పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
గర్భస్థుం డగు జీవుండు భగవంతుని స్తుతించుట
క. అనయమును భువనరక్షణ, మునకై స్వేచ్ఛానురూపమునఁ బుట్టెడి వి
ష్ణుని భయవిరహిత మగు పద, వనజయుగం బర్థిఁ గొల్తు వారని భక్తిన్‌.
993
వ. అదియునుంగాక పంచభూత విరహితుం డయ్యుం బంచభూత విరచితంబైన శరీరంబునందుఁ గప్పంబడి యింద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుండనైన నేను. 994
సీ. ఎవ్వఁడు నిఖిల భూతేంద్రియ మయ మగు మాయావలంబన మహిత కర్మ
బద్ధుఁడై వర్తించు పగిది దందహ్యమానంబగు జీవచిత్తంబునందు
నవికారమై శుద్ధమై యఖండ జ్ఞానమున నుండు వానికి ముఖ్యచరితు
నకు నకుంఠిత శౌర్యునకుఁ బరంజ్యోతికి సర్వజ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ
 
తే. గడఁగియుఁ బ్రకృతి పురుషులకంటెఁ బరముఁ, డైనవానికి మ్రొక్కెద నస్మదీయ
దుర్భరోదగ్ర భీకర గర్భనరక, వేదనలఁ జూచి శాంతిఁ గావించుకొఱకు.
995
సీ. అనవుడు సుతునకు జనని యిట్లనుఁ దగ మహితాత్మ! యెవ్వని మాయచేత
ఘనమోహులై గుణకర్మ నిమిత్త సాంసారిక మార్గ సంచారములను
ధృతి సెడి యలసి యే దిక్కు నెఱుంగక హరి పదధ్యానంబు నాత్మ మఱచి
యుండు వారలకు నే యుక్తియు నమ్మహాపురుషు ననుగ్రహ బుద్ధి లేక
 
తే. తద్గుణ ధ్యాన తన్మూర్తి దర్శనములు, గోచరించుట యెట్లు? నాకును బ్రబోధ
కలితముగఁ బల్కు మనవుడుఁ గపిలుఁ డనియె, నంబతోడను సుగణకదంబతోడ.
996
వ. అట్టి యీశ్వరుండు కాలత్రయంబునందును జంగమస్థావరాంతర్యామి యగుటం జేసి జీవ కర్మమార్గంబులం బ్రవర్తించువారు తాపత్రయ నివారణంబుకొఱకు భజియింతురని చెప్పి మఱియు నిట్లనియె. 997
క. జనయిత్రి! గర్భమందును, ఘన క్రిమివిణ్మూత్ర రక్త గర్తములోనన్‌
మునుఁగుచు జఠరాగ్నిని దిన, దినమును సంతప్యమానదేహుం డగుచున్‌.
998
ఆ. దీనవదనుఁ డగుచు దేహి యీ దేహంబు, వలన నిర్గమింపఁ దలఁచి చనిన
నెలల నెన్నుకొనుచు నెలకొని గర్భంబు, వలన వెడలఁ ద్రోయువారు గలరె?
999
వ. అని తలంచుచు దీనరక్షకుండయిన పుండరీకాక్షుండు దన్ను గర్భనరకంబువలన విముక్తునిం జేయ నమ్మహాత్మునికిఁ బ్రత్యుపకారంబు సేయలేమికి నంజలి మాత్రంబు సేయందగు నట్టి జీవుండ నైన నేను శమదమాది యుక్తంబైన శరీరంబునందు విజ్ఞాన దీపాంకురంబునం బురాణపురుషు నిరీక్షింతునని మఱియు నిట్లనియె. 1000
సీ. నెలకొని బహుదుఃఖములకు నాలయమైన యీ గర్భనరకము నేను వెడలఁ
జాల బహిః ప్రదేశమునకు వచ్చిన ననుపమ దేవమాయా విమోహి
తాత్ముండనై ఘోరమైనట్టి సంసార చక్రమందును బరిశ్రమణ శీలి
నై యుండ వలయుఁ దా, నది గాక గర్భంబు నందుండు శోకంబు నపనయించి.
 
తే. యాత్మ కనయంబు సారథియైన యట్టి, రుచిర విజ్ఞానమునఁ దమోరూపమైన
భూరి సంసార సాగరోత్తారణంబు, సేసి యీ యాత్మ నరసి రక్షించుకొందు.
1001
వ. మఱియును. 1002
చ. పరఁగుచు నున్న దుర్వ్యసనభాజనమై ఘనదుఃఖమూలమై
యరయఁగఁ బెక్కు తూట్లు గలదై క్రిమిసంభవ మైనయట్టి దు
స్తర బహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్‌
సరసిజనాభ భూరి భవ సాగర తారక పాదపద్మముల్‌.
1003
క. అని కృతనిశ్చయుఁ డయి యే, చిన విమలజ్ఞాని యగుచు జీవుఁడు గర్భం
బున వెడల నొల్లకుండం, జనియెడు నవమాసములును జననీ! యంతన్‌.
1004
వ. దశమ మాసంబున వాని నధోముఖుం గావించిన నుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులు లేక ఘనదుఃఖభాజనుండు విగతజ్ఞానుండు రక్తదిగ్ధాంగుండునై విష్ఠాస్థ క్రిమియుంబోలె నేలంబడి యేడ్చుచు జ్ఞానహీనుండై జడుఁడునుం బోలె నుండి యంత నిజభావనానభిజ్ఞులగు నితరులవలన వృద్ధిం బొందుచు నభిమతార్థంబులం జెప్ప నేరక యనేక కీటసంకులం బయిన పర్యంకంబునందు శయానుండై యవయవంబులు గండూయమానంబు లైన గోఁకనేరక యాసనోత్థాన గమనంబుల నశక్తుండై తన శరీరచర్మంబు మశక మత్కుణ మక్షికాదులు వొడువఁ గ్రిములచే వ్యథంబడు క్రిమియుంబోలె దోదూయమానుండై రోదనంబు సేయుచు విగతజ్ఞానుండై మెలంగుచు శైశవంబునం దత్తత్క్రియానుభవంబు గావించి పౌగండవయస్సునఁ దదనురూపంబులగు నధ్యయనాది దుఃఖంబు లనుభవించి తదనంతరంబ యౌవనంబు ప్రాప్తంబైన నభిమతార్థ ఫలప్రాప్తికి సాహసపూర్వంబు లగు వృథాగ్రహంబులు సేయుచు పంచమహాభూతార్థంబగు దేహంబందుఁ బెక్కుమాఱు లహంకార మమకారంబులం జేయుచుఁ దదర్థంబులైన కర్మంబు లాచరించుచు సంసారబద్ధుం డగుచు దుష్పురుష సంగమంబున శిశ్నోదర పరాయణుండై వర్తించుచు నజ్ఞానంబునం జేసి వర్ధిష్యమాణరోషుఁ డగుచుఁ దత్ఫలంబులగు దుఃఖంబు లనుభవించుచుఁ గాముకుండై నిజనాశంబునకు హేతువులగు కర్మంబులం బ్రవర్తించుచుండు మఱియును. 1005
సీ. జనయిత్రి! సత్యంబు శౌచంబు దయయును ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు,
క్షమయును యశమును శమదమ భగములు, మొదలుగాఁగల గుణంబులు నశించు
జనుల కసత్సంగమున నని యెఱిఁగించి, వెండియు నిట్లను వినుము మూఢ
హృదయులు శాంతివిహీనులు దేహాత్మ, బుద్ధులు నంగనామోహ పాశ
 
తే. బద్ధ కేళీమృగంబుల పగిదిఁ దగిలి, పరవశస్వాంతమున శోచ్యభావులైన
వారి సంగతి విడువంగవలయు, నందు, నంగనా సంగమము దోష మండ్రుగాన.
1006
వ. దీని కొక్క యితిహాసంబు గలదు. తొల్లి యొక్కనాఁడు ప్రజాపతి దన కూఁతురయిన భారతి మృగీరూప ధారిణియై యుండం జూచి తదీయరూపరేఖావిలాసంబులకు నోటువడి వివశీకృతాంతరంగుండును, విగతత్రపుండునునై తానును మృగరూపంబు నొంది తదనుధావనంబు హేయంబని తలంపక ప్రవర్తించె. కావున నంగనా సంగమంబు వలవ దస్మదీయ నాభీ కమల సంజాత చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత కశ్యపాది కల్పిత దేవమనుష్యాదులందు మాయాబలంబునం గామినీజన మధ్యంబున విఖండిత మనస్కుండు గాకుండఁ బుండరీకాక్షుం డైన నారాయణఋషికిం దక్క నన్యులకు నెవ్వరికిం దీరదని వెండియు నిట్లనియె. 1007
తే. రూఢి నా మాయ కామినీ రూపమునను, బురుషులకు నెల్ల మోహంబుఁ బొందఁ జేయుఁ
గాన పురుషులు సతుల సంగంబు మాని, యోగవృత్తిఁ జరించుచు నుండవలయు.
1008
క. ధీరతతో మత్పదసర, సీరుహ సేవానురక్తిఁ జెందిన వారల్‌
నారీసంగము నిరయ, ద్వారముగా మనములందుఁ దలఁపుదు రెందున్‌.
1009
క. హరిమాయా విరచితమై, తరుణీ రూపంబుఁ దాల్చి ధరఁ బర్విన బం
ధురతృణ పరివృతకూపము, కరణి నదియు మృత్యురూపకం బగు మఱియున్‌.
1010
చ. ధన పశు పుత్త్ర మిత్ర వనితా గృహ కారణభూతమైన యీ
తనువున నున్న జీవుఁడు పదంపడి యెట్టి శరీర మెత్తిన
న్ననుగతమైన కర్మఫల మందక పోవఁగరాదు, మింటఁ బ్రా
కిన భువిఁ దూఱినన్‌ దిశల కేగిన నెచ్చటనైన దాఁగినన్‌.
1011
వ. అట్టి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్రీ సంగంబుచే విత్తాపత్య గృహాది ప్రదంబగు స్త్రీత్వంబు నొందు, నీక్రమంబున నంగనారూపుండగు జీవుండు మన్మాయచేఁ బురుష రూపంబు నొంది ధనాది ప్రదుండగు భర్తను నాత్మబంధ కారణంబగు మృత్యువునుగ నెఱుంగవలయు, మఱియు జీవోపాధి భూతంబగు లింగదేహంబుచే స్వావాసభూతలోకంబున నుండి లోకాంతరంబు నొందుచుం బ్రారబ్ధకర్మఫలంబుల ననుభవించుచు మరలఁ గర్మాదులం దాసక్తుం డగుచు మృగయుండు గాననంబున ననుకూల సుఖ ప్రదుండైనను మృగంబునకు మృత్యువగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయం బైన దేహంబు గలిగి యుండు, నట్టి దేహనిరోధంబె మరణంబు, ఆవిర్భావంబె జన్మంబు, కాన సకల వస్తు విషయజ్ఞానంబు కలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రియంబ. ద్రష్టృ దర్శనీయ యోగ్యతా ప్రకారంబున జీవునకు జన్మమరణంబులు లేవు గావున భయ కార్పణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవప్రకారంబు జ్ఞానంబునం దెలిసి ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ్యవైరాగ్య యుక్తంబైన సమ్యగ్‌జ్ఞానంబున మాయావిరచితంబైన లోకంబున దేహాదులం దాసక్తి మాని వర్తింపవలయు నని చెప్పి వెండియు నిట్లనియె. 1012
సీ. గృహమందు వర్తించు గృహమేధు లగువారు మహిత ధర్మార్థ కామముల కొఱకు
సంప్రీతు లగుచుఁ దత్సాధనానుష్ఠాన నిరతులై వేదనిర్ణీత భూరి
భగవత్సుధర్మ తద్భక్తి పరాఙ్ముఖు లై దేవగణముల ననుదినంబు
భజియించుచును భక్తిఁ బైతృక కర్మముల్‌ సేయుచు నెప్పుడు శిష్టచరితు
 
తే. లగుచుఁ దగ దేవపితృసువ్రతాఢ్యు లయిన, కామ్యచిత్తులు ధూమాదిగతులఁ జంద్ర
లోకమును జెంది పుణ్యంబు లుప్త మయిన, మరలి వత్తురు భువికి జన్మంబు నొంద.
1013
వ. అదియునుంగాక. 1014
తే. ప్రవిమలానంత భోగితల్పంబునందు, యోగనిద్రాళువై హరి యున్నవేళ
నఖిల లోకంబులును విలయంబు నొందు, నట్టి సర్వేశ్వరునిఁ గూర్చి యలఘుమతులు
1015
మ. పరికింపన్‌ నిజభక్తియుక్తి గరిమం బాటిల్లు పంకేరుహో
దర విన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగముం
బరివర్జించి విశుద్ధచిత్తు లగుచుం బంకేజపత్రేక్షణే
తర ధర్మైక నివృత్తులై సతతమున్‌ దైత్యారిఁ జింతించుచున్‌.
1016
సీ. మఱియు నహంకార మమకార శూన్యులై యర్థి వర్తించుచు నర్చిరాది
మార్గ గతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుఁడును విమలయశుఁడు
జగదుద్భవస్థానసంహార కారణుం డవ్యయుం డజుఁడుఁ బరాపరుండుఁ
బురుషోత్తముఁడు నవ పుండరీకాక్షుండు నైన సర్వేశ్వరునందుఁ బొంది
 
తే. మానితాపునరావృత్తిమార్గ మయిన, ప్రవిమలానంద తేజోవిరాజమాన
దివ్యపదమున సుఖియించు ధీరమతులు, మరలిరా రెన్నటికిని జన్మముల నొంద.
1017
వ. మఱియుఁ బరమేశ్వర దృష్టిచే హిరణ్యగర్భు నుపాసించువారు సత్యలోకంబున ద్విపరార్ధావసానంబగు ప్రళయంబుఁ దనుకఁ బరుండగు చతురాననుం బరమాత్మ రూపంబున ధ్యానంబు సేయుచు నుండి పృథివ్యప్తేజో వాయ్వాకాశమానసేంద్రియ శబ్దాది భూతాదులతోడంగూడ లోకంబును బ్రకృతియందు లీనంబు సేయ సర్వేశ్వరుండు సకల సంహర్తయగు సమయంబున గతాభిమానంబులు గలిగి బ్రహ్మలోకవాసులగు నాత్మలు బ్రహ్మతోడం గూడి పరమానందరూపుండును సర్వోత్కృష్టుండు నగు పురాణపురుషుం బొందుదురు, కావున నీవు సర్వభూతహృదయ పద్మనివాసుండును శ్రుతానుభావుండును నిష్కళంకుండును నిరంజనుండును నిర్ద్వంద్వుండును నగు పురుషుని భావంబుచే శరణంబు నొందు మని చెప్పి మఱియును నిట్లనియె. 1018
మ. సకలస్థావర జంగమ ప్రతతికిం జర్చింపఁ దా నాఢ్యుఁడై
యకలంకశ్రుతిగర్భుఁడుం బరముఁడు న్నైనట్టి యీశుండు సే
వక యోగీంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవ
ర్తకమై తన్ను భజింపఁజూపు సగుణ బ్రహ్మంబు లీలాగతిన్‌.
1019
సీ. అట్టి సర్వేశ్వరుం డయ్యయికాలంబు లందును దద్గుణవ్యతికరమున
జనియించుచుండు, నీ చాడ్పున ఋషి దేవ గణములు దమ తమ కర్మ నిర్మి
తైశ్వర్య పారమేష్ఠ్యములందుఁ బురుషత్వమునఁ బొంది యధికారములు వహించి
వర్తించి క్రమ్మఱ వత్తురు, మఱి కొంద ఱారూఢ కర్మానుసారమైన
 
తే. మనములను జాలఁ గలిగి ధర్మములయందు, శ్రద్ధతోఁ గూడి యప్రతిషిద్ధమైన
నిత్యనైమిత్తికాచార నిపుణు లగుచుఁ, దగి రజోగుణ కలిత చిత్తములు గలిగి.
1020
వ. సకాములై యింద్రియ జయంబు లేక పితృగణంబుల నెల్లప్పుడుఁ బూజించుచు గృహంబులయందు వర్తించి హరి పరాఙ్ముఖు లగువారు త్రైవర్గిక పురుషులని చెప్పంబడుదురు. 1021
చ. వినుత గుణోత్తరుండు నురువిక్రముఁడైన హరిన్‌ భజించి త
న్మనన లసత్కథామృతము మానుగఁ గ్రోలుట మాని దుష్కథల్‌
విని ముద మందుచుందురు, వివేకవిహీనత నూరఁబంది యా
త్మను మధురాజ్యభక్ష్యములు మాని పురీషముకేగు చాడ్పునన్‌.
1022
చ. అలవడ ధూమమార్గగతులై పితృలోకముఁ బొంది పుణ్యముం
బొలసినవారు దొంటి తమ పుత్త్రులకుం దగఁ దాము పుట్టి వి
హ్వలమతి గర్భగోళ పతనాది పరేత ధరాగతాంతమై
వెలసిన కర్మ మిం దనుభవింతురు గావున నీవు భామినీ!
1023
క. విను సర్వభావములఁ బర, ముని ననఘు ననంతు నీశుఁ బురుషోత్తము స
న్మనమున భజియింపుము ముద, మునఁ, బునరావృత్తి లేని ముక్తి లభించున్‌.
1024
వ. అని చెప్పి వెండియు నిట్లనియె: భగవంతుండగు వాసుదేవునియందుం బ్రయుక్తంబగు భక్తియోగంబు బ్రహ్మసాక్షాత్కార సాధనంబు లగు వైరాగ్యజ్ఞానంబులం జేయు, నట్టి భగవద్భక్తి యుక్తంబైన చిత్త బింద్రియ వృత్తులచే సమంబులగు నర్థంబులందు వైషమ్యంబును ప్రియాప్రియంబులును లేక నిస్సంగంబు సమదర్శనంబు హేయోపాదేయ విరహితంబునై యారూఢంబైన యాత్మపదంబు నాత్మచేఁ జూచుచుండు జ్ఞానరూపుండును బరబ్రహ్మంబును బరమాత్ముండును నీశ్వరుండును నగు పరమపురుషుం డేకరూపంబు గలిగి యుండియు దృశ్యద్రష్టృకరణంబులచేతం బృథగ్భావంబును బొందుచుండు, నిదియ యోగికి సమగ్రంబగు యోగంబునం జేసి ప్రాప్యంబగు ఫలంబు, కావున విషయవిముఖంబు లగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును హేయగుణ రహితంబును నగు బ్రహ్మంబు మనోవిభ్రాంతిం జేసి శబ్దాది ధర్మంబగు నర్థరూపంబునం దోఁచు, అది యెట్టు లర్థాకారంబునం దోఁచు నని యడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును, భూతరూపంబునం బంచ విధంబును, నింద్రియరూపంబున నేకాదశ విధంబునై యుండు, జీవరూపుం డగు విరాట్పురుషుండు జీవవిగ్రహంబైన యండంబగు జగంబునం దోఁచుచుండు, దీని శ్రద్ధాయుక్తం బయిన భక్తిచేత యోగాభ్యాసంబునం జేసి సమాహిత మనస్కుండై నిస్సంగత్వంబున విరక్తుండైన వాఁడు వొడగను చుండు, నది యంతయు బుధజన పూజనీయ చరిత్రవు గావున నీకుం జెప్పితి, సర్వయోగ సంప్రాప్యుండును నిర్గుణుండును భగవంతుండని చెప్పిన జ్ఞానయోగంబును, మదీయ భక్తి యోగంబును నను రెండు నొక్కటియ, యింద్రియంబులు భిన్నరూపంబులు గావున నేకరూపంబయిన యర్థం బనేక విధంబు లగున ట్లేకం బగు బ్రహ్మం బనేక విధంబులుగఁ దోఁచు, మఱియును. 1025
సీ. అంబ! నారాయణుం డఖిల శాస్త్రములను సమధికానుష్ఠిత సవనతీర్థ
దర్శన జపతపోఽధ్యయన యోగక్రియా దాన కర్మంబులఁ గానఁబడఁడ,
యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి సకల కర్మత్యాగ సరణి నొప్పి
తలకొని యాత్మ తత్త్వజ్ఞానమున మించి యుడుగక వైరాగ్యయుక్తిఁ దనరి
 
తే. మహిత ఫల సంగరహిత ధర్మమునఁ దనరు, నట్టి పురుషుండు దలపోయ, నఖిల హేయ
గుణములను బాసి కల్యాణ గుణవిశిష్టుఁ, డైన హరి నొందుఁ బరమాత్ము ననఘుఁ డగుచు.
1026
వ. అది గావున నీకుం జతుర్విధ భక్తియోగ ప్రకారంబుఁ దేటపడ నెఱింగించితి, నదియునుం గాక కాలరూప యగు మదీయ గతి జంతువులయందు నుత్పత్తి వినాశరూపంబుల నుండు, నవిద్యా కర్మ నిర్మితంబులైన జీవుని గతు లనేక ప్రకారంబులై యుండు, నదియు జీవాత్మ వానియందుం బ్రవర్తించి యాత్మగతి యిట్టిదని యెఱుంగక యుండునని చెప్పి మఱియు నిట్లనియె. ఇట్టి యతిరహస్యంబగు సాంఖ్యయోగ ప్రకారంబు ఖలునకు, నవినీతునకు, జడునకు, దురాచారునకు, దాంభికునకు, నింద్రియలోలునకుఁ, బుత్త్ర దారాగారాద్యత్యంతాసక్త చిత్తునకు, భగవద్భక్తిహీనునకు, విష్ణుదాసులయందు ద్వేషపడువానికి నుపదేశింపవలవదు, శ్రద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, నసూయారహితుండును, సర్వభూతమిత్త్రుండును, శుశ్రూషాభిరతుండును, బాహ్యార్థజాత విరక్తుండును, శాంత చిత్తుండును, నిర్మత్సరుండును, శుద్ధాత్ముండును, భక్తులయందుఁ బ్రేమ గల వాఁడును, నన్యకాంతా విముఖుండును, నిష్కాముండును నగు నధికారికి నుపదేశింప నర్హం బగు. ఈ యుపాఖ్యానం బే పురుషుండేనిఁ బతివ్రత యగు నుత్తమాంగన యేని శ్రద్ధాభక్తులు గలిగి మదర్పిత చిత్తంబున న్వినుఁ బఠియించు నట్టి పుణ్యాత్ములు మదీయ దివ్యస్వరూపంబుం బ్రాపింతు రని చెప్పెనని మైత్రేయుండు విదురునకు వెండియు నిట్టనియె, ఈ ప్రకారంబునం గర్దమదయితయైన దేవహూతి గపిలుని వచనంబుల విని నిర్ముక్త మోహపటల యగుచు సాష్టాంగ దండ ప్రణామంబు లాచరించి తత్త్వ విషయాంకిత సాంఖ్యజ్ఞాన ప్రవర్తకం బగు స్తోత్రంబు సేయ నుపక్రమించి కపిలున కిట్లనియె. 1027
సీ. అనయంబు విను మింద్రియార్థ మనోమయంబును భూతచయమయంబును నశేష
భూరి జగద్బీజ భూతంబును గుణప్రవాహ కారణమును వలను మెఱయు
నారాయణాభిఖ్య నాఁ గల భవదీయ దివ్యమంగళమూర్తిఁ దేజరిల్లు
చారు భవద్గర్భ సంజాతుఁ డగునట్టి కమల గర్భుండు సాక్షాత్కరింప
 
తే. లేక మనమునఁ గనియె ననేకశక్తి, వర్గములు గల్గి సుగుణప్రవాహరూప
మంది విశ్వంబు దాల్చి సహస్రశక్తి, కలితుఁడై సర్వకార్యముల్‌ గలుగఁజేయు.
1028
వ. అంత. 1029
తే. అతుల భూరి యుగాంతంబునందుఁ గపట, శిశువవై యొంటి కుక్షి నిక్షిప్త నిఖిల
భువన నివహుండవై మహాంభోధి నడుమఁ, జారు వటపత్ర తల్పసంస్థాయి వగుచు.
1030
తే. లీల నాత్మీయ పాదాంగుళీ వినిర్గ, తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు
గడఁగి నా పూర్వభాగ్యంబు కతన నిపుడు, పూని నాగర్భమున నేఁడు పుట్టితయ్య!
1031
వ. అట్టి పరమాత్ముండ వయిన నీవు. 1032
సీ. వరుస విగ్రహ పారవశ్యంబునను జేసి రఘురామ కృష్ణ వరాహ నార
సింహాది మూర్తు లంచితలీల ధరియించి దుష్టనిగ్రహమును శిష్టపాల
నమును గావించుచు నయమున సద్ధర్మ నిరత చిత్తులకు వర్ణింపఁ దగిన
చతురాత్మతత్త్వ విజ్ఞాన ప్రదుండవై వర్తింతు వనఘ! భవన్మహత్త్వ
 
తే. మజున కయినను వాక్రువ్వ నలవి గాదు, నిగమ జాతంబు లయిన వర్ణింపలేవ
యెఱిఁగి సంస్తుతి సేయ నే నెంత దాన?, వినుత గుణశీల! మాటలు వేయు నేల?
1033
వ. అదియునుం గాక. 1034
క. ధీమహిత! భవన్మంగళ, నామస్మరణానుకీర్తనము గల హీనుల్‌
శ్రీమంతు లగుదు, రగ్ని, ష్టోమాదికృదాళికంటె శుద్ధులు దలఁపన్‌.
1035
వ. అదియునుం గాక. 1036
క. నీ నామస్తుతి శ్వపచుం, డైనను జిహ్వాగ్రమందు ననుసంధింపన్‌
వానికి సరి భూసురుఁడుం, గానేరఁడు చిత్ర మిది జగంబుల నరయన్‌.
1037
ఉ. ఈ విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజ్జనసంఘముల్‌ జగ
త్పావనమైన నీ గుణకథామృత మాత్మలఁ గ్రోలి సర్వ తీ
ర్థావళిఁ గ్రుంకినట్టి ఫల మందుదు రంచు సమస్త వేదముల్‌
వావిరిఁ బల్కుఁ గావునను వారలు ధన్యులు మాన్యు లుత్తముల్‌.
1038
వ. అది గావునఁ బరబ్రహ్మంబవును, బరమ పురుషుండవును, బ్రత్యఙ్మనోభావ్యుండవును, సమస్త జన పాపనివారక స్వయం ప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీ మహావిష్ణుండవును నగు నీకు వందనంబు లాచరించెద నని స్తుతియించినం బరమ పురుషుండును. మాతృవత్సలుండును నగు కపిలుండు గరుణారసార్ద్ర హృదయ కమలుండై జనని కిట్లనియె. 1039
తే. తవిలి సుఖరూపమును మోక్షదాయకంబు, నైన యీ యోగమార్గ మే నంబ! నీకు
నెఱుఁగ వివరించి చెప్పితి నిది దృఢంబు, గాఁగ భక్తి ననుష్ఠింపు కమలనయన!
1040
క. జీవన్ముక్తి లభించుం, గావున నేమఱక తలఁపు కైకొని దీనిన్‌
వావిరి నొల్లని వారికిఁ, దావల మగు మృత్యుభయము, దవ్వగు సుఖమున్‌.
1041
క. అని యిట్లు దేవహూతికి, మన మలరఁగఁ గపిలుఁ డాత్మ మార్గం బెల్లన్‌
వినిపించి చనియె నని విదు, రునకున్‌ మైత్రేయమునివరుం డెఱిఁగించెన్‌.
1042
వ. అట్లు కపిలుం డేగిన పిదప దేవహూతియుం బుత్రుండు సెప్పిన యోగమార్గంబున విజ్ఞానంబు గలిగి యుండియుం బెనిమిటియైన కర్దమునిం దనయుండైన కపిలునిం బాసి నష్టవత్సయగు గోవు చందంబునం దల్లడిల్లుచుఁ గపిలమహామునిం దలంచుచుం గర్దమ తపస్సామర్థ్యంబున నైనయట్టి. 1043
ఉ. మానిత సౌరభప్రసవ మంజుల పక్వ ఫలప్రవాళ భా
రానత చూత పోత విటపాగ్ర నికేతన రాజకీర స
మ్మాని సుఖానులాప పరిమండిత కర్దమతాపసాశ్రమో
ద్యాన వన ప్రదేశ కమలాకర తీర నికుంజ పుంజముల్‌.
1044
వ. వెండియు. 1045
సీ. అంచిత స్ఫటిక మయ స్తంభ దీప్తిచేఁ గొమరారు మరకత కుడ్యములను
సజ్జాతి వజ్రాల సజ్జాలరుచులచే భాసిల్లు నీల సోపానములను
దీపించు చంద్రకాంతోపలవేదుల విద్రుమ గేహళీ విలసితముల
హాటక రత్న కవాట శోభితముల నలరిన సౌధశాలాంగణముల
 
తే. వర పయః ఫేన పటల పాండుర కరీంద్ర, దంత నిర్మిత ఖట్వాతి ధవళ పట్ట
రచిత శయ్యాళులును జతురంతయాన, కనక పీఠాది వస్తు సంఘముల నెల్ల.
1046
వ. మఱియు వికచకమల కుముద సౌగంధిక బంధుర సుగంధానుబంధి గంధవహ శోభితంబును నరవింద నిష్యంద కందళిత మరంద రసపాన మదవదిందిందిర సందోహ ఝంకార సంకులంబునునై చెలువారు బావులు గలిగి, పురందర సుందరీ నందితంబైన కర్దమాశ్రమంబుఁ బరిత్యజించి కుటిలంబులైన కుంతలంబులు జటిలంబులుగా ధరియించి సరస్వతీ బిందు సరోవరంబులం ద్రిషవణ స్నానంబు గావించుచు నుగ్రతపోభారంబునం గృశీభూత శరీరయై నిజకుమారుండును బ్రసన్నవదనుండును గపిల నామధేయుండును నగు నారాయణుని సమస్త సన్యస్త చింతనలచే ధ్యానంబు సేయుచుఁ బ్రవాహరూపం బైన భక్తి యోగంబునను నధికవైరాగ్యంబునను యుక్తానుష్ఠాన జాతంబై బ్రహ్మత్వాపాదకంబగు జ్ఞానంబును విశుద్ధ మనంబును గలిగి. 1047
సీ. అనయంబు నాత్మనాయకుఁడును విశ్వతోముఖుఁ డనంతుఁడుఁ బరముఁడు నజుండు
చతురుండు నిజపరిజ్ఞాన దీపాంకుర మహిమ నిరస్త సమస్త భూరి
మాయాంధకారుఁ డమేయుఁ డీశ్వరుఁ డగు నా పరబ్రహ్మంబునం దవిరత
బద్ధతత్త్వ జ్ఞాన పరతచే నిర్ముక్త జీవ భావమున విశిష్టయోగ
 
తే. భవ్యసంప్రాప్త నిర్మల బ్రహ్మభావ, ములను గలిగి సమాధిచే నెలమిఁ దనరు
నపునరావృత్త మగు త్రిగుణప్రధాన, తత్త్వముల నొప్పి సంతతోదారనియతి.
1048
తే. కలలఁ దోఁచిన వస్తుసంఘముల మేలు, కొని కనుంగొనఁగా లేని మనుజు పోల్కిఁ
బొలఁతి తన యాత్మ మఱచి యిమ్ముల సధూమ, మైన పావకుగతి నుండె నంతలోన.
1049
క. గురుయోగ శక్తిచే నం, బరతలమున కెగసి సత్కృపామయుఁడగు నా
పరవాసుదేవు చరణాం, బురుహ యుగన్యస్త చిత్తము గలది యగుచున్‌.
1050
వ. ఇట్లు కపిలోక్తమార్గంబున దేవహూతి శ్రీహరియందుఁ గలసె, నయ్యంగనారత్నంబు మోక్షంబునకుం జనిన క్షేత్రంబు “సిద్ధిపదం” బనుపేరం బరఁగి ప్రసిద్ధి వహించె, అంత నక్కడఁ గపిలుండు తల్లిచేత ననుజ్ఞాతుండై సిద్ధ చారణ గంధర్వాప్సరోముని నివహ సంస్తూయమానుం డగుచు సముద్రునిచేత దత్తార్హణ పూజా నికేతనంబులు వడసి సాంఖ్యాచార్యాభిష్టుతంబగు యోగంబు నవలంబించి లోకత్రయ శాంతి కొఱకు సమాహితుండై స్వపిత్రాశ్రమంబు విడిచి యుదగ్భాగంబునకుం జనియె నని మైత్రేయ మహాముని విదురున కిట్లనియెఁ దండ్రీ! యీ యుపాఖ్యానంబును నాకు గోచరించిన రీతి నీకుం జెప్పితి, నిది కపిల “దేవహూతి సంవాదం” బత్యంత పావనంబు, గపిల ప్రణీతంబు నయిన యోగంబు, దీనిం బరమభక్తి యుక్తుండై యెవ్వండు పఠించు, నెవ్వండు విను, నట్టి పుణ్యాత్ములు విగతపాపులై గరుడ ధ్వజుండయిన పుండరీకాక్షుని శ్రీచరణారవిందంబులం బొందుదురని మైత్రేయుండు విదురున కెఱింగించిన విధంబున శుక యోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పెనని సూతుండు శౌనకాది మహామునులకు నీ కథా వృత్తాంతంబు సెప్పిన విని ప్రహృష్ట హృదయులై మునికులోత్తమా! భవద్వాక్పూరం బగు భగవత్కథామృతంబు గ్రోలుచుండ మా మనంబులం దనివోవ, దింకను దరువాతి వృత్తాంతంబులు మాకు విశదంబులుగ వినిపింప నీవ యర్హుండ వని యడుగుటయు. 1051
చ. జనకసుతా మనో విమల సారస కోమల చంచరీక! చం
దన శరదిందు కుంద హర తార మరాళ పటీర చంద్రికా
వినుత యశోవిశాల! రఘువీర! దరస్మిత పద్మపత్ర లో
చన! నిటలాంబక ప్రకట చాపవిఖండన! వంశమండనా!
1052
తరల. పరమపావన! విశ్వభావన! బాంధవ ప్రకరావనా!
శరధిశోషణ! సత్యభాషణ! సత్కృపామయ భూషణా!
దురిత తారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా!
ధరణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా!
1053
మాలిని. దివిజగణవరేణ్యా! దీపితానంతపుణ్యా!
ప్రవిమల గుణజాలా! భక్తలోకానుపాలా!
భవ తిమిర దినేశా! భానుకోటి ప్రకాశా!
కువలయ హితకారీ! ఘోరదైత్య ప్రహారీ!
1054
గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబునందు విదురనీతియు, విదురుని తీర్థాగమనంబును, నుద్ధవ సందర్శనంబును, గౌరవయాదవ కృష్ణాది నిర్యాణంబును, గంగాద్వారంబున విదురుండు మైత్రేయునిం గనుటయు, విదురమైత్రేయ సంవాదంబును, జగదుత్పత్తి లక్షణంబును, మహదాదుల సంభవ ప్రకారంబును, మహదాదులు నారాయణు నభినందించుటయు, విరాడ్విగ్రహ ప్రకారంబును, శ్రీ మహాభాగవత భక్తి కారణంబగు పద్మ సంభవు జన్మప్రకారంబును, బ్రహ్మతపంబును, బరమేష్ఠికిఁ బుండరీకాక్షుండు బ్రత్యక్షం బగుటయు, బ్రహ్మకృతం బయిన విష్ణు స్తోత్రంబును, గమలసంభవుని మానససర్గంబును, బరమాణువుల పుట్టువును, భూర్భువస్సువరాది లోకవిస్తారంబును, గాల దివస మాస వత్సరాది నిర్ణయంబును, నాయుః పరిమాణంబును, జతుర్యుగ పరిమాణంబును, బద్మసంభవు సృష్టిభేదనంబును, సనకాదుల జన్మంబును, స్వాయంభువమనువు జన్మంబును, శ్రీహరి వరాహావతారంబును, భూమ్యుద్ధరణంబును, సూకరాకారుండైన హరిని విధాత స్తుతియించుటయు, దితి కశ్యప సంవాదంబును, గశ్యపుండు రుద్రునిం బ్రశంసించుటయు, గశ్యపువలన దితి గర్భంబు ధరియించుటయుఁ, దత్ప్రభావంబునకు వెఱచి దేవతలు బ్రహ్మసన్నిధికిం జని దితిగర్భప్రకారంబు విన్నవించుటయు, సనకాదులు వైకుంఠంబున కరుగుటయు, నందు జయవిజయుల కలిగి సనకాదులు శపించుటయు, శ్రీహరి దర్శనంబును, బ్రాహ్మణ ప్రశంసయు, సనకాదులు హరిని నుతించుటయు, హిరణ్యకశిపు హిరణ్యాక్షుల జన్మప్రకారంబును, హిరణ్యాక్షుని దిగ్విజయంబును, సవన వరాహ హిరణ్యాక్షుల యుద్ధంబును, బ్రహ్మస్తవంబును, హిరణ్యాక్ష వధయు, నమర గణంబులు శ్రీహరి నభినందించుటయు, హరి వరాహావతార విసర్జనంబు సేయుటయును, దేవతిర్యఙ్మనుష్యాదుల సంభవంబును, గర్దమ మహాముని తపంబునకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షం బగుటయుఁ, గర్దముండు స్వాయంభువ మనుపుత్త్రియైన దేవహూతిం బరిణయం బగుటయు, దేవహూతి పరిచర్యలకు సంతసిల్లి కర్దముండు నిజయోగ కల్పితంబగు విమానంబునందు నిలిచి సహస్రదాసీ పరివృతయైన దేవహూతింగూడి భారతాది వర్షంబులు గలయం గ్రుమ్మరుటయు, దేవహూతి కర్దమునివలన గన్యకానవకంబును గపిలునిం గనుటయుఁ, దత్కన్యకా వివాహంబులును, కర్దముని తపోయాత్రయు, కపిల దేవహూతి సంవాదంబును, శబ్దాది పంచతన్మాత్రల జన్మప్రకారంబును, బ్రహ్మాండోత్పత్తియు, విరాట్పురుష కర్మేంద్రియ పరమాత్మ ప్రకారంబును, బ్రకృతి పురుష వివేకంబును, నారాయణుని సర్వాంగ స్తోత్రంబును, సాంఖ్యయోగంబును, భక్తియోగంబును, జీవునకైన గర్భసంభవ ప్రకారంబును, జంద్రసూర్య మార్గంబును, బితృమార్గంబును, దేవహూతి నిర్యాణంబును, గపిల మహాముని దపంబునకుం జనుటయు నను కథలు గల తృతీయస్కంధము. 1055
శ్రీకృష్ణార్పణమస్తు
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )