| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| సీ. |
ఘనుఁడౌ మరీచికిఁ గర్దమాత్మజయగు కళ యను నంగనవలనఁ గశ్య పుం డను కొడుకును బూర్ణిమ యను నాఁడుబిడ్డయుఁ బుట్టిరి; పేర్చి వారి వలనఁ బుట్టిన ప్రజావళిపరంపరలచే భువనంబు లెల్ల నాపూర్ణ మగుచు జరగెను; బూర్ణిమ జన్మాంతరంబున హరిపదప్రక్షాళితాంబువులను |
|
| తే. |
గంగ యనుపేరఁ బుట్టి యక్కన్య “దేవ, కుల్య” యనుదాని నొక్కతెఁ గూఁతు నఖిల విష్టపవ్యాపకుం డగు “విరజుఁ” డనెడి, తనయు నొక్కనిఁ గాంచె మోదంబు తోడ. |
7 |
| క. |
అనఘుం డత్రిమహాముని, యనసూయాదేవివలన నజహరిపురసూ దనుల కళాంశంబుల నం, దనులను మువ్వురను గాంచెఁ దద్దయుఁ బ్రీతిన్. |
8 |
| క. |
అనవుడు విదురుఁడు మైత్రే, యునిఁ గనుఁగొని పలికె మునిజనోత్తమ! జగతిన్ జననస్థితిలయకారణు, లన వెలసిన పద్మగర్భహరిహరు లెలమిన్. |
9 |
| క. |
ఏమి నిమిత్తం బత్రిమ, హాముని మందిరమునందు ననసూయకు ను ద్దామగుణు లుదయమై రన, నా మైత్రేయుండు పలికె నవ్విదురునితోన్. |
10 |
| సీ. |
సుచరిత్ర! విను విధిచోదితుండై యత్రి దప మాచరింపఁ గాంతాసమేతుఁ డయి ఋక్షనామకులాద్రితటంబున ఘుమఘుమారావసంకులవిలోల కల్లోలజాలసంకలితనిర్వింధ్యానదీజలపరిపుష్టరాజితప్ర సూనగుచ్ఛస్వచ్ఛమానితాశోకపలాశకాంతారస్థలమున కెలమి |
|
| తే. |
నరిగి యచ్చట నిర్ద్వంద్వుఁ డగుచుఁ బ్రాణ, నియమమున నేకపదమున నిలిచి గాలిఁ దివుటఁ గ్రోలి కృశీభూతదేహుఁ, డగుచుఁ దపము గావించె దివ్యవత్సరశతంబు. |
11 |
| వ. | ఇట్లతిఘోరంబైన తపంబు సేయుచుఁ దన చిత్తంబున. | 12 |
| క. |
ఏ విభుఁడు జగదధీశ్వరుఁ, డా విభుశరణంబు సొత్తు నతఁడాత్మ సమం బై వెలసిన సంతతిని ద, యావరమతి నిచ్చుఁగాక యని తలఁచు నెడన్. |
13 |
| చ. |
మునుకొని యత్తపోధనుని మూర్ధజమైన తపఃకృశానుచే తనుఁ ద్రిజగంబులుంగరఁగి తప్తములైనను జూచి బంకజా సనమురశాసనత్రిపురశాసను లచ్చటి కేగి రప్సరో జనసురసిద్ధసాధ్యమునిసన్నుతభూరియశోభిరాములై. |
14 |
| వ. | అట్లు మునీంద్రు నాశ్రమంబు డాయంజను నవసరంబున. | 15 |
| చ. |
అనఘతపోభిరాముఁడగు నత్రిమునీంద్రుఁడుఁ గాంచెఁ దప్తకాం చనఘనచంద్రికారుచిరచారుశరీరుల హంసనాగసూ దనవృషభేంద్రవాహుల నుదారకమండలచక్రశూలసా ధనుల విరించివిష్ణుపురదాహుల వాక్కమలాంబికేశులన్. |
16 |
| వ. | మఱియుఁ గృపావలోకన మందహాస సుందరవదనారవిందంబులుగల మహాత్ముల సందర్శించి యమందానందకందళితహృదయారవిందుండై సాష్టాంగదండప్రణామంబు లాచరించి పుష్పాంజలి గావించి నిటలతటఘటితకరపుటుండై దుర్నిరీక్ష్యం బైన తత్తేజోవిశేషంబుఁ దేఱి చూడంజాలక ముకుళిత నేత్రుండై తత్పదాయత్త చిత్తుం డగుచు సర్వలోకప్రశస్యంబు లైన మృదుమధురగంభీరభాషణంబుల నిట్లని స్తుతియించె. | 17 |
| సీ. |
ప్రతికల్పమందు సర్వప్రపంచోద్భవస్థితివినాశంబులఁ జేయునట్టి మహితమాయాగుణమయదేహములఁ బొల్చు నజవాసుదేవశివాభిధాన ములు గల్గు మీ పాదజలజాతములకు నే నతిభక్తి వందనం బాచరింతు; నఖిలచేతనమానసాగమ్య మన నొప్పు మూర్తులు గల్గు మీ మువ్వురందుఁ |
|
| తే. |
బరఁగ నాచేతఁ బిలువంగఁబడిన ధీరుఁ,డెవ్వఁడే నొక్కరునిఁబిల్వ నిపుడు మీరు మువ్వు రేతెంచుటకు నాదు బుద్ధి విస్మ,యంబు గదిరెడిఁ జెప్పరే యనఘులార! |
18 |
| వ. | అదియునుం గాక సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబున ధరియించిన మహాత్ముం డొక్కరుండ యనిన నమ్మువ్వురు విబుధశ్రేష్ఠులు నతనిం గనుంగొని సుధామధురంబు లయిన వాక్యంబుల నిట్లనిరి. | 19 |
| క. |
విను మేము ముగుర మయ్యును, ననుపమమతిఁ దలఁప నేకమై యుందుము; నీ మనమందు నేమి గోరితి, వనయము నా కోర్కి సఫల మయ్యెడుఁజుమ్మీ! |
20 |
| క. |
మా మువ్వుర యంశంబుల, ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో నీ మంగళగుణకీర్తిన్, శ్రీమహితము సేయఁగలరు సిద్ధము సుమ్మీ! |
21 |
| క. |
అని మునిచంద్రుఁడు తన మన, మునఁ గామించిన వరంబు బుధవరులు ముదం బున నొసఁగి యతనిచేఁ బూ, జనములఁ బరితృప్తు లగుచుఁ జనిరి యథేచ్ఛన్. |
22 |
| ఉ. |
ఆ సుచరిత్రదంపతు లుదంచితలీలఁ గనుంగొనంగ న బ్జాసను నంశమందు నమృతాంశుఁడు, విష్ణుకళన్ సుయోగ వి ద్యాసుభగుండు దత్తుఁడు, పురాంతకు భూరికళాంశమందు దు ర్వాసుఁడునై జనించి రనవద్యపవిత్రచరిత్రు లిమ్ములన్. |
23 |
| క. |
అంగిరసుఁ డనెడు మునికిఁ గు, లాంగన యగు శ్రద్ధయందు నంచితసౌంద ర్యాంగులు గూఁతులు నలువురు, మంగళవతు లుదయమైరి మాన్యచరిత్రా! |
24 |
| క. |
వారు సినీవాలియనఁ గు, హూ రాకానుమతు లనఁగ నొప్పిరి; మఱియుం గోర సుతయుగము గలిగెను, స్వారోచిషమనువువేళ శస్తఖ్యాతిన్. |
25 |
| వ. | వార లెవ్వ రనిన భగవంతుం డగు నుచథ్యుండును బ్రహ్మనిష్ఠుండగు బృహస్పతియు ననం బ్రసిద్ధి వహించిరి; పులస్త్యుండు హవిర్భుక్కను నిజభార్యయందు నగస్త్యునిం బుట్టించె; నా యగస్త్యుండు జన్మాంతరంబున జఠరాగ్నిరూపంబై ప్రవర్తించె; వెండియు నా పులస్త్యుండు విశ్రవసునిం గలిగించె; నా విశ్రవసునకు “నిలబిల” యను భార్యవలనం గుబేరుండును, “గైకసి” యను దానివలన రావణ కుంభకర్ణ విభీషణులునుం బుట్టిరి; పులహునకు గతియను భార్యవలనఁ గర్మశ్రేష్ఠుండును వరీయాంసుండును సహిష్ణుండును నను మువ్వురుగొడుకులు జనియించిరి. మఱియుఁ గ్రతువునకుఁ “గ్రియ” యను భార్యయందు బ్రహ్మతేజంబున జ్వలించుచున్న షష్టిసహస్రసంఖ్యలు గల వాలఖిల్యులను మహర్షులు గలిగిరి; వసిష్ఠుం డూర్జయను భార్యయందుఁ జిత్రకేతుండును సురోచియు విరజుండును మిత్రుండును నుల్బణుండును వసుభృద్ధ్యానుండును ద్యుమంతుండును నను సప్తఋషులను, భార్యాంతరంబున శక్తి ప్రముఖపుత్రులనుం బుట్టించె; నథర్వుం డనువానికిఁ “జిత్తి” యను భార్యయందు ధృతవ్రతుండు నశ్వశిరస్కుండు నయిన దధ్యంచుండు పుట్టె; మహాత్ముండగు భృగువు “ఖ్యాతి” యను పత్నియందు ధాతయు విధాతయు నను పుత్రద్వయంబును భగవత్పరాయణయగు “శ్రీ” యను కన్యకం బుట్టించె; నా ధాతృవిధాతృలు మేరు వనువాని కూఁతు లయిన “యాయతి” “నియతు” లను భార్యలవలన మృకండుప్రాణు లను కొడుకులం బుట్టించి; రందు మృకండునకు మార్కండేయుండును, బ్రాణునకు వేదశిరుం డను మునియు బుట్టిరి; భార్గవునకు నుశన యను కన్యయందుఁ గవి యనువాఁడు పుట్టె; నిట్లు కర్దమ దుహిత లయిన కన్యకా నవకంబువలనం గలిగిన సంతానపరంపరలచే సమస్తలోకంబులును బరిపూర్ణంబులయ్యె; నట్టి సద్యః పాపహరంబును శ్రేష్ఠతమంబును నైన కర్దమదౌహిత్రసంతాన ప్రకారంబు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండవగు నీకుం జెప్పితి; నింక దక్షప్రజాపతివంశం బెఱింగింతు, వినుము. | 26 |