్ప్రకాశకుం డీశ్వరుండు ఘటకుండు గావునఁ గ్రమ్మఱ జీవుండు దేహసంబంధంబుఁ దివిరి తాల్ప దొరకొని పురుష రేతోబిందు సంబంధి యై వధూగర్భంబునందుఁ జొచ్చి కైకొని యొక రాత్రి గలిలంబు పంచరాత్రముల బుద్బుదమును దశమదివస |
|
| తే. |
మందుఁ గర్కంధు వంతయౌ నంతమీఁదఁ, బేశియగు నంతమీఁదటఁ బేర్చి యండ కల్పమగు నొక్క నెల మస్తకమును మాస, యమళ మైనను గరచరణములుఁ బొడము. |
991 |
| వ. | మఱియు మాసత్రయంబున నఖ రోమాస్థి చర్మంబులు లింగచ్ఛిద్రంబులును గలిగి నాల్గవమాసంబున సప్త ధాతువులును బంచమ మాసంబున క్షుత్తృష్ణలును గలిగి, షష్ఠమాసంబున మావిచేతం బొదువంబడి తల్లికుక్షిని దక్షిణ భాగంబునం దిరుగుచు, మాతృభుక్తాన్నపానంబులవలనఁ దృప్తిం బొందుచు నేధమాన ధాతువులు గల్గి జంతుసంకీర్ణంబగు విణ్మూత్ర గర్తంబందుఁ దిరుగుచుఁ గ్రిమిభక్షిత శరీరుండై మూర్ఛలం బొందుచుఁ దల్లి భక్షించిన కటుతిక్తోష్ణ లవణ క్షారామ్లాద్యుల్బణంబులైన రసంబులచేతఁ బరితప్తాంగుం డగుచు జరాయువునఁ గప్పంబడి బహిఃప్రదేశంబునందు నాంత్రంబులచేత బద్ధుండై కుక్షియందు శిరంబు మోపికొని భుగ్నంబైన పృష్ఠగ్రీవోదరుండై స్వాంగచలనంబునందు నసమర్థుం డగుచుఁ బంజరంబునందుండు శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం బూర్వ జన్మ దుష్కృతంబులం దలంచుచు దీర్ఘోచ్ఛ్వాసంబు సేయుచు నే సుఖలేశంబునుం బొందక వర్తించుచు, నంత నేడవనెల యందు లబ్ధజ్ఞానుండై చేష్టలు గలిగి విట్క్రిమిసోదరుండై యొక్క దిక్కున నుండక సంచరించుచుం బ్రసూతి మారుతంబులచేత నతివేపితుం డగుచు యాచమానుండును, దేహాత్మదర్శియుఁ బునర్గర్భవాసంబునకు భీతుండు నగుచు బంధన భూతంబగు సప్తధాతువులచే బద్ధుండై కృతాంజలిపుటుండు, దీనవదనుండునై జీవుండు దా నెవ్వనిచే నుదరంబున వసియింప నియమింపంబడె నట్టి సర్వేశ్వరుని నిట్లని స్తుతియించు. | 992 |