| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| సీ. |
జననాథ! విను విదురునకును మైత్రేయ మునినాథచంద్రుఁడిట్లనియె మరల స్వాయంభువున కర్థి శతరూపవలనను గూఁతులు మువ్వు రాకూతి దేవ హూతి ప్రసూతులు నొనరఁ బ్రియవ్రతోత్తానపాదులు నను తనయయుగము జనియించి రందగ్రసంభవయైన యాకూతిని సుమహితభ్రాతృమతిని |
|
| తే. |
దనకు సంతానవిస్తరార్థంబుగాఁగఁ, బుత్త్రికాధర్మ మొంది యా పువ్వుఁబోఁడిఁ బ్రకటమూర్తి రుచిప్రజాపతికి నిచ్చె, మనువు ముదమొంది శతరూప యనుమతింప. |
3 |
| వ. | అట్లు వివాహంబైన రుచిప్రజాపతి బ్రహ్మవర్చస్వియుఁ బరిపూర్ణ గుణుండును గావునఁ జిత్తైకాగ్రతం జేసి యాకూతి యందు శ్రీవిష్ణుండు యజ్ఞరూపధరుం డగు పురుషుండుగను జగదీశ్వరి యగు నాదిలక్ష్మి యమ్మహాత్మునకు నిత్యానపాయిని గావునఁ దదంశంబున దక్షిణ యను కన్యకారత్నంబుగను మిథునంబు సంభవించె; నందు స్వాయంభువుండు సంతుష్టాంతరంగుం డగుచుఁ బుత్త్రికాపుత్త్రుండును, వితతతేజోధనుండును, శ్రీ విష్ణుమూర్తి రూపుండును నగు యజ్ఞునిఁ దన గృహంబునకుఁ దెచ్చియునిచె; రుచియుఁ గామగమన యైన దక్షిణ యను కన్యకాలలామంబును దన యొద్దన నిలిపె; నంత సకల మంత్రాధిదేవత యగు శ్రీయజ్ఞుండు దనుఁ బతిగం గోరెడు దక్షిణయను కన్యకం బరిణయంబయ్యె; వార లాదిమిథునంబు గావున నది నిషిద్ధంబు గాకుండె నని చెప్పి మైత్రేయుండు వెండియు నిట్లనియె. | 4 |
| క. |
ధీమహిత! యంతవారల, యామాఖ్యలు గలుగు దేవతావళి గడఁకన్ వేమఱు నభినందించుచు, నా మిథునము వలనఁబుట్టె నతిబలయుతమై. |
5 |
| వ. | వారు తోషుండును బ్రతోషుండును సంతోషుండును భద్రుండును శాంతియు నిడస్పతియు నిధ్ముండును గవియు విభుండును వహ్నియు సుదేవుండును రోచనుండును ననం బన్నిద్దఱు సంభవించిరి; వారలు స్వాయంభువాంతరంబునం “దుషితు” లను దేవగణంబులై వెలసిరి; మఱియు మరీచి ప్రముఖులైన మునీశ్వరులును యజ్ఞుండును దేవేంద్రుండును మహాతేజస్సంపన్ను లయిన ప్రియవ్రతోత్తానపాదులుం గలిగి పుత్త్రపౌత్త్రనప్తృవంశంబులచే వ్యాప్తంబయి యా మన్వంతరంబు పాలితం బగుచు వర్తిల్లె; మనువు ద్వితీయపుత్రియైన దేవహూతిం గర్దమున కిచ్చి తద్వంశవిస్తారంబు గావించెనని మున్న యెఱింగించితి; వెండియు నమ్మనువు మూఁడవచూలైన ప్రసూతి యను కన్యకను బ్రహ్మపుత్త్రుండగు దక్షప్రజాపతికి నిచ్చె; నా దక్షునకుఁ బ్రసూతివలన నుదయించిన ప్రజాపరంపరలచేత ముల్లోకంబులు విస్తృతంబు లయ్యె; మఱియుఁ గర్దమపుత్త్రికా సముదయంబు బ్రహ్మర్షి భార్య లగుటం జేసి వారివలనం గలిగిన సంతాన పరంపరల వివరించెద. | 6 |