పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
ఈశ్వరునకు దక్షప్రజాపతికిని విరోధము సంభవించుట
సీ. దక్షప్రజాపతితనయ యా భవుని భార్యయు ననఁదగు ‘సతి’ యను లతాంగి
సతతంబుఁ బతిభక్తి సలుపుచుండియుఁ దనూజాతలాభము నందఁజాలదయ్యె;
భర్గుని దెసఁ జాలఁ బ్రతికూలుఁ డైనట్టి తమ తండ్రిమీఁది రోషమునఁ జేసి
వలనేది తా ముగ్ధవలె నిజయోగమార్గంబున నాత్మదేహంబు విడిచె;
 
తే. నని మునీంద్రుండు వినిపింప న మ్మహాత్ముఁ,డైన విదురుండు మనమున నద్భుతంబు
గదురఁ దత్కథ విన వేడ్క గడలుకొనఁగ, మునివరేణ్యునిఁ జూచి యిట్లనియె మఱియు.
35
సీ. చతురాత్మ! దుహితృవత్సలుఁడైన దక్షుండు దన కూఁతు సతి ననాదరము సేసి
యనయంబు నఖిలచరాచరగురుఁడు నిర్వైరుండు శాంతవిగ్రహుఁడు ఘనుఁడు
జగముల కెల్లను జర్చింప దేవుండు నంచితాత్మారాముఁ డలఘుమూర్తి
శీలవంతులలోన శ్రేష్ఠుండు నగు నట్టి భవునందు విద్వేషపడుట కేమి
 
తే. కారణము? సతి దా నేమి కారణమున, విడువరానట్టి ప్రాణముల్‌ విడిచె? మఱియు
శ్వశురజామాతృవిద్వేషసరణి నాకుఁ, దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ!
36
క. అని యడిగిన నవ్విదురునిఁ, గనుఁగొని మైత్రేయుఁడనియెఁ గౌతుక మొప్పన్‌
విను మనఘ! తొల్లి బ్రహ్మలు, జననుతముగఁ జేయునట్టి సత్త్రముఁ జూడన్‌.
37
చ. సరసిజగర్భయోగిజనసర్వసుపర్వమునీంద్రహవ్యభు
క్పరమఋషి ప్రజాపతులు భక్తిమెయిం జనుదెంచియుండ న
త్తరణిసమానతేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా
దరమున లేచి; రప్పుడు పితామహభర్గులు దక్క నందఱున్‌.
38
క. చనుదెంచిన యా దక్షుఁడు, వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్‌
దన కిచ్చిన పూజలు గై, కొని యర్హాసనమునందుఁ గూర్చుండి తగన్‌.
39
తే. తన్నుఁ బొడగని సభ్యు లందఱును లేవ, నాసనము దిగనట్టి పురారి వలను
గన్ను గొనలను విస్ఫులింగములు సెదరఁ, జూచి యిట్లను రోషవిస్ఫురణ మెఱయ.
40
తే. వినుఁడు మీరలు రొదమాని విబుధముని హు, తాశనాదిసురోత్తములార! మోహ
మత్సరోక్తులు గావు! నా మాట లనుచు, వారి కందఱ కా పురవైరిఁజూపి,
41
సీ. పరికింప నితఁడు దిక్పాలయశోహాని కరుఁడీ క్రియాశూన్యపరునిచేతఁ
గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషితంబయ్యె; నెన్న గతత్రపుండు
మహితసావిత్రీసమానను సాధ్వి నస్మత్తనూజను మృగశాబనేత్ర
సకలభూమీసురజనసమక్షమున మర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ
 
తే. జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మ, దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి
నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న, నోరిమాటకుఁదన కేమి గోరువోయె.
42
సీ. అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మానహీనుఁడు మర్యాద లేనివాఁడు
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగంబరుఁడు భూతప్రేతపరివృతుండు
దామసప్రమథభూతములకు నాథుండు భూతిలిప్తుం డస్థిభూషణుండు
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్టహృదయుఁ డుగ్రుఁడును బరేతభూని
 
తే. కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి, యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁడగు నితని నెఱిఁగి, యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు.
43
వ. ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి. 44
క. అని యిట్టుల ప్రతికూల వ, చనములు దక్షుండు వలికి ‘శపియింతును శ
ర్వుని’ నని జలములు గొని కర, మున, నిలిచిట్లనియె, రోషమున ననఘాత్మా!
45
క. ఇతఁ డింద్రోపేంద్రపరీ, వృతుఁడై మఖసమయమున హవిర్భాగము దే
వతలం గూడఁగ మహిత ని, యతిఁ బొందక యుండుఁగాక యని శపియించెన్‌.
46
వ. ఇట్లు దక్షుండు పల్కిన గర్హితవాక్యంబులు వినిందితంబులుగ నుండియును నర్థాంతరంబున వాస్తవంబులగుచు భగవంతుండగు రుద్రునందు ననిందితంబులై స్తుతిరూపంబుల నొప్పెఁ; దదనంతరంబ రుద్రునకు శాపంబిచ్చిన కారణంబున దక్షుండు సదస్యముఖ్యులచే నకృత్యంబని నిషేధింపబడి ప్రవృద్ధంబయిన క్రోధంబుతోడ నిజనివాసంబునకుం జనియె; నంత గిరిశానుచరాగ్రేసరుండగు నందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించిన శాపంబు, నతనిఁ బల్కిన యనర్హవాక్యంబులును విని కోపారుణిత లోచనుండై యిట్లను; నీ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁదలంచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శియై యపరాధంబు గావించె; నిట్టి మూఢాత్ముండు దత్త్వవిముఖుండగు; మఱియుం గూటధర్మంబు లయిన నివాసంబుల గ్రామ్యసుఖకాంక్షలం జేసి సక్తుండై యర్థవాదంబు లయిన వేదంబులచే నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబుసేయు; వెండియు దేహాదికంబు లుపాదేయంబులుగాఁ దలంచుచు బుద్ధిచేత నాత్మతత్త్వంబు మఱచి వర్తించుచుఁ బశుప్రాయుండై స్త్రీకాముండు నగు నిదియునుం గాక దక్షుం డచిరకాలంబున మేషముఖుండగు నని మఱియు. 47
మ. అనయంబుం దన మానసంబున నవిద్యల్‌ ముఖ్యతత్త్వంబుగాఁ
గని గౌరీశుఁ దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని
న్ననువర్తించినవాడు సంసరణకర్మారంభుడై నిచ్చలున్‌
జననం బందుచుఁ జచ్చుచున్‌ మరల నోజం బుట్టుచున్‌ వర్తిలున్‌.
48
వ. అదియునుంగాక యీ హరద్వేషులైన ద్విజు లర్థవాదబహుళంబులైన వేదవాక్యంబులవలన మధుగంధసమంబైన చిత్తక్షోభంబుచేత విమోహితమనస్కులయి కర్మాసక్తులగుదురు; మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాదిపోషణంబుకొఱకు ధరియింపఁ బడిన విద్యాతపోవ్రతంబులు గలవారలై ధనదేహేంద్రియంబుల యందుఁ బ్రీతిం బొంది యాచకులై విహరింతురని నందికేశ్వరుండు బ్రాహ్మణ జనంబుల శపియించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపియింపం బూని యిట్లనియె. 49
తే. వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు, వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు
నట్టి సచ్ఛాస్త్రపరిపంథు లైనవారు, నవనిఁ“బాషండు” లయ్యెద రని శపించె.
50
సీ. సకలవర్ణాశ్రమాచారహేతువు లోకమునకు మంగళమార్గమును, సనాత
నముఁ, బూర్వఋషి సమ్మతము, జనార్దనమూలమును, నిత్యమును, శుద్ధమును, శివంబు,
నార్యపథానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున
నే శివదీక్ష యందేని మధ్యమపూజ్యుఁడై భూతపతి దైవ మగుచు నుండు
 
తే. నందు మీరలు భస్మజటాస్థిధారణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
లై నశింతురు పాషండు లగుచు ననుచు, శాపమొనరించె నా ద్విజసత్తముండు.
51
వ. ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గలవార లగుటం జేసి నాశంబు నొందరై; రట్టియెడ విమనస్కుండగుచు ననుచరసమేతుండై భవుండు సనియె నంత. 52
సీ. అనఘాత్మ! యే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుఁడగు హరి సంపూజ్యుఁడై వెలుంగు
నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున సహస్రవత్సరములు నజుఁడొనర్చెఁ
గరమొప్ప నమరగంగాయమునా సంగమావనిఁ గలుగు ప్రయాగయందు
నవభృథస్నానంబు లతిభక్తిఁ గావించి గతకల్మషాత్ములై ఘనత కెక్కి
 
తే. తగ నిజాశ్రమభూములఁ దలఁచి వార, లందఱును వేడ్కతోఁ జని రనుచు విదురు
నకును మైత్రేయుఁడను మునినాయకుండు, నెఱుఁగ వినిపించి వెండియు నిట్టులనియె.
53
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )