పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికిఁ బోవుట
వ. అంత శ్వశురుండగు దక్షునకు జామాతయైన భర్గునకు నన్యోన్యవిరోధంబు వెరుఁగుచుండ నతిచిరంబగు కాలం బరిగెనంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి పూర్వవిరోధంబునను బరమేష్ఠికృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబుననుం జేసి బ్రహ్మనిష్ఠులగు నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయసవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన నామకంబైన మఖంబు సేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున. 54
చ. కర మనురక్తి నమ్మఖము గన్గొను వేడుక తొంగలింపఁగా
బరమముని ప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్‌ సభార్యులై
పరువడి వచ్చి యందఱు శుభస్థితి దీవన లిచ్చి దక్షుచేఁ
బొరిఁబొరి నచ్చటన్‌ విహితపూజల నొందిరి సమ్ముదంబున్‌.
55
తే. దక్షతనయ సతీదేవి దవిలి యాత్మ, సదనమున నుండి జనకుని సవనమహిమ
గగనచరులు నుతింప నా కలకలంబు, విని కుతూహలిని యయి విన్వీధిఁ జూడ.
56
వ. అయ్యవసరంబునఁ దదుత్సవదర్శనకుతూహలులై సర్వదిక్కులవారును జనుచుండి; రా సమయంబున. 57
సీ. తనరారు నవరత్నతాటంకరోచులు చెక్కుటద్దములతోఁజెలిమిసేయ
మహనీయతపనీయమయపదకద్యుతు లంసభాగంబుల నావరింప
నంచితచీనిచీనాంబరప్రభలతో మేఖలాకాంతులు మేలమాడఁ
జంచలసారంగచారువిలోచనప్రభలు నల్దిక్కులఁ బ్రబ్బికొనఁగ
 
తే. మించు వేడుక భర్తృసమేత లగుచు, మానితంబుగ దివ్యవిమానయాన
లగుచు నాకాశపథమున నరుగుచున్న, ఖచరగంధర్వకిన్నరాంగనలఁజూచి.
58
క. సతి దన పతియగు నా పశు, పతిఁ జూచి సముత్సుకతను భాషించె; ప్రజా
పతి మీ మామ మఖము సు, వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే.
59
క. కావున నయ్యజ్ఞమునకు, నీ విబుధగణంబు లర్థి నేగెద; రదిగో;
దేవ! మన మిప్పు డచటికిఁ, బోవలె నను వేడ్క నాకుఁ బుట్టెడు నభవా!
60
క. ఆ యజ్ఞముఁ గనుఁగొనఁగా, నా యనుజలు భక్తిఁ బ్రాణనాథులతోడం
బాయక వత్తురు;మనముం, బోయిన నే వారి నచటఁబొడగనఁగల్గున్‌.
61
క. జనకుని మఖమున కర్థిం, జని నీతోఁ బారిబర్హ సంజ్ఞికతఁగడుం
దనరిన భూషణములఁ గై, కొన వేడ్క జనించె నీశ! కుజనవినాశా?
62
క. నాతోడను స్నేహము గల, మాతను దత్సోదరీసమాజము ఋషి సం
ఘాతకృతమఖసమంచిత, కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్‌.
63
వ. అదియునుంగాక! దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచము భవదీయ మాయా వినిర్మితం బగుటం చేసి నీకు నాశ్చర్యకరంబుగా; దయినను భవదీయ తత్త్వంబెఱుంగఁ జాలక కామినీస్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమిఁగనుంగొన నిచ్చగించితి నని వెండియు నిట్లనియె; 64
చ. ముదమునఁ దన్మఖోద్భవవిభూతిఁగనుంగొన నన్యకామినుల్‌
పదువులు గట్టి భూషణవిభాసితలై నిజనాథయుక్తలై
మదకలహంసపాండురసమంచితదివ్యవిమానయానలై
యదె చనుచున్నవారు గను మభ్రపథంబున నీలకంధరా!
65
క. అనఘా! విను లోకంబుల, జనకుని గేహమునఁ గలుగు సకలసుఖంబుల్‌
తనయలు సని సంప్రీతిన్‌, గనుఁగొన కే రీతి నిలుచుఁ గాయము లభవా!
66
క. అనయముఁ బిలువకయుండం, జన ననుచిత మంటివేని జనకగురుసుహృ
జ్జననాయకగేహములకుఁ, జనుచుందురు పిలువకున్న సజ్జను లభవా!
67
వ. అని మఱియు నిట్లనియె; దేవా! నాయందుఁ బ్రసన్నుండవై మదీయ మనోరథంబుం దీర్ప నర్హుండవు; సమధికజ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబునం దర్ధంబున ధరియింప బడితి; నట్టి నన్ను ననుగ్రహింప వలయునని ప్రార్థించిన మందస్మిత వదనారవిందుం డగుచు జగత్స్రష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన మర్మభేదంబులైన కుహకవాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె. 68
సీ. కల్యాణి! నీ మాట గడునొప్పు; బంధువుల్‌ పిలువకుండినను సంప్రీతిఁ జనుదు
రంటి; విదియు లెస్స యైనను దేహాభిమానమదమున నమర్షమునను
గడఁగి యారోపితఘనకోపదృష్టులు గారేనిఁ బోఁదగుఁగాని వినుము
వినుతవిద్యాతపోవిత్తవయోరూపకులములు సుజనులకును గుణంబు;
 
తే. లివియ కుజనులయెడ దోషహేతుకంబు, లై వివేకంబు సెఱుచు; మహాత్ములైన
వారి మాహాత్మ్య మాత్మగర్వమునఁ జేసి, జడులు పొడగానఁ జాలరు జలజనేత్ర!
69
క. విను; మట్టి కుటిలు లగు దు, ర్జనుల గృహంబులకు బంధుసరణిని బోవం
జనదు! వినీతుల కది గడు, ననుచితమైయుండు నింతి! యది యెట్లనినన్‌.
70
ఆ. కుటిలబుద్ధు లయిన కుజనుల యిండ్లకు, నార్యు లేగ, వా రనాదరమున
బొమలు ముడివడంగ భూరిరోషాక్షులై, చూతు రదియుఁగాక సుదతి! వినుము.
71
చ. సమదరిపుప్రయుక్తపటుసాయకజర్జరితాంగుఁ డయ్యు దుః
ఖమును దొఱంగి నిద్రఁ గనుఁ గాని కృశింపఁడు మానవుండు; నో
యుమ! విను మిష్టబాంధవదురుక్తులు మర్మము లంటనాటఁజి
త్తమున నహర్నిశంబుఁబరితాపము నొంది కృశించు నెప్పుడున్‌.
72
క. విను లోకోత్కృష్టుఁడు ద, క్షునికిఁ దనూభవలలోనఁ గూరిమిసుత వై
నను నా సంబంధంబున, జనకునిచేఁ బూజఁ బడయఁజాలవు తరుణీ!
73
వ. అదియె ట్లతనిచేత భవత్సంబంధంబునం జేసి పూజఁ బడయమికి నతనికి నీకు విరోధంబునకు హేతు వెట్టిదని యంటివేని. 74
మ. నిరహంకారనిరస్తపాపసుజనానింద్యోల్లసత్కీర్తిఁగొం
దఱు కామించి యశక్తులై మనములన్‌ దందహ్యమానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముండీశ్వరుండైన యా
హరితో బద్ధవిరోధముందొడరు దైత్యశ్రేణిచందంబునన్‌.
75
వ. అదియునుం గాక నీ వతనికిం బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్థానాభివందనంబులు గావింతు, రదియు ప్రాజ్ఞు లయినవారు సర్వభూతాంతర్యామియైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయిక వ్యాపారం బయుక్తంబని తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబులు గావింతురుగాని దేహాభిమానంబులు గలుగు పురుషులందుఁ గావింపరు, గాన నేనును వాసుదేవ శబ్దవాచ్యుండు, శుద్ధ సత్త్వమయుండు, నంతఃకరణంబునందు నావరణవిరహితుండును నయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున నెల్లప్పుడు నమస్కరించు చుండుదు; నిట్లనపరాధినైన నన్నుఁ బూర్వంబున బ్రహ్మలు సేయు సత్త్రంబునందు దురుక్తులం జేసి పరాభవించి మద్ద్వేషియై దక్షుండు భవజ్జనకుండైన నతఁడు దదనువర్తులయిన వారలును జూడఁదగరు; కావున మద్వచనాతిక్రమంబుం జేసి యరిగితివేని నచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనఁ బూజ వడయక తిరస్కారంబు వొందుట చచ్చుటయ కాదే; యని పలికి మఱియు నభవుండు పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట నవమానంబునం జేసి యశుభంబగు ననియు, నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునం దలపోయుచు నూరకుండె; నంత. 76
సీ. సతి సుహృద్దర్శనేచ్ఛాప్రతికూల దుఃఖస్వాంత యగుచు నంగములు వడఁక
నందంద తొరఁగెడు నశ్రుపూరంబులు గండభాగంబులఁ గడలుకొనఁగ
నున్నతస్తనమండలోపరిహారముల్‌ వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద
నతిశోకరోషాకులాత్యంతదోదూయమానమై హృదయంబు మలఁగుచుండ
 
తే. మఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు, నాత్మ దేహంబు సగ మిచ్చినట్టి ధవుని
విడిచి మూఢాత్మ యగుచు నవ్వెలఁది సనియె, జనకుఁ జూచెడు వేడుక సందడింప.
77
వ. ఇట్లతిశీఘ్రగమనంబున. 78
సీ. మానిని చనుచుండ మణిమన్మదాదిసహస్రసంఖ్యాతరుద్రానుచరులు
యక్షులు నిర్భయులై వృషభేంద్రుని మున్నిడికొనుచు నమ్ముదిత దాల్చు
కందుకాంబుజశారికాతాళవృంత దర్పణ ధవళాతపత్ర ప్రసూన
మాలికాసౌవర్ణమణివిభూషణ ఘనసార కస్తూరికా చందనాది
 
తే. వస్తువులు గొంచు నేగి శర్వాణిఁ గదిసి, శంఖదుందుభివేణునిస్వనము లొప్ప
మానితంబైన వృషభేంద్రయానఁ జేసి, యజ్ఞభూమార్గులై యర్థి నరిగి యరిగి.
79
వ. ముందట. 80
చ. మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ
త్కనకకుశాజినాయసనికాయవినిర్మితపాత్రసీమము
న్ననుపమవేదఘోష సుమహత్పశుబంధన కర్మభూమమున్‌
మునివిబుధాభిరామము సముజ్జ్వలహోమము యాగధామమున్‌.
81
వ. ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన. 82
క. చనుదెంచిన యమ్మగువను, జననియు సోదరులుఁ దక్క సభఁగల జను లె
ల్లను దక్షువలని భయమున, ననయము నపు డాదరింపరైరి మహాత్మా!
83
క. నెఱిఁ దల్లియుఁ బినతల్లులుఁ, బరిరంభణ మాచరింపఁ బరితోషాశ్రుల్‌
దొరఁగఁగ డగ్గుత్తికతో, సరసిజముఖి సేమ మరయ సతి దా నంతన్‌.
84
క. జనకుం డవమానించుట, యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁజే
సిన పూజల నందక శో, భన మరసిన మాఱుమాటఁ బలుకక యుండెన్‌.
85
వ. ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై విభుండైన యీశ్వరునందు నాహ్వానక్రియాశూన్యత్వ రూపంబైన తిరస్కారంబును, నరుద్రభాగంబైన యజ్ఞంబునుం గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు సేయంబూనిన తెఱంగున నుద్రేకించి రుద్రవిద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండునగు దక్షుని వధియింతు మనుచు లేచిన భూతగణబుల నివారించి రోషావ్యక్తభాషణంబుల నిట్లనియె; లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుండైన యీశ్వరునకుఁ బ్రియాప్రియులును నధికులును లే; రట్టి సకల కారణుండును నిర్మత్సరుండును నైన రుద్రునందు నీవు దక్క నెవ్వండు ప్రతికూలంబాచరించు? నదియునుంగాక మిముబోఁటి వారలు పరులవలని గుణంబులందు దుర్గుణంబులన యాపాదింతురు; మఱియుం గొందఱు మధ్యస్థులైన వారలు పరుల గుణంబులయందు దోషంబుల నాపాదింపరు; గొందఱు సాధువర్తనంబు గలవారలు పరుల దోషంబులనైన గుణంబులుగా ననుగ్రహింతురు. మఱియుం గొంద ఱుత్తమోత్తములు పరులయందు దోషంబుల నాపాదింపక తుచ్ఛగుణంబులు గలిగినను సద్గుణంబులుగాఁ గై కొందు, రట్టి మహాత్ములయందు నీవు పాపబుద్ధి గల్పించితివి అని వెండియు నిట్లను; మహాత్ములగు వారల పాదధూళిచే నిరస్తప్రభావులై జడస్వభావంబు గల దేహంబు నాత్మ యని పల్కు కుజనులగు వారు మహాత్ముల నిందించు టాశ్చర్యంబుగా; దదియు వారి కనుచితం బగు నని వెండియు నిట్లనియె. 86
సీ. అనయంబు “శివ” యను నక్షరద్వయ మర్థి వాక్కునఁ బలుక భావమునఁ దలఁప
సర్వజీవుల పాపసంఘముల్‌ సెడు; నట్టి మహితాత్మునందు నమంగళుండ
వగు నీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు నందెద, వినుము నీ వదియుఁ గాక
చర్చింప నెవ్వని చరణపద్మంబుల నరసి బ్రహ్మానంద మను మరంద
 
తే. మతులభక్తిని దమ హృదయంబు లనెడి, తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
లగుదు రత్యంతవిజ్ఞాను; లట్టి దేవు, నందు ద్రోహంబు సేసి; తే మందు నిన్ను?
87
క. మఱియును నమ్మహితాత్ముని, చరణసరోజాతయుగము సకలజగంబుల్‌
నెఱిఁ గొలువఁగోరు కోర్కులు, దరమిడి వర్షించు నతనిఁ దగునే తెగడన్‌?
88
చ. పరఁగఁ జితాస్థిభస్మనృకపాలజటాధరుఁడుం బరేత భూ
చరుఁడు పిశాచయుక్తుఁడని శర్వు నమంగళుగాఁ దలంప రె
వ్వరు; నొకఁడీవు దక్క, మఱి వాక్పతిముఖ్యులు నమ్మహాత్ము స
చ్చరణసరోజరేణువులు సమ్మతిఁ దాల్తురు మస్తకంబులన్‌.
89
చ. నెలకొని ధర్మపాలనవినిర్మలు భర్గుఁ దిరస్కరించు న
క్కలుషుని జిహ్వఁగోయఁదగుఁ గా; కటుసేయఁగ నోపఁడేని దాఁ
బొలియుట యొప్పు; రెంటికిఁ బ్రభుత్వము సాలమిఁ గర్ణరంధ్రముల్‌
బలుపుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు ధర్మవర్తనుల్‌.
90
వ. అది గావున 91
మ. జనుఁడజ్ఞానమునన్‌ భుజించిన జుగుప్సంబైన యన్నంబు స
య్యన వెళ్ళించి పవిత్రుఁడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్‌
ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ, నీ హేయ భా
జనమైనట్టి శరీరమున్‌ విడిచి భాస్వచ్ఛుద్ధిఁ బాటిల్లెదన్‌.
92
వ. అదియునుం గాక దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతలగమనంబును, స్వాభావికంబు లయినట్లు ప్రవృత్తినివృత్తిలక్షణకర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం జేసి రాగయుక్తులై కర్మతంత్రులయిన సంసారులకు వైరాగ్యయుక్తులయి యాత్మారాము లయిన యోగిజనులకు విధినిషేధరూపంబు లయిన వైదికకర్మంబులు గలుగుటయు లేకుండుటయు నైజంబు లగుటంజేసి స్వధర్మ నిష్ఠుం డగువాని నిందింప జన; దా యుభయకర్మశూన్యుండు బ్రహ్మభూతుండు నయిన సదాశివునిఁ గ్రియాశూన్యుండని నిందించుట పాపంబగు, తండ్రీ! సంకల్పమాత్ర ప్రభవంబు లగుటం జేసి మహాయోగి జనసేవ్యంబు లయిన యస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు; భవదీయంబులగు నైశ్వర్యంబులు ధూమమార్గప్రవృత్తులై యాగాన్న భోక్తలైన వారిచేత యజ్ఞశాలయందె చాల నుతియింపంబడి యుండుఁగాన నీ మనంబున నే నధిక సంపన్నుండ ననియుఁ, జితాభస్మాస్థిధారణుండైన రుద్రుండు దరిద్రుం డనియును గర్వింపం జనదని వెండియు నిట్లనియె. 93
ఉ. నీలగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా!
చాలుఁ గుమర్త్య! నీదు తనుజాత ననన్‌ మది సిగ్గు పుట్టెడి
న్నేల ధరన్‌ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్‌
గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడఁగన్‌!
94
చ. వరవృషకేతనుండు భగవంతుఁడు నైన హరుండు నన్ను నా
దర పరిహాసవాక్యముల “దక్షతనూభవ!” యంచుఁ బిల్వ నేఁ
బురపురఁ బొక్కుచున్‌ ముదముఁ బొందక నర్మవచస్స్మితంబులం
దొఱఁగుదు? నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చు టొప్పగున్‌.
95
వ. అని యిట్లు యజ్ఞసభామధ్యంబునం బ్రతికూలుండగు దక్షు నుద్దేశించి పలికి కామక్రోధాది శత్రువిఘాతిని యగు సతీదేవి యుదఙ్ముఖియయి జలంబుల నాచమనంబు సేసి శుచియై మౌనంబు ధరియించి జితాసనయై భూమియం దాసీన యగుచు యోగమార్గంబునం జేసి శరీరత్యాగంబు సేయం దలచి. 96
సీ. వరుసఁ బ్రాణాపానవాయునిరోధంబు గావించి వాని నేకముగ నాభి
తలమునఁ గూర్చి యంతట నుదానము దాక నెగయించి బుద్ధితో హృదయపద్మ
మున నిల్పి వాని మెల్లన కంఠమార్గము నను మఱి భ్రూమధ్యమున వసింపఁ
జేసి శివాంఘ్రిరాజీవ చింతనముచే నాథునిఁ దక్క నన్యంబుఁ జూడ
 
తే. కమ్మహాత్ముని యంకపీఠమ్మునందు, నాదరంబున నుండు దేహంబు దక్షు
వలని దోషంబునను విడువంగఁ దలఁచి, తాల్చెఁ దనువున ననిలాగ్నిధారణములు.
97
వ. ఇట్లు ధరియించి గత కల్మషంబైన దేహంబుగల సతీదేవి నిజయోగసమాధిజనితం బయిన వహ్నిచేఁ దత్‌క్షణంబ దగ్ధ యయ్యె నంత. 98
క. అది గనుఁగొని హాహాధ్వని, వొదలఁగ నిట్లనిరి మానవులుఁ ద్రిదశులు నీ
మదిరాక్షి యకట! దేహము, వదలెఁగదా! దక్షుతోడి వైరము కతనన్‌.
99
వ. మఱియు నిట్లనిరి. 100
సీ. సకలచరాచరజనకుఁడై నట్టి యీ దక్షుండు దన కూర్మితనయ మాన
వతి పూజనీయ యీ సతి దనచే నవమానంబు నొంది సమక్షమందుఁ
గాయంబు దొఱఁగంగఁ గనుఁగొను చున్నవాఁడిట్టి దురాత్ముఁ డెందేనిఁ గలఁడె?
యనుచుఁ జిత్తంబుల నాశ్చర్యములఁ బొంది, రదియునుఁగాక యిట్లనిరి యిట్టి
 
తే. దుష్టచిత్తుఁడు బ్రహ్మబంధుండు నయిన, యీతఁ డనయంబుఁ దా నపఖ్యాతిఁ బొందు
నిందఁబడి మీఁద దుర్గతిఁ జెందుగాక, యనుచు జనములు వలుకు న య్యవసరమున.
101
క. దేహము విడిచిన సతిఁ గని, బాహాబల మొప్ప రుద్ర పార్షదులును ద
ద్ద్రోహింద్రుంచుటకై యు, త్సాహంబున లేచి రసిగదాపాణులునై.
102
క. ఆ రవ మపు డీక్షించి మ, హారోషము తోడ భృగుమహాముని క్రతుసం
హారకమారక మగు నభి, చారకహోమం బొనర్చె సరభసవృత్తిన్‌.
103
వ. ఇట్లు దక్షిణాగ్ని యందు వ్రేల్చిన నందుఁ దపం బొనర్చి సోమలోకంబున నుండు సహస్రసంఖ్యలు గల “ఋభు” నామధేయులైన దేవత లుదయించి బ్రహ్మతేజంబునం జేసి దివ్యవిమానులై యుల్ముకంబులు సాధనంబులుగా ధరియించి రుద్రపార్షదులయిన ప్రమథగుహ్యగణంబులఁ బాఱందోలిన వారును బరాజితులైరి, తదనంతరంబ నారదువలన నభవుండు దండ్రిచే నసత్కృతురా లగుటం జేసి భవానిపంచత్వంబు నొందుటయుం బ్రమథగణంబులు ఋభునామకదేవతలచేఁ బరాజితు లగుటయు విని. 104
శా. ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై
మాద్యద్భూరిమృగేంద్రఘోషమున భీమప్రక్రియన్‌ నవ్వుచున్‌
విద్యుద్వహ్నిశిఖాసముచ్చయరుచిన్‌ వెల్గొందు చంచజ్జటన్‌
సద్యఃక్రోధముతోడఁ బుచ్చి వయిచెన్‌ క్ష్మాచక్రమధ్యంబునన్‌.
105
వ. ఇట్లు పెఱికివైచిన రుద్రుని జటయందు. 106
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )